వ్యూహాత్మకమైన్ షింకున్ లా సొరంగ నిర్మాణ పథకంలో భాగంగా తొలి పేలుడు ఘటనను నిర్వహించడాన్ని ఆయన వీక్షించారు
‘‘దేశం కోసం చేసిన త్యాగాలు శాశ్వతమైనవని మనకు గుర్తుకు తీసుకు వస్తున్న కార్గిల్ విజయ్ దివస్’’
‘‘కార్గిల్ లో యుద్ధాన్ని గెలవడం ఒక్కటే కాకుండా సత్యం, నిరోధం, శక్తి ల పరంగా అపురూపమైన నిదర్శనాన్ని చాటాం మనం’’
‘‘కార్గిల్ లో యుద్ధాన్ని గెలవడం ఒక్కటే కాకుండా సత్యం, నిరోధం, శక్తి ల పరంగా అపురూపమైన నిదర్శనాన్ని చాటాం మనం’’
‘‘లద్దాఖ్ అభివృద్ధికి, శ్రేష్ఠమైన భవిష్యత్తుకు షింకున్ లా సొరంగ మార్గం సరికొత్త అవకాశాల తలుపులను తెరుస్తుంది’’
‘‘గత అయిదు సంవత్సరాలలో, లద్దాఖ్ బడ్జెట్ 1100 కోట్ల రూపాయల నుంచి 6000 కోట్ల రూపాయలకు వృద్ధి చెందింది’’
‘‘బలగాలను యవ్వనభరితమైనవిగాను, నిరంతరం సమరానికి సన్నద్ధంగాను ఉంచడమే అగ్నిపథ్ పథకం లక్ష్యం’’
‘‘నిజం ఏమిటి అంటే, అగ్నిపథ్ పథకం దేశానికున్న శక్తిని పెంచుతుంది; అంతేకాకుండా, దేశానికి సమర్థమైన యువత అండదండలు కూడా లభిస్తాయి’’
‘‘కార్గిల్ లో సాధించిన విజయం ఏ ప్రభుత్వ విజయమో, ఏ పార్టీ విజయమో కాదు. ఈ విజయం దేశం సాధించిన విజయం’’

 కర్తవ్య పాలనలో సర్వోన్నత త్యాగానికి వెనుదీయని వీర సైనికులకు ఈ రోజు ఇరవై అయిదో కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ లద్దాఖ్ లో శ్రద్ధాంజలి ఘటించారు.  ‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో కూడా ఆయన పాల్గొన్నారు.  సైన్యంలో దిగువ స్థానాల నుంచి ఉన్నతిని సాధించి అధికారి శ్రేణికి ఎదిగిన సభ్యులు (ఎన్‌సిఒ స్) చదివిన ‘గౌరవ్ గాథ: బ్రీఫింగ్ ఆన్ కార్గిల్ వార్’ ను ప్రధాన మంత్రి విన్నారు.  ‘అమర్ సంస్మరణ్: హట్ ఆఫ్ రిమెంబ్రెన్స్’ ను ఆయన సందర్శించారు.  వీర భూమిని కూడా ప్రధాన మంత్రి సందర్శించారు.

 

లద్దాఖ్ లో షింకున్ లా సొరంగ నిర్మాణ పథకం లో భాగమైన తొలి విస్ఫోట ఘట్టాన్ని సైతం  ఈ రోజు వర్చువల్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి వీక్షించారు.  లేహ్ కు అన్ని రుతువులలోనూ అనుసంధానాన్ని అందించడానికి నిమూ - పదుమ్ - దార్చా  రహదారి మార్గంలో సుమారు 15,800 అడుగుల ఎగువ ప్రాంతంలో రూపుదాల్చనున్న 4.1 కిలో మీటర్ ల పొడవైన రెండు దోవలతో కూడిన సొరంగాన్ని నిర్మించడానికే ఈ షింకున్ లా టనల్ ప్రాజెక్టు ను తలపెట్టడమైంది.

 

‘శ్రద్ధాంజలి సమారోహ్’ లో ప్రధాన మంత్రి పాల్గొని సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, కార్గిల్ విజయ్ దివస్ ఇరవై అయిదో వార్షికోత్సవానికి సాక్షిభూతురాలుగా లద్దాఖ్ యశో భూమి ఉందన్నారు.  ‘‘దేశ ప్రజల కోసం చేసిన త్యాగాలు అమరమైనవీ, శాశ్వతమైనవీనూ అని కార్గిల్ విజయ్ దివస్ మనకు గుర్తు చేస్తుంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  నెలలు, సంవత్సరాలు, దశాబ్దాలు, శతాబ్దాలు గడచిపోయినా సరే, దేశ సరిహద్దులను సంరక్షించడానికి గాను చేసిన ప్రాణత్యాగం చెరిపి వేయలేనిది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ‘‘మన సాయుధ దళాలకు చెందిన శక్తిశాలి మహావీరులకు దేశ ప్రజలు సదా రుణపడిపోవడంతో పాటుగా ఎనలేని కృతజ్ఞత భావాన్ని కూడా కలిగివుంటారు’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

కార్గిల్ యుద్ధం నాటి రోజులను ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, అప్పట్లో సైనికుల మధ్య ఉన్న భాగ్యం తనకు దక్కిందన్నారు.  అంతటి ఎత్తయిన ప్రదేశంలో క్లిష్టమైన సైనిక చర్యను మన సైనికులు ఏ విధంగా నిర్వర్తించారో ఇప్పటికీ తనకు జ్ఞాపకముందని ఆయన అన్నారు.  ‘‘మాతృభూమి పరిరక్షణకు సర్వోన్నత త్యాగానికి ఒడిగట్టిన ఈ దేశ సాహస పుత్రులకు నేను ప్రణమిల్లుతున్నాను’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

‘‘కార్గిల్ లో మనం యుద్ధాన్ని గెలవడమొక్కటే కాక ‘సత్యం, నిరోధం, శక్తి’ ల సమ్మిళిత నిదర్శనాన్ని కూడా లోకానికి చాటిచెప్పాం’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  భారతదేశం శాంతి పరిరక్షణకు సకల ప్రయత్నాలను చేస్తున్న కాలంలో, పాకిస్తాన్ పాల్పడిన వంచనను గురించి ప్రధాన మంత్రి వివరించారు.  ‘‘అసత్యాన్ని, భయాన్ని, సత్యం జయించింది’’ అని ఆయన అన్నారు.

 

 

ఉగ్రవాదాన్ని ప్రధాన మంత్రి ఖండిస్తూ, పాకిస్తాన్ గతంలో ఎల్లవేళలా పరాజయం పాలయిందన్నారు.  ‘‘పాకిస్తాన్ గతం నుంచి నేర్చుకొన్నది ఏమీ లేదు; మనుగడ సాగించడం కోసం ప్రచ్ఛన్న యుద్ధాలను, ఉగ్రవాదం ముసుగులో సమరాన్ని కొనసాగిస్తూనే ఉంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ఉగ్రవాదుల దుర్మార్గ ఉద్దేశ్యాలు ఎన్నటికీ నెరవేరవు అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు.  ‘‘మన వీరులు భీతావహ ప్రయత్నాలన్నింటిని అణగదొక్కుతారు’’ అని ఆయన అన్నారు.

 

‘‘అభివృద్ధికి అడ్డువచ్చే సవాళ్ళన్నింటిని లద్దాఖ్ లో అయినా, లేదా జమ్ము, కశ్మీర్ లో అయినా.. భారతదేశం అధిగమించి తీరుతుంది’’ అని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.  రాజ్యాంగ 370వ అధికరణం రద్దయి మరికొన్ని రోజులలో- ఆగస్టు 5న- అయిదేళ్ళు పూర్తి అవుతాయి; మరి ఇప్పుడు జమ్ము- కశ్మీర్ ఎన్నెన్నో కలలతో  నిండిన ఒక కొత్త భవితను గురించి మాట్లాడుతోంది అని ఆయన గుర్తుకు తీసుకు వచ్చారు.  ఇంతదాకా జరిగిన  ప్రగతికి సంబంధించిన ఉదాహరణలను ప్రధాన మంత్రి పేర్కొంటూ, కేంద్రపాలిత ప్రాంతంలో జి20 సమావేశాలను నిర్వహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పైన, పర్యటక రంగం పైన ప్రభుత్వం దృష్టి సారించడం, సినిమా హాళ్ళు మొదలవడం, తాజియా ఊరేగింపును మూడున్నర దశాబ్దాల తరువాత మళ్ళీ మొదలుపెట్టడం వంటి వాటిని గురించి ప్రస్తావించారు.  ‘‘ఈ భూతల స్వర్గం శాంతి, సమృద్ధిల మార్గంలో వేగంగా ముందుకు సాగిపోతోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

