ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఉన్న ఇండియా ఎక్స్ పో మార్ట్‌లో సెమీకాన్ ఇండియా 2024ను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన ప్రదర్శనను ఆయన వీక్షించారు. సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ రంగంలో భారత్‌ను ప్రపంచస్థాయి హబ్‌గా మార్చే వ్యూహం, విధానంపై చర్చించనున్నారు.
ప్రపంచ సెమీకండక్టర్ల పరిశ్రమకు సంబంధించిన కార్యక్రమాన్ని నిర్వహించిన దేశాల్లో భారత్ 8వది అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా సెమీ సభ్యులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 'భారత్‌లో కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు ఇదే సరైన సమయం. మీరు సరైన సమయంలో సరైన ప్రదేశంలో ఉన్నారు. 21వ శతాబ్దపు భారత్‌లో చిప్‌ల మార్కెట్ ఎప్పుడు కిందికి వెళ్లదు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితులు బాలేని తరుణంలో భారత్‌పై పందెం వేయొచ్చని నేటి భారత్ ప్రపంచానికి హామీ ఇస్తోంది” అని ఆయన అన్నారు.
సెమీకండక్టర్ పరిశ్రమకు, ఒక దిశలో మాత్రమే శక్తి ప్రయాణించే డయోడ్‌కు మధ్య సంబంధాన్ని ఎత్తిచూపిన మోదీ.. భారత సెమీకండక్టర్ పరిశ్రమలో మాత్రం రెండు దిశల్లో శక్తి ప్రవహించే ప్రత్యేక డయోడ్‌లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. పరిశ్రమలు పెట్టుబడులు పెట్టి విలువను పెంచుతుండగా.. మరోవైపు ప్రభుత్వం స్థిరమైన విధానాలు, సులభతర వాణిజ్య వాతావరణాన్ని అందిస్తోందని వివరించారు. సెమీకండక్టర్ పరిశ్రమలో ఉపయోగించే ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్‌కు సమాంతరంగా భారత్ ఒక ఇంటిగ్రేటెడ్ వ్యవస్థను అందిస్తోందని అన్నారు. సెమీకండక్టర్ల తయారీలో కీలకమైన డిజైనర్ల గురించి మాట్లాడిన ఆయన.. దేశంలోని డిజైనర్ల ప్రతిభ గురించి ప్రధానంగా ప్రస్తావించారు. డిజైనింగ్ రంగంలో భారత వాటా 20 శాతం ఉందని, ఇది నిరంతరం పెరుగుతోందని తెలియజేశారు. 85,000 మంది సాంకేతిక నిపుణులు, ఇంజనీర్లు.. పరిశోధన, అభివృద్ధి నిపుణులతో సెమీకండక్టర్ శ్రామిక శక్తిని భారత్ సృష్టిస్తోందని అన్నారు. అనుసంధన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ మొదటి సమావేశాన్ని గుర్తు చేస్తూ "విద్యార్థులు, వృత్తి నిపుణులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిద్ధం చేయడంపై భారత్ దృష్టి సారించింది" అని వ్యాఖ్యానించారు. 1 లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక పరిశోధన నిధిని ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి కార్యక్రమాలు శాస్త్ర సాంకేతిక రంగంలో సెమీ కండక్టర్లు, ఆవిష్కరణల పరిధిని పెంచుతాయని అన్న ఆయన.. సెమీకండక్టర్ రంగంలో మౌలికసదుపాయాలకు ప్రభుత్వం ఇస్తోన్న ప్రాధాన్యత గురించి ప్రధానంగా ప్రస్తావించారు. ప్రస్తుత సంస్కరణవాద ప్రభుత్వం, దేశంలో పెరుగుతున్న ఉత్పాదక రంగం, సాంకేతిక ధోరణులపై అవగాహన ఉన్న బలమైన మార్కెట్ అనే త్రిముఖ శక్తిని భారత్ కలిగి ఉందని వివరించిన ప్రధాని.. ఈ 3డీ శక్తి మరెక్కడా దొరకడం కష్టమని అన్నారు.
భారత దేశ ఆకాంక్షపూరితమైన, సాంకేతిక ఆధారిత సమాజం విశిష్టతను ప్రధానంగా చెప్పిన ప్రధాని.. భారత్‌లో చిప్స్ అంటే కేవలం సాంకేతిక పరిజ్ఞానానికే పరిమితం కాదని, కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే మాధ్యమం అని అన్నారు. ఇలాంటి చిప్‌ల భారీ వినియోగదారు భారత్ అని, ప్రపంచంలోనే అత్యుత్తమ డిజిటల్ పబ్లిక్ మౌలికసదుపాయాల నిర్మాణం వీటి ఆధారంగా జరిగిందని పేర్కొన్నారు. "ఈ చిన్న చిప్ దేశంలో చిట్ట చివరన ఉన్న వారికి కూడా సేవలు అందించే పెద్ద పనిని చేస్తోంది" అని వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రపంచంలోనే బలమైన బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన.. భారతదేశంలో బ్యాంకులు నిరంతరాయంగా నడిచాయని తెలిపారు. "భారత యూపీఐ, రూపే కార్డ్, డిజి లాకర్ లేదా డీజీ యాత్ర, వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఇలా ఏవైనా కావచ్చు, దేశ ప్రజల దైనందిన జీవితంలో ఇవి భాగమయ్యాయి" అని ఆయన పేర్కొన్నారు. స్వావలంబన సాధించడానికి ప్రతి రంగంలో తయారీని భారత్ పెంచుతోందని, పెద్ద ఎత్తున హరిత పరివర్తనను తీసుకొస్తోందని, డేటా సెంటర్లకు డిమాండ్ కూడా పెరుగుతోందని ఆయన అన్నారు. “ప్రపంచ సెమీకండక్టర్ పరిశ్రమను ముందుకు నడిపించడంలో భారత పెద్ద పాత్ర పోషించేందుకు సిద్ధమైంది” అని వ్యాఖ్యానించారు.
'చిప్స్ ఎక్కడ పడతాయో అక్కడ పడనివ్వండి(లెట్ ద చిప్స్ ఫామ్ వేర్ దే ఫాల్)' అనే పాత సామెత ఉందని, అంటే ఏం జరుగుతోందో అది అలా కొనసాగనివ్వండి అని అర్థమని.. కానీ నేటి యువ, ఆకాంక్ష భారత్ ఈ సెంటిమెంట్‌ను అనుసరించడం లేదని అన్నారు. "దేశంలో ఉత్పత్తి చేసే చిప్‌ల సంఖ్యను పెంచటమే భారత్ నూతన మంత్రం" అని వ్యాఖ్యానించారు. సెమీకండక్టర్ తయారీని ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలను ఈ సందర్భంగా ప్రస్తావించిన ప్రధాని.. సెమీకండక్టర్ తయారీ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం 50% ఆర్థిక సహాయాన్ని అందిస్తోందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. ఈ విధానాల వల్ల అతి తక్కువ కాలంలోనే భారత్ రూ. 1.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించిందని, మరెన్నో ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. ఫ్రంట్-ఎండ్ ఫ్యాబ్రికేషన్స్, డిస్ప్లే ఫ్యాబ్రికేషన్స్, సెమీకండక్టర్ ప్యాకేజింగ్, సరఫరా గొలుసులో ఇతర కీలక భాగాల తయారీకి ఆర్థిక సహాయం అందించే సెమికాన్ ఇండియా కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర విధానం గురించి కూడా మాట్లాడారు. ప్రపంచంలోని ప్రతి పరికరంలో భారత్‌లో తయారైన చిప్ ఉండాలనేది తమ కల అని పునరుద్ఘాటించిన ఆయన.. ఇదే విషయాన్ని ప్రస్తుత సంవత్సరం ఎర్రకోట నుంచి వెలువరించిన ప్రసంగంలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. సెమీకండక్టర్ దిగ్గజ కేంద్రంగా ఎదిగేందుకు తీసుకోవాల్సిన చర్యల విషయంలో భారత్ ఆకాంక్షను పునరుద్ఘాటించారు.
సెమీకండక్టర్ పరిశ్రమకు అవసరమైన కీలకమైన ఖనిజాలను సమకూర్చుకోవటంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, ఆ దిశగా తీసుకున్న చర్యల గురించి ఆయన మాట్లాడారు. దేశీయ ఉత్పత్తిని పెంచడానికి, విదేశాల్లో వాటి సేకరణను పెంచడానికి ఇటీవల ప్రకటించిన కీలకమైన వనరుల మిషన్(క్రిటికల్ మినరల్ మిషన్) గురించి ప్రస్తావించారు. కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు, కీలకమైన ఖనిజాల గనుల తవ్వకానికి సంబంధించిన వేలం విషయంలో భారత్ వేగంగా పనిచేస్తోందని తెలిపారు. ప్రస్తుతం వినియోగిస్తున్న అత్యాధునిక చిప్‌లనే కాకుండా భవిష్యత్ తరం చిప్‌లను కూడా తయారు చేసేందుకు ఐఐటీల సహకారంతో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్సెస్‌లో సెమీకండక్టర్ రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసే ప్రణాళికలను వెల్లడించారు. అంతర్జాతీయ సహకారం గురించి మాట్లాడుతూ.. ప్రపంచం నేడు 'ఆయిల్ దౌత్యం' నుంచి 'సిలికాన్ దౌత్య' శకం వైపు వెళ్తోందని అన్నారు. ఇండో-పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్ వర్క్‌కు చెందిన సరఫరా గొలుసు కౌన్సిల్‌కు వైస్ ఛైర్మన్‌గా భారత్ ఎంపికైందని, క్వాడ్ సెమీకండక్టర్ సరఫరా గొలుసు కార్యక్రమంలో కీలక భాగస్వామిగా భారత్ ఉందని తెలియజేశారు. అంతేకాకుండా జపాన్, సింగపూర్ వంటి దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని, సెమీకండక్టర్ రంగంలో భారత్ అమెరికాతో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటోందని తెలిపారు.
సెమీకండక్టర్లపై భారత్ ఆశయాలను ప్రశ్నించే వారు డిజిటల్ ఇండియా మిషన్ విజయాన్ని అధ్యయనం చేయాలని ప్రధాని కోరారు. పారదర్శకమైన, సమర్థవంతమైన, లీకేజీ రహిత పాలనను అందించడమే లక్ష్యంగా డిజిటల్ ఇండియా మిషన్‌ను భారత్ చేపట్టిందని, అది కలిగించిన ఎన్నో రెట్లు ప్రభావాన్ని ఈ రోజు చూడొచ్చని ఆయన పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా విజయవంతం చేసేందుకు దేశంలో మొబైల్ ఫోన్లు, డేటా చౌకగా అందేలా అవసరమైన సంస్కరణలు, మౌలిక సదుపాయాలకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. దశాబ్దం క్రితం మొబైల్ ఫోన్ల అతిపెద్ద దిగుమతిదారుల్లో భారత్ ఒకటని.. నేడు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి, ఎగుమతిలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. భారత్ సాధించిన వేగవంతమైన పురోగతిని ఆయన ఉదహరించిన ఆయన.. ముఖ్యంగా 5జీ ఫోన్ల మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పారు. 5జీ అందుబాటులోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రపంచంలో 5జీ ఫోన్లకు భారత్ రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచిందన్నారు.
భారత ఎలక్ట్రానిక్స్ రంగం 150 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగి ఉందని.. దీనిని 500 బిలియన్ డాలర్లకు పెంచటం, ఈ దశాబ్దం చివరి నాటికి 60 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలనే భారీ లక్ష్యాన్ని ప్రధాని వివరించారు. ఈ వృద్ధి భారత సెమీకండక్టర్ రంగానికి నేరుగా ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. “100 శాతం ఎలక్ట్రానిక్ తయారీ దేశంలోనే జరగాలన్నదే మన లక్ష్యం.. సెమీకండక్టర్ చిప్స్, అంతిమ వినియోగ పరికరాలను కూడా భారత్ తయారు చేయనుంది” అని అన్నారు.
