ప్రధాన మంత్రి అల్బనీస్,
ఇరు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులు,
నమస్కారం!
ఆస్ట్రేలియా పర్యటనలో నాకు, నా ప్రతినిధి బృందానికి ఇచ్చిన ఆతిథ్యం, గౌరవానికి ఆస్ట్రేలియా ప్రజలకు, ప్రధాని అల్బనీస్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మిత్రుడు, ప్రధాన మంత్రి (ఆస్ట్రేలియా) అల్బనీస్ భారత పర్యటనకు వచ్చిన రెండు నెలల్లోనే నేను ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నాను. గత ఏడాది కాలంలో మా భేటీ ఇది ఆరోసారి.
ఇది మన సమగ్ర సంబంధాల లోతును, మన అభిప్రాయాలలో సారూప్యతను, మన సంబంధాల పరిపక్వతను ప్రతిబింబిస్తుంది. నేను క్రికెట్ భాషలో చెప్పాలంటే మన బంధాలు టీ-20 మోడ్ లోకి ప్రవేశించాయి.
ప్రముఖులారా ,
నిన్న మీరు చెప్పినట్లు మన ప్రజాస్వామ్య విలువలే మన బంధాలకు పునాది. మన బంధం పరస్పర విశ్వాసం, గౌరవంపై ఆధారపడి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని భారతీయ సమాజం మన రెండు దేశాల మధ్య సజీవ వారధి. నిన్న సాయంత్రం జరిగిన ఇండియన్ కమ్యూనిటీ ఈవెంట్ లో నేను, ప్రధాన మంత్రి అల్బనీస్ హారిస్ పార్క్ 'లిటిల్ ఇండియా'ను ఆవిష్కరించాం. ఈ కార్యక్రమంలో ప్రధాని అల్బనీస్ కు ఉన్న ప్రజాదరణను కూడా నేను గ్రహించగలిగాను.
మిత్రులారా,
ఈ రోజు, ప్రధాన మంత్రి అల్బనీస్ తో నా సమావేశంలో, వచ్చే దశాబ్దంలో భారతదేశం-ఆస్ట్రేలియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లడం గురించి మాట్లాడాము. కొత్త రంగాల్లో సహకారానికి ఉన్న అవకాశాలపై కూలంకషంగా చర్చించాము. గత ఏడాది భారత్-ఆస్ట్రేలియా ఇ సి టి ఎ lఅమల్లోకి వచ్చింది. ఈ రోజు మేము సిఇసిఎ - సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందంపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాము. ఇది మన వాణిజ్య, ఆర్థిక సహకారానికి మరింత బలాన్ని, కొత్త కోణాలను ఇస్తుంది.
మైనింగ్, కీలకమైన ఖనిజాల రంగాల్లో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేసుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిపాం. పునరుత్పాదక ఇంధనంలో సహకారానికి పటిష్ట ప్రాంతాలను గుర్తించాం. గ్రీన్ హైడ్రోజన్ పై టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించాము. నిన్న వివిధ రంగాల్లో పెట్టుబడులపై ఆస్ట్రేలియా సి ఇ ఒ లతో ఫలవంతమైన చర్చ జరిపాను. ఈ రోజు నేను బిజినెస్ రౌండ్ టేబుల్ లో వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సహకారం గురించి మాట్లాడతాను.
ఈ రోజు, మైగ్రేషన్ అండ్ మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఇది మన జీవన వారధిని మరింత బలోపేతం చేస్తుంది. బెంగళూరులో ఆస్ట్రేలియా కొత్త కాన్సులేట్ ను ప్రారంభిస్తున్నట్లుగా, నేను నిన్న ప్రకటించినట్లుగా, మన నిరంతర పెరుగుతున్న సంబంధాలను బలోపేతం చేయడానికి, త్వరలో బ్రిస్బేన్ లో ఒక కొత్త భారతీయ కాన్సులేట్ ను ప్రారంభిస్తాము.
మిత్రులారా,
ఆస్ట్రేలియాలో దేవాలయాలపై జరుగుతున్న దాడులు, వేర్పాటువాద శక్తుల కార్యకలాపాలపై ప్రధాని అల్బనీస్ , నేను గతంలో చర్చించాం. ఈ రోజు కూడా ఈ అంశంపై చర్చించాం. భారత్, ఆస్ట్రేలియాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను తమ ఆలోచనలు, చర్యల ద్వారా దెబ్బతీసే అంశాలు మనకు ఆమోదయోగ్యం కావు. ఈ విషయంలో ప్రధాని అల్బనీస్ తీసుకున్న చర్యలకు ధన్యవాదాలు. ఇదే సమయంలో ఇలాంటి శక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన నాకు మరోసారి హామీ ఇచ్చారు.
మిత్రులారా,
భారత్-ఆస్ట్రేలియా సంబంధాల పరిధి కేవలం రెండు దేశాలకే పరిమితం కాదు. ఇది ప్రాంతీయ సుస్థిరత, శాంతి , ప్రపంచ సంక్షేమంతో ముడిపడి ఉంది. కొద్ది రోజుల క్రితం హిరోషిమాలో జరిగిన క్వాడ్ శిఖరాగ్ర సదస్సులో ప్రధాని అల్బనీస్ తో కలిసి ఇండో-పసిఫిక్ ప్రాంతంపై చర్చించాం. గ్లోబల్ సౌత్ పురోగతికి భారత్-ఆస్ట్రేలియా సహకారం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. యావత్ ప్రపంచాన్ని ఒకే కుటుంబంగా చూసే భారతీయ వసుదైక కుటుంబ భావనే జీ-20 సదస్సు ప్రధాన ఇతివృత్తం. జి-20లో మన కార్యక్రమాలకు ఆస్ట్రేలియా మద్దతు ఇచ్చినందుకు నేను ప్రధాన మంత్రి అల్బనీస్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా,
ఈ ఏడాది భారత్ లో జరగనున్న క్రికెట్ ప్రపంచ కప్ లో పాల్గొనేందుకు భారత్ కు రావాలని ప్రధాని అల్బనీస్ ను, ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులను ఆహ్వానిస్తున్నాను. ఆ సమయంలో క్రికెట్ తో పాటు దీపావళి పండుగను కూడా ఘనంగా జరుపుకోవచ్చు.
ప్రముఖులారా,
ఈ ఏడాది సెప్టెంబర్ లో జరిగే జీ-20 శిఖరాగ్ర సదస్సుకు మిమ్మల్ని మళ్లీ భారత్ కు ఆహ్వానించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మరోసారి ధన్యవాదాలు!