‘‘మౌలిక సదుపాయాల నిర్మాణంలో ఇదివరకు ఎన్నడు ఎరుగనంత వేగాన్ని, పరిమాణాన్ని మా ప్రభుత్వం కనబరుస్తున్నది’’
‘‘ఈ రోజు మనం ‘వికసిత్ భారత్ దిశగా ప్రస్థానం’ అంశాన్ని చర్చించుకొంటున్నాం. ఇది ఒక్క భావన లో మార్పు మాత్రమే కాదు, ఇది విశ్వాసంలో మార్పునకు కూడా అద్దం పడుతోంది’’
‘‘ప్రస్తుత అనిశ్చిత ప్రపంచంలో భారతదేశ వృద్ధి, స్థిరత్వాలు ఒక మినహాయింపు అని చెప్పాలి’’
‘‘మేం మన పౌరులందరికి ‘జీవన సౌలభ్యానికి’, ‘జీవన నాణ్యత’కు పూచీపడుతున్నాం’’
‘‘మహమ్మారి విజృంభించినప్పటికీ భారతదేశం అనుసరిస్తున్న యుక్తాయుక్త విచక్షణ సహిత ఆర్థిక విధానం ప్రపంచానికి ఆదర్శప్రాయ నమూనాను అందిస్తోంది’’
‘‘మా ప్రభుత్వం ఉద్దేశ్యం, నిబద్ధత లు సుస్పష్టం. మేం నడుస్తున్న దారిలో నుంచి మళ్లిపోవడంలేదు’’
‘‘మా ప్రభుత్వంలో రాజకీయ ఇచ్ఛాశక్తి కి ఎలాంటి లోపం లేదు. మా దృష్టిలో దేశం, దేశ పౌరుల ఆకాంక్షలే అన్నిటి కన్నా మిన్న’’
‘‘అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించాలంటే భారతదేశంలోని పరిశ్రమతో పాటు ప్రైవేటు రంగం కూడా ఒక శక్తివంతమైన మాధ్యమమని నేననుకొంటున్నాను’’

భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) ఈ రోజు న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో ఏర్పాటు చేసిన ‘‘జర్నీ టువార్డ్స్ వికసిత్ భారత్: ఎ పోస్ట్ యూనియన్ బడ్జెట్ 2024-25 కాన్ఫరెన్స్’’ (అభివృద్ధి చెందిన భారతదేశం దిశగా పయనం: 2024-25 కేంద్ర బడ్జెట్ అనంతర సమావేశం) ప్రారంభ సదస్సును ఉద్దేశించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.   వృద్ధి కోసం ప్రభుత్వం అమలుపరుస్తున్న విశాల దృష్టికోణం రూపు రేఖలను, అందులో పరిశ్రమ పోషించవలసిన పాత్రను వివరించాలన్న లక్ష్యంతో ఈ సదస్సు ను ఏర్పాటు చేశారు.  పరిశ్రమ, ప్రభుత్వం, దౌత్య సముదాయం, మేధావి వర్గం తదితర రంగాలకు చెందిన ఒక వేయి మందికి పైగా ఈ సమావేశానికి స్వయంగా హాజరు కాగా, దేశ, విదేశాలలోని వివిధ సిఐఐ కేంద్రాల నుంచి చాలా మంది ఈ సమావేశంతో అనుసంధానమయ్యారు. 

సదస్సులో పాల్గొన్న సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశ పౌరులు జీవన రంగాలన్నిటిలో స్థిరత్వాన్ని సాధించిన వేళ, వారిలో ఉత్సాహం పొంగి పొర్లుతూ ఉన్న వేళ ఆ దేశం ఎన్నటికీ వెనుకబడిపోదన్నారు.  ఈ సందర్భంగా సభలో ప్రసంగించవలసిందిగా భారతీయ పరిశ్రమల సమాఖ్య (సిఐఐ) తనను ఆహ్వానించినందుకు ప్రధాన మంత్రి సిఐఐ కి కృతజ్ఞతలు తెలిపారు.

మహమ్మారి చెలరేగిన కాలంలో వ్యాపార సముదాయం తో జరిపిన చర్చలలో వృద్ధి విషయంలో కలిగిన భయాందోళనలను ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, అప్పట్లో ఆశాభావం వ్యక్తమైందన్న సంగతిని గుర్తుకు తెచ్చుకొన్నారు. ప్రస్తుతం దేశంలో సత్వర వృద్ధి చోటుచేసుకొంటోందని  ప్రస్తావించారు.  ‘‘ఈ రోజు మనం వికసిత్ భారత్ బాటలో ప్రయాణిస్తుండడాన్ని గురించి చర్చించుకొంటున్నాం.  ఇది భావన లో మార్పు ఒక్కదానినే కాకుండా విశ్వాసంలో మార్పు చోటుచేసుకోవడాన్ని ప్రతిబింబిస్తోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.  ప్రపంచంలో భారతదేశానికి అయిదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా స్థానం లభించిందని ఆయన పునరుద్ఘాటిస్తూ, మూడో స్థానం దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయన్నారు.

 

ప్రస్తుత ప్రభుత్వం 2014 లో అధికారంలోకి వచ్చిన కాలాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తీసుకు వస్తూ, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టవలసిన ముఖ్యావసరం ఉండిందన్నారు.  2014కు పూర్వం దేశం బలహీన ఆర్థిక వ్యవస్థలు అయిదింటిలో ఒకటిగా ఉండేదని, దేశంలో అవినీతి, లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని పేర్కొన్నారు.  ప్రభుత్వం ఒక శ్వేతపత్రంలో వివరించిన ఆర్థిక స్థితుల సూక్ష్మాల జోలికి ప్రధాన మంత్రి పోకుండా, ఆ శ్వేతపత్రాన్ని సమీక్షించి దానిని గతం తాలూకు ఆర్థిక స్థితులతో పోల్చి చూడవలసిందిగా పరిశ్రమ ప్రముఖులకు సూచించారు.   ప్రస్తుతం ప్రభుత్వం భారతదేశ ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలకు తీసుకుపోయిందని, గంభీర సంకటం నుంచి కాపాడిందని ఆయన నొక్కి చెప్పారు. 

ఇటీవల సమర్పించిన బడ్జెట్ లో కొన్ని వాస్తవాలను ప్రధాన మంత్రి తెలియజేస్తూ, 48 లక్షల కోట్ల రూపాయల ప్రస్తుత బడ్జెట్ తో 16 లక్షల కోట్ల రూపాయల 2013-14 నాటి బడ్జెట్ ను పోల్చారు. తాజా బడ్జెట్ లో మూడింతల వృద్ధి ఉందన్నారు.  వనరుల పెట్టుబడికి ప్రధాన సూచికగా లెక్కకు వచ్చే మూలధన వ్యయం (కేపెక్స్) 2004లో 90 వేల కోట్ల రూపాయలుగా ఉండగా, పది సంవత్సరాల కాలంలో అంటే 2014 నాటికి మూలధన వ్యయం రెండింతల వృద్ధితో 2 లక్షల కోట్ల రూపాయలకు చేరిందని వివరించారు.  ఈ ప్రధాన సూచిక ప్రస్తుతం అయిదు రెట్లు అధికంగా 11 లక్షల కోట్ల రూపాయలను దాటిందన్నారు.

భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతి రంగాన్ని సంరక్షించాలని తన ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటిస్తూ, ‘‘మీరు విభిన్న రంగాలను గమనించారా అంటే గనక వాటిలో ప్రతి ఒక్క రంగం పైన భారతదేశం ఏ విధంగా ప్రత్యేక దృష్టిని సారిస్తోందో మీరు గ్రహించ గలుగుతారు’’ అని పేర్కొన్నారు.  పూర్వపు ప్రభుత్వంతో ఒక పోలికను శ్రీ నరేంద్ర మోదీ తీసుకువస్తూ, గత పదేళ్ళలో రైల్వేలు, హైవేల బడ్జెట్ లలో ఎనిమిది రెట్ల పెరుగుదల చోటుచేసుకొందన్నారు; వ్యావసాయిక బడ్జెట్ లో నాలుగింతల పెరుగుదల, రక్షణ రంగ బడ్జెట్ లో రెండింతలు పెరుగుదల ఉన్నాయన్నారు. 

పన్నులలో రికార్డు స్థాయి తగ్గింపుల తరువాత కూడా ప్రతి రంగానికి బడ్జెట్ ను రికార్డు స్థాయిలో పెంచినట్లు ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.  ‘‘2014 లో ఒక కోటి రూపాయలు సంపాదిస్తూ వచ్చిన సూక్ష్మ, లఘు, మధ్యతరహా, వాణిజ్య సంస్థలు (ఎమ్ఎస్ఎమ్ఇ స్) సంభావ్య పన్ను (ప్రిజంప్టివ్ ట్యాక్స్)ను చెల్లించవలసి వచ్చింది.  ప్రస్తుతం 3 కోట్ల రూపాయల వరకు ఆదాయాన్ని ఆర్జించే ఎమ్ఎస్ఎమ్ఇ లు కూడా ఈ ప్రయోజనాన్ని పొందవచ్చు.  2014లో 50 కోట్ల రూపాయల వరకు ఆదాయం కల ఎమ్ఎస్ఎమ్ఇ  లు 30 శాతం పన్ను చెల్లించవలసి ఉండేది.  ప్రస్తుతం ఈ పన్ను రేటు 22 శాతంగా ఉంది.  2014లో కంపెనీలు 30 శాతం కార్పొరేట్ ట్యాక్స్ ను చెల్లించేవి; ఇప్పుడు 400 కోట్ల రూపాయల వరకు ఆదాయం కలిగి ఉన్న కంపెనీలకు ఈ రేటు 25 శాతంగా ఉంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. 

 

ఈ కేంద్ర బడ్జెట్ కేవలం బడ్జెట్ కేటాయింపు, పన్ను తగ్గింపులకే సంబంధించింది కాదు, ఇది సుపరిపాలనకు సంబంధించింది కూడా అని ప్రధాన మంత్రి అన్నారు.  2014కు పూర్వం ఆరోగ్యవంతమైన ఆర్థిక వ్యవస్థ స్వరూపాన్ని కళ్లకు కట్టడానికి ప్రధానమైన ప్రకటనలను బడ్జెట్ లలో వెల్లడించే ప్రయత్నం జరిగేది.  అయితే, క్షేత్ర స్థాయిలో అమలు విషయానికి వచ్చేసరికి అవే ప్రకటనలు కార్యరూపం దాల్చేవి కాదు.  మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించిన మొత్తాన్ని అంతటినీ ఖర్చు పెట్టలేకపోయే వారు.  కాని, ప్రకటనల వేళ పతాక శీర్షికలకెక్కేవి అని ప్రదాన మంత్రి అన్నారు.  షేర్ మార్కెట్ లలోనూ చిన్న చిన్న గెంతులు (లాభార్జన గణాంకాలు) ఉండేవి, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి వారి ప్రభుత్వాలు ఎన్నడూ ప్రాధాన్యాన్ని ఇవ్వలేదు.  ‘‘మేం గత పదేళ్ళలో ఈ స్థితి ని మార్చాం.  ప్రతి మౌలిక సదుపాయాల ప్రాజెక్టును మేం వేగంగా, భారీ ఎత్తున పూర్తి చేస్తున్న తీరును మీరందరు చూశారు’’ అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ప్రస్తుతం ప్రపంచ ముఖచిత్రంలో అనిశ్చితులను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, భారతదేశంలో వృద్ధి, స్థిరత్వాలు దీనిలో ఒక మినహాయింపు అని చెప్పవచ్చని ప్రముఖంగా పేర్కొన్నారు.  భారతదేశ విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో మంచి వృద్ధి ఉంది;  తక్కువ వృద్ధి, ఎక్కువ ద్రవ్యోల్బణంలతో కూడిన ప్రపంచ స్థితిగతుల నడుమ భారతదేశం అధిక వృద్ధిని, తక్కువ ద్రవ్యోల్బణాన్ని కలిగివుందన్నారు.  మహమ్మారి కాలంలో భారతదేశం పాటించిన ఆర్థిక యుక్తాయుక్త విచక్షణసహిత విధానం ప్రపంచానికి ఒక ఆదర్శప్రాయ నమూనాగా ఉందని కూడా ఆయన అన్నారు.  ప్రపంచంలో వస్తువులు, సేవల ఎగుమతికి భారతదేశం అందిస్తున్న తోడ్పాటు నిలకడగా పెరుగుతోందన్నారు.  మహమ్మారి, ప్రాకృతిక ఆపదలు, యుద్ధాలు వంటి అంతర్జాతీయంగా దిగ్భ్రాంతికర ఘటనలు తలెత్తిన నేపథ్యంలో కూడా  ప్రపంచ వృద్ధిలో భారతదేశం వాటా 16 శాతానికి చేరుకొంది అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.

వికసిత్ భారత్ సంకల్పాలతో దేశం ముందుకు సాగుతోందని,  గత పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొన్న ప్రధాన మంత్రి, జీవన సౌలభ్యాన్ని పెంచడానికి, జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నొక్కి చెప్పారు.

పరిశ్రమ 4.0 ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని నైపుణ్యాభివృద్ధి, ఉపాధిపై ప్రభుత్వం అధిక దృష్టి సారించిందని ప్రధాన మంత్రి చెప్పారు. ముద్రా యోజన, స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా క్యాంపెయిన్ లకు ఉదాహరణలు చెబుతూ, 8 కోట్ల మందికి పైగా కొత్త వ్యాపారాలను ప్రారంభించారని ప్రధానమంత్రి తెలియజేశారు. భారత్ లో 1.40 లక్షల స్టార్టప్ లు లక్షలాది మంది యువతకు ఉపాధి కల్పిస్తున్నాయని చెప్పారు.ఈ ఏడాది బడ్జెట్ లో రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎం ప్యాకేజీ గురించి ప్రస్తావిస్తూ, ఇది 4 కోట్ల మందికి పైగా యువతకు ప్రయోజనం చేకూరుస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. ‘సంపూర్ణమైన, సమగ్రమైన పిఎం ప్యాకేజ్ ఎండ్-టు-ఎండ్ పరిష్కారాలతో ముడిపడి ఉంది." అన్నారు. పిఎం ప్యాకేజీ వెనుక ఉన్న దార్శనికతను మరింత వివరిస్తూ, భారతదేశ మానవ వనరులు, ఉత్పత్తులను నాణ్యత, విలువ పరంగా  ప్రపంచవ్యాప్తంగా పోటీ పడేలా చేయడమే దీని లక్ష్యమని ప్రధానమంత్రి అన్నారు. యువత లో నైపుణ్యం పెంచి వారి సామర్ధ్యాన్ని వెలికతీసేందుకు, తద్వారా వారి ఉపాధి అవకాశాలను పెంచడానికి, అదే సమయంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే వారిని ప్రోత్సహించడానికి ప్రవేశపెట్టిన ఇంటర్న్‌షిప్ పథకాన్ని గురించి కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. అందుకే ఇ పి ఎఫ్ ఒ కంట్రిబ్యూషన్ లో ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటించిందని ప్రధాని తెలిపారు.

 

ప్రభుత్వ ఉద్దేశం, నిబద్ధత చాలా స్పష్టంగా ఉన్నాయని, దాని మార్గం లో దిశలో ఎలాంటి మళ్లింపు లేదని ప్రధాని అన్నారు. దేశానికే తొలి ప్రాధాన్యం (నేషన్ ఫస్ట్)  నిబద్ధత   5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం, పూర్తి సంతృప్త విధానం, జీరో ఎఫెక్ట్-జీరో డిఫెక్ట్ కు ప్రాధాన్యత , ఆత్మనిర్భర్ భారత్ లేదా వికసిత్ భారత్ ప్రతిజ్ఞలో ప్రతిబింబిస్తుందని అన్నారు. పథకాల విస్తరణ, పర్యవేక్షణ పై ప్రత్యేక దృష్టి సారించడాన్ని ఆయన ప్రముఖంగా వివరించారు.

బడ్జెట్ లో తయారీ రంగానికి సంబంధించిన అంశాన్ని ప్రధాని ప్రస్తావించారు. మేకిన్ ఇండియా, వివిధ రంగాల్లో ఎఫ్ డీఐ నిబంధనల సరళీకరణతో పాటు మల్టీ పర్పస్ లాజిస్టిక్స్ పార్కులు, 14 రంగాలకు పీఎల్ ఐలను ఆయన ప్రస్తావించారు. ఈ బడ్జెట్  దేశంలోని 100 జిల్లాలకు పెట్టుబడికి సిద్ధంగా ఉన్న ఇన్వెస్ట్ మెంట్ పార్కులను ప్రకటించింది. ఈ 100 నగరాలు వికసిత్ భారత్ కు కొత్త హబ్ లుగా మారతాయని, ప్రస్తుతం ఉన్న పారిశ్రామిక కారిడార్ లను కూడా తమ ప్రభుత్వం ఆధునీకరిస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ ఎంఇ ) మంత్రిత్వ శాఖకు సాధికారత కల్పించాలన్న తమ ప్రభుత్వ దార్శనికతను పంచుకున్న ప్రధాన మంత్రి, వాటికి  అవసరమైన సౌకర్యాలను కల్పించడంతో పాటు వారు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించామని చెప్పారు. ‘ఎంఎస్ఎంఇ లకు అవసరమైన నిర్వహణ పెట్టుబడి, రుణం లభించేలా 2014 నుంచి నిరంతరం కృషి చేస్తున్నాం. వాటికి మార్కెట్ లభ్యత,, అవకాశాలు మెరుగయ్యాయి, వాటిని అని క్రమబద్ధీకరించాం’ అని శ్రీ మోదీ తెలిపారు. పన్ను తగ్గింపుతో పాటు షరతుల భారం తక్కువ ఉండేలా చూశామని మోదీ అన్నారు.

 

అణువిద్యుత్ ఉత్పత్తికి కేటాయింపుల పెంపు,  వ్యవసాయానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతుల భూములకు నంబర్ ఇవ్వడానికి బి హెచ్ యు - ఆధార్ కార్డు, స్పేస్ ఎకానమీకి రూ.1000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్, క్రిటికల్ మినరల్ మిషన్, మైనింగ్ కోసం ఆఫ్ షోర్ బ్లాకుల వేలం వంటి బడ్జెట్ లోని కొన్ని అంశాలను ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ‘ఈ కొత్త ప్రకటనలు పురోగతికి కొత్త మార్గాలను తెరుస్తాయని’ ఆయన అన్నారు. 

భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దశలో ముఖ్యంగా కొత్తగా ఆవిర్భవిస్తున్న రంగాలలో సృష్టిస్తున్న అవకాశాల గురించి వివరిస్తూ, భవిష్యత్‌లో కీలక పాత్ర పోషించేందుకు సెమీకండక్టర్ వాల్యూ చైన్‌లో పేరు తెచ్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని, అందువల్ల, సెమీకండక్టర్ పరిశ్రమను ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోందని ప్రధాని చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుత మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ విప్లవ యుగంలో ఎలక్ట్రానిక్స్ తయారీని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. గతంలో దిగుమతిదారుగా ఉన్న భారత్ అగ్రశ్రేణి మొబైల్ తయారీదారుగా, ఎగుమతిదారుగా ఎలా మారిందో ఆయన వివరించారు. గ్రీన్ హైడ్రోజన్, ఎలక్ట్రిక్ వెహికల్స్ పరిశ్రమలకు ఊతమిచ్చేలా భారత్ లో గ్రీన్ జాబ్స్ సెక్టార్ కు రోడ్ మ్యాప్ ను కూడా ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఈ ఏడాది బడ్జెట్ లో ప్రతిపాదించిన క్లీన్ ఎనర్జీ కార్యక్రమాలపై ఎక్కువగా చర్చ జరుగుతోందని పేర్కొన్న ప్రధాన మంత్రి, నేటి యుగంలో ఇంధన భద్రత, ఇంధన మార్పు రెండూ ఆర్థిక వ్యవస్థకు, పర్యావరణానికి సమానంగా ముఖ్యమైనవని అన్నారు. చిన్న న్యూక్లియర్ రియాక్టర్లపై జరుగుతున్న పనులను ప్రస్తావిస్తూ, ఇది పరిశ్రమకు ఇంధన లభ్యత రూపంలో ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, ఈ రంగానికి సంబంధించిన మొత్తం సరఫరా గొలుసుకు కూడా కొత్త వ్యాపార అవకాశాలు లభిస్తాయని శ్రీ మోదీ అన్నారు. "మన పారిశ్రామిక వేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు దేశాభివృద్ధికి ఎల్లవేళలా తమ నిబద్ధతను చాటుకున్నారు" అని అంటూ, అన్ని రంగాల్లో భారతదేశాన్ని గ్లోబల్ ప్లేయర్ గా మార్చడంలో వారు కీలక పాత్ర పోషిస్తారని ప్రధాన మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు, 

 

"మా ప్రభుత్వానికి రాజకీయ సంకల్పానికి కొదవ లేదు. మాకు దేశం, పౌరుల ఆకాంక్షలే ముఖ్యం' అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. వికసిత్ భారత్ ను సృష్టించడానికి భారతదేశ ప్రైవేట్ రంగాన్ని రంగం ఒక బలమైన మాధ్యమంగా అభివర్ణించిన ప్రధాన మంత్రి, సంపద సృష్టించే వారే భారతదేశ వృద్ధి గాధకు ప్రధాన చోదక శక్తి అని అన్నారు. భారతదేశ విధానాలు, నిబద్ధత, దృఢ సంకల్పం, నిర్ణయాలు, పెట్టుబడులు ప్రపంచ ప్రగతికి పునాదిగా మారుతున్నాయన్నారు. ప్రపంచ పెట్టుబడిదారుల్లో భారత్ పట్ల పెరుగుతున్న ఆసక్తిని ప్రస్తావిస్తూ, పెట్టుబడిదారుల స్నేహపూర్వక చార్టర్లను రూపొందించాలని, పెట్టుబడి విధానాల్లో స్పష్టత తీసుకురావాలని, పెట్టుబడులకు అనువైన వాతావరణాన్ని సృష్టించాలని ఇటీవల నీతి ఆయోగ్ సమావేశం లో రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తాము ఇచ్చిన పిలుపు గురించి ప్రధాని తెలియజేశారు. 

కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్,, కాన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సిఐఐ) అధ్యక్షుడు శ్రీ సంజీవ్ పూరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage