హిందుస్థాన్ టైమ్స్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా స్మారక తపాలా బిళ్ళ విడుదల
దేశ భవితను తీర్చిదిద్ది, మార్గనిర్దేశం చేసింది సామాన్య పౌరుడి బుద్ధి కుశలత, సమర్ధతలేనన్న ప్రధాని
సంపూర్ణ అభివృద్ధి సాధించిన నవీన భారతదేశ సాధన కోసం ‘ప్రజల వలన, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రగతి’ అన్న సూత్రాన్ని అనుసరిస్తున్నామన్న ప్రధానమంత్రి
నేడు దేశం అసాధారణ ఆకాంక్షలకు ఆలవాలమని, ఈ ఆకాంక్షలే విధానాల రూపకల్పనకు ప్రేరణగా నిలుస్తున్నాయన్న శ్రీ మోదీ
‘పెట్టుబడుల ద్వారా ఉపాధి, అభివృద్ధి ద్వారా గౌరవం’ అనే విలక్షణ మార్గం ద్వారా పౌరులకు అభివృద్ధి ఫలాలను అందిస్తున్నామన్న ప్రధాని
ప్రజల ప్రయోజనార్థం ‘అధిక మొత్తంలో వ్యయం, అధిక మొత్తంలో పొదుపు’ సూత్రాన్ని అనుసరిస్తున్నామన్న ప్రధాని
ఈ శతాబ్ది మనదేశానిదేనన్న శ్రీ మోదీ

న్యూఢిల్లీలో ఈరోజు  ఏర్పాటైన ‘2024-హిందుస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’ నుద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు. వందేళ్ల కిందట జాతి పిత మహాత్మా గాంధీ  చేతుల మీదుగా ప్రారంభమైన హిందుస్థాన్  టైమ్స్ పత్రిక, నూరేళ్ళ చారిత్రాత్మక ప్రయాణం పూర్తిచేసినందుకు పత్రిక యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు. తొలినాళ్ళ నుంచీ పత్రికతో అనుబంధం కలిగిన వారిని అభినందిస్తూ, వారికి అన్ని విధాలా శుభం చేకూరాలని ఆకాంక్షించారు. పత్రిక శతాబ్ది వేడుకల సందర్భంగా ఏర్పాటైన ప్రత్యేక ప్రదర్శనను తిలకించిన శ్రీ మోదీ, అద్భుతమైన ఈ ప్రదర్శనను ప్రతినిధులందరూ తప్పక సందర్శించాలని సూచించారు. భారత్ కు స్వాతంత్య్రం  సిద్ధించిన సందర్భం, రాజ్యాంగం అమలు… మొదలైన అలనాటి చారిత్రక ఘట్టాలకు సంబంధించిన పాత ప్రతులను చూసే అవకాశం కలిగిందన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నేతాజీ సుభాష్ చంద్ర బోస్, డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ, అటల్ బిహారీ వాజపేయి, డాక్టర్ ఎం ఎస్ స్వామినాథన్ వంటి లబ్ధ ప్రతిష్ఠులు హిందుస్థాన్  టైమ్స్ పత్రికకు వ్యాసాలు రాసేవారని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్వాతంత్య్ర  పోరు నాటి పరిస్థితులకు, అనంతర కాలంలోని ఆశలూ ఆకాంక్షలకు ప్రత్యక్షసాక్షిగా నిలిచిన పత్రిక ప్రయాణం అద్భుతమనదగ్గదని అన్నారు. అక్టోబర్ 1947లో భారతదేశంలో కాశ్మీర్ విలీనానికి సంబంధించిన వార్తను తానూ మిగతా దేశవాసులతో కలిసి అబ్బురంగా చదివానని శ్రీ మోదీ నెమరువేసుకున్నారు. నిర్ణయం తీసుకోవడంలో అసంగదిగ్ధత కాశ్మీర్ ను ఏ విధంగా ప్రతికూలంగా ప్రభావితం చేసిందో ఆ క్షణం తనకు అవగతమైందని, ఏడు సుదీర్ఘ దశాబ్దాల పాటు కాశ్మీర్ హింసను ఎదుర్కొనవలసి వచ్చిందని అన్నారు. ఇప్పటి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని, ఇప్పుడు జమ్ము కాశ్మీర్  ఎన్నికల్లో  రికార్డు సంఖ్యలో ఓటర్లు పాల్గొనడం గురించి వార్తల ప్రచురణ తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు. తనని ఆకర్షించిన మరో వార్త గురించి చెబుతూ, వార్తా పత్రిక ఒకవైపు పుటలో అస్సాం ను సమస్యాత్మక ప్రాంతంగా ప్రకటించిన వార్త ప్రచురితమవగా, మరోవైపు భారతీయ జనతా పార్టీకి అటల్ బిహారీ వాజపేయి శంకుస్థాపనకు సంబంధించిన వార్త ప్రచురితమైందని వెల్లడించారు. నేడు  అస్సాంలో సుస్థిర శాంతిని నెలకొల్పేందుకు అదే బీజేపీ కీలక భూమిక పోషిస్తూండడం తనకు ఆనందం కలిగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

నిన్న జరిగిన తొలి బోడోలాండ్ మహోత్సవ్‌లో తాను పాల్గొన్న విషయాన్ని గురించి చెబుతూ, కార్యక్రమానికి సంబంధించిన పేలవమైన మీడియా కవరేజీ తనను ఆశ్చర్యపరిచిందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దశాబ్దాల తర్వాత హింసను విడిచిపెట్టిన యువత, ప్రజలు ఢిల్లీలో సాంస్కృతిక కార్యక్రమాన్ని జరుపుకోవడం గొప్ప విశేషమని అన్నారు. 2020 బోడో శాంతి ఒప్పందం ప్రజల జీవితాల్లో గొప్ప  మార్పుకు కారణమయ్యిందని అన్నారు. హిందుస్థాన్  టైమ్స్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌లో భాగంగా ముంబై 26/11 ఉగ్రదాడుల చిత్రాలను వీక్షించిన శ్రీ మోదీ, పొరుగు దేశాల ప్రోద్బలం వల్ల జరిగే ఉగ్రదాడుల వల్ల ఆ కాలంలో ప్రజలు తమ సొంత ఇళ్ళలో, నగరాల్లో అభద్రతకు గురయ్యేవారని, ఇప్పుడు ఉగ్రవాదులే సొంత ఇళ్ళలో భయపడుతూ గడుపుతున్నారని అన్నారు.
 

100 సంవత్సరాల ప్రస్థానంలో, 25 సంవత్సరాల బానిసత్వాన్ని, 75 సంవత్సరాల స్వతంత్రాన్ని పత్రిక చూసిందన్నారు. ఇన్ని దశాబ్దాల్లో దేశానికి దిశానిర్దేశం చేసి, భవితను తీర్చిదిద్దింది  సామాన్య పౌరుడి బుద్ధి కుశలత, సమర్ధతలేనన్న ప్రధాని, ఈ విజయంలో పత్రిక భాగస్వామ్యం కూడా ఉందని చెప్పారు. సామాన్య పౌరుడి ప్రతిభని గుర్తించడంలో  నిపుణులు కూడా తరుచూ విఫలమయ్యేవారని వ్యాఖ్యానించారు. చరిత్రను స్పృశిస్తూ, బ్రిటీష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టినప్పుడు, దేశం విచ్ఛిన్నమవుతుందని కొందర జోస్యం చెప్పారని, అదే విధంగా ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇక ఎప్పటికీ మామూలు రోజులు రావని భయపడ్డ కొందరు వ్యక్తులు, సంస్థలు అప్పటి ప్రభుత్వ ఆశ్రయాన్ని పొందారని అన్నారు. అటువంటి క్లిష్ట సమయాల్లో కూడా స్థిరంగా నిలబడ్డ పౌరులు ఎమర్జెన్సీని పెకిలించివేశారని అన్నారు.  సామాన్యుల బలాన్ని గురించి  చెబుతూ, కోవిడ్ మహమ్మారిపై  పోరాడిన  సామాన్య పౌరుల స్ఫూర్తిని శ్రీ మోదీ కొనియాడారు.

అస్థిరత నెలకొన్న 1990 దశకం గురించి ప్రస్తావించిన ప్రధాని, ఆ 10 ఏళ్ళ కాలంలో 5 సార్లు ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఇదే తీరు కొనసాగుతుందని అప్పటి పత్రికలు రాసినప్పటికీ, నిపుణుల అంచనాలు తప్పని ప్రజలు మరోమారు రుజువు చేశారని అన్నారు. ఈరోజున ప్రపంచం మొత్తం నిలకడ లేమి పరిస్థితులను ఎదుర్కొంటూ, ప్రభుత్వాలు మారిపోతున్న పరిస్థితుల్లో భారత ప్రజలు మూడో సారి ఒకే ప్రభుత్వానికి పట్టం కట్టి స్థిరత్వానికే తమ ఓటని నిరూపించారన్నారు.
 

గతంలోని విధానాల గురించి మాట్లాడుతూ, ‘సమర్ధమైన ఆర్థికవ్యవస్థ రాజకీయానికి పనికిరాదు ’ అనే నానుడిని విమర్శకులు ప్రచారం చేసేవారని, ప్రభుత్వాలు దాన్ని నమ్మి ఆచరించేవని శ్రీ మోదీ అన్నారు. తమ అసమర్థ పాలనని కప్పిపుచ్చుకోవడానికి గత ప్రభుత్వాలకు ఈ మాట బాగా పనికి వచ్చేదన్నారు. దరిమిలా అభివృద్ధిలో సమతౌల్యం దెబ్బతిని ప్రభుత్వంపై ప్రజలకు గల నమ్మకం వమ్మైందన్నారు. ‘ప్ర‌జ‌ల వలన, ప్ర‌జ‌ల చేత, ప్ర‌జ‌ల‌కు కొరకు ప్ర‌గ‌తి’ అనే మంత్రాన్ని ఆచరించడం ద్వారా త‌మ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల విశ్వాసాన్ని తిరిగి సాధించిందని ప్ర‌ధాన మంత్రి వ్యాఖ్యానించారు. పరిపూర్ణంగా అభివృద్ధి చెందిన నవీన భారతదేశాన్ని నిర్మించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, భారతదేశ ప్రజలు నమ్మకమనే అమూల్యమైన మూలధనాన్ని తమ ప్రభుత్వానికి  అప్పగించారని అన్నారు. సామాజిక మాధ్యమాల ప్రభావం అధికమైన ఈ  యుగంలో తప్పుడు సమాచారం, అసత్య ప్రచారాలు రాజ్యామేలుతున్నప్పటికీ భారత పౌరులకు తమ ప్రభుత్వంపై సంపూర్ణమైన విశ్వాసం ఉందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

ప్రజలకు ప్రభుత్వంపై విశ్వాసం పెరిగినప్పుడు, పాలకులకు కూడా విశ్వాసం పెరుగుతుందని, అది దేశాభివృద్ధిపై సానుకూల ప్రభావాన్ని చూపుతుందని ప్రధానమంత్రి అన్నారు. ‘రిస్క్ తీసుకోవడం’ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ, మన పూర్వీకులు కొత్త పంథాలో నడిచేందుకు భయపడలేదని, అందువల్ల భారతీయ ఉత్పత్తులు విదేశీ మార్కెట్లకు చేరుకుని   అటు సాంస్కృతికంగా, ఇటు ఆర్థిక పరంగా దేశానికి పేరు ప్రతిష్ఠలు తెచ్చిపెట్టాయని శ్రీ మోదీ అన్నారు. అయితే, స్వాతంత్య్రానంతర కాలంలో గత ప్రభుత్వాలు రిస్క్ తీసుకునే ధోరణికి పూర్తిగా  దూరమయ్యాయని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 సంవత్సరాల్లో  భారతదేశం అభివృద్ధిని సాధిస్తూ అనేక మార్పులను చవి చూస్తోందని, కొత్త సవాళ్ళను ధైర్యంగా స్వీకరించే ప్రజాసంస్కృతికి తమ ప్రభుత్వం కొత్త బలాన్నిచ్చిందని ప్రధాని అన్నారు. ఇటీవలి కాలంలో నమోదైన 1.25 లక్షల అంకుర పరిశ్రమలు, రిస్క్ తీసుకునే మన యువత ధోరణికి నిదర్శనమన్నారు.  క్రీడలను వృత్తిగా స్వీకరించడాన్ని ఒకప్పుడు రిస్క్ గా భావించేవారని,  అదే ఈ రోజు చిన్న చిన్న పట్టణాల్లోని యువత కూడా ఈ రిస్క్ తీసుకొని దేశానికి కీర్తిని తెచ్చిపెడుతున్నారని అన్నారు. స్వయం సహాయక బృందాలని ఉదహరిస్తూ, ఈరోజున దేశంలోని కోటిమందికి పైగా గ్రామీణ మహిళలు తమ  సొంత వ్యాపారాలను స్థైర్యంగా నిర్వహించుకుంటూ లఖ్ పతీ దీదీలుగా (లక్షాధికారి మహిళలు) మారారని  అన్నారు.
 

