ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదికైన ఇన్ఫినిటీ ఫోరమ్ రెండో సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్’ సిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ ఇతివృత్తంగా ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 సమావేశం ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- 2021 డిసెంబరులో ఇన్ఫినిటీ ఫోరమ్ తొలి సదస్సు సమయంలో మహమ్మారి ప్రభావిత ప్రపంచం ఆర్థిక అనిశ్చితితో దెబ్బతిన్నదని గుర్తు చేసుకున్నారు. ఆనాటి ఆందోళనకర పరిస్థితులు ఇంకా పూర్తిగా సమసిపోలేదని పేర్కొన్నారు. దీనికితోడు నేటి భౌగోళిక- రాజకీయ ఉద్రిక్తతలు, అధికస్థాయి ద్రవ్యోల్బణం, పెరుగుతున్న రుణభారం వంటి సవాళ్లు పీడిస్తున్నా పునరుత్థానం, పురోగమనానికి చిహ్నంగా భారత్ ఆవిర్భవించిందని ప్రధాని ప్రముఖంగా వివరించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని గిఫ్ట్ సిటీలో నిర్వహించడం ద్వారా గుజరాత్ ప్రభుత్వ ప్రతిష్ట కొత్త శిఖరాలకు చేరుతున్నదని పేర్కొన్నారు. గుజరాత్ సొంతమైన ‘గర్బా’ నాట్యం యునెస్కో అదృశ్య సాంస్కృతిక వారసత్వ సంపద జాబితాలో స్థానం పొందిన సందర్భంగా రాష్ట్ర ప్రజలను ప్రధాని అభినందించారు. ‘‘గుజరాత్ విజయం యావద్దేశానికీ విజయం’’ అని వ్యాఖ్యానించారు.
దేశంలో విధానాలు, సుపరిపాలన, పౌర సంక్షేమం వగైరాలకు ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యమిచ్చిన ఫలితంగానే వృద్ధి పథంలో భారత పురోగమనం సాధ్యమైందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. గత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో భారత వృద్ధి 7.7 శాతంగా నమోదైందని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది (2023) ప్రపంచ వృద్ధి 16 శాతంగా నమోదైతే, అందులో భారత్ వాటా గణనీయ స్థాయిలో ఉన్నట్లు అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రకటించడాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ‘‘అంతర్జాతీయ సవాళ్ల నడుమ భారత ఆర్థిక వ్యవస్థపై అంచనాలు అత్యధిక స్థాయిలో ఉన్నాయి’’ అని ప్రపంచ బ్యాంకు పేర్కొనడాన్ని ఆయన ఉటంకించారు. దక్షిణార్థ గోళ దేశాలకు భారత నాయకత్వం కీలకమని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ప్రకటించడాన్ని కూడా శ్రీ మోదీ గుర్తుచేశారు. అదేవిధంగా అనవసర ఆలస్యం జాఢ్యంపై నియంత్రణతో భారతదేశంలో పెట్టుబడి అవకాశాలు మెరుగుపడ్డాయని ప్రపంచ ఆర్థిక వేదిక వ్యాఖ్యానించడాన్ని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. నానాటికీ బలపడుతున్న ఆర్థిక వ్యవస్థ, దశాబ్దం నుంచీ అమలవుతున్న పరివర్తనాత్మక సంస్కరణల వల్ల భారతదేశం ప్రపంచానికి ఆశాకిరణంగా మారిందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ప్రపంచంలోని ఇతర దేశాలు ఆర్థిక-ద్రవ్యపరమైన ఊరటపై దృష్టి సారించిన వేళ దీర్ఘకాలిక వృద్ధి-ఆర్థిక సామర్థ్య విస్తరణపై దృష్టి సారించిన ఘనత మన దేశానికే దక్కిందని వ్యాఖ్యానించారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ఏకీకరణ పెంపు లక్ష్యం గురించి ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఈ దిశగా సాధించిన విజయాలకు అనేక రంగాల్లో సానుకూల ‘ఎఫ్‌డిఐ’ విధానం, సమ్మతి భారంనుంచి ఊరట వంటి చర్యలుసహా ఇవాళ 3 ‘ఎఫ్‌టిఎ’లపై సంతకాలు చేయడం వంటివి దోహదం చేశాయని వివరించారు. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సిఎ’ అన్నది భారత-ప్రపంచ ఆర్థిక విపణులను ఏకీకృతం చేసే ఓ కీలక సంస్కరణలో భాగమని ఆయన చెప్పారు. కాబట్టే ‘‘అంతర్జాతీయ ఆర్థిక రంగ నేపథ్యాన్ని పునర్నిర్వచించే గతిశీల పర్యావరణ వ్యవస్థగా గిఫ్ట్ సిటీ పరిగణించబడుతోంది’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఇది ఆవిష్కరణ, సామర్థ్యం, ప్రపంచ సహకారం సంబంధిత అంశాల్లో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని స్సష్టం చేశారు. ఏకీకృత నియంత్రణ వ్యవస్థగా 2020లో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ) ఏర్పాటును ఓ కీలక మైలురాయిగా ఆయన పేర్కొన్నారు. ఆ ప్రస్తుత ఆర్థిక సంక్షోభ సమయంలో ‘ఐఎఫ్ఎస్‌సిఎ’ 27 నిబంధనలు, 10కిపైగా చట్రాలను రూపొందించి పెట్టుబడికి కొత్త బాటలు పరిచిందని ఆయన తెలిపారు. ఇన్ఫినిటీ ఫోరమ్ తొలి సమావేశం సందర్భంగా అందిన సూచనలను పరిగణనలోకి తీసుకోవడంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు 2022 ఏప్రిల్ నెలలో ఫండ్ల నిర్వహణ కార్యకలాపాల సమగ్ర నియంత్రణ చట్రాన్ని ‘ఐఎఫ్ఎస్‌సిఎ’ ప్రకటించడాన్ని ఆయన ఉదాహరించారు. దీనికింద నేడు 80 ఫండ్ నిర్వహణ సంస్థలు ‘ఐఎఫ్ఎస్‌సిఎ’ చట్రం కింద నమోదైనట్లు ప్రధాని వెల్లడించారు. తదనుగుణంగా 24 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడితో ఫండ్ నిర్వహణ సంస్థలు తమ కార్యకలాపాలు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అలాగే ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి’లో 2024 నుంచి కోర్సులు ప్రారంభించేందుకు రెండు ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు ఆమోదం పొందాయని తెలిపారు. అలాగే 2022 మే నెలలో ‘ఐఎఫ్ఎస్‌సిఎ’ విమాన లీజుల చట్రం ప్రకటించడాన్ని, దానికింద ఇప్పటిదాకా 26 యూనిట్లు కార్యకలాపాలు ప్రారంభించడాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు.
‘ఐఎఫ్ఎస్‌సిఎ’ పరిధి విస్తరణను ప్రస్తావిస్తూ- ఇందుకోసం ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సిఎ’ని సంప్రదాయ ఫైనాన్స్-వెంచర్లకు అతీతంగా రూపొందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘గిఫ్ట్ సిటీని మేం నవతరం ప్రపంచ సాంకేతికార్థిక సేవల అంతర్జాతీయ జీవనాడిగా మార్చాలని భావిస్తున్నాం’’ అని పేర్కొన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారంలో గిఫ్ట్ సిటీ ఉత్పత్తులు-సేవలు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, ఇందులో భాగస్వాములు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.
ఇక వాతావరణ మార్పు పెనుసవాలును సమావేశం దృష్టికి తెస్తూ- ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఈ విషయంలో భారత్ ఆందోళనను ప్రధాని ప్రస్తావించారు. దీనికి సంబంధించి ఇటీవలి కాప్-28 శిఖరాగ్ర సదస్సులో భారత్ ప్రకటించిన లక్ష్యాలను గుర్తుచేశారు. ఇందులో భారత్ సహా ప్రపంచం ముందున్న లక్ష్యాల సాధన కోసం చౌకవ్యయంతో తగుమేర ఆర్థిక సహాయంపై భరోసా లభించాల్సి ఉందని స్పష్టం చేశారు. భారత జి-20 అధ్యక్షత సమయంలో ప్రాధాన్యాంశమైన ప్రపంచ వృద్ధి, నిలకడ కోసం సుస్థిర ఆర్థిక సహాయం ఆవశ్యకతను ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు. తద్వారా మరింత సార్వజనీన, హరిత, మరింత పునరుత్థాన సమాజాలు, ఆర్థిక వ్యవస్థల వికాసానికి ప్రోత్సాహం లభిస్తుందని స్పష్టం చేశారు. కొన్ని అంచనాల ప్రకారం 2070 నాటికి భారత్ నికర శూన్య ఉద్గార స్థాయిని సాధించాలంటే కనీసం 10 ట్రిలియన్ డాలర్ల మేర నిధులు కావాల్సి ఉందన్నారు. ఇందులో అధిక శాతం ప్రపంచ ఆర్థిక వనరుల నుంచి సమకూర్చుకోవాల్సి ఉంటుందని ప్రధాని చెప్పారు. ఈ నేపథ్యంలో ‘ఐఎఫ్ఎస్‌సి’ని సుస్థిర ఆర్థిక సహాయ కూడలిగా రూపొందించాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. భారతదేశాన్ని స్వల్ప కర్బన ఆర్థిక వ్యవస్థగా మార్చడానికి అవసరమైన హరిత మూలధన ప్రవాహం కోసం ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి’ ఒక సమర్థ మాధ్యమం. నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా ‘గ్రీన్ బాండ్స్, సస్టెయినబుల్ బాండ్స్, సస్టెయినబిలిటీ లింక్డ్ బాండ్స్’ వంటి ద్రవ్య ఉత్పత్తుల రూపకల్పన ప్రపంచానికి మార్గం సుగమం చేయగలదు’’ అని ఆయన సూచించారు. ఇక కాప్-28లో భారత్ భూగోళ హిత ‘ప్రపంచ హరిత క్రెడిట్ కార్యక్రమం’ అమలుకు ప్రతిపాదించిందని గుర్తుచేశారు. దీనికి సంబంధించి ‘గ్రీన్ క్రెడిట్’ విపణిని రూపొందించేందుకు పారిశ్రామిక దిగ్గజాలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని శ్రీ మోదీ పిలుపునిచ్చారు.
సాంకేతికార్థిక రంగంలో భారత్ సామర్థ్యం ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి’ దార్శనికతకు సమాంతరంగా ఉంటుందని వివరిస్తూ- ‘‘ప్రపంచంలో నేడు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న సాంకేతికార్థిక విపణులలో భారత్ కూడా ఒకటి’’ అని ప్రధాని ప్రకటించారు. కాబట్టే భారత్ ఎంతో వేగంతో సాంకేతికార్థిక కూడలిగా రూపొందుతున్నదని చెప్పారు. సాంకేతికార్థిక రంగం కోసం 2022లో ‘ఐఎఫ్ఎస్‌సిఎ’ రూపొందించిన ప్రగతిశీల నియంత్రణ చట్రం అమలుతో సాధించిన విజయాలను ప్రధాని వివరించారు. అలాగే ఆవిష్కరణలు-వ్యవస్థాపనకు ప్రేరణనిచ్చేలా భారత, విదేశీ సాంకేతికార్థిక సంస్థల కోసం ‘ఐఎఫ్ఎస్‌సిఎ సాంకేతికార్థిక ప్రోత్సాహక పథకం’ ప్రవేశపెట్టిందని ప్రధాని గుర్తుచేశారు. అంతర్జాతీయ సాంకేతికార్థిక రంగానికి సింహద్వారంగా, ప్రపంచ సాంకేతికార్థిక ప్రయోగశాలగా రూపొందే సామర్థ్యం గిఫ్ట్ సిటీకి ఉందని ఆయన చెప్పారు. ఈ అవకాశాన్ని గరిష్ఠ స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిందిగా ప్రధాని పెట్టుబడిదారులను కోరారు.
