ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్)ను ప్రారంభించారు. మన దేశం 200 గిగావాట్ల శిలాజేతర ఇంధన స్ధాపిత సామర్థ్యం సాధించడంలో సహకరించిన కీలక భాగస్వాములను ఈ మూడు రోజుల శిఖరాగ్ర సదస్సులో భారత్ సత్కరిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థలలో అత్యాధునిక ఆవిష్కరణలతో సదస్సు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను శ్రీ మోదీ తిలకించారు.
అనంతరం సభనుద్దేశించి ప్రసంగిస్తూ తొలుత ‘4వ రీ-ఇన్వెస్ట్ (RE-INVEST) శిఖరాగ్ర సదస్సు’కు హాజరైన ప్రముఖులందరికీ స్వాగతం పలికారు. మూడు రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో భవిష్యత్ ‘ఇంధన, సాంకేతిక పరిజ్ఞాన, విధాన’ సంబంధిత అంశాలపై లోతైన చర్చలు సాగుతాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. అలాగే చర్చలు, తద్వారా లభించే ఫలితాల యావత్ మానవాళికి మేలు చేస్తాయని శ్రీ మోదీ అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా చర్చల ఫలవంతం కావాలంటూ శుభాకాంక్షలు తెలిపారు.
దేశంలో ఆరు దశాబ్దాల తర్వాత ఒక ప్రభుత్వాన్ని రికార్డు స్థాయిలో వరుసగా మూడోసారి ఎన్నుకుంటూ ప్రజలిచ్చిన తీర్పును ప్రధాని గుర్తుచేశారు. ‘‘ఈ ప్రభుత్వం వరుసగా మూడోసారి ఎన్నిక కావడానికి కారణం భారతీయుల ఆకాంక్షలే’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు మూడో దఫా ఎన్నికైన ప్రభుత్వం తమ ఆకాంక్షలకు కొత్త రెక్కలు తొడుగుతుందనే నమ్మకం, విశ్వాసాన్ని 140 కోట్ల మంది పౌరులు... ముఖ్యంగా యువతరం, మహిళలు వెలిబుచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే తమ గౌరవప్రద జీవనానికి ఈ ప్రభుత్వం హామీ ఇవ్వగలదని పేదలు, దళితులు, అణగారిన వర్గాల ప్రజలు విశ్వసిస్తున్నారని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌ను ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే సంకల్పంతో 140 కోట్ల మంది పౌరులు శ్రమిస్తున్నారని పేర్కొన్నారు. నేటి కార్యక్రమం ఏదో ఒక ప్రయోజనానికి పరిమితం కాదని, దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా రూపుదిద్దే మహా సంకల్పం, ఉద్యమం, కార్యాచరణ ప్రణాళికలో భాగమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఈ దిశగా ప్రభుత్వం పాలన బాధ్యతలు చేపట్టాక తొలి 100 రోజులలో తీసుకున్న నిర్ణయాలను శ్రీ మోదీ ప్రముఖంగా వివరించారు.
ఈ మేరకు ‘‘మా ప్రభుత్వ తొలి వంద రోజుల కార్యక్రమాలు మా ప్రాధాన్యాలనే కాకుండా వాటి అమలు వేగం, భారీతనాన్ని కూడా ప్రతిబింబిస్తాయి’’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్ శరవేగంగా పురోగమించడంలో అన్ని రంగాలకూగల ప్రాధాన్యాన్ని ఇవి స్పష్టం చేశాయన్నారు. గడచిన 100 రోజుల్లో దేశవ్యాప్తంగా భౌతిక-సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణకు అనేక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలాగే తమ తొలి, మలిదఫా ప్రభుత్వాల హయాంలో 4 కోట్ల ఇళ్లను ప్రజలకు అందజేయగా, ఈసారి 7 కోట్ల ఇళ్ల నిర్మాణం దిశగా ముందడుగు వేస్తున్నామన్నారు. ఒకవిధంగా అనేక దేశాల జనాభాకన్నా ఈ ఇళ్ల సంఖ్యే అధికమని అభివర్ణించారు. దీంతోపాటు 12 కొత్త పారిశ్రామిక నగరాల నిర్మాణం, 8 హైస్పీడ్ రోడ్ కారిడార్ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామన్నారు. అంతేగాక 15కుపైగా ‘వందే భారత్’ సెమీ హైస్పీడ్ రైళ్లు ప్రారంభించామని, పరిశోధనలకు ప్రోత్సాహమిస్తూ రూ.1 ట్రిలియన్ విలువైన పరిశోధన నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. విద్యుత్-రవాణా రంగం ప్రగతికి వివిధ కార్యక్రమాల ప్రకటన, అధిక-సామర్థ్యంగల ‘బయో మాన్యుఫ్యాక్చరింగ్’ రంగానికి ప్రోత్సాహం సహా ‘బయో ఇ3’ విధానానికి ఆమోదం తెలిపామని ప్రధానమంత్రి వెల్లడించారు.
హరిత ఇంధన రంగంలో గత 100 రోజుల పరిణామాలను ప్రస్తావిస్తూ- రూ.7000 కోట్లకుపైగా విలువైన సముద్ర తీర పవన విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు మద్దతుగా ‘నష్టభయ నివారణ నిధి’ (వయబిలిటీ గ్యాప్ ఫండింగ్-విజిఎఫ్) పథకం ప్రారంభించామని ఆయన తెలిపారు. అలాగే రూ.12 వేల కోట్ల వ్యయంతో 31 వేల మెగావాట్ల జలవిద్యుదుత్పాదనకు భారత్ కృషి చేస్తున్నదని చెప్పారు.
అద్వితీయ వైవిధ్యం, స్థాయి, శక్తి, సామర్థ్యం, దక్షత’లు భారత్ సొంతమని, యావత్ ప్రపంచానికీ వర్తించే భారతీయ పరిష్కారాలకు ఇవి బాటలు వేస్తామని ప్రధానమంత్రి ఆత్మవిశ్వాసం ప్రకటించారు. ఈ మేరకు ‘‘ఇది భారత్ ఆత్మవిశ్వాసం మాత్రమే కాదు... ప్రస్తుత 21వ శతాబ్దానికి అత్యుత్తమ ఎంపిక భారతదేశమేనని ప్రపంచం మొత్తం నమ్ముతోంది’’ అని ఉద్ఘాటించారు. గత నెలలో భారత్ నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమాలను వివరిస్తూ- ఈ నెలారంభంలో ‘గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్’ నిర్వహించామని గుర్తుచేశారు. అలాగే ప్రపంచ తొలి సౌర ఉత్సవంతోపాటు సెమీకండక్టర్ శిఖరాగ్ర సదస్సులో ప్రపంచవ్యాప్త ప్రజానీకం పాలుపంచుకున్నదని శ్రీ మోదీ అన్నారు. అంతేగాక పసిఫిక్ పౌర విమానయాన మంత్రిత్వశాఖల స్థాయి సదస్సు నిర్వహించగా, ప్రస్తుతం ‘హరిత ఇంధన’ శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తున్నదని వివరించారు.
శ్వేత, మధుర (తేనె), సౌర విప్లవాలకు నాంది పలికిన గుజరాత్- నేడు ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన (రీ-ఇన్వెస్ట్)ను నిర్వహించడం యాదృచ్ఛికమే అయినా, హర్షణీయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ‘‘దేశంలో సొంత సౌరశక్తి విధానంగల తొలి రాష్ట్రం గుజరాత్’’ అని గుర్తుచేస్తూ- ఆ తర్వాతే జాతీయ స్థాయిలో సౌరశక్తి విధానాలు రూపుదిద్దుకున్నాయని ఆయన తెలిపారు. అంతేగాక ప్రపంచంలో తొలిసారి వాతావరణ మార్పు సంబంధిత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన రాష్ట్రాల జాబితాలోనూ గుజరాత్ ముందు వరుసలో ఉందని శ్రీ మోదీ సగర్వంగా చెప్పారు. సౌరశక్తి గురించి ప్రపంచం ఆలోచించే నాటికే సౌరవిద్యుత్ ప్లాంట్లను గుజరాత్ ప్రారంభించిందని ఆయన గుర్తుచేశారు.
ఈ సదస్సు వేదిక ‘మహాత్మా మందిర్’ను ప్రస్తావిస్తూ- వాతావరణ సవాళ్ల మాట ఊహకైనా అందని రోజుల్లో దానిపై ప్రపంచాన్ని అప్రమత్తం చేసిన మార్గదర్శకుడు మహాత్మా గాంధీ పేరిట దీనికి నామకరణం చేశామని పేర్కొన్నారు. అలాగే- ‘‘మన అవసరాలన్నీ తీర్చగల వనరులు ఈ భూగోళంమీద ఉన్నా.. మన అత్యాశను తీర్చడానికి అవి చాలవు’’ అన్న మహాత్మా గాంధీ ప్రబోధాన్ని ఉటంకించారు. ఈ దార్శనికత సుసంపన్న భారతీయ సంస్కతి నుంచి పుట్టిందని ప్రధాని అన్నారు. ‘హరిత భవిత, నికర-శూన్య ఉద్గారాలు’ వంటివి అందమైన పదాలకు పరిమితం కాదని, అవి దేశంలోని కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వాల అవసరాలు-కట్టుబాట్లని శ్రీ మోదీ స్పష్టం చేశారు.
వర్ధమాన ఆర్థిక వ్యవస్థ కాబట్టి భారత్ వీటికి కట్టుబడటం తప్పనిసరి కానప్పటికీ, నైతిక నిబద్ధతతో ఆ మార్గాన్ని ఎంచుకోలేదని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అలాగే ‘‘నేటి భారతం వర్తమానానికే కాకుండా రాబోయే వెయ్యేళ్లకు అవసరమైన పునాదిని సిద్ధం చేస్తోంది’’ అన్నారు. శిఖరాగ్రానికి చేరడం మాత్రమే భారత్ లక్ష్యం కాదు... ఆ స్థానంలో సుస్థిరంగా నిలిచేలా స్వీయ సంసిద్ధత అవశ్యమని శ్రీ మోదీ ఉద్బోధించారు. దేశాన్ని 2047 నాటికి ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దే దిశగా ఇంధన అవసరాలు, విధానాలు ఎలా ఉండాలో తమకు బాగా తెలుసునన్నారు. చమురు-వాయు నిల్వల కొరత నేపథ్యంలో సౌర, పవన, అణు, జల విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధన శక్తి ప్రాతిపదికగా భవిష్యత్తుకు రూపమివ్వాలన్నది భారత్ సంకల్పమని శ్రీ మోదీ గుర్తుచేశారు.
జి-20 కూటమి దేశాల్లో పారిస్ సదస్సు నిర్దేశిత వాతావరణ లక్ష్యాలను గడువుకన్నా.. అదీ తొమ్మిదేళ్లు ముందుగా సాధించింది భారతదేశమేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇదే ఊపులో 2030 నాటికి 500 గిగావాట్ల స్థాపిత పునరుత్పాదక ఇంధన సామర్థ్యం సాధనకు లక్ష్య నిర్దేశం చేసుకున్నదని తెలిపారు. ఇందులో భాగంగా హరిత ఇంధన రూపాంతరీకరణను ప్రభుత్వం ప్రజా ఉద్యమంగా మార్చిందన్నారు. ఇళ్ల పైకప్పులపై సౌర విద్యుదుత్పాదనకు భారత్ ప్రవేశపెట్టిన ‘ప్రధానమంత్రి సూర్యగృహ ఉచిత విద్యుత్ పథకం’ (PMSGFES)పై అధ్యయనం చేయాలని అతిథులకు ఆయన సూచించారు. ఈ పథకం కింద సౌరశక్తి ఉత్పాదన కోసం ఆర్థిక సహాయంతోపాటు ఉపకరణాల ఏర్పాటుకు చేయూతనిస్తుందని చెప్పారు. తద్వారా దేశంలోని ప్రతి ఇల్లు విద్యుదుత్పాదన యూనిట్‌గా మారుతుందన్నారు. ఈ పథకం కింద నమోదు చేసుకున్న 1.30 కోట్లకుపైగా కుటుంబాలకుగాను ఇప్పటిదాకా 3.25 లక్షల ఇళ్లపై ఉపకరణాల ఏర్పాటు పూర్తయిందని ఆయన వెల్లడించారు.