లద్దాఖ్ లో చోటు చేసుకొంటున్న పరిణామాలను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, షింకున్ లా సొరంగ మార్గం ద్వారా ఈ కేంద్ర పాలిత ప్రాంతం ఏడాది పొడవునా ప్రతి రుతువులోనూ పూర్తి దేశంతో అనుసంధానం అవుతుందన్నారు.  ‘‘లద్దాఖ్ అభివృద్ధికి, మెరుగైన భవిష్యత్తుకు నూతన అవకాశాల తలుపులను ఈ సొరంగ మార్గం తెరుస్తుంది’’ అని ఆయన అన్నారు.  లద్దాఖ్ ప్రజలకు ప్రధాన మంత్రి అభినందనలు  తెలియజేస్తూ,  ఈ సొరంగ మార్గం వారి జీవనాన్ని మరింత సులభతరం చేస్తుందని, ఈ ప్రాంతంలో విపరీత వాతావరణ స్థితి కారణంగా వారు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందులు ఇకపై తీరుతాయన్నారు.

 

కార్గిల్ ప్రజల విషయంలో ప్రభుత్వం పెట్టుకొన్న ప్రాధాన్యాలను ప్రధాన మంత్రి ప్రముఖంగా పేర్కొంటూ, కోవిడ్-19 మహమ్మారి విజృంభించిన కాలంలో  ఇరాన్ లో ప్రవాసమున్న కార్గిల్ ప్రాంత పౌరులను సురక్షితంగా తరలించడానికి స్వయంగా పూనుకొని ప్రయత్నించినట్లు వివరించారు.  జైసల్మేర్ లో క్వారంటీన్ జోన్ ను ఏర్పాటు చేశాం;  అక్కడ వారికి పరీక్షలు నిర్వహించి అప్పుడు లద్దాఖ్ కు పంపించాం అని ఆయన గుర్తుచేసుకొన్నారు.  లద్దాఖ్ ప్రజలకు మరిన్ని సేవలను అందించడానికి, వారి జీవనంలో సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, గత అయిదేళ్ళలో బడ్జెటును 1100 కోట్ల రూపాయల నుంచి దాదాపుగా ఆరింతలు పెంచి 6,000 కోట్లు చేసినట్లు తెలిపారు.  ‘‘రహదారులు కావచ్చు, విద్యుత్తు కావచ్చు, నీరు కావచ్చు, విద్య, విద్యుత్తు సరఫరా, ఉద్యోగకల్పన కావచ్చు.. అన్ని విషయాలలో లద్దాఖ్ పరివర్తన చెందుతోంది’’ అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  మొట్టమొదటి సారిగా సమగ్ర పథక రచన జరుగుతోంది అని ఆయన అన్నారు.  లద్దాఖ్ లో నివసిస్తున్న కుటుంబాలకు 90 శాతానికి జల్ జీవన్ మిషన్ లో భాగంగా త్రాగునీటి సదుపాయాన్ని సమకూర్చడం, లద్దాఖ్ యువత కు నాణ్యమైన ఉన్నత విద్య బోధన కోసం త్వరలోనే సింధు కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రారంభం కానుండడం, లద్దాఖ్ అంతటా 4జి నెట్ వర్క్ ను స్థాపించే పనులు జరుగుతూ ఉండడం, ఎన్‌హెచ్-1 లో అన్ని రుతువుల్లోనూ ఉపయోగపడే విధంగా 13 కిలో మీటర్ ల పొడవైన జోజిలా సొరంగ మార్గం తాలూకు పనులు పురోగతిలో ఉండడం గురించి ఆయన ఉదాహరించారు.

 

సరిహద్దు ప్రాంతాలను దృష్టిలో పెట్టుకొని మహత్వాకాంక్షయుక్త  లక్ష్యాలను నిర్దేశించుకొన్నట్లు ప్రధాన మంత్రి వెల్లడిస్తూ, సరిహద్దు రహదారి సంస్థ (బిఆర్ఒ) 330 కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసింది.  వాటిలో సీలా సొరంగ మార్గం కూడా ఒకటి, ఈ పనులు న్యూ ఇండియా సామర్థ్యాలను కళ్ళకు కడుతున్నాయన్నారు.

 

సైన్య సంబంధ సాంకేతికతలను ఆధునికీకరించడానికి కట్టబెట్టిన ప్రాధాన్యాన్ని ప్రధాన మంత్రి వివరిస్తూ, మారుతున్న అంతర్జాతీయ ముఖచిత్రంలో మన రక్షణ దళాలకు అత్యాధునిక ఆయుధాలు, ఉపకరణాలతో పాటు అధునాతన పని పద్ధతులు కూడా అవసరమే అన్నారు.  ఆధునికీకరణ అవసరమన్న భావన గతంలో సైతం వ్యక్తమైంది, దురదృష్టవశాత్తు ఈ అంశానికి పెద్దగా ప్రాముఖ్యాన్ని ఇవ్వలేదు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.  ‘‘ఏమైనా, గడచిన 10 సంవత్సరాలలో రక్షణ రంగ సంస్కరణలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి, మన బలగాలను మరింత సత్తా కలిగినవిగా, స్వయంసమృద్ధమైనవి గా తీర్చిదిద్దడమైంది’’ అని ఆయన అన్నారు.  ప్రస్తుతం రక్షణ రంగ కొనుగోళ్ళలో ఎక్కువ భాగాన్ని భారతీయ రక్షణ పరిశ్రమకే ఇస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు.  రక్షణ, పరిశోధన- అభివృద్ధి సంబంధ బడ్జెట్ లో 25 శాతాన్ని ప్రైవేటు రంగం కోసం ప్రత్యేకించడమైంది అని ఆయన అన్నారు.  ‘‘ఈ ప్రయత్నాలన్నిటి ఫలితంగా భారతదేశ రక్షణ రంగ ఉత్పత్తి 1.5 లక్షల కోట్ల రూపాయలకు పైబడింది’’ అని ఆయన అన్నారు. ప్రస్తుతం భారతదేశం ఆయుధాల ఎగుమతిదారుగా కూడా తనదైన ముద్రను వేస్తోంది, ఇది ఇంతకుముందు ఆయుధాలను దిగుమతి చేసుకొనే దేశం భారతదేశమన్న గుర్తింపునకు భిన్నమైందని ఆయన అన్నారు.  ప్రస్తుతం 5000కు పైగా ఆయుధాలను, సైనిక సామగ్రిని దిగుమతి చేసుకోవడం ఆపివేయాలని మన బలగాలు నిర్ణయించినట్లు శ్రీ నరేంద్ర మోదీ చెప్తూ, సంతోషాన్ని వ్యక్తం చేశారు.

 

రక్షణ రంగంలో సంస్కరణలకు గాను రక్షణ దళాలను ప్రధాన మంత్రి ప్రశంసిస్తూ, అగ్నిపథ్ పథకం ఆ తరహా కీలక సంస్కరణలలో ఒకటని వివరించారు.  ప్రపంచ సగటు కన్నా భారతీయ వయస్సు సగటు అధికంగా ఉండడం చాలా కాలంగా ఆందోళనకరంగా ఉంటూ వచ్చిందన్న సంగతిని ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, ఈ కీలకమైన అంశాన్ని పరిష్కరించడానికి గతంలో మనశ్శక్తి  లోపించింది, ప్రస్తుతం అగ్నిపథ్ పథకం ద్వారా దీనిని పరిష్కరించడం జరుగుతోంది అని పేర్కొన్నారు. ‘‘అగ్నిపథ్ లక్ష్యమల్లా బలగాలను యవ్వన భరితమైనటువంటివి గా, నిరంతరం సమరసన్నద్ధంగా ఉండేటట్లు చూడడం’’  అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ఇంత సున్నితమైన అంశంలో కఠోర రాజకీయాలు జరగడం శోచనీయం అని ఆయన అన్నారు.  మునుపు జరిగిన కుంభకోణాలను, వాయు సేన యుద్ధ విమానాల ఆధునికీకరణ ను ఇదివరకు ఉపేక్షించడాన్ని  ఆయన విమర్శించారు.  ‘‘వాస్తవం ఏమిటంటే, దేశానికి ఉన్న శక్తిని అగ్నిపథ్ పథకం పెంచుతుంది, సమర్థ యువత ప్రయోజనం దేశానికి దక్కుతుంది’’  అని ఆయన అన్నారు.  అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో, అర్థ సైనిక బలగాలలో కూడా  ప్రాధాన్యాన్ని ఇవ్వడానికి ఉద్దేశించిన ప్రకటనలను వెలువరించడమైంది’’ అని ఆయన అన్నారు. 

 

పింఛను భారాన్ని తప్పించుకోవాలన్న ఉద్దేశ్యమే అగ్నిపథ్ పథకానికి వెనుక గల ప్రధాన కారణమని జరుగుతున్న ప్రచారాన్ని ప్రధాన మంత్రి తోసిపుచ్చుతూ, ప్రస్తుతం భర్తీ చేసుకొంటున్న సైనికులకు పింఛన్ భారం 30 సంవత్సరాల తరువాతనే పడుతుంది, అందువల్ల ఈ పథకానికి వెనుక ఉన్న కారణం ఇది కాజాలదు అన్నారు.  ‘‘మేం సాయుధ దళాలు తీసుకొన్న ఈ నిర్ణయాన్ని గౌరవించామంటే అందుకు గల కారణం మా దృష్టిలో  రాజకీయాల కన్నా దేశ భద్రతయే మరింత ముఖ్యమైంది కావడమే’’ అని ఆయన అన్నారు.

 

ప్రస్తుతం దేశంలో యువతను తప్పుదోవ పట్టిస్తున్న వర్గాలు ఇదివరకు సాయుధ దళాల పట్ల ఎలాంటి గౌరవ భావాన్ని వ్యక్తపరచలేదు అని ప్రధాన మంత్రి అన్నారు.  ‘వన్ ర్యాంక్ - వన్ పెన్షన్’ విషయంలో మునుపటి ప్రభుత్వాలు చేసిన అబద్ధపు వాగ్ధానాలను ప్రధాన మంత్రి గుర్తుకు తీసుకువస్తూ, ఈ పథకాన్ని అమలు చేసింది ప్రస్తుత ప్రభుత్వమే, దీనిలో భాగంగా పూర్వ సైనికోద్యోగులకు 1.25 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఇవ్వడమైంది అని వెల్లడించారు.  ఇదివరకటి ప్రభుత్వాల అనాదరణను గురించి ప్రధాన మంత్రి మరింతగా చెప్తూ, ‘‘స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు అయినప్పటికీ అమరవీరులకు ఒక యుద్ధ స్మారక చిహ్నాన్ని నిర్మించనిది ఈ వ్యక్తులే, సరిహద్దులలో విధులను నిర్వహిస్తూ ఉన్న మన జవానులకు బులెట్ ప్రూఫ్ జాకెట్ లను సరిపడినన్ని సమకూర్చనిదీ, కార్గిల్ విజయ్ దివస్ ను పట్టించుకోకుండా ఉండిపోయిందీ వీరే’’ అన్నారు.

 

ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో, ‘‘కార్గిల్ విజయం ఏ ప్రభుత్వ విజయమో, లేదా ఏ పార్టీ విజయమో కాదు, ఈ విజయం ఘనత దేశానికి చెందుతుంది.  ఈ విజయం దేశ వారసత్వానికి లభించిన విజయం. ఇది అతిశయానికి,  దేశ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఉత్సవం’’ అన్నారు.  యావద్దేశం తరఫున సాహసిక సైనికులకు ఆయన వందనం చేయడంతో పాటు కార్గిల్ విజయానికి 25 సంవత్సరాలైన సందర్భంగా  దేశ ప్రజలందరికీ తన శుభాకాంక్షలను కూడా తెలియజేశారు.

 

ఈ కార్యక్రమంలో లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ బ్రిగేడియర్ (డాక్టర్) బి.డి. శర్మ, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సేఠ్, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్ లతో పాటు త్రివిధ సాయుధ దళాల ప్రధానాధికారులు పాల్గొన్నారు.

 

నేపథ్యం

 

లేహ్ కు ప్రతి రుతువులోనూ సంధానాన్ని సమకూర్చడానికి ఉద్దేశించిన షింకున్ లా ప్రాజెక్టు లో 4.1 కిలో మీటర్ ల పొడవైన రెండు మార్గాల సొరంగాన్ని నిర్మించనున్నారు. దీని నిర్మాణం నిమూ - పదుమ్ - దార్చా రహదారిలో సుమారు 15,800 అడుగుల ఎత్తున జరుగనుంది.  షింకున్ లా సొరంగం  ఒకసారి నిర్మాణాన్ని పూర్తి చేసుకుందా అంటే ప్రపంచంలో  అత్యంత ఎత్తయిన ప్రదేశంలో రూపుదిద్దుకొన్న సొరంగ మార్గంగా పేరు తెచ్చుకోనుంది.  షింకున్ లా సొరంగ మార్గం మన సాయుధ దళాలకు, సైనిక సామగ్రికి  శీఘ్రగతిన సాగిపోయే, నిరంతరాయ రాకపోకల సౌకర్యాన్ని అందించడం ఒక్కటే కాకుండా లడఖ్ లో ఆర్థిక, సామాజిక అభివృద్ధిని కూడా ప్రోత్సహించనుంది.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi