పాఠశాలలో బహుళ క్రీడల ప్రాంగణానికి శంకుస్థాపన;
సింధియా పాఠశాల 125వ వార్షికోత్సవ స్మారక తపాలా బిళ్ల ఆవిష్కరణ;
పాఠశాల అగ్రశ్రేణి.. విశిష్ట పూర్వ విద్యార్థులకు వార్షిక పురస్కారాల ప్రదానం;
భవిష్యత్తరాల కోసం ఉజ్వల భవిష్యత్తు సృష్టికి దార్శనికుడైన
మహారాజా మాధవరావ్ సింధియా-1 ఎన్నో కలలుగన్నారు”;
“గడచిన దశాబ్ద కాలంలో దేశ వినూత్న దీర్ఘకాలిక ప్రణాళికలు సంచలనాత్మక నిర్ణయాలకు తోడ్పడ్డాయి”;
“నేటి యువత శ్రేయస్సు కోసం దేశంలో తగిన వాతావరణ సృష్టే మా లక్ష్యం”;
“సింధియా పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వృత్తిపరమైన లేదా మరే ఇతర రంగంలోనైనా దేశాన్ని ‘వికసిత భారతం’గా మార్చడానికి కృషి చేయాలి”;
“భారతదేశం నేడు అన్ని కార్యక్రమాలనూ భారీస్థాయిలోనే చేపడుతోంది”; “మీ కలలను సాకారం చేయడమే నా జీవిత సంకల్పం”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ‘సింధియా పాఠశాల’ 125వ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా బహుళార్థ సాధక క్రీడా ప్రాంగణానికి శంకుస్థాపన చేశారు. అలాగే విశిష్ట పూర్వ విద్యార్ధులతోపాటు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన విద్యార్థులకు పతకాలు ప్రదానం చేశారు. సింధియా స్కూల్ 1897లో చరిత్రాత్మక గ్వాలియర్‌ కోటలో ఏర్పాటు చేయబడింది. కాగా, ఈ పాఠశాల వార్షికోత్సవం నేపథ్యంలో   ీ53 2

స్మారక తపాలా బిళ్లను కూడా కూడా ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శివాజీ మహరాజ్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించడంతోపాటు అక్కడి ఎగ్జిబిషన్‌ను కూడా ఆయన తిలకించారు.

 

   అనంతరం సభకు హాజరైనవారిని ఉద్దేశించి ప్రసంగిస్తూ- ముందుగా సింధియా పాఠశాల 125వ వార్సికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఆజాద్‌ హింద్‌ ప్రభుత్వ వ్యవస్థాపక దినోత్సవం నేపథ్యంలో దేశ పౌరులకు ప్రధాని అభినందనలు తెలియజేశారు. సింధియా పాఠశాలతోపాటు గ్వాలియర్ నగర ప్రతిష్టాత్మక చరిత్ర ఉత్సవాల్లో పాల్గొనే అవకాశం కల్పించడంపై ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గ్వాలిప మహర్షి, సంగీత విద్వాంసుడు తాన్‌సేన్‌, మాధవ్‌రావ్‌ సింధియా, రాజమాత విజయ రాజే, అటల్ బిహారీ వాజ్‌పేయి, ఉస్తాద్ అమ్జద్ అలీఖాన్‌ వంటి ప్రముఖుల పేర్లను ప్రస్తావిస్తూ- అందరికీ స్ఫూర్తిదాయకులైన వారికి గ్వాలియర్ పుట్టినిల్లని కొనియాడారు. “ఇది నారీశక్తి శౌర్యపరాక్రమాల గడ్డ”.. స్వరాజ్య సాధనకు ఏర్పాటైన హింద్ ఫౌజ్ కోసం మహారాణి గంగాబాయి తన ఆభరణాలను విక్రయించారని ప్రధాని గుర్తుచేశారు. “గ్వాలియర్‌ నగర సందర్శన నాకు సదా ఎనలేని ఆనందానుభూతినిస్తుంది” అని ఆయన అన్నారు. దేశరక్షణతోపాటు వారణాసి సంస్కృతి పరిరక్షణకు సింధియా కుటుంబ సహకారం ఎంతో విలువైనదని పేర్కొన్నారు. కాశీ నగరంలో ఆ కుటుంబ సభ్యులు అనేక పవిత్ర స్నానఘట్టాలను నిర్మించడంతోపాటు బెనారస్‌ హిందూ విశ్వవిద్యాలయానికి (బిహెచ్‌యు) వారి సేవల గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో నేడు వారణాసిలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఆ కుటుంబానికి ఎంతో సంతృప్తినిస్తాయని పేర్కొన్నారు. శ్రీ జ్యోతిరాదిత్య సింధియా గుజరాత్‌ రాష్ట్రానికి అల్లుడని, ఆ ప్రాంత ప్రగతికి గైక్వాడ్‌ల కుటుంబ కృషిని కూడా ప్రధాని ప్రస్తావించారు.

   కర్తవ్య నిబద్ధులు ఎన్నడూ తాత్కాలిక ప్రయోజనాలను ఆశించరని, భవిష్యత్తరాల సంక్షేమమే వారికి జీవితాశయంగా ఉంటుందని ప్రధాని అన్నారు. విద్యాసంస్థల స్థాపనతో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఒనగూడుతాయని నొక్కిచెబుతూ ఇందుకుగాను మహారాజా మాధవ్‌రావు-1కి ఆయన నివాళి అర్పించారు. ఢిల్లీలో ప్రస్తుత ప్రజా రవాణా వ్యవస్థ ‘డిటిసి’ ఆయన నెలకొల్పిందేనని, ఈ వాస్తవం చాలామందికి తెలియదని శ్రీ మోదీ పేర్కొన్నారు. జల సంరక్షణ, నీటిపారుదల సదుపాయాల కల్పన దిశగా  ఆయన చొరవను ప్రధాని ప్రస్తావిస్తూ- 150 ఏళ్ల తర్వాత కూడా ఆసియాలోనే అతిపెద్ద మట్టి ఆనకట్టగా ‘హర్సీ డ్యామ్’ పేరు వినిపించడం ఇందుకు నిదర్శనమని వెల్లడించారు. జీవితంలోని ప్రతి రంగంలోనూ తాత్కాలిక ఫలితాల కోసం కాకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కృషి చేయాలని ఆయన దూరదృష్టి మనకు నేర్పుతుందని ప్రధాని వ్యాఖ్యానించారు.

 

   దేశ ప్రధానిగా 2014లో తాను పదవీ బాధ్యతలు స్వీకరించిన వేళ తక్షణ ఫలితాల కోసం పనిచేయడం లేదా దీర్ఘకాలిక విధానాలు అనుసరించడమనే రెండు మార్గాలు తనముందు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో 2 నుంచి 5, 8, 10, 15, 20 ఏళ్ల వంతున వివిధ కాల వ్యవధుల పరిమితితో ఆయా లక్ష్యాలను నిర్దేశించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన గుర్తుచేశారు. ఈ మేరకు ఇప్పుడు తమ ప్రభుత్వం పదేళ్ల పాలన పూర్తికి చేరువలో ఉందని, దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా అనేక సమస్యలకు పరిష్కారాన్వేషణ చేశామని పేర్కొన్నారు. ఈ విధంగా సాధించిన విజయాలను ఏకరవు పెడుతూ- జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దుపై ఆరు దశాబ్దాల డిమాండుతోపాటు మాజీ సైనికులకు ‘ఒకే ర్యాంకు-ఒకే పెన్షన్‌’పై 40 ఏళ్లనాటి డిమాండ్‌ను పరిష్కరించినట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. అలాగే వస్తుసేవల పన్ను (జిఎస్‌టి), ‘ముమ్మారు తలాఖ్‌’ రద్దు చట్టంసహా ఇటీవల పార్లమెంటు ఆమోదముద్ర వేసిన మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

   దేశ యువతరానికి అవకాశాల కొరత రాకుండా తగిన వాతావరణం సృష్టించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం కృషి చేస్తున్నదని శ్రీ మోదీ పేర్కొన్నారు. కాబట్టే ఈ చిరకాల డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపిందని, లేకపోతే మరో తరం గడచినా ఇది అలాగే కొనసాగేవని నొక్కిచెప్పారు. భారత స్వాతంత్ర్య శతాబ్ది నాటికి ‘సింధియా పాఠశాల’ 150 ఏళ్లు పూర్తి చేసుకుంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో “గొప్ప కలలు కనండి... గొప్ప విజయాలు సాధించండి” అని విద్యార్థులకు ఆయన  పిలుపునిచ్చారు. రాబోయే 25 ఏళ్లలో యువత‌రం దేశాన్ని ‘వికసిత భారతం’గా తీర్చిదిద్దగలదని  ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. “యువతరం మీద, వారి సామర్థ్యంపైనా నాకు ఎనలేని  విశ్యాసం ఉంది” అని ప్రధానమంత్రి అన్నారు. ఆ మేరకు వారు దేశ సంకల్పాన్ని నెరవేర్చగలరనే నమ్మకం ఉందన్నారు. రాబోయే 25 ఏళ్లు దేశానికే కాకుండా యువతరానికీ ఎంతో ముఖ్యమైనవని పునరుద్ఘాటించారు. “సింధియా పాఠశాలలోని ప్రతి విద్యార్థి వృత్తిపరంగా లేదా ప్రపంచంలోని మరే రంగంలోనైనా దేశాన్ని వికసిత భారతంగా రూపుదిద్దడానికి కృషి చేయాలి” అని ఆయన ఆకాంక్షించారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులతో తన సంభాషణ వికసిత భారత స్వప్న సాకారంపై వారి సామర్థ్యంమీద తన నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, రేడియో దిగ్గజం అమీన్ సయానీ సహా తాను రాసిన గర్బా గీతాన్ని ప్రదర్శించిన మీత్‌ సోదరులతోపాటు సల్మాన్ ఖాన్, గాయకుడు నితిన్ ముఖేష్ వంటి పూర్వ విద్యార్థుల పేర్లను ఆయన ప్రస్తావించారు.

 

   ప్రపంచంలో భారత్‌ పేరుప్రతిష్టలు ఇనుమడించడాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ ప్రయోగ విజయం, జి-20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించడం వంటివి ఇందుకు ఉదాహరణలని ఆయన పేర్కొన్నారు. భారత్‌ శరవేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థ అని గుర్తుచేస్తూ- సాంకేతికార్థిక, ప్రత్యక్ష డిజిటల్ లావాదేవీలు, స్మార్ట్‌ ఫోన్ డేటా వినియోగం వగైరాల్లో మన దేశం అగ్రస్థానంలో ఉందన్నారు. అలాగే ఇంటర్నెట్ వాడకందారుల సంఖ్యరీత్యా, మొబైల్ ఫోన్ల తయారీలో రెండో స్థానంలో ఉందని ఆయన తెలిపారు. ఇక మూడో అతిపెద్ద అంకుర పర్యావరణ వ్యవస్థగల దేశంగానే కాకుండా మూడో అతిపెద్ద ఇంధన వినియోగదారుగానూ ఉందన్నారు. అంతరిక్షంలో శాశ్వత పరిశోధన కేంద్రం ఏర్పాటు సన్నాహాలుసహా నేటి గగన్‌యాన్‌  సంబంధిత ప్రయోగం విజయవంతం కావడాన్ని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా, ‘తేజస్’ విమానం, ‘ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌’ యుద్ధనౌక తదితరాలను ప్రస్తావిస్తూ- “భారతదేశానికి ఏదీ అసాధ్యం కాదు” అని స్పష్టం చేశారు.

   యావత్‌ ప్రపంచం యువతరానికి అవకాశాల ఆవరణమని ప్రధాని విద్యార్థులకు సూచించారు. అంతరిక్షం, రక్షణ రంగాలుసహా వారికోసం ఎదురుచూస్తున్న కొత్త మార్గాల గురించి వివరించారు.  రైల్వేశాఖ మాజీమంత్రి శ్రీ మాధవరావు సింధియా శతాబ్ది రైళ్లను ప్రారంభించడం వంటి కార్యక్రమాలు మూడు దశాబ్దాల దాకా పునరావృతం కాకపోవడాన్ని గుర్తుచేశారు. అయితే, దేశం ఇవాళ వందే భారత్, నమో భారత్ వంటి రైళ్లను ఏ విధంగా చూడగలిగిందీ తెలుసుకోవాలని విద్యార్థులను కోరారు. స్వరాజ్య సాధన స్ఫూర్తి దిశగా సింధియా పాఠశాలలోని తరగతులకు పేర్లు పెట్టడాన్ని ప్ర‌ధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ మేరకు ‘శివాజీ, మహద్ జీ, రాణోజీ, దత్తాజీ, కనార్‌ఖేడ్‌, నిమాజీ, మాధవ్‌’ల పేరిట వాటికి పేర్లు పెట్టారని, ఇదెంతో స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇవి సప్తరుషుల శక్తితో సమానమని అన్నారు. ఈ సందర్భంగా కిందివిధంగా విద్యార్థులకు 9 కర్తవ్యాలను నిర్దేశించారు.

 

   ఈ మేరకు “జల సంరక్షణపై అవగాహన కల్పన, డిజిటల్ చెల్లింపులపై ప్రజల్లో ప్రచారం, దేశంలోనే అత్యంత పరిశుభ్ర నగరంగా గ్వాలియర్‌ను రూపుదిద్దడం, భారత్‌ తయారీ ఉత్పత్తులను ప్రోత్సహించడం, ‘స్థానికత కోసం స్వగళం’ విధానం అనుసరణ, విదేశాలకు వెళ్లే ముందు భారత్‌లో అన్వేషణ-స్వదేశీ పర్యటన, ప్రకృతి వ్యవసాయంపై ప్రాంతీయంగా రైతులకు అవగాహన కల్పన, రోజువారీ ఆహారంలో చిరుధాన్యాల వాడకం, క్రీడలు-యోగా లేదా ఏదైనా శరీర దారుఢ్య విధానాన్ని జీవనశైలిలో అంతర్భాగంగా మార్చుకోవడం, చివరగా కనీసం ఒక పేద కుటుంబానికి చేయూతనివ్వడం” వంటివి అనుసరించాలని సూచించారు. దేశం ఇప్పటికే ఈ మార్గాన్ని అనుసరిస్తున్నదని, కాబట్టే గత ఐదేళ్లలో 13 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తులయ్యారని ఆయన పేర్కొన్నారు. “భారతదేశం నేడు అన్ని కార్యక్రమాలనూ భారీస్థాయిలోనే చేపడుతోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇందుకు అనుగుణంగా విద్యార్థులు కూడా ఘనమైన సంకల్పాలు, స్వప్నాలను నిర్దేశించుకోవాలని ఉద్బోధించారు. “మీ కలలను సాకారం చేయడమే నా జీవిత సంకల్పం” అని ఆయన హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమ ఆలోచనలు-అభిప్రాయాలను ‘నమో యాప్’ ద్వారా తనతో పంచుకోవాలని లేదా వాట్సాప్‌ ద్వారా సంధానం కావచ్చునని సూచించారు.

 

   చివరగా- “సింధియా పాఠశాల కేవలం ఒక విద్యా సంస్థ కాదు.. ఇదొక వారసత్వం” అని ప్రధానమంత్రి అన్నారు. స్వాతంత్య్రానికి ముందు-తర్వాత మహారాజ్ మాధవరావ్ జీ సంకల్పాలను పాఠశాల నిరంతరం ముందుకు తీసుకువెళ్తూ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. కొద్దిసేపటి కిందట పురస్కారాలు స్వీకరించిన విద్యార్థులను శ్రీ మోదీ మరోసారి అభినందించారు. సింధియా పాఠశాలకు, ఇక్కడి విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సిద్ధించాలని ఆకాంక్షిస్తూ ఆయన తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్ గవర్నర్ శ్రీ మంగూభాయ్ పటేల్, రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర మంత్రులు శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్, జితేంద్ర సింగ్ తదితరులు పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world

Media Coverage

PM Modi hails diaspora in Kuwait, says India has potential to become skill capital of world
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi