“రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ ప్రగతిలో కీలకపాత్ర”;
“ప్రస్తుత మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో భారత్ తన పాత్రనే కాకుండా స్వీయ ప్రగతి వేగాన్ని కూడా పెంచుకోవాలి” ;
“స్వయం సమృద్ధ – నవ భారత నిర్మాణమే 21వ శతాబ్దంలో అతిపెద్ద లక్ష్యాలు… మీరీ విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి”;
“మీరు సేవలందించే కాలంలో సేవాభావం.. కర్తవ్య నిర్వహణలే మీ వ్యక్తిగత/వృత్తిగత విజయానికి కొలబద్దలుగా ఉండాలి”;
“మీరు అంకెల కోసం కాకుండా ప్రజల కోసం ఏం చేశారన్నదే ముఖ్యం”;
ప్రస్తుత అమృత కాలంలో సంస్కరణలు.. పనితీరు.. పరివర్తనలను మనం తదుపరి స్థాయికి చేర్చాలి; అందుకే ‘సబ్‌ కా ప్రయాస్‌’ స్ఫూర్తితో భారత్‌ ముందుకెళ్తోంది”;
“ఏదో ఒక సులభమైన పనితో సరిపెట్టుకుందామనే యోచన ఎన్నడూ వద్దు”;
“నిశ్చింత స్థాయికి చేరడంపై ఎంతగా యోచిస్తారో అంతగా మీ ప్రగతికేగాక దేశాభివృద్ధికీ మీరే అవరోధం అవుతారు”

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ లాల్‌ బహదూర్‌ శాస్త్రి నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌’ (ఎల్‌బీఎన్‌ఏఏ) ప్రాంగణంలో 96వ ‘కామన్‌ ఫౌండేషన్‌ కోర్సు' ముగింపు కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయన కొత్త క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించడంతోపాటు నవీకరించిన ‘హ్యీపీ వ్యాలీ కాంప్లెక్స్‌’ను జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ- ముందుగా కోర్సు పూర్తి చేసుకున్న అధికారులను అభినందించి, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం శిక్షణ పూర్తిచేసుకున్న బృందానికి ఎంతో విశిష్టత ఉందని, ఆ మేరకు స్వాతంత్ర్య అమృత కాలంలో వారంతా వాస్తవ సేవల్లో ప్రవేశిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా “రాబోయే 25 ఏళ్ల అమృత కాలంలో మీ బృందానిదే దేశ సర్వతోముఖాభివృద్ధిలో కీలకపాత్ర” అని గుర్తుచేశారు.

   మహమ్మారి అనంతరం సరికొత్త ప్రపంచ క్రమం ఆవిష్కరణ గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ 21వ శతాబ్దంలోని ప్రస్తుత కీలక తరుణంలో ప్రపంచం మొత్తం భారత్‌ వైపు చూస్తున్నదని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో “ప్రస్తుత మహమ్మారి అనంతర ప్రపంచ క్రమంలో భారత్ తన పాత్రనే కాకుండా స్వీయ ప్రగతి వేగాన్ని కూడా పెంచుకోవాలి” అని ఉద్బోధించారు. స్వయం సమృద్ధ – నవ భారత నిర్మాణమే ‘21వ శతాబ్దంలో అతిపెద్ద లక్ష్యమ’ని, అమృత కాలంలో దీనికిగల ప్రాధాన్యాన్న్ఇ సదా గుర్తుంచుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. సివిల్ స‌ర్వీసుల‌పై స‌ర్దార్ ప‌టేల్ అభిప్రాయాన్ని ప్ర‌స్తావిస్తూ-  సేవాభావం, కర్త‌వ్య‌ నిర్వహణలే ఈ శిక్ష‌ణ‌లో కీలక అంతర్భాగాలని ప్రధానమంత్రి అన్నారు. “మీరు సేవలందించే కాలంలో సేవాభావం.. కర్తవ్య నిర్వహణలే మీ వ్యక్తిగత/వృత్తిగత విజయానికి కొలబద్దలుగా ఉండాలి” అని దిశానిర్దేశం చేశారు. కర్తవ్య నిబద్ధత, ప్రయోజనాలు ప్రధానంగా పనిచేసే పని ఎన్నడూ భారం కాదని స్పష్టం చేశారు. సమాజంలో, దేశ పరిస్థితుల్లో సానుకూల మార్పు తేవడంలో భాగస్వాములం కావాలనే ధ్యేయంతో సేవ చేస్తున్నామనే భావనను ఎన్నడూ వీడవద్దని అధికారులను కోరారు.

   క్షేత్రస్థాయి నుంచి వచ్చే ఫైళ్ల ద్వారానే సమస్యలపై అసలైన అనుభూతి స్పష్టమవుతుందని, అందువల్ల దీన్నుంచి అనుభవాన్ని పెంచుకోవాలని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఫైళ్లలో ఉండేవి కేవలం సంఖ్యలు, గణాంకాలు కాదని, వాటిలో జీవితాలు, ప్రజాకాంక్షలు ఉంటాయని ఉద్బోధించారు. “మీరు అంకెల కోసం కాకుండా ప్రజల కోసం ఏం చేశారన్నదే ముఖ్యం” అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అధికారులు సదా సమస్యల మూలాల్లోకి వెళ్లి,  సముచిత పరిష్కారం దిశగా నిబంధనలను సహేతుకంగా ప్రయోగించాలని సూచించారు. ప్రస్తుత అమృత కాలంలో సంస్కరణలు.. పనితీరు.. పరివర్తనలను మనం తదుపరి స్థాయికి చేర్చాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. అందుకే ‘సబ్‌ కా ప్రయాస్’ స్ఫూర్తితో భారత్ ముందుకెళ్తోందని చెప్పారు. దేశంలోని చివరి వరుసలో చిట్టచివరి వ్యక్తి సంక్షేమం ప్రాతిపదికగా ప్రతి నిర్ణయం ఫలితాలను బేరీజు వేసుకోవాలంటూ మహాత్మాగాంధీ ప్రబోధించిన తారకమంత్రాన్ని ఆయన గుర్తుచేశారు.

   అధికారులందరూ తమతమ జిల్లాల్లోని స్థానిక స్థాయిలో 5-6 ప్రధాన సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం దిశగా అధికారులు కృషి చేయాలని ప్రధానమంత్రి నిర్దేశం చేశారు. సవాళ్లను పరిష్కరించడంలో మొదట వాటిని గుర్తించడం తొలి అడుగని పేర్కొన్నారు. ఈ మేరకు పేదలకు పక్కా ఇళ్లు, విద్యుత్‌ కనెక్షన్లకు సంబంధించిన సవాళ్లను ప్రభుత్వం గుర్తించి పరిష్కరించడాన్ని ఆయన ఉదాహరించారు. ఇందుకోసం ‘పీఎం ఆవాస్‌ యోజన, సౌభాగ్య పథకం, ప్రగతికాముక జిల్లాల పథకం’ వంటివాటిని అమలు చేసినట్లు గుర్తుచేశారు. ఈ పథకాల ద్వారా సంపూర్ణ సంతృప్త స్థాయిని సాధించాలని లక్ష్య నిర్దేశం చేసుకున్నామని తెలిపారు. వివిధ మౌలిక వసతుల ప్రాజెక్టులపై సమన్వయం పెంచుకోవాల్సి ఉందని ఆయన నొక్కిచెప్పారు. ఈ దిశగా ‘పీఎం గతిశక్తి’ ప్రణాళిక చాలావరకూ తోడ్పడగలదన్నారు.

   సివిల్‌ సర్వీసులలో కొత్త సంస్కరణలైన "మిషన్‌ కర్మయోగి, ఆరంభ్‌” కార్యక్రమాల గురించి ప్రధాని ప్రస్తావించారు. ఏదో ఒక సులభమైన పనితో సరిపెట్టుకుందామనే యోచన అధికారులు ఎన్నడూ చేయరాదని ప్రధానమంత్రి అన్నారు. సవాలుతో కూడుకున్న పనిని దిగ్విజయంగా పూర్తిచేయడంలో ఉన్న ఆనందం మరెందులోనూ కలగలదని చెప్పారు. “నిశ్చింత స్థాయికి చేరడంపై మీరెంతగా యోచిస్తారో అంతగా మీ వ్యక్తిగత ప్రగతికేగాక దేశాభివృద్ధికీ సాక్షాత్తూ మీరే ఆటంకాలుగా పరిణమిస్తారు” అని ప్రధాని స్పష్టం చేశారు. అకాడమీని వదిలి వెళ్లేముందు  అధికారులంతా తమ ఆకాంక్షలను, ప్రణాళికలను జాగ్రత్తగా నమోదు చేసిపెట్టుకోవాలని ప్రధానమంత్రి సూచించారు. అటుపైన 25 లేదా 50 ఏళ్ల తర్వాత వాటిలో తమ విజయాల స్థాయిని బేరీజు వేసుకోవాలని కోరారు. భవిష్యత్‌ సమస్యల పరిష్కారంలో డేటా సైన్స్‌ సంబంధిత మార్గాలు, సామర్థ్యం అవసరమవుతాయని ఆయన అన్నారు. ఈ మేరకు కృత్రిమ మేధస్సు సంబంధిత కోర్సులను పాఠ్యప్రణాళికలో చేర్చాలని, అందుకు తగిన వనరులు సమీకరించుకోవాలని కోరారు.

   కాగా, 96వ ఫౌండేషన్ కోర్సు అన్నది మిషన్ కర్మయోగి సూత్రాల ప్రాతిపదికన ‘ఎల్‌బీఎన్‌ఏఏ’లో సరికొత్త బోధన-కోర్సు రూపకల్పనతో ‘ఎల్‌బీఎన్‌ఏఏ’లో ప్రవేశపెట్టిన తొలి కామన్ ఫౌండేషన్ కోర్సు. ఇందులో శిక్షణకు ఎంపికైన తొలి బృందంలో 3 రాయల్‌ భూటాన్‌ సర్వీసులు (పాలన, పోలీసు, అటవీ), 16 ఇతర సర్వీసుల నుంచి 488 మంది శిక్షణార్థి అధికారులున్నారు. ఈ యువ బృందం సాహసోపేత, ఆవిష్కరణ స్ఫూర్తిని సద్వినియోగం చేసుకునే దిశగా మిషన్‌ కర్మయోగి సూత్రాల ఆధారంగా కొత్త శిక్షణ కోర్సును రూపొందించారు. ఆ మేరకు విద్యార్థి/పౌరుడు స్థాయినుంచి శిక్షణార్థి అధికారులను ప్రజా సేవకులుగా పరిణతి సాధించే దిశగా తీసుకెళ్లడానికి ఇందులో ప్రాముఖ్యం ఇవ్వబడింది. ఇందులో భాగంగా ‘సబ్‌ కా ప్రయాస్‌’ స్ఫూర్తిని వారికి అవగతం చేయడం కోసం పద్మా అవార్డు గ్రహీతలతో ఇష్టాగోష్ఠులు, గ్రామీణ భారతంపై సంలీనపూర్వక గ్రామ సందర్శనలు వంటివి నిర్వహించబడ్డాయి. అలాగే దేశ సరిహద్దుల్లోని దుర్గమ ప్రాంతాల్లో నివసించే ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి వీలుగా మారుమూల గ్రామాల సందర్శనకు కూడా శిక్షణార్థి అధికారులను తీసుకెళ్లారు. నిరంతర అంచెలవారీ అభ్యాసం, స్వీయమార్గదర్శక అభ్యాస సూత్రాలకు అనుగుణంగా పాఠ్యాంశ నిర్మాణంలో మాడ్యులర్‌ ప్రక్రియ అనుసరించబడింది. మరోవైపు పరీక్షల భారం మోసే విద్యార్థి దశ నుంచి ఆరోగ్యవంతులైన యువ సివిల్‌ సర్వెంట్‌గా రూపాంతరం చెందడంలో తోడ్పాటు దిశగా ఆరోగ్య, శరీర దారుఢ్య పరీక్షలు కూడా వారికి నిర్వహించబడ్డాయి. ఇవే కాకుండా మొత్తం 488 మంది శిక్షణార్థి అధికారులకు ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ శైలి “క్రవ్‌ మాగ” క్రీడతోపాటు ఇతరత్రా క్రీడల్లోనూ శిక్షణ ఇవ్వబడింది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi