మాననీయ చాన్సలర్ షోల్జ్ గారూ...
రెండు దేశాల ప్రతినిధులు...
పత్రికా-ప్రసార మాధ్యమ మిత్రులారా,

నమస్కారం!

గుటెన్ టాగ్! (శుభ దినం)

   మున్ముందుగా భారత పర్యటనకు వచ్చిన చాన్సలర్ షోల్జ్ గారికి, ఆయన ప్రతినిధి బృందానికీ సుస్వాగతం. గడచిన రెండేళ్ల వ్యవధిలో మిమ్మల్ని మూడోసారి మా దేశానికి ఆహ్వానించే అవకాశం లభించడం మాకెంతో సంతోషం కలిగిస్తోంది.
 

   భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంత విస్తృతమైనదో మా దేశంలో రెండుమూడు రోజులుగా సాగుతున్న కార్యకలాపాలను బట్టి మీరు అంచనా వేయవచ్చు. ఈ ఉదయం జర్మనీతో వాణిజ్యంపై ఆసియా-పసిఫిక్ సదస్సులో ప్రసంగించే అవకాశం మనకు లభించింది.
   ప్రధానిగా నా మూడోదఫా పదవీ కాలంలో తొలి అంతర-ప్రభుత్వ సదస్సు ఇంతకుముందే ముగిసింది. అటుపైన సీఈవోల వేదిక సమావేశం ఇప్పుడే పూర్తయింది. ఇదే వేళకు జర్మనీ నావికాదళ నౌకలు గోవా మజిలీకి చేరువయ్యాయి. ఇక క్రీడా ప్రపంచం పరంగానూ మనం ఎక్కడా వెనుకబడలేదు. రెండు దేశాల హాకీ జట్ల మధ్య స్నేహపూర్వక మ్యాచ్‌లు కూడా నిర్వహించుకుంటున్నాం.
మిత్రులారా!
   ఉభయ దేశాల భాగస్వామ్యానికి చాన్సలర్ షోల్జ్ నాయకత్వాన సరికొత్త ఊపు, ఉత్తేజం లభించాయి. జర్మనీ వ్యూహంలో ‘‘భార‌త్‌కు ప్రాధాన్యం’’ లభించడంపై ఆయనకు నా అభినందనలు. ప్రపంచంలోని రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ఆధునికంగా, ఉన్నతంగా తీర్చిదిద్దే సమగ్ర ప్రణాళిక రూపకల్పనకు ఇది దోహదం చేస్తుంది.
మిత్రులారా!
   సాంకేతికత-ఆవిష్కరణలపై సమగ్ర భవిష్యత్ ప్రణాళికకు నేడు శ్రీకారం చుట్టాం. కీలక, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, నైపుణ్యాభివృద్ధి, ఆవిష్కరణల సంబంధిత సహకారాత్మక  ప్రభుత్వ విధానంపైనా ఒప్పందం కుదిరింది. దీంతో కృత్రిమ మేధ, సెమీకండక్టర్స్, పరిశుభ్ర ఇంధనం వగైరా రంగాల్లో సహకారం కూడా మరింత బలోపేతం కాగలదు. ఇది సురక్షిత,  విశ్వసనీయ, పునరుత్థాన ప్రపంచ సరఫరా శ్రేణుల నిర్మాణంలోనూ ఇది తోడ్పడుతుంది.
మిత్రులారా!
   రెండు దేశాల మధ్య రక్షణ-భద్రత రంగాల్లో ఇనుమడిస్తున్న సహకారం మన లోతైన పరస్పర విశ్వాసానికి ప్రతిబింబం. ఆంతరంగిక సమాచార మార్పిడిపై ఒప్పందం ఈ దిశగా మరో ముందడుగు. అలాగే ఉగ్రవాదం, వేర్పాటువాద సవాళ్లను ఎదుర్కొనడంలో రెండు దేశాల మధ్య ఈ రోజు కుదిరిన పరస్పర న్యాయ సహాయ ఒప్పందం మన సమష్టి కృషికి మరింత  బలమిస్తుంది.
   అంతేకాకుండా హరిత, సుస్థిర ప్రగతిపై ఉమ్మడి హామీల అమలుకు రెండు దేశాలూ నిరంతరం కృషి చేస్తున్నాయి. తదనుగుణంగా ఈ హరిత-సుస్థిర ప్రగతి భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసేలా ‘‘పట్టణ హరిత రవాణా భాగస్వామ్యం’’ రెండో దశకు అమలుపైనా  మేము అంగీకారానికి వచ్చాం. దీంతోపాటు హరిత ఉదజనిపై భవిష్యత్ ప్రణాళికకూ శ్రీకారం చుట్టాం.
మిత్రులారా!
   ఉక్రెయిన్, పశ్చిమాసియాలో ప్రస్తుత ఘర్షణలు మాకు ఆందోళన కలిగిస్తున్నాయి. యుద్ధంతో ఏ సమస్యా పరిష్కారం కాదన్న సూత్రానికి భారత సదా కట్టుబడి ఉంటుంది. అదే సమయంలో శాంతి పునరుద్ధరణకు వీలైనంత మేర సహకరించేందుకూ సిద్ధంగా ఉంటుంది.
 

   ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ప్రయాణ స్వేచ్ఛ, నిబంధనల అనుసరణకు కట్టుబాటుకు ఉభయ దేశాలూ ఎల్లప్పుడూ సుముఖమే.
   అలాగే 20వ శతాబ్దంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ వేదికలకు ఈ 21వ శతాబ్దపు సవాళ్లను పరిష్కరించగల సామర్థ్యం లేదన్నది మా నిశ్చితాభిప్రాయం. ఆ మేరకు ఐక్యరాజ్య సమితి భద్రత మండలితో సహా వివిధ బహుపాక్షిక సంస్థలలో సంస్కరణలు తప్పనిసరి.
   ఈ దిశగా భారత్-జర్మనీ సంయుక్త కృషిని మేం కొనసాగిస్తాం.
మిత్రులారా!
   మన స్నేహబంధానికి రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలే పునాది. ఈ నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి, వృత్తి విద్యా రంగాల్లో సమష్టి కృషికి మేము నిర్ణయించుకున్నాం. తదనుగుణంగా ఐఐటి-చెన్నై, డ్రెస్‌డెన్ విశ్వవిద్యాలయం మధ్య ఒప్పందంపై సంతకాలు కూడా పూర్తయ్యాయి. తద్వారా ‘డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌’ (ద్వంద్వ పట్టా కోర్సు)ను రెండు దేశాల విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలుగుతారు.
   జర్మనీ పురోగమనం-శ్రేయస్సుకు భారత యువ ప్రతిభ నేడు ఎంతగానో తోడ్పడుతోంది. భారత్ కోసం జర్మనీ ‘‘నైపుణ్య కార్మిక వ్యూహం’’ రూపొందించడం హర్షణీయం. దీని ప్రకారం జర్మనీ ప్రగతికి దోహదపడగలిగేలా మా యువ ప్రతిభావంతులకు సదవకాశాలు లభిస్తాయని నేను నమ్ముతున్నాను. భారత యువత శక్తిసామర్థ్యాలపై చాన్సలర్ షోల్జ్ విశ్వాసం నిజంగా అభినందనీయం.
మహోదయా!
   మీరు మా దేశంలో పర్యటించడం మన రెండు దేశాల భాగస్వామ్యానికి కొత్త ఊపు, ఉత్తేజంతోపాటు మరింత బలాన్నిచ్చింది. మన భాగస్వామం విస్పష్టమైనదని, రెండు దేశాలకూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం.
జర్మనీ భాషలో అలెస్ క్లార్, అలెస్ గట్! (శుభం భూయాత్... సర్వే జనా సుఖినోభవంతు)
ధన్యవాదాలు,
డాంకెషేన్...
 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi