ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజాస్వామ్యంపై శిఖరాగ్ర సదస్సు’లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య దేశాల మధ్య అనుభవాల ఆదానప్రదానానికి ఈ సదస్సు ఓ కీలక వేదికని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై భారత్ నిబద్ధత ఎంతో లోతైనదని పునరుద్ఘాటిస్తూ- ‘‘భారతదేశానిది అత్యంత ప్రాచీన, నిరంతరాయ ప్రజాస్వామ్య సంస్కృతి. భారతీయ నాగరికతకు జీవనాడి అదే’’నని స్పష్టం చేశారు. అలాగే ‘‘ఏకాభిప్రాయ సాధన, బహిరంగ చర్చ, స్వేచ్ఛాయుత సంప్రదింపులు భారతదేశ చరిత్ర అంతటా కనిపిస్తాయి. అందువల్లనే నా సహ పౌరులు భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా పరిగణిస్తారు’’ అని నొక్కిచెప్పారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘భారత్ నేడు తన 140 కోట్ల జనాభా ఆకాంక్షలను నెరవేర్చడమేగాక ప్రజాస్వామ్య మనుగడతోపాటు తన సాధికారత కల్పన శక్తిపై ప్రపంచానికిగల ఆశాభావాన్ని నిలబెట్టుకుంటోంది’’ అని పేర్కొన్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య బలోపేతంలో భారత్ కీలక పాత్రను ప్రధాని గుర్తుచేశారు. ఈ మేరకు కోవిడ్-19 మహమ్మారి సమయంలో అంతర్జాతీయ సహాయం అందించడంసహా మహిళల ప్రాతినిధ్యం పెంపు దిశగా చట్టం చేయడం, పేదరిక నిర్మూలన కృషి తదితరాలను ఆయన ఉదాహరించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం కోసం ప్రజాస్వామ్య దేశాలన్నిటి మధ్య పరస్పర సహకారం అవశ్యమని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ వ్యవస్థలు-సంస్థలలో సార్వజనీనత, న్యాయబద్ధత, భాగస్వామ్య నిర్ణయాత్మకతల అవసరాన్ని ఆయన ప్రస్ఫుటం చేశారు.
ముఖ్యంగా ‘‘ప్రస్తుత సంక్షుభిత, పరివర్తనాత్మక శకంలో ప్రజాస్వామ్యానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. కాబట్టి వాటి పరిష్కారానికి మనమంతా సమష్టిగా కృషి చేయాలి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తదనుగుణంగా ‘‘ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలతో తన అనుభవాలను పంచుకోవడానికి భారత్ సదా సిద్ధంగా ఉంటుంది’’ అని ఆయన ప్రకటించారు.