జ‌మ్ముకశ్మీర్‌లో రూ.1,500 కోట్లకుపైగా విలువైన 84 ప్రధాన అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం;
వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు(జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన ప‌థ‌కానికి ప్రారంభోత్సవం;
‘‘ప్రభుత్వ ఆలోచనలు.. విధానాలపై ప్రజలకు విశ్వాసం ఉంది’’;
‘‘ప్రజల అంచనాల మేరకు ప్రభుత్వం తన పనితీరుతో ఫలితాలు సాధిస్తుంది’’;
‘‘ఈ లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల తీర్పు స్థిరత్వానికి పెద్దపీట వేసింది’’;
‘‘మానవ‌త‌... ప్ర‌జాస్వామ్యం... కశ్మీరత’ల‌పై శ్రీ అటల్ దార్శ‌నిక‌త వాస్తవం కావడం నేడు మ‌నం చూస్తున్నాం’’;
‘‘ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నత స్థాయిలో నిలిపిన మీ కృషికి ధన్యవాదాలు తెలపడానికే ఇక్కడికి వచ్చాను’’;
‘‘జమ్ముకశ్మీర్‌లో నేడు ఆర్టికల్ 370 గోడలు తొలగి భారత రాజ్యాంగం వాస్తవికార్థంలో అమలవుతోంది’’;
‘‘హృదయానుగతంగా లేదా ఢిల్లీపరంగా (దిల్ యా దిల్లీ) అంతరాల తొలగింపుపై అన్నివిధాలా కృషి చేస్తున్నాం’’;
‘‘మీ సొంత ఓటుతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే స‌మ‌యం ఎంతో దూరంలో లేదు... జమ్ముకశ్మీర్ ఒక రాష్ట్రంగా త్వరలో మ‌ళ్లీ తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకోగలదు’’;
‘‘అంకుర సంస్థలు.. క్రీడలు.. నైపుణ్యాభివృద్ధికి ప్రధాన కూడలిగా లోయ ప్రాంతం క్రమంగా పురోగమిస్తోంది’’;
‘‘జమ్ముకశ్మీర్‌ నవతరం శాశ్వత శాంతితో జీవిస్తుంది’’;

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ శ్రీనగర్‌లోని ‘షేర్-ఎ-కశ్మీర్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సెంటర్’ (ఎస్‌కెఐసిసి)లో ‘‘యువతకు సాధికారత.. జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట నిర్వ‌హించిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.1,500 కోట్లకుపైగా విలువైన పలు అభివృద్ధి పథకాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు (జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన ప‌థ‌కానికి ఆయన శ్రీకారం చుట్టారు. అంతేకాకుండా తాజాగా ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 200 మందికి నియామక ఉత్తర్వులు అందజేసే కార్యక్రమాన్ని కూడా శ్రీ మోదీ ప్రారంభించారు. అనంతరం ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించి, ఈ కేంద్రపాలిత ప్రాంత యువ విజేతలతో కొద్దిసేపు ముచ్చటించారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా ఏర్పాటు చేసిన సభలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- జ‌మ్ముక‌శ్మీర్‌లో తన ప్రస్తుత ప‌ర్య‌ట‌న ఎంతో ఉత్తేజభరితమైనదని అభివర్ణించారు. ఇందుకు రెండు నిర్దిష్ట కారణాలున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు మొదటిది... ‘‘జ‌మ్ముక‌శ్మీర్‌లో ఇవాళ వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపన. ఇక రెండోది.. లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలిసారి జమ్ముకశ్మీర్ ప్రజలను తొలిసారి కలుసుకోవడం’’ అని తెలిపారు. ఇటీవల జి-7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు ఇటలీ వెళ్లడాన్ని ప్రస్తావిస్తూ- భారతదేశంపై ప్రపంచ దృక్పథంలో మార్పును ప్రస్ఫుటంగా గమనించానని ప్రధానమంత్రి చెప్పారు. ఒక ప్రభుత్వం మూడోసారి కూడా కొనసాగి, ప్రపంచాన్ని ప్రభావితం చేయడమే ఇందుకు కారణమని పేర్కొన్నారు. భారతీయుల ఆకాంక్షలు నేడు మునుపెన్నడూ లేనంత అధికస్థాయిలో ఉండటం దేశానికి అతిపెద్ద బలమని ఆయన వ్యాఖ్యానించారు. ఈ భారీ ఆకాంక్షలు ప్రభుత్వ పనితీరుపై అంచనాలను పెంచుతాయని చెప్పారు. ఆకాంక్షాత్మక సమాజం పనితీరును మాత్రమే కొలబద్దగా పరిగణించిన నేపథ్యంలో ఈ ప్రభుత్వానికి మూడోదఫా పదవీకాలం ఎంతో ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. ‘‘ఆ మేరకు ప్రభుత్వ ఆలోచనలు, విధానాలపై  ప్రజలు తమ నమ్మకాన్ని ప్రస్ఫుటం చేశారు’’ అని ప్రధాని అన్నారు.

 

   ప్రస్తుత లోక్‌సభ ఎన్నికలలో ప్రజల తీర్పు దేశంలో సుస్థిరత సందేశాన్ని గట్టిగా చాటిందని ప్రధాని అన్నారు. ఈ సందర్భంగా గత శతాబ్దపు చివరి దశాబ్దంలో సుదీర్ఘంగా సాగిన అస్థిర ప్రభుత్వాల చరిత్రను ఆయన గుర్తుచేశారు. అప్పట్లో కేవలం 10 సంవత్సరాల్లోనే దేశం 5 ఎన్నికలను చూసిందని, ఫలితంగా ప్రగతి స్తంభించిందని చెప్పారు. ‘‘దేశం నేడు ఆ దుస్థితినుంచి బయటపడి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయగల సుస్థిర ప్రభుత్వ నవ శకంలో ప్రవేశించింది’’ అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో జమ్ముకశ్మీర్ ప్రజలు కూడా తమవంతు పాత్ర పోషించారని ఆయన అన్నారు. ఆ మేరకు ‘‘మానవ‌త‌, ప్ర‌జాస్వామ్యం, కశ్మీరత’ల‌పై శ్రీ అటల్ దార్శ‌నిక‌త వాస్తవం కావడాన్ని ఇవాళ మ‌నమంతా ప్రత్యక్షంగా చూస్తున్నాం’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇటీవలి ఎన్నికలలో రికార్డు స్థాయిలో ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యంపై తమ దృఢ విశ్వాసాన్ని జమ్ముకశ్మీర్ ప్రజలు రుజువు చేసుకున్నారని ప్రధాని ప్రశంసించారు. ‘‘ప్రజాస్వామ్య పతాకాన్ని సమున్నతంగా నిలిపిన మీ నమ్మకానికి ధన్యవాదాలు చెప్పడం కోసమే నేనిక్కడికి వచ్చాను’’ అన్నారు.

   ‘‘గడచిన 10 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వ కృషి ఫలితంగానే జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరివర్తన సాధ్యమైంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ ప్రాంతంలో స్వల్పాదాయ నేపథ్యంగల మహిళలు, ప్రజలు తమ హక్కులను కోల్పోయారని ఆయన గుర్తుచేశారు. అయితే, ప్రస్తుత ప్రభుత్వం ‘సబ్‌కా  సాథ్... సబ్‌కా వికాస్’ మంత్రంతో వారి హక్కుల పునరుద్ధరణకు, అవకాశాలను దరిచేర్చడానికి శ్రమించిందని పేర్కొన్నారు. తదనుగుణంగా పాకిస్థాన్ నుంచి వలస వచ్చిన శరణార్థులు, వాల్మీకి వర్గ ప్రజలు, పారిశుధ్య కార్మిక కుటుంబాలకు తొలిసారి ఓటు హక్కు లభించిందని ప్రధాని చెప్పారు. తమను ఎస్సీ జాబితాలో చేర్చాలన్న వాల్మీకి సామాజిక వర్గం చిరకాల వాంఛతోపాటు ఎస్సీలకు చట్టసభల్లో రిజర్వేషన్ సహా పెద్దారి తెగ, పహాడీ కులం, గడ్డ బ్రాహ్మణ, కోలి సామాజిక వర్గాలను ఎస్సీల జాబితాలో చేర్చాలన్న చిరకాల డిమాండ్‌ను నెరవేర్చాల్సి ఉందని పేర్కొన్నారు.

 

   పంచాయతీ, నగరపాలిక, నగర నిగమ్‌ ఎన్నికల్లో ‘ఒబిసి’ రిజర్వేషన్ అమలు చేశామని ప్రధాని గుర్తుచేశారు. భారత రాజ్యాంగానికిగల శక్తిని, ప్రతి అక్షరంలో ఉట్టిపడే స్ఫూర్తికిగల ప్రాధాన్యాన్ని ప్రస్తావిస్తూ- దేశంలోని 140 కోట్ల మంది పౌరుల హక్కులను నిర్ధారిస్తున్నదని పేర్కొన్నారు. అలాగే దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములయ్యే అవకాశం కల్పిస్తుందని ప్రధాని నొక్కిచెప్పారు. అయితే, ఈ మహత్తర రాజ్యాంగాన్ని అంగీకరించకపోవడంతోపాటు స్వాతంత్ర్యం వచ్చిన నాటినుంచీ  జమ్ముకశ్మీర్ విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించడంపై శ్రీ మోదీ విచారం వెలిబుచ్చారు. అయితే, ‘‘నేడు మనమంతా భారత రాజ్యాంగానికి అనుగుణంగా జీవిస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. అలాగే రాజ్యాంగానుసారం కశ్మీర్ రూపురేఖలను చక్కగా తీర్చిదిద్దే కొత్త మార్గాన్వేషణ చేస్తున్నాం’’ అని సగర్వంగా ప్రకటించారు. ‘‘జమ్ముకశ్మీర్‌లో నేడు ఆర్టికల్ 370 గోడలు తొలగి ఎట్టకేలకు భారత రాజ్యాంగం వాస్తవికార్థంలో అమలవుతోంది’’ అని శ్రీ మోదీ ఉద్వేగభరిత స్వరంతో చెప్పారు.

   గడచిన పదేళ్లలో కశ్మీర్‌లో చోటుచేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ- కశ్మీర్ లోయలో ఇటీవలి పరివర్తనకు ప్రపంచమే సాక్షిగా నిలుస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా లోయలోని ప్రజల ఆతిథ్యాన్ని పలు దేశాధినేతలు నేటికీ ప్రశంసిస్తూనే ఉన్నారని చెప్పారు. లోయ ప్రాంతంలో జి-20 వంటి అంతర్జాతీయ సమావేశం నిర్వహించడం కశ్మీర్ ప్రజలకు గర్వకారణంగా మారిందన్నారు. నిత్యం పొద్దుపోయేదాకా లాల్ చౌక్‌లో పిల్లలు ఆటపాటలు చూసి, ప్రతి భారతీయుడి హృదయంలో ఆనందం ఉప్పొంగుతున్నదని చెప్పారు. అలాగే లోయలోని వ్యాపార ప్రాంతాల్లో నెలకొన్న సందడితో ప్రజల వదనాల్లో చిరునవ్వు ప్రకాశిస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో దాల్‌ సరస్సు సమీపాన స్పోర్ట్స్‌ కార్‌ ప్రదర్శనను గుర్తుచేస్తూ, యావత్ ప్రపంచం ఆ వేడుకను వీక్షించిందని పేర్కొన్నారు. లోయ ప్రాంతంలో పురోగతికి ఇవే నిదర్శనాలని శ్రీ మోదీ అన్నారు. ఇక కశ్మీర్‌లో పర్యాటకం ఇవాళ చర్చనీయాంశం కావడాన్ని ప్రస్తావిస్తూ- రేపటి అంతర్జాతీయ యోగా దినోత్సవం మరింతగా పర్యాటకులను ఆకర్షిస్తుందన్నారు. ఈ సందర్భంగా లోయను సందర్శించిన పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో 2 కోట్లకు చేరిందని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా చెప్పడాన్ని ఉటంకించారు. ఈ పరిణామాలన్నీ స్థానిక ఆర్థిక వ్యవస్థ వృద్ధికి గణనీయంగా దోహదం చేస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.

 

   ‘‘నేటి తరాన్ని గతకాలపు కష్టనష్టాల నుంచి విముక్తం చేసే దిశగా చిత్తశుద్ధితో, నిజాయితీతో నన్ను నేను అంకితం చేసుకుంటున్నాను. హృదయానుగతంగా లేదా ఢిల్లీపరంగా (దిల్ యా దిల్లీ) అంతరాల తొలగింపుపై అన్నివిధాలా కృషి చేస్తున్నాం” అని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ప్రజాస్వామ్య ఫలాలు ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అందేవిధంగా సమష్టి కృషి అవశ్యమని స్పష్టం చేశారు. జమ్ముకశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం కేంద్ర సాయంలో ప్రతి పైసా వెచ్చిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం నుంచి అందే ప్రతి పైసానూ జమ్ముకశ్మీర్ ప్రజల సంక్షేమానికే వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ‘‘తమ ప్రతినిధిని ఎన్నుకోవడం, వారి ద్వారా సమస్యలు పరిష్కరించుకోవడంకన్నా జమ్ముకశ్మీర్ ప్రజలకు కావాల్సింది ఏముంటుంది?  కాబట్టే, శాసనసభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. మీ సొంత ఓటుతో కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకునే స‌మ‌యం ఎంతో దూరంలో లేదు. జమ్ముకశ్మీర్ ఒక రాష్ట్రంగా త్వరలో మ‌ళ్లీ తన భవిష్యత్తును తానే తీర్చిదిద్దుకోగలదు’’ అని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

   నేటి కార్యక్రమాల్లో భాగంగా రూ.1,500 కోట్లకుపైగా విలువైన ప్రధాన ప్రగతి పనులతోపాటు రూ.1,800 కోట్ల విలువైన వ్యవసాయ-అనుబంధ రంగాల (జెకెసిఐపి) ప్రాజెక్టులకు ప్రారభోత్సవం, శంకుస్థాపన చేయడాన్ని ప్రధాని ప్రస్తావించారు. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను వేగంగా భర్తీ చేయడంపై కేంద్రపాలిత ప్రాంత యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. ఈ మేరకు గడచిన 5 ఏళ్లలో దాదాపు 40,000 నియామకాలు చేపట్టడాన్ని కొనియాడారు. మరోవైపు జమ్ముకశ్మీర్‌పై భారీ పెట్టుబడుల ప్రభావాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

 

   కశ్మీర్‌లో పురోగతిని ప్రశంసిస్తూ- రైలుమార్గా అనుసంధానం, విద్య-ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పన, విద్యుత్, నీరు సహా దాదాపు అన్ని రంగాల్లో నిజమైన ప్రగతిని ఈ లోయ నేడు ప్రత్యక్షంగా చూస్తున్నదని ప్రధానమంత్రి అన్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి గ్రామీణ రహదారుల పథకం కింద వేల కిలోమీటర్ల మేర రోడ్లు నిర్మించామని గుర్తు చేశారు. దాంతోపాటు కొత్త జాతీయ రహదారులు, ఎక్స్‌ ప్రెస్‌వేలతోపాటు లోయను రైలుమార్గాలతో అనుసంధానిస్తామని ఆయన నొక్కిచెప్పారు. చీనాబ్ రైలు వంతెన ఆకర్షణీయ దృశ్యం ప్రతి ఒక్కరూ గర్వంతో ఉప్పొంగేలా చేస్తోందన్నారు. ముఖ్యంగా... ఉత్తర కశ్మీర్‌లోని గురెజ్ వ్యాలీ తొలిసారి గ్రిడ్ సంధానం పొందిందని తెలిపారు. వ్యవసాయం నుంచి ఉద్యానాల దాకా... క్రీడలు-అంకుర సంస్థల వరకూ అన్ని రంగాల్లోనూ ఈ లోయ అపార అవకాశాలను దరిచేరుస్తుందని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు.

   కశ్మీర్‌లో దశాబ్దంగా కొనసాగుతున్న అభివృద్ధిని ప్రధానమంత్రి కొనియాడారు. ఈ మేరకు లోయ ప్రాంతం అంకుర సంస్థలు, నైపుణ్యాభివృద్ధితోపాటు క్రీడలకు ప్రధాన కూడలిగా పురోగమిస్తున్నదని చెప్పారు. అలాగే లోయలోని అంకుర సంస్థలలో 70 శాతం వ్యవసాయ రంగానికి సంబంధించినవేనని తెలిపారు. కొన్నేళ్లుగా ఇక్కడ 50కిపైగా డిగ్రీ కళాశాలలు ఏర్పాటైనట్లు గుర్తుచేశారు. ‘‘పాలిటెక్నిక్‌లలో సీట్లు పెరిగాయి.. కొత్త నైపుణ్య శిక్షణకు అవకాశాలు అందివచ్చాయి. ఐఐటీ, ఐఐఎం, ఎయిమ్స్‌ సహా  అనేక కొత్త వైద్య కళాశాలలు కూడా నిర్మితమయ్యాయని చెప్పారు. మరోవైపు పర్యాటక, ఆతిథ్య రంగాల్లోనూ స్థానిక స్థాయిలో నైపుణ్యం పెంచుకుంటున్నట్లు చెప్పారు. పర్యాటక గైడ్‌లకు శిక్షణ కోసం ఆన్‌లైన్ కోర్సులు ప్రవేశపెట్టాలని, పాఠశాలలు-కళాశాలలు-విశ్వవిద్యాలయాల్లో యువ పర్యాటక క్లబ్బులు ఏర్పాటు చేయాలని కూడా ప్రధాని లోగడ సూచించారు. తదనుగుణంగా నేడు ఈ కార్యక్రమాలన్నీ కశ్మీర్‌లో కొనసాగుతున్నాయి.

 

   జమ్ముకశ్మీర్‌ నారీశక్తిపై ప్రగతి పథకాల సానుకూల ప్రభావాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. స్థానిక స్వయం సహాయ సంఘాల మహిళలకు పర్యాటక, ఐటీ రంగంలో శిక్షణ ఇవ్వడాన్ని ప్రస్తావించారు. అలాగే రెండు రోజుల కిందట ‘వ్యవసాయ సఖి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడాన్ని గుర్తుచేస్తూ- దేశవ్యాప్తంగా 1,200 మందికిపైగా జ‌మ్ముకశ్మీర్‌ మహిళలు ‘వ్యవసాయ స‌ఖి’ విధులు నిర్వర్తిస్తున్నారని తెలిపారు. అలాగే ‘నమో డ్రోన్ దీదీ’ కార్యక్రమం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ పథకం కింద జమ్ముకశ్మీర్ యువతులకు శిక్షణ ఇస్తున్నారని చెప్పారు. ‘‘మహిళల ఆదాయం మెరుగుతోపాటు జీవనోపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం ఈ మేరకు కృషి చేస్తోంది’’ అని ఆయన చెప్పారు.

   ‘‘పర్యాటక, క్రీడా రంగాల్లో భారత్ ఒక ప్రధాన ప్రపంచ శక్తిగా శరవేగంతో దూసుకుపోతోంది’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ రెండు రంగాల్లో జమ్ముకశ్మీర్ అవకాశాలను ప్రస్తావిస్తూ- ప్రతి జిల్లాలో అద్భుత క్రీడా మౌలిక సదుపాయాలతో ప్రతిభగల క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా సుమారు 100 ఖేలో ఇండియా కేంద్రాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్‌లోని దాదాపు 4,500 మంది యువ క్రీడాకారులు జాతీయ-అంతర్జాతీయ పోటీలకు శిక్షణ పొందుతున్నారని ఆయన వెల్లడించారు. అన్నిటినీ మించి, జమ్ముకశ్మీర్ శీతాకాల క్రీడా రాజధానిగా మారుతోందని ప్రధాని మోదీ అన్నారు. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో ‘ఖేలో ఇండియా’ 4వ శీతాకాల క్రీడలు నిర్వహించడాన్ని గుర్తుచేశారు. ఈ క్రీడలలో దేశం నలుమూలల నుంచి 800 మందికిపైగా క్రీడాకారులు పాల్గొన్నారని చెప్పారు. ‘‘ఇటువంటి కార్యకలాపాలు రాబోయే రోజుల్లో ఇక్కడ అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణ దిశగా కొత్త అవకాశాలకు బాటలు వేస్తాయి’’ అన్నారు.

 

   అభివృద్ధి నిరోధక, శాంతి-మానవతా వ్యతిరేక, విచ్ఛిన్న శక్తుల విషయంలో జాగ్రత్త వహించాలని  జమ్ముకశ్మీర్ ప్రజలను ప్రధాని హెచ్చరించారు. ‘‘జమ్ముకశ్మీర్ ప్రగతిని అడ్డుకోవడానికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికి విచ్ఛిన్న శక్తులు ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నాయి’’ అని శ్రీ మోదీ అప్రమత్తం చేశారు. ఇటీవలి ఉగ్రవాద దాడుల ఉదంతాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నదని, వీటిని జమ్ముకశ్మీర్ యంత్రాంగం సహకారంతో అరికట్టేందుకుగల మార్గాలపై కేంద్ర హోం మంత్రి సమీక్షించారని గుర్తుచేశారు. ‘‘జమ్ముకశ్మీర్ శత్రువులకు గుణపాఠం నేర్పే ఏ అవకాశాన్నీ చేజార్చుకునేది లేదు. ఇక్కడి నవతరం ఇకపై శాశ్వత శాంతితో జీవిస్తుంది. మీరెంచుకున్న ప్రగతి పథాన్ని మేం మరింత బలోపేతం చేస్తాం’’ అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. చివరగా- ఇవాళ్టి అభివృద్ధి కార్యక్రమాలపై జమ్ముకశ్మీర్ ప్రజలకు అభినందనలు తెలుపుతూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ మనోజ్ సిన్హా, కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ ప్ర‌తాప్‌రావు జాదవ్ కూడా పాల్గొన్నారు.

 

నేపథ్యం

   శ్రీనగర్‌లో ‘‘యువతకు సాధికారత... జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట నిర్వ‌హించిన కార్యక్రమం ఈ ప్రాంతానికి ఎంతో కీలకం. ఇది జమ్ముకశ్మీర్ ప్రగతిని ప్రస్ఫుటం చేయడంతోపాటు యువ విజేతలకు స్ఫూర్తినిచ్చే దిశగా చేపట్టిన కార్యక్రమం. ఇందులో భాగంగా జ‌మ్ముకశ్మీర్‌లో రూ.1,500 కోట్లకుపైగా విలువైన 84 ప్రధాన అభివృద్ధి ప‌నుల‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వీటిలో రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా చెనాని-పట్నీతోప్-నశ్రీ సెక్షన్ సహా పారిశ్రామిక వాడల నిర్మాణం, 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నిర్మాణం వంటి ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు(జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన ప‌థ‌కానికి ఆయన శ్రీకారం చుట్టారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని 20 జిల్లాల్లోగల 90 సమితులలో ఈ పథకం అమలవుతుంది. దీనికింద 15 లక్షల మంది లబ్ధిదారులుగల 3,00,000 గృహాలకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన/ప్రారంభోత్సవాలతో యువతకు సాధికారత సిద్ధించడంతోపాటు జమ్ముకశ్మీర్‌లో మౌలిక సదుపాయాలు ఉన్నతీకరించబడతాయి. ఈ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 2,000 మంది యువతకు నియామక ఉత్తర్వుల ప్రదానాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.

 

   శ్రీనగర్‌లో ‘‘యువతకు సాధికారత... జ‌మ్ముక‌శ్మీర్ ప‌రివ‌ర్త‌న‌’’ పేరిట నిర్వ‌హించిన కార్యక్రమం ఈ ప్రాంతానికి ఎంతో కీలకం. ఇది జమ్ముకశ్మీర్ ప్రగతిని ప్రస్ఫుటం చేయడంతోపాటు యువ విజేతలకు స్ఫూర్తినిచ్చే దిశగా చేపట్టిన కార్యక్రమం. ఇందులో భాగంగా జ‌మ్ముకశ్మీర్‌లో రూ.1,500 కోట్లకుపైగా విలువైన 84 ప్రధాన అభివృద్ధి ప‌నుల‌కు ప్రధానమంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. వీటిలో రహదారులు, నీటి సరఫరా సహా ఉన్నత విద్యకు మౌలిక సదుపాయాల కల్పన వంటి కార్యక్రమాలు ఉన్నాయి. అంతేకాకుండా చెనాని-పట్నీతోప్-నశ్రీ సెక్షన్ సహా పారిశ్రామిక వాడల నిర్మాణం, 6 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల నిర్మాణం వంటి ప్రాజెక్టులకూ ప్రధాని శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా వ్యవసాయం-అనుబంధ రంగాల్లో పోటీతత్వం మెరుగు(జెకెసిఐపి) లక్ష్యంగా రూ.1,800 కోట్ల విలువైన ప‌థ‌కానికి ఆయన శ్రీకారం చుట్టారు. జ‌మ్ముక‌శ్మీర్‌లోని 20 జిల్లాల్లోగల 90 సమితులలో ఈ పథకం అమలవుతుంది. దీనికింద 15 లక్షల మంది లబ్ధిదారులుగల 3,00,000 గృహాలకు ఇది అందుబాటులో ఉంటుంది. ఈ ప్రాజెక్టుల శంకుస్థాపన/ప్రారంభోత్సవాలతో యువతకు సాధికారత సిద్ధించడంతోపాటు జమ్ముకశ్మీర్‌లో మౌలిక సదుపాయాలు ఉన్నతీకరించబడతాయి. ఈ కార్యక్రమాలతోపాటు ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 2,000 మంది యువతకు నియామక ఉత్తర్వుల ప్రదానాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India’s Biz Activity Surges To 3-month High In Nov: Report

Media Coverage

India’s Biz Activity Surges To 3-month High In Nov: Report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM to participate in ‘Odisha Parba 2024’ on 24 November
November 24, 2024

Prime Minister Shri Narendra Modi will participate in the ‘Odisha Parba 2024’ programme on 24 November at around 5:30 PM at Jawaharlal Nehru Stadium, New Delhi. He will also address the gathering on the occasion.

Odisha Parba is a flagship event conducted by Odia Samaj, a trust in New Delhi. Through it, they have been engaged in providing valuable support towards preservation and promotion of Odia heritage. Continuing with the tradition, this year Odisha Parba is being organised from 22nd to 24th November. It will showcase the rich heritage of Odisha displaying colourful cultural forms and will exhibit the vibrant social, cultural and political ethos of the State. A National Seminar or Conclave led by prominent experts and distinguished professionals across various domains will also be conducted.