ఈ పథకంతో ఒనగూడే ఫలితాలను ప్రస్తావిస్తూ- నెలకు 205 యూనిట్ల విద్యుత్తును ఉపయోగించే ఓ చిన్న కుటుంబం 100 యూనిట్లను ఉత్పత్తి చేసి, గ్రిడ్‌కు విక్రయిస్తే ఏటా రూ.25 వేలదాకా ఆదా కాగలదని ప్రధాని వివరించారు. ‘‘పొదుపు-ఆర్జనతో సమానం కాబట్టి, కరెంటు చార్జీల భారం తప్పడంతోపాటు రూ.25 వేల మేర ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది’’ అన్నారు. ఈ సొమ్మును 20 ఏళ్లపాటు ‘ప్రజా భవిష్య నిధి’ (పిపిఎఫ్)లో పెట్టుబడి పెడితే, రూ.10 లక్షలకుపైగా పోగుపడి పిల్లల చదువులు, పెళ్లిళ్లకు ఉపయోగపడుతుందని తెలిపారు.
అంతేకాకుండా ఉపాధి కల్పన, పర్యావరణ పరిరక్షణకు ఈ పథకం ఒక మాధ్యమంగా మారుతున్నదని, దీనిద్వారా దాదాపు 20 లక్షల ఉద్యోగాల సృష్టికి అవకాశం ఉందని శ్రీ మోదీ అన్నారు. మరోవైపు ఈ పథకం కింద 3 లక్షల మంది యువతను నిపుణ మానవశక్తిగా రూపొందించాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నామన్నారు. వీరిలో లక్షమంది సౌర విద్యుత్ ఘటాల సాంకేతిక నిపుణులుగా పనిచేస్తారని తెలిపారు. ‘‘ఇళ్ల పైకప్పులమీద ప్రతి 3 కిలోవాట్ల సౌర విద్యుదుత్పాదనతో 50 నుంచి 60 టన్నుల కర్బన ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుంది’’ అని ప్రధాని చెప్పారు. ఈ విధంగా వాతావరణ మార్పు సవాళ్లపై పోరులో ప్రతి కుటుంబ సహకారం కూడా ఉంటుందన్నారు.
‘‘ఈ 21వ శతాబ్దపు చరిత్రలో భారత సౌర విప్లవం సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది’’ అని శ్రీ మోదీ ఉద్ఘాటించారు. శతాబ్దాలనాటి సూర్య దేవాలయంగల ‘మోధేరా’ దేశంలో తొలి సౌరశక్తి గ్రామంగా రూపొందడాన్ని ప్రస్తావిస్తూ- నేడు అక్కడి ప్రజల విద్యుత్ అవసరాలన్నిటినీ సౌరశక్తి తీరుస్తున్నదని తెలిపారు. ఈ క్రమంలో దేశంలోని అనేక గ్రామాలను సౌరశక్తియుతంగా మార్చే కార్యక్రమం కొనసాగుతున్నదని చెప్పారు.
అయోధ్య సూర్యవంశజుడైన శ్రీరాముని జన్మస్థలమని- ఆ స్ఫూర్తితో దీన్ని ‘ఆదర్శ సౌరశక్తి నగరం’గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని ప్రధాని తెలిపారు. ఇందులో భాగంగా నగరంలోని ప్రతి ఇల్లు, కార్యాలయం, సేవాప్రదానం వగైరాలను సౌర శక్తియుతం చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు ఇప్పటికే నగరంలోని అనేక ప్రభుత్వ భవనాలతోపాటు, గృహాలు సౌరశక్తిని వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరమంతటా పెద్ద సంఖ్యలో సౌర వీధిదీపాలు, రహదారి కూడళ్లు కాంతులు వెదజల్లుతున్నాయన్నారు. అంతేగాక సౌరశక్తితో బోట్లు, జల ఏటీఎంలు, భవనాలు ఎన్నో కనిపిస్తాయంటూ శ్రీ మోదీ హర్షం వెలిబుచ్చారు.
ఇదే తరహాలో దేశవ్యాప్తంగా 17 నగరాలను సౌరశక్తియుతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. దీంతోపాటు పంటపొలాలు, వ్యవసాయ క్షేత్రాలను సౌరశక్తి ఉత్పాదక మాధ్యమంగా మార్చే ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. పొలాలకు నీటిపారుదల కోసం సౌర పంపులు, స్వల్పస్థాయి ప్లాంట్ల ఏర్పాటు కోసం రైతులకు సహాయం చేస్తున్నట్లు తెలిపారు.
పునరుత్పాదక ఇంధన సంబంధిత రంగాలన్నిటా భారత్ ఎంతో వేగంతోపాటు భారీస్థాయిలో ముందంజ వేస్తున్నదని శ్రీ మోదీ స్పష్టీకరించారు. ఈ మేరకు మునుపటి దశాబ్దంతో పోలిస్తే గత పదేళ్లలో అణుశక్తి ఉత్పాదన 35 శాతం పెరిగిందని తెలిపారు. అలాగే హరిత ఉదజని రంగంలో ప్రపంచ అగ్రగామిగా ఎదగడానికి శక్తివంచన లేకుండా కృష్టి చేస్తున్నామని చెప్పారు. ఈ దిశగా దాదాపు రూ.20 వేల కోట్లతో హరిత ఉదజని కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇవేకాకుండ ‘వ్యర్థం నుంచి ఇంధనం’ (వేస్ట్ టు ఎనర్జీ) పేరిట భారీ కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. కీలక ఖనిజ సంబంధిత సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను శ్రీ మోదీ వివరించారు. పునరుపయోగం (రీయూజ్), పునరావృత్తి (రీసైక్లింగ్) సంబంధిత మెరుగైన పరిజ్ఞానాల రూపకల్పన కోసం అంకుర సంస్థలకు రుణమద్దతు సహా ప్రభుత్వం ఒక వర్తుల విధానాన్ని ప్రోత్సహిస్తున్నదని వెల్లడించారు.
‘మిషన్ లైఫ్- పర్యావరణ పరిరక్షణ జీవనశైలి’పై భారత్ దృక్కోణాన్ని వివరిస్తూ ‘‘భూగోళ హిత జనజీవనం’ సూత్రావళికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ప్రధాని మోదీ అన్నారు. అలాగే ‘అంతర్జాతీయ సౌర కూటమి’ ఏర్పాటు, జి-20 అధ్యక్షత సమయంలో ‘హరిత ఇంధన రూపాంతరీకరణ’పై దృష్టి సారించడం, శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ‘ప్రపంచ జీవ-ఇంధన కూటమి’కి శ్రీకారం వంటి కార్యక్రమాలతో భారత్ ముందడుగు వేసిందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ‘‘ఈ దశాబ్దం చివరికల్లా రైల్వే రంగాన్ని నికర-శూన్య ఉద్గార స్థాయికి తేవాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నాం’’ అని తెలిపారు. అంతేగాక 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్యాన్ని సాధించాలని సంకల్పించినట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో జల సంరక్షణ దిశగా దేశమంతటా వేలాది ‘అమృత సరోవరాలు’ (చెరువులు) నిర్మించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మరోవైపు ‘అమ్మ పేరిట ఓ మొక్క’ కార్యక్రమం గురించి చెబుతూ- దీనికింద ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలని ప్రధాని పిలుపునిచ్చారు.
దేశంలో పునరుత్పాదక ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్‌ను ప్రస్తావిస్తూ- ఈ అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కొత్త విధానాలకు రూపకల్పన చేస్తున్నదని ప్రధాని తెలిపారు. అంతేకాకుండా వీటి అమలు దిశగా అన్నివిధాలా అండదండలు కూడా అందిస్తున్నట్లు చెప్పారు. చివరగా- ఒక్క ఇంధన రంగంలోనేగాక తయారీ రంగంలోనూ భారత్ అపార, అద్భుత అవకాశాలు కల్పిస్తున్నదని ఆయన ప్రకటించారు. ‘‘పూర్తిస్థాయిలో ‘భారత్ తయారీ’ (మేడ్ ఇన్ ఇండియా) పరిష్కారాల దిశగా కృషిలో భాగంగా అనేక అవకాశాలను సృష్టిస్తున్నాం. అందువల్ల వాస్తవ విస్తరణ-మెరుగైన రాబడికి భారత్ హామీ ఇస్తోంది’’ అని పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడుల ద్వారా దేశ హరిత ఇంధన రూపాంతరీకరణలో భాగస్వాములు కావాల్సిందిగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషిసహా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా ముఖ్యమంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్, ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, కేంద్ర నవ్య-పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషిసహా ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా ముఖ్యమంత్రులతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
నేపథ్యం
ప్రపంచ 4వ పునరుత్పాదక ఇంధన పెట్టుబడిదారుల సదస్సు-ప్రదర్శన’ (రీ-ఇన్వెస్ట్) ద్వారా పునరుత్పాదక ఇంధన ఉత్పాదన, విస్తరణలో భారత్ అద్భుత పురోగమనం ప్రపంచానికి ప్రత్యక్షంగా వెల్లడవుతుంది. రెండున్నర రోజులపాటు సాగే ఈ కార్యక్రమంలో ప్రపంచం నలుమూలల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్నారు. వీరంతా ముఖ్యమంత్రుల ప్లీనరీ, ‘సీఈవో’ల రౌండ్ టేబుల్, ఆవిష్కరణాత్మక ఆర్థిక తోడ్పాటు, హరిత ఉదజని-భవిష్యత్ ఇంధన పరిష్కారాలపై ప్రత్యేక చర్చలతోపాటు సమగ్ర కార్యక్రమాల్లో భాగస్వాములవుతారు. ఈ సదస్సుకు గుజరాత్ ఆతిథ్యం ఇస్తుండగా- జర్మనీ, ఆస్ట్రేలియా, డెన్మార్క్, నార్వే అంతర్జాతీయ భాగస్వాములుగా ఉన్నాయి. ఇక దేశీయంగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ భాగస్వామ్య రాష్ట్రాలుగా పాల్గొంటున్నాయి.
ఈ సదస్సులో భాగంగా ప్రభుత్వ-ప్రైవేట్ రంగ కంపెనీలు, అంకుర సంస్థలు, ప్రధాన పారిశ్రామిక సంస్థల అత్యాధునిక ఆవిష్కరణలతో ఏర్పాటైన ప్రదర్శన అతిథులను ఆకట్టుకుంటుంది. సుస్థిర భవిత దిశగా భారత్ నిబద్ధతను ఇది వేనోళ్ల చాటుతుంది.
పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
In the first hundred days, our priorities are clearly visible. It is also a reflection of our speed and scale: PM @narendramodi pic.twitter.com/JCuQGxLu5t
— PMO India (@PMOIndia) September 16, 2024
Indian solutions for global application. pic.twitter.com/1re7rmDEic
— PMO India (@PMOIndia) September 16, 2024
India is the best bet of the 21st century. pic.twitter.com/jc7to46ol6
— PMO India (@PMOIndia) September 16, 2024
Green future and net zero are India's commitment. pic.twitter.com/drwFno5kQG
— PMO India (@PMOIndia) September 16, 2024
India is the first nation in the G-20 to achieve the climate commitments set in Paris, 9 years ahead of the deadline. pic.twitter.com/vOKwpLVhiZ
— PMO India (@PMOIndia) September 16, 2024
With PM Surya Ghar Muft Bijli Yojana, every home in India is set to become a power producer. pic.twitter.com/wIWTRUFFZ8
— PMO India (@PMOIndia) September 16, 2024