Quoteయు పి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాలుగో శంకుస్థాపన కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ వ్యాప్తంగా రూ.10 లక్షల కోట్లకు పైగా విలువైన 14,000 ప్రాజెక్టులను ప్రారంభించిన ప్రధాని
Quote“రాష్ట్ర ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు ఉత్తరప్రదేశ్ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాత్రింబవళ్లు కృషి చేస్తోంది”
Quote“గత ఏడేళ్లలో యు పి లో వ్యాపార, అభివృద్ధి, నమ్మకమైన వాతావరణం ఏర్పడింది”
Quote“మార్పు రావాలన్న నిజమైన ఉద్దేశం ఉంటే దాన్ని ఎవరూ అడ్డుకోలేరని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరూపించింది”
Quote“ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల అపూర్వ సానుకూలత ఉంది”
Quote“యు పి లో ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు సమాన ప్రాధాన్యం ఇచ్చాం”
Quote“ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రతి ఒక్కరికీ అందే వరకు విశ్రమించేది లేదు”
Quote“అత్యధిక ఎక్స్ ప్రెస్ వే లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం యు పి”
Quote“ఉత్తర్ ప్రదేశ్ నేల బిడ్డ చౌదరి చరణ్ సింగ్ ను గౌరవించడం దేశంలోని కోట్లాది మంది రైతులకు దక్కిన గౌరవం”

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సోమవారం లక్నోలో వికసిత్ భారత్ - వికసిత్ ఉత్తర ప్రదేశ్ కార్యక్రమంలో ప్రసంగించారు. 2023 ఫిబ్రవరిలో జరిగిన యుపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023 నాల్గవ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన ఉత్తర ప్రదేశ్ అంతటా రూ .10 లక్షల కోట్లకు పైగా విలువైన 14000 ప్రాజెక్టులను ప్రారంభించారు. వీటిలో మాన్యుఫ్యాక్చరింగ్, రెన్యూవబుల్ ఎనర్జీ, ఐటీ అండ్ ఐటీఇఎస్, ఫుడ్ ప్రాసెసింగ్, హౌసింగ్ అండ్ రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్ వంటి రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ, వికసిత్ ఉత్తర ప్రదేశ్ అభివృద్ధి ద్వారా వికసిత్ భారత్ను సాధించే దిశగా నేటి కార్యక్రమం  ఒక మెట్టు అని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉత్తరప్రదేశ్ లోని 400కు పైగా నియోజకవర్గాల నుంచి హాజరైన లక్షలాది మంది ప్రజలకు స్వాగతం చెబుతూ, 7-8 ఏళ్ల క్రితం ఊహించని విధంగా అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఇప్పుడు పౌరులు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కాగలిగారని ప్రధాన మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో నేరాల రేటు అధికంగా ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలకు సంబంధించి రాష్ట్రంలో సానుకూల వాతావరణం నెలకొందని ప్రధాని ప్రశంసించారు. "ఈ రోజు ఉత్తర ప్రదేశ్ లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను చూస్తోంది" అని ప్రధాన మంత్రి అన్నారు, తాను వారణాసి పార్లమెంటు సభ్యుడిగా ఉన్నందున రాష్ట్ర పురోగతి పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఈనాటి అభివృద్ధి పథకాల గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఇది ఉత్తర ప్రదేశ్ ముఖ చిత్రాన్ని మారుస్తుందని, పెట్టుబడిదారులతో పాటు యువత ను అభినందించారు.

 

|

ఉత్తర్ ప్రదేశ్ లో ఏడేళ్ల డబుల్ ఇంజిన్ ప్రభుత్వ పాలనను ప్రస్తావిస్తూ, ఈ కాలంలో 'రెడ్ కార్పెట్ కల్చర్ ' స్థానంలో 'రెడ్ టేప్  కల్చర్ ' వచ్చిందని ప్రధాని అన్నారు. గత ఏడేళ్లలో యు పి లో నేరాలు తగ్గాయని, వ్యాపార సంస్కృతి వృద్ధి చెందిందన్నారు. “గడచిన ఏడేళ్లలో ఉత్తరప్రదేశ్ లో వ్యాపార, అభివృద్ధి, నమ్మకమైన వాతావరణం ఏర్పడిందని” ప్రధాన మంత్రి అన్నారు. నిజమైన ఆకాంక్ష ఉంటే మార్పు అనివార్యమని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ఈ కాలంలో రాష్ట్రం నుంచి ఎగుమతులు రెట్టింపు అయ్యాయని పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి, ట్రాన్స్ మిషన్ లో రాష్ట్రం పురోగతి సాధిస్తోందని కొనియాడారు. ప్రస్తుతం దేశంలోనే అత్యధిక ఎక్స్ ప్రెస్ వే లు,  అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం యు పి అని, దేశంలో మొట్టమొదటి రాపిడ్ రైలు నడుస్తున్న రాష్ట్రం  అని ప్రధాన మంత్రి రాష్ట్రంలో తూర్పు , పశ్చిమ పెరిఫెరల్ ఎక్స్ ప్రెస్ వేల ఉనికిని వివరించారు. రాష్ట్రంలో నదీ జలమార్గాల వినియోగాన్ని ప్రస్తావిస్తూ, రాష్ట్రంలో కనెక్టివిటీ, ప్రయాణ సౌలభ్యాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు.

నేటి అభివృద్ధి ప్రాజెక్టులను కేవలం పెట్టుబడుల పరంగా మాత్రమే అంచనా వేయడం లేదని, మెరుగైన భవిష్యత్తు కోసం సమగ్ర దార్శనికతను, పెట్టుబడిదారులకు ఆశాకిరణాన్ని అందిస్తున్నాయని ప్రధాన మంత్రి  చెప్పారు. ఇటీవల యు ఎ ఇ , ఖతార్ లలో తాను పర్యటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం పట్ల అపూర్వమైన సానుకూలత ఉందని, భారతదేశ వృద్ధి కథపై ప్రతి దేశం భరోసాను, నమ్మకాన్ని కలిగి ఉందని  అన్నారు.

 

|

'మోదీ కీ గ్యారంటీ' గురించి నేడు దేశవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతున్నప్పటికీ, మెరుగైన రాబడులకు భారత్ ను గ్యారంటీగా ప్రపంచం చూస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి, ఎన్నికలు తలుపులు తట్టినప్పుడు పెట్టుబడులకు దూరంగా ఉన్న ప్రభుత్వాల ధోరణిని భారతదేశం విచ్ఛిన్నం చేసిందని అన్నారు. "ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ప్రభుత్వ విధానాలు ,స్థిరత్వాన్ని విశ్వసిస్తున్నారు" అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు, ఉత్తర ప్రదేశ్ లో ఇలాంటి ధోరణి ఆవిర్భవించడాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు.

వికసిత్ భారత్ కు కొత్త ఆలోచనలు, దిశా నిర్దేశం చేయాల్సిన అవసరాన్ని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. పౌరులను కనీస ఉనికి, ప్రాంతీయ అసమతుల్యత వద్ద ఉంచే మునుపటి విధానం దేశాభివృద్ధికి సరిపోదని ఆయన అన్నారు. ఈ విధానం వల్ల ఉత్తరప్రదేశ్ కూడా నష్టపోయిందని ఆయన అన్నారు. సులభ వ్యాపారానికి దారితీసే విధంగా ప్రతి కుటుంబం జీవనాన్ని తీర్చిదిద్దడంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నిమగ్నమైందన్నారు. పిఎం ఆవాస్ కింద నాలుగు కోట్ల పక్కా ఇళ్లు నిర్మించామని, పట్టణ మధ్యతరగతి కుటుంబాలకు కూడా సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు రూ.7 వేల కోట్ల సాయం అందించామని తెలిపారు. దీని ద్వారా యుపి కి చెందిన 1.5 లక్షల కుటుంబాలతో సహా 25 లక్షల లబ్దిదారుల కుటుంబాలకు వడ్డీలో రాయితీలు లభించాయని తెలిపారు. 2014లో రెండు లక్షలుగా ఉన్న మినహాయింపు పరిమితిని ఇప్పుడు ఏడు లక్షలకు పెంచడం వంటి ఆదాయపు పన్ను సంస్కరణలు మధ్యతరగతికి మేలు చేశాయి.

 

|

ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లకు ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని, ప్రతి లబ్ధిదారుడికి అన్ని ప్రయోజనాలు అందుబాటులోకి తీసుకురావడానికి డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా ఉత్తరప్రదేశ్ కు చెందిన లక్షలాది మందికి లబ్ధి చేకూరిందని, ఆ ప్రయోజనాలను లబ్ధిదారుల ముంగిటకు తీసుకెళ్లిందని ఆయన పేర్కొన్నారు. "మోదీ కీ గ్యారంటీ వెహికల్ దాదాపు అన్ని గ్రామాలు, నగరాలకు చేరుకుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను గరిష్ట స్థాయికి అందించడమే  సామాజిక న్యాయానికి నిజమైన సంకేతమని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు. ఇదే నిజమైన లౌకికవాదమని, గత ప్రభుత్వ హయాంలో అవినీతి, అసమానతలు పెరిగాయని, దీనివల్ల లబ్ధిదారులకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ప్రధాని మోదీ అన్నారు. పక్కా ఇళ్లు, విద్యుత్ సరఫరా, గ్యాస్ కనెక్షన్, ట్యాప్డ్ వాటర్ ఇలా ప్రతి లబ్ధిదారుడికి దక్కాల్సినవి అందే వరకు ప్రభుత్వం విశ్రమించబోదని మోదీ హామీ ఇచ్చారు. గతంలో అందరూ విస్మరించిన వారిని మోదీ చూసుకుంటున్నారని పునరుద్ఘాటించారు. పీఎం స్వనిధి పథకం కింద వీధి వ్యాపారులకు అందించిన రూ.10,000 కోట్ల సాయాన్ని గురించి ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. యు పి లో దాదాపు 22 లక్షల మంది వీధి వ్యాపారులు లబ్ధి పొందారు. ఈ పథకం ద్వారా లబ్దిదారులకు 23 వేల రూపాయల అదనపు వార్షిక ఆదాయం సమకూరిందని పేర్కొన్నారు. పి ఎం స్వనిధి లబ్ధిదారుల్లో 75 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన లేదా గిరిజన వర్గాలకు చెందిన వారేనని, వారిలో సగం మంది మహిళలే ఉన్నారని తెలిపారు. గతంలో బ్యాంకులకు ఎలాంటి గ్యారంటీ ఉండేది కాదని, నేడు మోదీ గ్యారంటీ ఉందన్నారు. జై ప్రకాశ్ నారాయణ్, రామ్ మనోహర్ లోహియా కలల సామాజిక న్యాయం ఇదేనని ఆయన అన్నారు.

లాఖ్ పతి దీదీ పథకం గురించి ప్ర ధాన మంత్రి మాట్లాడుతూ, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం విధానాలు, నిర్ణయాలు సామాజిక న్యాయం, ఆర్థిక వ్యవస్థ రెండింటికీ మేలు చేస్తాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. స్వయం సహాయక సంఘాల్లో 10 కోట్ల మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని, కోటి మంది మహిళలు లాఖ్పతి దీదీలుగా మారారని పేర్కొన్నారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మూడు కోట్ల లాఖ్పతి దీదీలను సృష్టించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన ప్రముఖంగా తెలిపారు.

 

|

ఉత్తరప్రదేశ్ లోని చిన్న, సూక్ష్మ, కుటీర పరిశ్రమల బలాబలాలను ప్రస్తావిస్తూ, డిఫెన్స్ కారిడార్ వంటి ప్రాజెక్టుల ప్రయోజనాలతో పాటు రాష్ట్రంలోని ఎంఎస్ఎంఇ రంగానికి అందిస్తున్న విస్తరణ, మద్దతును ప్రధాని ప్రస్తావించారు. వన్ డిస్ట్రిక్ట్ - వన్ ప్రొడక్ట్ పథకం కింద ప్రతి జిల్లాలో స్థానిక ఉత్పత్తులను బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా. రూ.13,000 కోట్లతో పి ఎమ్  విశ్వకర్మ పథకం యు పి లోని  లక్షలాది విశ్వకర్మ కుటుంబాలను ఆధునిక పద్ధతులతో అనుసంధానిస్తుందని తెలిపారు.

ప్రభుత్వ శరవేగంగా పనిచేస్తున్న తీరును ప్రధానమంత్రి వివరించారు. భారత దేశంలో బొమ్మల తయారీ రంగం గురించి ప్రస్తావిస్తూ, వారణాసిలో తయారయ్యే చెక్క బొమ్మలను ఈ ప్రాంతానికి చెందిన పార్లమెంటేరియన్ గా ప్రమోట్ చేయడం గురించి ఆయన తెలియజేశారు. తరతరాలుగా బొమ్మల తయారీలో ప్రజలు నైపుణ్యం కలిగి ఉన్నప్పటికీ, దేశానికి గొప్ప సంప్రదాయం ఉన్నప్పటికీ భారతదేశంలో ఇంకా బొమ్మల దిగుమతి పట్ల  శ్రీ మోదీ విచారం వ్యక్తం చేశారు. భారతీయ బొమ్మలను ప్రోత్సహించకపోవడం, ఆధునిక ప్రపంచానికి అనుగుణంగా కళాకారులకు సహాయం చేయకపోవడం వల్ల విదేశాల్లో తయారైన బొమ్మలు భారతీయ బొమ్మల మార్కెట్ ను అధిగమించాయని ఆయన అన్నారు. దీనిని మార్చాలనే తన సంకల్పాన్ని నొక్కిచెప్పిన ప్రధాన మంత్రి, బొమ్మల ఎగుమతి గణనీయంగా పెరగడానికి మద్దతు ఇవ్వాలని దేశవ్యాప్తంగా బొమ్మల తయారీదారులకు విజ్ఞప్తి చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

 

|

"భారతదేశపు అతి పెద్ద టూరిజం హబ్ గా మారే సామర్ధ్యం యుపికి ఉంది" అని ప్రధాన మంత్రి అన్నారు, దేశంలోని ప్రతి వ్యక్తి ఈ రోజు వారణాసి, అయోధ్యలను సందర్శించాలని కోరుకుంటున్నారని, లక్షలాది మంది సందర్శకులు, పర్యాటకులను ఆకర్షిస్తుందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. దీని వల్ల యు పి లో చిన్న పారిశ్రామికవేత్తలు, విమానయాన సంస్థలు, హోటల్-రెస్టారెంట్ యజమానులకు అపూర్వమైన అవకాశాలు లభిస్తున్నాయని ప్రధాని అన్నారు. యుపి కి గల మెరుగైన స్థానిక, జాతీయ , అంతర్జాతీయ కనెక్టివిటీని గురించి కూడా ప్రధాన మంత్రి ప్రస్తావించారు. వారణాసి ద్వారా ఇటీవల ప్రారంభించిన ప్రపంచంలోనే పొడవైన క్రూయిజ్ సర్వీసు గురించి గుర్తు చేశారు. 2025లో కుంభమేళాను కూడా నిర్వహించనున్నామని, ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. రాబోయే కాలంలో పర్యాటక, ఆతిథ్య రంగంలో పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు ఇక్కడ సృష్టించబోతున్నామని చెప్పారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ, గ్రీన్ ఎనర్జీపై భారతదేశం దృష్టి సారించిందని, అటువంటి సాంకేతికత,  తయారీలో భారతదేశాన్ని గ్లోబల్ హబ్ గా మార్చడానికి ప్రభుత్వం ఇస్తున్న  ప్రాధాన్యతను ప్రధాన మంత్రి వివరించారు.

"దేశంలోని ప్రతి ఇల్లు,  ప్రతి కుటుంబం సౌర విద్యుత్ జనరేటర్ గా మారాలని మా ప్రయత్నం" అన్నారు. పిఎం సూర్యఘర్ లేదా ఉచిత విద్యుత్ పథకాన్ని గురించి ప్రస్తావిస్తూ, ‘ఇక్కడ 300 యూనిట్ల విద్యుత్ ఉచితంగా లభిస్తుంది. పౌరులు అదనపు విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించగలుగుతారు‘ అన్నారు. ప్రస్తుతం కోటి కుటుంబాలకు అందుబాటులో ఉన్న ఈ పథకం కింద ప్రతి కుటుంబం బ్యాంకు ఖాతాలో రూ.30 వేల నుంచి రూ.80 వేల వరకు నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. ప్రతి నెలా 100 యూనిట్లు విద్యుత్ ఉత్పత్తి చేసే వారికి రూ.30 వేలు, 300 యూనిట్లు లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి చేసే వారికి రూ.80 వేల వరకు సాయం అందుతుందని వివరించారు.

 

|

ఎలక్ట్రిక్ వాహనాల రంగం పట్ల ప్రభుత్వ ప్రోత్సాహాన్ని ప్రధాని మోదీ  వివరించారు. తయారీ భాగస్వాముల కోసం పిఎల్ఐ పథకాన్ని,  అలాగే ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై పన్ను మినహాయింపులను ప్రస్తావించారు. ఫలితంగా గత పదేళ్లలో 34.5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయని తెలిపారు. “ఎలక్ట్రిక్ బస్సులను శరవేగంగా అందుబాటులోకి తెస్తున్నాం. సోలార్ అయినా, ఈవీ అయినా ఉత్తరప్రదేశ్ లో రెండు రంగాల్లోనూ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి” అన్నారు.

చౌదరి చరణ్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ, "ఉత్తరప్రదేశ్ నేల బిడ్డ చౌదరి సాహెబ్ ను గౌరవించడం దేశంలోని కోట్లాది మంది శ్రామిక రైతులకు దక్కిన గౌరవం" అని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో గతంలో ఉన్న వివక్షాపూరిత విధానాల గురించి కూడా ఆయన మాట్లాడారు. చిన్న రైతులకు చౌదరి చరణ్ సింగ్ చేసిన సేవలను ఆయన ప్రశంసించారు. "చౌదరి సాహెబ్ స్ఫూర్తితో మేము దేశంలోని రైతులకు సాధికారత కల్పిస్తున్నాము" అని అన్నారు.

 

|

వ్యవసాయంలో కొత్త మార్గాలను అన్వేషించడంలో రైతులకు మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు, "మన దేశ వ్యవసాయాన్ని కొత్త మార్గంలో తీసుకెళ్లడానికి మేము రైతులకు సహాయం చేస్తున్నాము,  ప్రోత్సహిస్తున్నాము" అని పేర్కొన్నారు. ఉత్తర ప్రదేశ్ లోని గంగానది ఒడ్డున పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం ఆవిర్భవించిందని, ఇది రైతులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా మన పవిత్ర నదుల స్వచ్ఛతను కాపాడటానికి సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఫుడ్ ప్రాసెసింగ్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ , వారి ప్రయత్నాల్లో 'జీరో ఎఫెక్ట్, జీరో డిఫెక్ట్' అనే మంత్రానికి ప్రాధాన్యమివ్వాలని కోరారు. ప్రపంచవ్యాప్తంగా డైనింగ్ టేబుల్స్ పై భారతీయ ఆహార ఉత్పత్తులను ఉంచాలనే ఉమ్మడి లక్ష్యం కోసం పనిచేయవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు, సిద్ధార్థ్ నగర్ కాలా నమక్ రైస్, చందౌలి “ బ్లాక్ రైస్ వంటి ఉత్పత్తుల విజయగాథలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. వీటిని ఇప్పుడు గణనీయమైన పరిమాణంలో ఎగుమతి చేస్తున్నారు.

చిరుధాన్యాలు సూపర్ ఫుడ్స్ గా ఎదుగుతున్న ధోరణిని ప్రస్తావిస్తూ, చిరుధాన్యాల వంటి సూపర్ ఫుడ్స్ లో పెట్టుబడులకు ఇదే సరైన సమయమని, ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. రైతులతో భాగస్వామ్యం ఏర్పరుచుకో వాలని పారిశ్రామికవేత్తలను కోరుతూ, ప్రైతు ఉత్పత్తిదారుల సంస్థలు (ఎఫ్ పి ఒ లు) సహకార సంఘాల ద్వారా చిన్న తరహా రైతులకు సాధికారత కల్పించడంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను  వివరించారు. “ఇవి పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యానికి అవకాశాలను అందిస్తాయి. రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది, వ్యవసాయం,   వ్యాపారానికి కూడా మంచిది" అని ప్రధాని మోదీ పెట్టుబడిదారులతో అన్నారు.

 

|

భారతదేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ,  వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను నడిపించడంలో ఉత్తర ప్రదేశ్  కీలక పాత్రను వివరిస్తూ, ఈ అవకాశం ప్రయోజనాలను గరిష్టంగా పొందాలని ప్రధాన మంత్రి వాటాదారులకు పిలుపునిచ్చారు. ఉత్తరప్రదేశ్ ప్రజల సామర్థ్యాలు, రాష్ట్ర, దేశ ప్రగతికి పునాది వేయడంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వ కృషి పై ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్ , ఉత్తరప్రదేశ్ ముఖ్య మంత్రి శ్రీ యోగి ఆదిత్య నాథ్  , ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు పాల్గొన్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ అంతర్జాతీయ, భారతీయ కంపెనీల ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, ఇతర విశిష్ట అతిథులు సహా సుమారు 5000 మంది హాజరయ్యారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India's first microbiological nanosat, developed by students, to find ways to keep astronauts healthy

Media Coverage

India's first microbiological nanosat, developed by students, to find ways to keep astronauts healthy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi greets the people of Arunachal Pradesh on their Statehood Day
February 20, 2025

The Prime Minister, Shri Narendra Modi has extended his greetings to the people of Arunachal Pradesh on their Statehood Day. Shri Modi also said that Arunachal Pradesh is known for its rich traditions and deep connection to nature. Shri Modi also wished that Arunachal Pradesh may continue to flourish, and may its journey of progress and harmony continue to soar in the years to come.

The Prime Minister posted on X;

“Greetings to the people of Arunachal Pradesh on their Statehood Day! This state is known for its rich traditions and deep connection to nature. The hardworking and dynamic people of Arunachal Pradesh continue to contribute immensely to India’s growth, while their vibrant tribal heritage and breathtaking biodiversity make the state truly special. May Arunachal Pradesh continue to flourish, and may its journey of progress and harmony continue to soar in the years to come.”