‘‘సాధ్వి మీరాబాయి 525వ జయంతి కేవలం వార్షికోత్సవం కాదు.. భారతీయ ప్రేమాస్పద సంస్కృతి-సంప్రదాయాల వేడుక’’;
‘‘భారతీయ భక్తి-ఆధ్యాత్మికతల చైతన్యాన్ని మీరాబాయి ఇనుమడింపజేశారు’’;
‘‘భారతదేశం యుగయుగాలుగా నారీశక్తికి అంకితం చేయబడింది’’;
‘‘ప్రగతి పయనంలో మధుర.. బ్రజ్ ప్రాంతాలను వెనుకబడనీయం’’;
‘‘బ్రజ్ ప్రాంతంలో ప్రగతి మేల్కొంటున్న దేశ పునరుజ్జీవన చైతన్యం స్వభావ ప్రతీక’’

   ఉత్తరప్రదేశ్‌లోని మధురలో ఇవాళ సాధ్వి మీరాబాయి 525వ జయంతి వార్షికోత్సవంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. అలాగే ఆమె గౌరవార్థం స్మారక తపాలా బిళ్లతోపాటు నాణాన్ని ఆయన ఆవిష్కరించారు. వేడుకల్లో భాగంగా అక్కడ ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను, సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించారు. సాధ్వి మీరాబాయి స్మృత్యర్థం ఏడాది పొడవునా నిర్వహించే ఉత్సవాలు ఈ కార్యక్రమాలతో ప్రారంభమయ్యాయి.

   ఈ సందర్భంగా మాట్లాడుతూ- బ్రజ్ భూమిలో ఇక్కడి ప్రజల్లో ఒకడుగా వేడుకల్లో పాల్గొనడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేయడంతోపాటు భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ గడ్డకుగల దైవిక ప్రాధాన్యాన్ని స్మరిస్తూ ఘన నివాళి అర్పించారు. శ్రీకృష్ణ భగవానుడితోపాటు రాధారాణి, మీరాబాయి సహా బ్ర‌జ్‌లోని సాధువులందరికీ వందనం చేశారు. మధుర నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీమతి హేమామాలిని ఈ ప్రాంత ప్రగతి కోసం చేసిన కృషిని ప్రధాని ప్రశంసించారు. అంతేకాకుండా శ్రీకృష్ణుని ఆరాధనలో ఆమె తాదాత్మ్యం చెందారని పేర్కొన్నారు.

   గుజరాత్‌తో కృష్ణ భగవానునికి, మీరాబాయికిగల సంబంధాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ నేపథ్యంలో నేటి తన మధురానగర సందర్శన మరింత ప్రత్యేకంగా మారిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘‘మధురానగరి కన్నయ్య గుజరాత్ సందర్శించాక ద్వారకాధీశునిగా రూపాంతరం చెందారు’’ అని ప్రధాని భక్తిభావనతో ఉటంకించారు. ఇక రాజస్థాన్ గడ్డపై జన్మించి మధురానగరి ప్రాంగణాలను తన ప్రేమ భావనతో ముంచెత్తిన సాధ్వి మీరాబాయి తన జీవిత చరమాంకాన్ని ద్వారకలో గడిపారని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో విస్తరించిన బ్రజ్ సందర్శనకు వచ్చినపుడు గుజరాత్ ప్రజలు దాన్ని ద్వారకాధీశుని ఆశీర్వాదానికి ఒక అవకాశంగా  పరిగణిస్తారని ఆయన నొక్కిచెప్పారు. కాగా, వారణాసి నుంచి పార్లమెంటుకు ఎన్నికైన తాను 2014 నుంచి ఉత్తరప్రదేశ్‌ ప్రజల్లో ఒకడినయ్యానని శ్రీ మోదీ అన్నారు.

   సాధ్వి మీరాబాయి 525వ జయంతి కేవలం ఒక వార్షికోత్సవం కాదని ప్రధాని పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘ఇది భారతీయ ప్రేమాస్పద సంస్కృతి-సంప్రదాయాల వేడుక. నరనారాయణ, జీవాత్మ-పరమాత్మ, భక్తుడు-దేవుడు ఒకటేననే తాదాత్మ్య భావనను చాటే ఉత్సవం’’ అని అభివర్ణించారు.

 

   సాధ్వి మీరాబాయిని శౌర్యపరాక్రమాలు, త్యాగానికి మారుపేరైన రాజస్థాన్ గడ్డపై జన్మించిన స్త్రీమూర్తిగా ప్రధాని గుర్తుచేశారు. అలాగే 84 ‘కోసుల’లో విస్తరించిన బ్రజ్ మండలం ఉత్తరప్రదేశ్-రాజస్థాన్ రాష్ట్రాలు రెండింటిలోనూ అంతర్భాగంగా ఉండటాన్ని ఎత్తి చూపారు. ‘‘భారతీయ భక్తి-ఆధ్యాత్మికతల చైతన్యాన్ని మీరాబాయి ఇనుమడింపజేశారు. ఆమె స్మారకార్థం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం భారతీయ భక్తి సంప్రదాయంతోపాటు శౌర్యపరాక్రమాలు, త్యాగాలను కూడా మనకు గుర్తు చేస్తుంది. ఎందుకంటే- రాజస్థాన్ ప్రజలు భారత సంస్కృతి-చైతన్యాల పరిరక్షణలో ఒక ప్రాకారంలా దృఢంగా నిలిచారు’’ అని ఆయన ప్రశంసించారు.

   ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘భారతదేశం యుగయుగాలుగా నారీశక్తికి అంకితం చేయబడింది’’ అని వ్యాఖ్యానించారు. బ్రజ్ వాసులకన్నా ఈ వాస్తవం చక్కగా తెలిసినవారు మరెవరూ ఉండరన్నారు. కన్నయ్య నడయాడిన గడ్డలో ప్రతి స్వాగతం... ప్రతి ప్రసంగం... ప్రతి సత్కారం.. ‘‘రాధే రాధే’’ అంటూ మొదలవుతుందని పేర్కొన్నారు. ‘‘రాధ పేరును ముందు జోడిస్తే కృష్ణ నామానికి సంపూర్ణత సిద్ధిస్తుంది’’ శ్రీ మోదీ నొక్కిచెప్పారు. దేశ నిర్మాణంలో, సమాజ ప్రగతి పథాన్ని సుగమం చేయడంలో మహిళలు పోషించే కీలక పాత్రకు ఈ ఆదర్శాలే ప్రాతిపదికలని ఆయన పేర్కొన్నారు. ఇందుకు మీరాబాయిని ఒక చక్కటి ఉదాహరణగా పేర్కొంటూ- ఆమె రచించిన ఒక ద్విపదను ఉటంకించి... ‘భూమ్యాకాశాల నడుమ ప్రతిదీ ఆ పరమాత్మలో లీనం కావాల్సిందే’ అన్నది అందులోని సందేశమని వివరించారు.

   ఒక మహిళలోని అంతర్గత శక్తి యావత్ ప్రపంచానికి మార్గనిర్దేశం చేయగలదని మీరాబాయి తనకెదురైన కష్ట సమయాల్లో ప్రస్ఫుటం చేశారని ప్రధాని చెప్పారు. పండిత రవిదాస్ ఆమె గురువు కాగా, సాధ్వి మీరాబాయి స్వయంగా గొప్ప సంఘసంస్కర్త అని చెప్పారు. ఆమె రచించిన కవితలు ఈనాటికీ మనకు మార్గనిర్దేశం చేస్తాయని ఆయన అన్నారు. మూస ధోరణిలో కొట్టుకుపోకుండా మనవైన విలువలకు కట్టుబడి ఉండాలని ఆమె ప్రబోధించారని గుర్తుచేశారు.

 

   ఈ సందర్భంగా మొక్కవోని భారతీయ స్ఫూర్తిని ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. భారతీయ చైతన్యం దాడికి గురైనప్పుడు లేదా బలహీనపడినప్పుడల్లా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో రగిలే ఆధ్యాత్మిక శక్తి ఆ పరిస్థితులను చక్కదిద్దడానికి నాయకత్వం వహిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ విధంగా నాయకత్వం వహించిన వారిలో కొందరు ప్రసిద్ధులు వీరులు కాగా, మరికొందరు సాధువులుగా మారారని గుర్తుచేశారు. ఈ మేరకు కొన్ని ఉదాహరణలిస్తూ- ఆళ్వార్లు, నయనార్లు, రామానుజాచార్య వంటివారు దక్షిణ భారతానికి చెందినవారని పేర్కొన్నారు. అలాగే తులసీదాసు, కబీర్ దాసు, రవిదాసు, సూరదాసు ఉత్తర భారత వాసులని తెలిపారు. ఇక పుంజాబ్ నుంచి గురు నానక్ దేవ్, తూర్పు భారతంలోని బెంగాల్ నుంచి చైతన్య మహాప్రభు, పశ్చిమ భారతంలో గుజరాత్ నుంచి నరసింహ మెహతా, మహారాష్ట్ర నుంచి తుకారాం, నామ్‌దేవ్ వంటివారు ప్రజానీకానికి మార్గదర్శులుగా నిలిచారని పేర్కొన్నారు. వారు త్యాగనిరతికి బాటలు పరచి, భారతదేశాన్ని తీర్చిదిద్దారని ప్రధాని తెలిపారు. ఆయా సాధువుల భాష-సంస్కృతి పరస్పరం భిన్నమే అయినా, వారి ప్రబోధం మాత్రమే ఒకటేనని, తమ భక్తి-జ్ఞానంతో దేశమంతటా ఆధ్యాత్మిక వెలుగులు నింపారని పేర్కొన్నారు.

   ‘‘దేశం నలుమూలలా సాగిన ‘భక్తి ఉద్యమం’ ప్రవాహానికి మధురానగరం సంగమ స్థానంగా నిలిచింది’’ అని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భంగా మాలుక్ దాస్, మహాప్రభు వల్లాభచార్య, చైతన్య మహాప్రభు, స్వామి హరిదాస్, స్వామి హిత హరివంశ మహాప్రభు వంటి సాధువులు, పండితులను ఉదాహరించారు. వీరంతా భరతజాతిలో నవ చైతన్యం నింపారని చెబుతూ- ‘‘ఈ భక్తి యజ్ఞం ఇప్పుడు శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదంతో ముందుకు సాగుతోంది’’ అని చెప్పారు.

   భారత ఉజ్వల చరిత్రపై స్పృహలేని వ్యక్తులు బానిసత్వ భావన నుంచి స్వీయ విముక్తి పొందలేని కారణంగా మధురా నగరానికి దక్కాల్సిన ఖ్యాతి లభించలేదని ప్రధాని చెప్పారు. అదేవిధంగా బ్రజ్ భూమి ప్రగతికి దూరమైందని విచారం వ్యక్తం చేశారు. అయితే, ప్రస్తుత అమృత కాలంలో దేశం తొలిసారి బానిస ధోరణిని వదిలించుకుని, ఎర్రకోట బురుజుల నుంచి ఇచ్చిన నినాదం మేరకు ‘పంచప్రాణ’ ప్రతిజ్ఞ చేసిందని ఆయన చెప్పారు. ఇక పురాతన కాశీ విశ్వనాథ క్షేత్రం, కేదార్ నాథ్ క్షేత్రం నవీకరణతోపాటు అయోధ్యలో ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న రామాలయం వగైరాలను ప్రధాని ప్రస్తావించారు. ‘‘ఈ ప్రగతి పయనంలో మధుర, బ్రజ్ ప్రాంతాలను ఎంతమాత్రం వెనుకబడనీయం’’ అని స్పష్టం చేశారు. బ్రజ్ అభివృద్ధి కోసం ‘ఉత్తరప్రదేశ్ బ్రజ్ క్షేత్ర అభివృద్ధి మండలి’ ఏర్పాటుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈ యాత్రాస్థలం అభివృద్ధితోపాటు భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా మండలి ఎంతగానో కృషి చేస్తోంది’’ అని ఆయన ప్రశంసించారు.

 

   ఈ ప్రాంతం యావత్తూ కన్నయ్య ‘లీలల’తో ముడిపడినదేనని శ్రీ మోదీ పునరుద్ఘాటించారు. ఈ మేరకు మధుర, బృందావన్, భ‌ర‌త్‌పూర్‌, కరౌలి, ఆగ్రా, ఫిరోజాబాద్, కాస్‌గంజ్‌, పాల్‌వాల్, వ‌ల్ల‌భ్‌గ‌ఢ్‌ వంటి ప్రాంతాలు వివిధ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నప్పటికీ అవన్నీ లీలామానుష వేషధారి నడయాడిన ప్రదేశాలేనని ఉదాహరించారు. వివిధ రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాలన్నిటి అభివృద్ధికి కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు.

   చివరగా- బ్రజ్ ప్రాంతంతోపాటు దేశమంతటా మార్పులు, పరిణామాలు వ్యవస్థలో పరివర్తనను మాత్రమేగాక ఆధ్యాత్మిక పునరుజ్జీవన చైతన్య స్వభావం మేల్కొనడాన్ని ప్రతిబింబిస్తాయని ప్రధాని నొక్కిచెప్పారు. ‘‘భారత పునరుజ్జీవనం సంభవిస్తున్న ప్రతి ప్రదేశంలోనూ శ్రీకృష్ణుని ఆశీర్వాదాలు కచ్చితంగా ఉంటాయనడానికి మహాభారతమే రుజువు’ అని పేర్కొంటూ దేశం తన స్వప్నాలను సాకారం చేసుకుంటూ వికసిత భారతాన్ని నిర్మించి తీరుతుందని పునరుద్ఘాటిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు శ్రీ కేశవ్ ప్రసాద్ మౌర్య, శ్రీ బ్రజేష్ పాఠక్, మధుర పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి హేమామాలిని కూడా పాల్గొన్నారు.

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi congratulates hockey team for winning Women's Asian Champions Trophy
November 21, 2024

The Prime Minister Shri Narendra Modi today congratulated the Indian Hockey team on winning the Women's Asian Champions Trophy.

Shri Modi said that their win will motivate upcoming athletes.

The Prime Minister posted on X:

"A phenomenal accomplishment!

Congratulations to our hockey team on winning the Women's Asian Champions Trophy. They played exceptionally well through the tournament. Their success will motivate many upcoming athletes."