“భారత 75 ఏళ్ల పార్లమెంటరీ పయనంపై సంస్మరణకు.. సింహావలోకనానికి ఈ రోజు సందర్భం కలసివచ్చింది”;
“భారత ప్రజాస్వామ్య పయనంలో మనం కొత్త సౌధంలోకి మారడం ఒక సువర్ణాధ్యాయమే.. కానీ- పాత భవనం భవిష్యత్తరానికి స్ఫూర్తినిస్తుంది”;
“అమృత కాల ఉషోదయంలో కొత్త విశ్వాసం.. విజయాలు.. సామర్థ్యాలు మనలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాయి”;
“భారత్‌ జి-20 అధ్యక్ష బాధ్యత నిర్వర్తిస్తున్న వేళ ఈ కూటమిలో ఆఫ్రికా సమాఖ్యకు సభ్యత్వం కల్పించడం దేశానికి గర్వకారణం ”;
“జి-20కి అధ్యక్షత నేపథ్యంలో భారత్‌ ‘విశ్వమిత్రుడు’గా అవతరించింది”;
“సభలో సార్వజనీన వాతావరణం ప్రజాకాంక్షలను సంపూర్ణంగా ప్రతిబింబిస్తోంది”;
“సామాన్య పౌరులలో పార్లమెంటుపై విశ్వాసం నిరంతరం పెరగడమే ఈ 75 ఏళ్లలో సిద్ధించిన అతిపెద్ద విజయం”;
“పార్లమెంటుపై ఉగ్రవాద దుశ్చర్య భారతదేశ జీవాత్మపైనే దాడి”;
“భారత ప్రజాస్వామ్యంలో ఎన్నో ఒడుదొడుకులు చూసిన మన సభ ప్రజా విశ్వాసానికి కేంద్ర బిందువుగా నిలిచింది”;

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రసంగించారు. ఈ ప్రత్యేక సమావేశాలు 2023 సెప్టెంబరు 22వ తేదీవరకూ కొనసాగుతాయి. సభా వ్యవహారాలు త్వరలో కొత్త సౌధంలోకి మారనున్న నేపథ్యంలో భారత 75 ఏళ్ల పార్లమెంటరీ పయనంపై సంస్మరణకు, సింహావలోకనానికి ఈ రోజు ఒక సందర్భంగా కలసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు పాత భవనం గురించి ప్రస్తావిస్తూ- మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది ‘ఇంపీరియల్‌ లెజిస్లేటివ్‌ కౌన్సిల్‌’గా వ్యవహరించబడేదని ప్రధాని గుర్తుచేశారు.

   ఈ భవనం స్థానంలో కొత్త సౌధం నిర్మాణానికి విదేశీ పాలకులే నిర్ణయం తీసుకున్నప్పటికీ, భారతీయులు అంకితభావంతో కఠోర శ్రమ, ధనం, సమయం వెచ్చించి దీన్ని సాకారం చేశారని పేర్కొన్నారు. ఈ 75 ఏళ్ల ప్రజాస్వామ్య ప్రయాణంలో ఈ సభ అందరి సహకారంతో, అందరి సమక్షంలో అత్యుత్తమ రీతిలో సమావేశాలు నిర్వహించి, వినూత్న సంప్రదాయాలు సృష్టించిందని శ్రీ మోదీ అన్నారు. “భారత ప్రజాస్వామ్య పయనంలో మనం కొత్త సౌధంలోకి మారడం ఒక సువర్ణాధ్యాయమే... కానీ, పాత భవనం భవిష్యత్తరానికి స్ఫూర్తినిస్తుంది” అని ఆయన వ్యాఖ్యానించారు. అమృత కాల ఉషోదయంలో కొత్త విశ్వాసం, విజయాలు, సామర్థ్యాలు మనలో ఆత్మవిశ్వాసం నింపుతున్నాయని ప్రధాని వ్యాఖ్యానించారు. అలాగే భారతదేశం, భారతీయులు సాధించిన విజయాల గురించి ప్రపంచం నేడు చర్చించుకోవడాన్ని గుర్తుచేశారు. ఇది మన 75 ఏళ్ల పార్లమెంటు సమష్టి కృషి ఫలితమేనని ఆయన పేర్కొన్నారు.

   చంద్రయాన్‌-3 విజయాన్ని ప్రస్తావిస్తూ… భారతదేశ సామర్థ్యాల్లోని మరో కొత్త కొణాన్ని ఇది ప్రస్ఫుటం చేసిందని శ్రీ మోదీ అన్నారు. ఈ సామర్థ్యం ఆధునికత, శాస్త్రవిజ్ఞానం, సాంకేతికత, మన శాస్త్రవేత్తల ప్రతిభ, 140 కోట్లమంది భారతీయుల శక్తితో ముడిపడిన విజయమని పేర్కొన్నారు. శాస్త్రవేత్తల విజయంపై పార్లమెంటుతోపాటు ప్రజల అభినందనలను ప్రధానమంత్రి సభాముఖంగా తెలిపారు. లోగడ ‘అలీన ఉద్యమం’ (నామ్) శిఖరాగ్ర సదస్సు సందర్భంగా దేశం చేసిన కృషిని సభ ఎలా ప్రశంసించిందీ ప్రధానమంత్రి గుర్తుచేశారు. అదేవిధంగా జి-20 అధ్యక్ష బాధ్యత నిర్వహణలో దేశం సాధించిన విజయానికీ గుర్తింపు లభించడంపై కృతజ్ఞతలు తెలిపారు. అయితే, జి-20 విజయం 140 కోట్ల మంది భారతీయులదే తప్ప ఎవరో ఒక వ్యక్తిదో.. ఏదైనా పార్టీదో కాదని స్పష్టం చేశారు. దేశంలోని 60కిపైగా ప్రదేశాల్లో 200కు మించి కార్యక్రమాల నిర్వహణ విజయవంతం కావడం భారత వైవిధ్యం సాధించిన విజయానికి నిదర్శనమని నొక్కిచెప్పారు. అలాగే “భారత్‌ జి-20 అధ్యక్ష బాధ్యతల సమయాన ఈ కూటమిలో ఆఫ్రికా సమాఖ్యకు సభ్యత్వం కల్పించడం దేశానికి గర్వకారణం” అని వ్యాఖ్యానించారు.

   భారతదేశ సామర్థ్యంపై సందేహాలు లేవనెత్తే కొన్ని శక్తుల ధోరణికి భిన్నంగా జి-20 శిఖరాగ్ర సదస్సు తీర్మానంపై ఏకాభిప్రాయం సాధించడంసహా భవిష్యత్‌ ప్రణాళిక కూడా సిద్ధం కావడాన్ని ప్రధాని ఉదాహరించారు. జి-20 అధ్యక్షత నవంబరు ఆఖరుదాకా కొనసాగనున్నదని గుర్తుచేస్తూ, ఈ సమయాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని దేశం భావిస్తున్నట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో పి-20 (పార్లమెంటరీ 20) శిఖరాగ్ర సదస్సు నిర్వహించాలన్న సభాపతి ప్రతిపాదనకు ఆయన మద్దతు తెలిపారు. ఇక “విశ్వ మిత్రుడు’గా  భారత్‌ తనదైన స్థానాన్ని ఏర్పరచుకోవడం, తదనుగుణంగా యావత్‌ ప్రపంచం భారత్‌లో తమ స్నేహితుడిని చూడటం అందరికీ గర్వకారణం. వేదాల నుంచి వివేకానందుని దాకా లభించిన మన ‘సంస్కారాలే’ దీనికి కారణం. అలాగే ‘సబ్‌ కా సాథ్.. సబ్‌ కా వికాస్’ మంత్రం ప్రపంచం మనతో నడిపించేలా మనల్ని ఏకం చేస్తోంది” అని వివరించారు.

   పాత పార్లమెంటు భవనానికి వీడ్కోలు పలికే ఉద్వేగ క్షణాన్ని ఓ కుటుంబం కొత్త ఇంటికి మారడంతో ప్రధానమంత్రి పోల్చారు. ఇన్నేళ్లుగా సమావేశాల్లో ప్రతిఫలించిన వివిధ రకాల మనోభావాలకు ఈ సభ సాక్షిగా నిలిచిందని, ఇక్కడి జ్ఞాపకాలు సభా సభ్యులందరికీ సంక్రమించిన వారసత్వమని అన్నారు. “దీని వైభవం, కీర్తి కూడా మనకే చెందుతాయి”  అన్నారు. ఈ పార్లమెంటు భవనం 75 ఏళ్ల చరిత్రలో నవ భారతం నిర్మాణం దిశగా లెక్కలేనన్ని సందర్భాలను దేశం చూసిందన్నారు. ఈ క్రమంలో సామాన్య భారత పౌరులపట్ల గౌరవం వ్యక్తం చేసే అవకాశం లభించిందని ఆయన వ్యాఖ్యానించారు. పార్లమెంటు సభ్యుడిగా తాను తొలిసారి సభలో పాదం మోపే ముందు ఈ భవనానికి శిరసాభివందనం చేయడాన్ని ప్రధాని గుర్తుచేసుకున్నారు. అది తానెన్నడూ ఊహించని ఒక ఉద్వేగభరిత క్షణమన్నారు.  “రైల్వే స్టేషన్‌లో జీవనోపాధి వెదుక్కున్న పేద బాలుడు పార్లమెంటు మెట్లెక్కడం భారత ప్రజాస్వామ్యానికిగల శక్తికి నిదర్శనం. ఈ దేశం నాకింత ప్రేమ, గౌరవం, ఆశీర్వాదాలు ఇస్తుందని నేనెన్నడూ ఊహించలేదు” అన్నారు.

   పార్లమెంటు ద్వారంపై చెక్కిన ఉపనిషత్ వాక్యాన్ని ఉటంకిస్తూ- ప్రజల కోసం ద్వారాలు తెరచి, వారికి హక్కులు ఎలా దఖలు పరచాలో చూడాలని మన మహర్షులు ప్రబోధించినట్లు ప్రధాని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యానం సరైనదేననడానికి సభలోని ప్రస్తుత, గతకాలపు సభ్యులే సాక్షులని శ్రీ మోదీ అన్నారు. కాలం గడిచేకొద్దీ సభ మరింతగా అందరినీ కలగలుపుకుంటూ వెళ్లాలన్నారు. అదే సమయంలో సమాజంలోని అన్ని వర్గాలకూ సభలో ప్రాతినిధ్యం లభించడం కూర్పులో మార్పును స్పష్టం చేస్తున్నదని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఆ మేరకు “సభలో సార్వజనీన వాతావరణం ప్రజాకాంక్షలను సంపూర్ణంగా ప్రతిబింబిస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు. సభ గౌరవాన్ని ఇనుమడింప చేయడంలో తమవంతు పాత్ర పోషించిన మహిళా పార్లమెంటేరియన్ల సహకారాన్ని ఆయన ప్రశంసించారు.

   పార్లమెంటు ఉభయసభలలో 7,500 మంది ప్రజా ప్రతినిధులు తమ సేవలందించగా వారిలో సుమారు 600 మంది మహిళలున్నారని ప్రధాని రేఖామాత్రంగా వివరించారు. వీరిలో శ్రీ ఇంద్రజిత్ గుప్తా దాదాపు 43 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడుగా ఉన్నారని, అలాగే శ్రీ షఫీక్‌-ఉర్ రెహ్మాన్ 93 ఏళ్ల వయసులోనూ ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. ఇక శ్రీమతి చంద్రాణి ముర్ము 25 ఏళ్ల పిన్న వయసులో సభకు ఎన్నికయ్యారని పేర్కొన్నారు. వాదోపవాదాలు, వ్యంగ్యాస్త్ర విన్యాసం తదితరాలు ఎన్ని ఉన్నప్పటికీ సభలో ఎల్లప్పుడూ కుటుంబ భావన మెదిలేదని, చేదు జ్ఞాపకాలు ఎక్కువ కాలం ఉండేవి కావని ప్రధాని వ్యాఖ్యానించారు. కరోనా మహమ్మారి కాలం సహా వివిధ సందర్భాల్లో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ సభలో తమ కర్తవ్య నిర్వహణకు సభ్యులెన్నడూ వెనుకాడలేదని ప్రశంసించారు.

   స్వాతంత్ర్య సిద్ధించిన తొలినాళ్లలో ఈ కొత్త దేశం మనుగడపై కొన్ని సందేహాలు పొడసూపినా పార్లమెంటు దృఢ సంకల్పంతో అవన్నీ పటాపంచలయ్యాయని ప్రధానమంత్రి గుర్తుచేశారు. రాజ్యాంగ సభ ఇదే భవనంలో ఏకధాటిగా 2 సంవత్సరాల 11 నెలలు సమావేశం కావడంతోపాటు రాజ్యాంగాన్ని ఆమోదించడాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో “సామాన్య పౌరులలో పార్లమెంటుపై విశ్వాసం నిరంతరం ఇనుమడిస్తూ రావడమే ఈ 75 ఏళ్లలో సాధించిన అతిపెద్ద విజయం” అని ప్రధాని అభివర్ణించారు. అలాగే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, డాక్టర్ కలాం వంటి వారినుంచి శ్రీ రామ్‌నాథ్ కోవింద్, శ్రీమతి ద్రౌపది ముర్ముదాకా రాష్ట్రపతుల ప్రసంగాలతో సభ ఎంతో ప్రయోజనం పొందిందని ఆయన గుర్తుచేశారు.

   పండిట్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి కాలం నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి-మన్మోహన్ సింగ్‌ వంటి ప్రధానమంత్రుల హయాంను ప్రస్తావిస్తూ- వారు దేశానికి కొత్త దిశార్దేశం చేశారని పేర్కొన్నారు. వారి విజయాలను ఇవాళ సభలో ప్రముఖంగా ప్రస్తావించే అవకాశం లభించిందని ప్రధాని అన్నారు. సభలో చర్చలను సుసంపన్నం చేసిన, సామాన్య పౌరుల గళాన్ని బలంగా వినిపించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, రామ్ మనోహర్ లోహియా, చంద్రశేఖర్, లాల్ కృష్ణ ఆడ్వానీ తదితరుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. భారతదేశంపై తమ గౌరవాన్ని చాటుకుంటూ వివిధ దేశాల నాయకులు సభలో ప్రసంగించడాన్ని కూడా శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే పదవీ బాధ్యతల్లో ఉండగానే ముగ్గురు ప్రధానమంత్రులు నెహ్రూ, శాస్త్రి, ఇందిర కీర్తిశేషులైన సందర్భాల్లో దేశం అనుభవించిన వేదనను గుర్తుచేశారు.

   అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ తమ చాకచక్యంతో సభను సజావుగా నడిపిన సభాపతులను ప్రధానమంత్రి గుర్తుకుతెచ్చారు. సముచిత నిర్ణయాల ద్వారా వాటిని భవిష్యత్‌ అనుసరణీయ అంశాలుగా రూపుదిద్దారని చెప్పారు. శ్రీ మౌలంకర్ నుంచి శ్రీమతి సుమిత్రా మహాజన్.. శ్రీ ఓం బిర్లా వరకూ ఇద్దరు మహిళలు సహా 17 మంది సభాపతులు ప్రతి ఒక్కరినీ తమ వెంట నడిపించారని గుర్తుచేసుకున్నారు. అలాగే సభా నిర్వహణలో పార్ల‌మెంట్ సిబ్బంది స‌హ‌కారాన్ని కూడా ప్ర‌ధాని కొనియాడారు. పార్లమెంట్‌పై ఉగ్రదాడిని గుర్తుచేస్తూ, ఇది సభా భవనంపై దుశ్చర్య కాదని, ప్రజాస్వామ్య జీవాత్మపైనే దాడి అని పేర్కొన్నారు. “ఇది భారత జీవాత్మపైనే దాడి” అని స్పష్టం చేశారు. ఆనాడు సభ్యుల రక్షణ కోసం ఉగ్రవాదులకు-సభకు మధ్య ప్రాణాలొడ్డి నిలిచిన వారి సాహసాన్ని, త్యాగాన్ని ప్రశంసిస్తూ నివాళి అర్పించారు.

   పార్లమెంటు సమావేశాల వివరాలను ప్రజలకు అందించడంలో వృత్తి ధర్మానికి అంకితమైన పాత్రికేయుల పాత్రను కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేని ఆ రోజుల్లో ఈ బాధ్యతల నిర్వహణ ఎంతో క్లిష్టమైనదని వివరించారు. పాత పార్లమెంటుకు వీడ్కోలు పలకడం వారికి మరింత మనోభారం కలిగించవచ్చునని ఆయన పేర్కొన్నారు. వారు సభ్యులకన్నా వ్యవస్థతోనే ఎక్కువగా ముడిపడి ఉండటమే ఇందుకు కారణమని అన్నారు. నాద బ్రహ్మం సంప్రదాయం గురించి వివరిస్తూ- పరిసరాల్లోని నిరంతర మంత్రోచ్చారణతో ఒక ప్రదేశం తీర్థయాత్ర స్థలంగా మారినట్లు, ఈ భవనంలో చర్చలు ఆగినా 7500 మంది సభ్యుల గళం ప్రతిధ్వనులు పార్లమెంటును యాత్రా స్థలంగా మారుస్తాయని ప్రధాని అన్నారు.

   “ఈ పార్లమెంటు భవనంలోనే భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ తమ ధైర్యసాహసాలతో బ్రిటిష్ వారిని భయభ్రాంతులకు గురిచేశారు” అని ప్రధాని వ్యాఖ్యానించారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రచించిన ‘స్ట్రోక్‌ ఆఫ్ మిడ్‌నైట్’ ప్రతిధ్వని దేశంలోని ప్రతి పౌరుడికీ సదా స్ఫూర్తినిస్తూనే ఉంటుందన్నారు. అతను అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసిద్ధ ప్రసంగాన్ని ఉటంకిస్తూ- “ప్రభుత్వాలు వస్తుంటాయి.. పోతుంటాయి; పార్టీలు పుడతాయి.. గిడతాయి; కానీ, ఈ దేశం చిరంజీవిగా ఉండాలి… ప్రజాస్వామ్యం కలకాలం వర్ధిల్లాలి” అన్నారు. దేశానికి తొలి మంత్రిమండలిని గుర్తుచేసుకుంటూ- బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచవ్యాప్తంగా గల ఉత్తమ విధానాలను ఎలా క్రోడీకరించారో శ్రీ మోదీ ప్రస్తావించారు. ఇందులో భాగంగా నెహ్రూ మంత్రిమండలిలో బాబా సాహెబ్ రూపొందించిన అద్భుత జల విధానాన్ని కూడా ఆయన ఉటంకించారు. అలాగే దళితుల సాధికారత, పారిశ్రామికీకరణ అంశాన్ని కూడా బాబా సాహెబ్ నొక్కిచెప్పడాన్ని గుర్తుచేశారు. అలాగే తొలి పరిశ్రమల శాఖ మంత్రిగా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ తొలి పారిశ్రామిక విధానాన్ని ఎలా రూపొందించారో కూడా ప్రధాని ప్రస్తావించారు.

   లాల్ బహదూర్ శాస్త్రి 1965నాటి యుద్ధం సందర్భంగా భారత సైనికులలో స్ఫూర్తి నింపింది ఈ సభలోనేనని ప్రధాని గుర్తుచేశారు. ఆయన వేసిన హరిత విప్లవ పునాదుల గురించి కూడా ప్రస్తావించారు. బంగ్లాదేశ్ విముక్తిలో భాగంగా జరిగిన యుద్ధం కూడా శ్రీమతి ఇందిరా గాంధీ నాయకత్వంలో ఈ సభ నుంచి వెలువడిన నిర్ణయం ఫలితమేనని ఆయన వివరించారు. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యంపై దాడిని, అది రద్దయ్యాక ప్రజాశక్తి పునరుజ్జీవనాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. ఇక నాటి ప్ర‌ధాని చ‌ర‌ణ్ సింగ్ నేతృత్వంలో గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తొలిసారి ఏర్పాటు కావడాన్ని ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావించారు. “ఓటు హక్కు వయో పరిమితిని 21 నుంచి 18 ఏళ్లకు తగ్గించింది కూడా ఈ సభా మందిరంలోనే” అని నొక్కిచెప్పారు. దేశం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా పి.వి.నరసింహారావు నేతృత్వాన దేశం సరికొత్త ఆర్థిక విధానాలు, చర్యలు చేపట్టిందని గుర్తుచేశారు. అటల్ జీ హయాంలో ‘సర్వశిక్షా అభియాన్’కు శ్రీకారం చుట్టడం, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటుసహా భారత అణుశకానికి నాంది పలకడం గురించి కూడా ప్రస్తావించారు. మరోవైపు ‘ఓటుకు నోటు’ కుంభకోణాన్ని కూడా శ్రీ మోదీ స్పృశించారు.

   దశాబ్దాలపాటు మూలపడిన చరిత్రాత్మక నిర్ణయాలను సాకారం చేయడాన్ని ప్రస్తావిస్తూ-  ఆర్టికల్ 370, జిఎస్‌టి, ఒఆర్‌ఒపి, పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ వంటి అంశాలను ప్రధాని వివరించారు. ఈ సభ ప్రజల విశ్వాసానికి సాక్షి అని, ప్రజాస్వామ్యంలో అనేక ఒడుదొడుకుల మధ్య ఆ విశ్వాసమే కీలకంగా నిలిచిందని ప్రధాని అన్నారు. అటల్ బిహారీ ప్రభుత్వం ఒక్క ఓటుతో పతనమైన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి పార్టీల ఆవిర్భావాన్ని కూడా ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అటల్‌ జీ నాయకత్వాన మూడు కొత్త రాష్ట్రాలు… ఛత్తీస్‌గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్‌ ఏర్పాటును కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు. అయితే, తెలంగాణ ఏర్పాటు సందర్భంగా అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నాలు జరగడంపై విచారం వ్యక్తం చేశారు. ఈ దురుద్దేశంతో విభజన జరగడం వల్లనే రెండు రాష్ట్రాల్లోనూ సంతోషం కనిపించలేదని ఆయన పేర్కొన్నారు.

   రాజ్యాంగ సభ తన దినభత్యాన్ని తగ్గించుకోవడంతోపాటు సభ్యులకు క్యాంటీన్‌ సబ్సిడీలను సభ రద్దుచేయడాన్ని శ్రీ మోదీ గుర్తుచేసుకున్నారు. అలాగే, సభ్యులు తమ ‘ఎంపీల్యాడ్‌’ నిధులతో మహమ్మారి సమయంలో దేశానికి చేయూతనివ్వడానికి ముందుకొచ్చారని తెలిపారు. అంతేకాకుండా తమ వేతనంలో 30 శాతం కోత పెట్టుకున్నారని గుర్తుచేశారు. అలాగే ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పుల ద్వారా సభ్యులు తమపై క్రమశిక్షణను తామే విధించుకున్నారని వివరించారు. పాత భవనానికి రేపు వీడ్కోలు పలుకుతామని ప్రస్తావిస్తూ, ప్రస్తుత సభలోని సభ్యులకు భవిష్యత్తుతో గతానికి సంధానకర్తలుగా మారే అవకాశం లభించడం అదృష్టమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. “పార్లమెంటు నాలుగు గోడల మధ్య  స్ఫూర్తి పొందిన 7500 మంది ప్రతినిధులకు ఈ సందర్భం గర్వకారణం” అని శ్రీ మోదీ అన్నారు.

   చివరగా- సభ్యులు ఇనుమడించిన ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో కొత్త సౌధానికి తరలి వెళ్లగలరని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. సుహృద్భావ వాతావరణంలో సభ సంబంధిత చారిత్రక ఘట్టాలను స్మరించుకునే అవకాశం ఇచ్చినందుకు సభాపతికి ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రసంగం ముగించారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi