నైజీరియా దేశం అబూజాలో తన గౌరవార్థం స్థానిక భారతీయ సమాజం ఈరోజు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. స్థానిక భారతీయులు అందించిన ఘన స్వాగతనికి, చూపిన ఉత్సాహం, గౌరవాభిమానల పట్ల ఆనందం వెలిబుచ్చిన ప్రధాని, వారి స్నేహమే తనకు పెట్టుబడివంటిదన్నారు.
ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా నైజీరియాలో పర్యటించే అవకాశం కలిగిందన్న ప్రధాని, కోట్లాది భారతీయుల శుభాభినందనలను తన వెంట తెచ్చానన్నారు. నైజీరియాలో భారతీయులు సాధిస్తున్న విజయాల పట్ల దేశ పౌరులు గర్విస్తున్నారని చెప్పారు. ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్’ జాతీయ పురస్కారాన్ని తనకు ప్రదానం చేసినందుకు అధ్యక్షుడు టినుబు, నైజీరియా పౌరులకు ధన్యవాదాలు తెలిపిన శ్రీ మోదీ, పురస్కారాన్ని సవినయంగా కోట్లాది భారతీయులకు అంకితమిచ్చారు.
అధ్యక్షుడు శ్రీ టినుబుతో జరిపిన సమావేశాల సందర్భంలో, భారత సమాజ పౌరుల కృషిని అధ్యక్షుడు టినుబు కొనియాడుతుంటే, పిల్లలు సాధించిన విజయాలను చూసి ఉప్పొంగిపోయే తల్లితండ్రులకు కలిగే గర్వాన్నే తానూ అనుభవించానని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. దేశం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్న ప్రతి సందర్భంలో స్థానిక భారతీయులు నైజీరియాకు అండగా నిలబడ్డారని గుర్తు చేశారు. 40 నుంచి 60 ఏళ్ళ మధ్య వయసు గల అనేక మంది స్థానిక భారతీయులకు భారతీయ గురువు వద్ద విద్యనభ్యసించిన అనుభవం కలిగి ఉండవచ్చన్న ప్రధాని, భారతీయ వైద్యులు నైజీరియాలో నిస్వార్ధ సేవలను అందిస్తున్నారని ప్రశంసించారు. నైజీరియాలో వ్యాపారాలను ప్రారంభించి ఆ దేశాభివృద్ధిలో భాగస్వాములైన వాణిజ్యవేత్తల గురించి శ్రీ మోదీ ప్రస్తావించారు. మన దేశానికి స్వాతంత్య్రం రాక మునుపే నైజీరియాకు వలస వెళ్ళిన శ్రీ కిషన్ చంద్ ఝేలారామ్ జీ గురించి మాట్లాడుతూ, ఆయన స్థాపించిన వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయలు చందాన విస్తరించి నైజీరియాలోని అతిపెద్ద వ్యాపార సంస్థల్లో ఒకటిగా అవతరించిందని చెప్పారు. ఈనాడు అనేక భారతీయ కంపెనీలు నైజీరియా ఆర్థిక వృద్ధిలో భాగస్వాములయ్యాయని, తులసీచంద్ర ఫౌండేషన్ అనేకమంది నైజీరియన్ల జీవితాల్లో వెలుగులు నింపుతోందని అన్నారు. నైజీరియా పురోభివృద్ధిలో అడుగడుగునా బాసటగా నిలుస్తున్న భారతీయుల నిబద్ధతను ప్రశంసించిన శ్రీ మోదీ, సహకార స్ఫూర్తి భారతీయుల సహజ గుణమని, ఆ లక్షణం మన సంస్కృతికి నిదర్శనమని అన్నారు. జగమంతా ఒకే కుటుంబమని భావించే భారతీయులు, అందరి సంక్షేమాన్ని మనసుల్లో నిలుపుకొంటారని అన్నారు.
భారతీయ సంస్కృతికి నానాటికీ పెరుగుతున్న ఆదరణ గురించి మాట్లాడుతూ, దేశ సంస్కృతి భారతీయులకు ఎంతో గౌరవాన్ని తెచ్చిపెడుతోందన్నారు. నైజీరియన్లు యోగా పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారని, స్థానిక భారతీయులు కూడా ప్రతిరోజూ యోగ సాధన చేపట్టాలని సూచించారు. నైజీరియా జాతీయ టెలివిజన్ ఛానల్లో వారం వారం యోగాకు సంబంధించిన కార్యక్రమం ప్రసారమవుతోందని వెల్లడించిన ప్రధాని, హిందీ సినిమాలే కాక, ఇతర భాషల భారతీయ చలన చిత్రాల పట్ల నైజీరియన్లు ఆసక్తి కనబరుస్తున్నారని అన్నారు.
గాంధీజీ అనేక ఏళ్లు నైజీరియాలో గడిపారని గుర్తు చేస్తూ, స్వాతంత్య్రం పొందేందుకు భారత్ నైజీరియా దేశాలు చేయని ప్రయత్నం లేదన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటం నైజీరియాకు స్ఫూర్తిగా నిలిచిందని, స్వాతంత్య్ర అనంతరం ఇరు దేశాలు అభివృద్ధి పథంలో స్థిరంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. “భారత్ ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లైతే, నైజీరియా ఆఫ్రికా దేశపు అతిపెద్ద ప్రజాస్వామ్యం”, అన్నారు. ఇరు దేశాలకూ ప్రజాస్వామ్య విలువలు, వైవిధ్యమైన సంస్కృతి, అధిక సంఖ్యాక జనాభా బలంగా ఉన్నాయన్నారు. వైవిధ్యానికి అవకాశం కల్పిస్తూ ఆలయాల నిర్మాణానికి మద్దతునందించిన నైజీరియా ప్రభుత్వానికి భారతీయుల తరఫున శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.
నేడు ప్రపంచ దేశాలు భారత్ గురించి పదేపదే చర్చించుకుంటున్నాయని, స్వాతంత్య్ర అనంతర కాలంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్న దేశం నేడు విజేతగా నిలుస్తోందని చెప్పారు. చంద్రయాన్, మంగళ్ యాన్, ‘మేడిన్ ఇండియా’ యుద్ధ విమానాల తయారీ వంటి విజయాలను చూసిన ప్రతి భారతీయుడి గుండె గర్వంతో ఉప్పొంగుతోందంటూ, “అంతరిక్ష ప్రయాణాలు సహా ఉత్పాదన, డిజిటల్ సాంకేతికత, ఆరోగ్యం వంటి అనేక రంగాల్లో భారత్ అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీ పడుతోంది” అని చెప్పారు.
స్వాతంత్య్రం లభించిన ఆరు దశాబ్దాల అనంతరం ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థగా నిలిచిన భారత్, గత దశాబ్ద కాలంలో అనూహ్య వృద్ధి చూపుతూ మరో 2 ట్రిలియన్ డాలర్లు జోడించుకుని, నేడు ప్రపంచ అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిచిందని సగర్వంగా ప్రకటించారు. అతి త్వరలో అయిదు ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకుని, భారతదేశం ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
కష్టానష్టాలను బేఖాతరు చేస్తూ తెగువ చూపే భారతీయుల వల్ల నేడు దేశం అనేక రంగాల్లో శరవేగంగా వృద్ధి సాధిస్తోందన్నారు. భారతీయ అంకుర పరిశ్రమల విభాగం 1.5 లక్షల రిజిస్ట్రేషన్లను కలిగి ఉందని వెల్లడిస్తూ, సౌకర్యవంతమైన జీవితమనే చట్రం నుంచి బయటపడ్డ భారతీయ యువత పట్టుదల, దీక్షల వల్ల ఈ విజయం సాధ్యపడిందన్నారు. “గత పదేళ్ళలో దేశంలో 100 కి పైగా యూనికార్న్ సంస్థలు ఆవిర్భవించాయి” అని ప్రధాని చెప్పారు.
భారతదేశం సేవారంగానికి పేరుబడ్డదన్న శ్రీ మోదీ, ప్రభుత్వం కూడా భద్రత అనే వలయం నుంచి బయట పడి, ఉత్పాదన రంగానికి భారీగా ఊతమిచ్చి ప్రపంచ అగ్రగామి ఉత్పాదన కేంద్రంగా దేశాన్ని తీర్చిదిద్దిందని చెప్పారు. ఇందుకు ఉదాహరణగా మొబైల్ ఫోన్ల రంగం గురించి చెబుతూ, అత్యధిక మొబైల్ తయారీదారుగా ఎదిగిన భారత్ లో 30 కోట్లకు పైగా మొబైల్ ఫోన్ల ఉత్పత్తి జరిగినట్లు వెల్లడించారు. గత దశాబ్ద కాలంలో భారత మొబైల్ ఎగుమతులు 75 శాతం మేర పెరిగాయని చెప్పారు. నేడు భారత్ వందకు పైగా దేశాలకు రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని, గత దశాబ్దంలో రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల్లో 30 శాతం మేర వృద్ధి కనిపించిందని చెప్పారు. భారత అంతరిక్షరంగం ప్రపంచ దేశాల ప్రశంసలు మూటగట్టుకుంటోందని చెప్పిన ప్రధానమంత్రి, గగన్ యాన్ ద్వారా వ్యోమగాముల్ని అంతిరిక్ష యాత్రకు పంపాలన్న యోచనలో ఉన్న భారత్, త్వరలో అంతరిక్ష స్టేషన్ ను కూడా నెలకొల్పాలని భావిస్తోందని చెప్పారు.
మూసకు భిన్నమైన మార్గంలో నడవాలని నిశ్చయించుకున్న భారత్, సృజనాత్మకతకు పెద్దపీట వేస్తోందని చెప్పారు. గత 20 ఏళ్ళలో ప్రభుత్వం 25 కోట్లకు పైగా ప్రజలను పేదరికం నుంచి విముక్తి కల్పించిందని చెప్పారు. ఇంత పెద్ద సంఖ్యలో పేదరిక నిర్మూలన సాధ్యమేనని నిరూపించిన భారత్, అనేక ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని చెప్పారు. భారత్ కు సాధ్యమయ్యింది తమకు మాత్రం ఎందుకు సాధ్యం కాదన్న ప్రశ్న వేసుకుని ఆయా దేశాలు పేదరికంపై విజయం సాధించగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అభివృద్ధి చెంది తీరాలన్న ఆశయంతో భారత్ నేడు సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టిందని, దేశాన్ని 2047 కల్లా సంపూర్ణమైన అభివృద్ధి సాధించిన దేశంగా నిలిపేందుకు ప్రతి భారతీయుడూ కృషి చేస్తున్నాడని శ్రీ మోదీ అన్నారు. అభివృద్ధి, శాంతి సౌభాగ్యాలు, ప్రజాస్వామ్య విలువలు.. అంశమేదైనా నేడు భారత్ ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందన్నారు. తాము భారతీయులమని తెలియజేసినప్పుడు ఎదుటివారి నుంచీ లభించే గౌరవాన్ని నైజీరియాలోని భారతీయ సముదాయాల వారు అనుభవించే ఉంటారని ప్రధాని అన్నారు.
ప్రపంచానికి ఎటువంటి కష్టం ఎదురైనా, పెద్దన్న తీరులో నేనున్నానంటూ భారత్ ముందుగా స్పందిస్తుందని శ్రీ మోదీ చెప్పారు. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించిన కాలంలో, ప్రతి దేశమూ టీకాల గురించి ఆందోళన చెందుతున్నప్పుడు, భారత్ దృఢమైన నిర్ణయం తీసుకుని, వీలైనన్ని దేశాలకు టీకాలను అందించాలని నిర్ణయించిందని చెప్పారు. ఇది వేల ఏళ్ళ పురాతనమైన మన సంస్కృతి నేర్పిన సంస్కారం చలవేనని అన్నారు. ‘సబ్కా సాథ్ సబ్కా వికాస్’ అన్న సూత్రాన్ని నమ్మే భారత్, టీకాల ఉత్పత్తిని బాగా పెంచి, 150 దేశాలకు కరోనా టీకాలను పంపిణీ చేసిందని, తద్వారా నైజీరియా సహా అనేక దేశాల్లో వేలాది ప్రాణాలను కాపాడగలిగిందని సంతోషం వ్యక్తం చేశారు.
ఆఫ్రికా ఖండ భవిష్యత్తులో నైజీరియా కీలక కేంద్రంగా మారగలదన్న శ్రీ మోదీ, గత అయిదేళ్లలో ఆఫ్రికాలో 18 దౌత్య కార్యాలయాలు ఆరంభమయ్యాయని చెప్పారు. వివిధ ప్రపంచ వేదికలపై ఆఫ్రికా వాణి బలంగా వినిపించేందుకు గత కొన్నేళ్ళుగా భారత్ ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తోందని చెప్పారు. తొలిసారిగా జి-20 అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సమయంలో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించే దిశగా భారత్ కృషి చేసిందని గుర్తు చేశారు. భారత్ నిర్ణయాన్ని తతిమ్మా జి-20 దేశాలు స్వాగతించడం హర్షణీయమని, భారత్ ఆహ్వానం మేరకు సమావేశాల్లో అతిథి దేశంగా పాల్గొన్న నైజీరియా, చరిత్ర రచింపబడటాన్ని ప్రత్యక్షంగా చూసిందని సంతోషం వెలిబుచ్చారు.
వచ్చే జనవరిలో భారత్ కు తప్పక విచ్చేయాలంటూ శ్రీ మోదీ సభికులకు ప్రత్యేక ఆహ్వానం పలికారు. జనవరి మాసం పండుగల కాలమని, జనవరి 26న గణతంత్ర వేడుకలు జరగనుండగా, రెండో వారంలో జరిగే ప్రవాస భారతీయ దినోత్సవాన్ని ఒడిశాలో జగన్నాథుని పాదాల సన్నిధిలో జరుపుకోవచ్చని సూచించారు. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు కొనసాగి, ఫిబ్రవరి 26న ముగిసే ప్రయాగరాజ్ మహా కుంభ్ గురించి ప్రస్తావిస్తూ, భారత్ ను సందర్శించేందుకు అనేక కారణాలున్నాయని అన్నారు. భారత్ సందర్శన సందర్భంగా తమ నైజీరియా మిత్రులను తోడుతీసుకురావాలని స్థానిక భారతీయ సముదాయానికి సూచించారు. అయోధ్యలో శ్రీరామచంద్రుడి కోసం 500 ఏళ్ళ తరువాత భవ్యమైన మందిర నిర్మాణం జరిగిందని, నైజీరియాలోని భారత సమాజం వారంతా తమ పిల్లాపాపలతో వచ్చి రాముని ఆశీర్వాదాలు పొందాలని అన్నారు.
తొలుత ఎన్నారై దినోత్సవం, అటుపై మహా కుంభ్, తదుపరి గణతంత్ర దినోత్సవం... త్రివేణీ సంగమం వంటి ఈ పండుగల సంగమం సందర్భంగా పర్యాటకులకు భారత పురోభివృద్ధి, వారసత్వాలతో మమేకమయ్యే అద్భుత అవకాశం లభిస్తుందని చెప్పారు.
గతంలో తమ మూలాలు గల భారత దేశాన్ని సందర్శించినప్పటికీ, ఈసారి చేపట్టబోయే యాత్ర చిరకాలం గుర్తుండిపోయే అమూల్యమైన జ్ఞాపకం కాగలదని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తనను ఆప్యాయంగా ఆహ్వానించి ఆదరించిన ప్రతి ఒక్కరికీ శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రసంగాన్ని ముగించారు.
Click here to read full text speech
President Tinubu has honoured me with Nigeria's National Award. This honour belongs to the people of India. This honour belongs to all of you - Indians living here in Nigeria: PM @narendramodi in Abuja pic.twitter.com/at5y4HEzDF
— PMO India (@PMOIndia) November 17, 2024
For us, the whole world is one family: PM @narendramodi in Nigeria pic.twitter.com/C9WSQLxAv1
— PMO India (@PMOIndia) November 17, 2024
भारत Mother of Democracy है... तो नाइजीरिया अफ्रीका की सबसे बड़ी Democracy है: PM @narendramodi pic.twitter.com/t8hZqavGCu
— PMO India (@PMOIndia) November 17, 2024
Stepping out of the comfort zone, innovating and creating new paths - this has become the very essence of today's India. pic.twitter.com/zPpeB4L3hV
— PMO India (@PMOIndia) November 17, 2024
A confident India has embarked on a new journey today. The goal is clear - to build a Viksit Bharat. pic.twitter.com/ElSHeYEHhc
— PMO India (@PMOIndia) November 17, 2024
Whenever a challenge arises anywhere in the world, India rises as the first responder to extend its support. pic.twitter.com/dYHg5gHw8L
— PMO India (@PMOIndia) November 17, 2024
Over the years, India has made every possible effort to raise Africa’s voice on global platforms. pic.twitter.com/SyYTLgkVpJ
— PMO India (@PMOIndia) November 17, 2024