"భారత సమాజం నేడు అసాధారణమైన ఆకాంక్షలతో నిండి ఉంది, ప్రజల ఆకాంక్షలే మా విధానాలకు ప్రేరణ కలిగిస్తున్నాయి" అని శ్రీ మోదీ అన్నారు. ‘పెట్టుబడి ద్వారా ఉపాధి, అభివృద్ధి ద్వారా గౌరవం’ అనే విలక్షణ అభివృద్ధి నమూనాను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని శ్రీ మోదీ తెలిపారు. పెట్టుబడి అభివృద్ధికి దారితీస్తుందని, తద్వారా ఉపాధి కల్పన సాధ్యమవుతుందని, ఈ అభివృద్ధి పౌరులకు గౌరవాన్నిఅందిస్తుందని ప్రధాన మంత్రి అన్నారు. దేశంలో శౌచాలయాల నిర్మాణాన్ని గురించి చెబుతూ, అవి  సౌలభ్యంతో పాటు భద్రతకు, గౌరవానికి మార్గమని అన్నారు. శౌచాలయాల నిర్మాణం అభివృద్ధిని కూడా వేగవంతం చేసిందని, ఈ విధంగా ‘పెట్టుబడి ద్వారా ఉపాధి, అభివృద్ధి ద్వారా గౌరవం’ అనే సూత్రం ఆచరణలో విజయవంతమైందని శ్రీ మోదీ అన్నారు. గతంలో ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను కలిగి ఉండటం ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా భావించేవారని,  గత ప్రభుత్వాలు ప్రజలకు ఎన్ని సిలిండర్లు మంజూరు చేయవచ్చన్న అంశాన్ని చర్చిస్తే,  తమ ప్రభుత్వం దేశంలోని ప్రతి ఇంటికి గ్యాస్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రాధాన్యాన్నిచ్చిందని ప్రధాని  వ్యాఖ్యానించారు. 2014లో దేశంలో 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, నేడు ఆ సంఖ్య 30 కోట్లకు చేరుకుందన్నారు. గ్యాస్ సిలిండర్ల డిమాండ్‌ను తీర్చేందుకు  అవసరమైన మౌలిక సదుపాయాలు సిద్ధంగా ఉన్నాయని తెలియజేశారు. సిలిండర్ల  బాటిలింగ్ ప్లాంట్ల నుంచి పంపిణీ కేంద్రాలు, హోమ్ డెలివరీ వరకూ వివిధ దశల్లో అనేక మందికి  ఉపాధి లభిస్తోందని  చెప్పారు.  మొబైల్ ఫోన్, ‘రూపే’ కార్డ్, యూపీఐ మొదలైన సౌకర్యాలు ‘పెట్టుబడి ద్వారా ఉపాధి, అభివృద్ధి ద్వారా గౌరవం’ అన్న అభివృద్ధి నమూనా ఆధారంగా అభివృద్ధిపరిచామని చెప్పారు .
 

భారతదేశం నేడు పయనిస్తున్న అభివృద్ధి పథాన్ని అర్థం చేసుకునేందుకు  ప్రభుత్వం అమలుపరుస్తున్న మరొక విధానాన్ని గురించి తెలుసుకోవడం కీలకమని ప్రధాన మంత్రి అన్నారు. “ప్రజల ప్రయోజనార్థం ‘అధిక మొత్తంలో వ్యయం, అధిక మొత్తంలో పొదుపు’ సూత్రాన్ని అనుసరిస్తున్నామని వెల్లడించారు. 2014లో 16 లక్షల కోట్లుగా ఉన్న కేంద్ర బడ్జెట్ నేడు రూ. 48 లక్షల కోట్లకు చేరుకుందని, ఇక మూలధన వ్యయానికి వస్తే, 2013-14లో 2.25 లక్షల కోట్లగా ఉన్న మూలధన వ్యయం నేడు రూ. 11 లక్షల కోట్లకు చేరుకుందని చెప్పారు. కొత్త ఆసుపత్రులు, పాఠశాలలు, రోడ్లు, రైల్వేలు, పరిశోధన కేంద్రాల వంటి అనేక ప్రజా మౌలిక సదుపాయాల కోసం మూలధన వ్యయాన్ని వెచ్చిస్తున్నామని చెప్పారు. ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ కోసం చేసే  వ్య‌యం పెంచ‌డంతోపాటు ప్ర‌జ‌ల డబ్బును ఆదా కూడా చేస్తున్నదని ప్ర‌ధానమంత్రి తెలిపారు.  పొదుపుకి సంబంధించిన  గణాంకాలను వెల్లడిస్తూ , ప్రత్యక్ష నగదు బదిలీలో జరుగుతున్న అవకతవకలని నిరోధించడం ద్వారా  దేశానికి రూ. 3.5 లక్షల కోట్లు మిగులు లభించిందని, ఆయుష్మాన్ భారత్ యోజన కింద ఉచిత చికిత్స పేదలకు 1.10 లక్షల కోట్లు ఆదా చేసిందని చెప్పారు.  

జన్ ఔషధి కేంద్రాల్లో 80% రాయితీతో లభించే ఔషధాల వల్ల పౌరులకు రూ. 30 వేల కోట్లు ఆదా అయ్యాయని, స్టెంట్లు, మోకాలి ఇంప్లాంట్ల ధరలను నియంత్రించడం వల్ల ప్రజలకు వేల కోట్ల రూపాయలు ఆదా అయ్యాయని అన్నారు. ఇక ఉజాలా పథకం ద్వారా ప్రజలకు రూ. 20 వేల కోట్లు విద్యుత్ బిల్లుల రూపేణా ఆదా అయ్యాయని చెప్పారు. స్వచ్ఛ భారత్ మిషన్ వల్ల వ్యాధులు తగ్గుముఖం పట్టాయని , దీనివల్ల గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి రూ. 50 వేలు ఆదా అయ్యాయని తెలిపారు. యునిసెఫ్ నివేదికను ఉటంకిస్తూ, సొంత మరుగుదొడ్డి ఉన్న కుటుంబం కూడా దాదాపు రూ. 70 వేలు ఆదా చేస్తోందని, మొదటిసారిగా తాగునీటి సౌకర్యం కలిగిన 12 కోట్ల కుటుంబాలు ప్రతి సంవత్సరం రూ. 80 వేలకు పైగా ఆదా చేయగలుగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ అధ్యయనం వెల్లడించిందని శ్రీ మోదీ చెప్పారు.
 

10 ఏళ్ళ క్రితం దేశం ఇంత అభివృద్ధి సాధిస్తుందని ఎవరూ ఊహించలేదని, “దేశం సాధించిన అపూర్వ విజయాలు మరింత పెద్ద కలలు కనేందుకు మాకు ప్రేరణనందిస్తోంది" అని అన్నారు.  ఈ శతాబ్దం నిశ్చయంగా భారత్‌ దే అన్న ఆకాంక్షకు ఈ విజయాలు బలాన్నిస్తున్నాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు.  ఈ దిశగా పయనించడానికి ఎంతో కృషి అవసరమన్న ప్రధాని,  ప్రతి రంగంలోనూ అత్యుత్తమ పనితీరు కనపరిచే దిశగా  ప్రభుత్వం శ్రమిస్తోందన్నారు. దేశంలో తయారయ్యే వివిధ ఉత్పత్తులు, నిర్మాణం, విద్య, వినోదం... రంగం ఏదైనప్పటికీ  భారతదేశ ఉత్పత్తులూ సేవలకు 'ప్రపంచ స్థాయి'గా గుర్తింపు  పొందేందుకు ఎంతో కృషి అవసరమని వ్యాఖ్యానించారు. ఈ విధానాన్ని ప్రజల మనస్సులలో నాటేందుకు హిందుస్థాన్ టైమ్స్ కూడా  పెద్ద పాత్రను పోషించాలని, 100 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఈ దిశగా ఉపకరిస్తుందని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. భారతదేశం ఈ అభివృద్ధి వేగాన్ని కొనసాగించి త్వరలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తూ శ్రీ మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు.  వేగంగా పరివర్తన చెందుతున్న భారతదేశానికి  హిందూస్థాన్ టైమ్స్ కూడా సాక్షిగా నిలుస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Income inequality declining with support from Govt initiatives: Report

Media Coverage

Income inequality declining with support from Govt initiatives: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Chairman and CEO of Microsoft, Satya Nadella meets Prime Minister, Shri Narendra Modi
January 06, 2025

Chairman and CEO of Microsoft, Satya Nadella met with Prime Minister, Shri Narendra Modi in New Delhi.

Shri Modi expressed his happiness to know about Microsoft's ambitious expansion and investment plans in India. Both have discussed various aspects of tech, innovation and AI in the meeting.

Responding to the X post of Satya Nadella about the meeting, Shri Modi said;

“It was indeed a delight to meet you, @satyanadella! Glad to know about Microsoft's ambitious expansion and investment plans in India. It was also wonderful discussing various aspects of tech, innovation and AI in our meeting.”