భారత్‌లో సెమీకండక్టర్ వ్యవస్థ దేశీయ సవాళ్లకు మాత్రమే కాకుండా ప్రపంచ సవాళ్లకు కూడా ఒక పరిష్కారం అని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. డిజైన్ విభాగం నుంచి వచ్చిన 'సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్' అనే ఒక రూపకాన్ని ప్రస్తావిస్తూ, ఇందులో పూర్తి వ్యవస్థ కేవలం ఒక భాగంపై ఆధారపడుతుందని, దీనివల్ల ఈ లోపాన్ని నివారించాలని డిజైన్ విద్యార్థులకు చెబుతుంటారని అన్నారు. ఈ సూత్రం సరఫరా గొలుసుకు కూడా సమానంగా వర్తిస్తుందని ఆయన అన్నారు. కోవిడ్ అయినా, యుద్ధం అయినా సరఫరా గొలుసులో అంతరాయాల వల్ల ప్రభావితం కాని పరిశ్రమ ఒక్కటి కూడా లేదని ఆయన వ్యాఖ్యానించారు. వివిధ పరిస్థితులను తట్టుకొని నిలబడే సరఫరా గొలుసు ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. అన్ని రంగాలలో ఇలాంటి వ్యవస్థను నిర్మించే విషయంలో దేశ పోషిస్తోన్న పాత్ర పట్ల గర్వం వ్యక్తం చేశారు. సరఫరా గొలుసులను పరిరక్షించే ప్రపంచ కార్యచరణలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానానికి, ప్రజాస్వామిక విలువలకు మధ్య ఉన్న సంబంధం గురించి ప్రస్తావిస్తూ.. ప్రజాస్వామ్య విలువలతో మిళితం చేసినప్పుడు సాంకేతిక పరిజ్ఞానానికి సానుకూల శక్తి పెరుగుతుందని ప్రధాని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం నుంచి ప్రజాస్వామ్య విలువలను ఉపసంహరించుకోవడం వల్ల సత్వరమే నష్టం వాటిల్లుతుందని ఆయన హెచ్చరించారు. సంక్షోభ సమయాల్లో కూడా అంతరాయం లేకుండా ముందుకుసాగే ప్రపంచాన్ని సృష్టించడంపై భారతదేశం దృష్టి సారించిందని పునరుద్ఘాటించారు. "మొబైల్ తయారీ, ఎలక్ట్రానిక్స్ లేదా సెమీకండక్టర్లు ఏదైనా సరే, మా దృష్టి స్పష్టంగా ఉంది. సంక్షోభ సమయాల్లో ఆపకుండా, విరామం కలగకుండా ముందుకు సాగే ప్రపంచాన్ని నిర్మించాలని మేం కోరుకుంటున్నాం" అని అన్నారు. ప్రసంగం ముగింపులో ప్రపంచ కార్యచరణను పటిష్ఠం చేయటంలో భారత్ సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్న భాగస్వాములందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్.. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద్.. సెమీ అధ్యక్షులు, సీఈఓ శ్రీ అజిత్ మనోచా.. టాటా ఎలక్ట్రానిక్స్ అధ్యక్షులు, సీఈఓ డాక్టర్ రణధీర్ ఠాకూర్.. ఎన్ఎక్స్‌పీ సెమీకండక్టర్స్ సీఈఓ శ్రీ కర్ట్ సీవర్స్ .. రెనెసాస్ సీఈఓ శ్రీ హిడెతోషి షిబాటా..ఐఎంఈసీ సీఈఓ శ్రీ లూక్ వాన్ డెన్ హోవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నేపథ్యం
సెమీకండక్టర్ డిజైన్, తయారీ, టెక్నాలజీ అభివృద్ధికి భారత్‌ను ప్రపంచ హబ్ గా నిలపాలన్నది ప్రధాన మంత్రి దార్శనికత. ఇందులో భాగంగా సెమీకాన్ ఇండియా 2024ను సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు 'సెమీకండక్డర్ భవిష్యత్తును తీర్చిదిద్దటం' అనే ఇతివృత్తంతో నిర్వహిస్తున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సెమీకండక్టర్ల విషయంలో ప్రపంచ కేంద్రంగా భారత్‌ను తీర్చిదిద్దే వ్యూహం, విధానాన్ని ప్రదర్శించనున్నారు. ప్రపంచ సెమీకండక్టర్ దిగ్గజ సంస్థల అగ్రనాయకుల ఇందులో పాల్గొననున్నారు. సెమీకండక్టర్ పరిశ్రమకు చెందిన ప్రపంచ నాయకులు, కంపెనీలు, నిపుణులను ఒకే వేదికపైకి ఈ సదస్సు తీసుకురానుంది. 250 మందికి పైగా ప్రదర్శనదారులు(ఎగ్జిబిటర్లు), 150 మంది వక్తలు పాల్గొననున్నారు.
Click here to read full text speech
Today's India inspires confidence in the world... When the chips are down, you can bet on India! pic.twitter.com/KHMerOlN4P
— PMO India (@PMOIndia) September 11, 2024
India's semiconductor industry is equipped with special diodes... pic.twitter.com/I1DkJTc6Tq
— PMO India (@PMOIndia) September 11, 2024
The three-dimensional power that forms the foundation of India's semiconductor industry... pic.twitter.com/PHhESMcJhG
— PMO India (@PMOIndia) September 11, 2024
India is set to play a major role in driving the global semiconductor industry. pic.twitter.com/kNNzEHLnbu
— PMO India (@PMOIndia) September 11, 2024
We have taken numerous steps to advance semiconductor manufacturing. pic.twitter.com/cVKunWeTn3
— PMO India (@PMOIndia) September 11, 2024
An Indian-made chip in every device. pic.twitter.com/gs1ORrtoFX
— PMO India (@PMOIndia) September 11, 2024