గిఫ్ట్ సిటీ ప్రపంచ మూలధన ప్రవాహానికి ముఖద్వారంగా రూపొందే అవకాశాలను ప్రస్తావిస్తూ- దీనికి సంబంధించి ‘నగర త్రయం’ భావన గురించి ప్రధాని వివరించారు. అటు రాష్ట్ర రాజధాని గాంధీనగర్, ఇటు చారిత్రక అహ్మదాబాద్ నగరంతో గిఫ్ట్ సిటీకి అద్భుత అనుసంధానం ఉందని పేర్కొన్నారు. అంతేకాకుండా ‘వ్యాపార సంస్థలు తమ సామర్థ్యం పెంచుకోవడంలో ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి’లోని అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలు ఒక వేదికను సమకూరుస్తాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు సాంకేతిక, ఆర్థిక ప్రపంచంలోని అత్యంత ప్రతిభావంతులను ఆకర్షించగల అయస్కాంతంగా ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి’ ఆవిర్భవించిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం ఇక్కడ 58 సంస్థలు, అంతర్జాతీయ బులియన్ ఎక్స్ఛేంజీ సహా 3 ఎక్స్ఛేంజీలు, 9 విదేశీ బ్యాంకులు సహా 25 బ్యాంకులు, 29 బీమా సంస్థలు, 2 విదేశీ విశ్వవిద్యాలయాలు, సంప్రదింపు సంస్థలు, న్యాయసేవా సంస్థలు, చార్టర్డ్ అకౌంటెన్సీ సంస్ధలు సహా 50కిపైగా వృత్తి నైపుణ్య సేవా సంస్థలు పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే కొన్నేళ్లలోనే గిఫ్ట్ సిటీ అత్యుత్తమ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా ఆవిర్భవించగలదని ప్రధానమంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
‘‘చారిత్రక వ్యాపార-వాణిజ్య సంప్రదాయాలు, లోతైన ప్రజాస్వామ్య విలువలకు భారతదేశం నెలవు’’ అని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. భారతదేశంలో ప్రతి కంపెనీకి, పెట్టుబడిదారుకుగల విభిన్న అవకాశాలను వివరిస్తూ- గిఫ్ట్ సిటీపై భారత దార్శనికత భారత వృద్ధి పయనంతో ముడిపడి ఉందని ప్రధాని చెప్పారు. ఇందుకు కొన్ని ఉదాహరణలిస్తూ- ఇక్కడికి నిత్యం 4 లక్షల మంది విమాన ప్రయాణికుల రాకపోకలు సాగుతున్నాయని గుర్తుచేశారు. అలాగే 2014 ప్రయాణిక విమానాల సంఖ్య 400 కాగా, నేడు 700 దాటిందని పేర్కొన్నారు. అంతేకాకుండా గడచిన తొమ్మిదేళ్లలో దేశంలోని విమానాశ్రయాల సంఖ్య రెట్టింపైందని చెప్పారు. ‘‘మన విమానయాన సంస్థలు రాబోయే కాలంలో సుమారు 1000 విమానాలను కొనుగోలు చేయనున్నాయి’’ అంటూ గిఫ్ట్ సిటీ ద్వారా లభించే సదుపాయాలపై విమాన లీజుదారులకు ప్రధాని విస్తృత సమాచారం ఇచ్చారు. దీంతోపాటు ‘ఐఎఫ్‌ఎస్‌సిఎ’ ఓడల లీజు చట్రం, ఐటి ప్రతిభావంతుల భారీ నిధి, సమాచార రక్షణ చట్టాలు సహా గిఫ్ట్ సిటీలోని సమాచార రాయబార కార్యాలయం ఏర్పాటుతో అన్ని దేశాలు, వ్యాపారాలకు నిరంతర డిజిటల్ అనుసంధానం సహా సురక్షిత సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ‘‘భారత యువ ప్రతిభతో అన్నిరకాల పెద్ద కంపెనీలకు అంతర్జాతీయ సామర్థ్య కేంద్రంగా మనం రూపొందడం హర్షణీయం’’ అని ఆయన చెప్పారు.
చివరగా- రాబోయే కొన్నేళ్లలో భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి వికసిత భారతంగా రూపొందుతుందని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు. ఈ ప్రగతి పయనంలో కొత్తరకం మూలధనం, డిజిటల్ సాంకేతికతలు, నవతరం ఆర్థిక సేవల పాత్రను కూడా ఆయన నొక్కిచెప్పారు. సమర్థ నిబంధనలు, తక్షణ వినియోగ మౌలిక సదుపాయాలు, అతిపెద్ద భారతీయ అంతర్గత ఆర్థిక వ్యవస్థ సౌలభ్యం, కార్యకలాపాల చౌక వ్యయం, ప్రతిభ లభ్యత వంటి దీటైన అవకాశాలను గిఫ్ట్ సిటీ సృష్టిస్తోందని ఆయన వివరించారు. ‘‘ప్రపంచ స్వప్నాలను సాకారం చేయడానికి ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి’తో జట్టుగా ముందడుగు వేద్దాం. మరోవైపు ఉజ్వల గుజరాత్ సదస్సు కూడా త్వరలోనే జరగనుంది’’ అంటూ పెట్టుబడిదారులందరికీ ఆయన ఆహ్వానం పలికారు. "ప్రపంచంలోని తీవ్ర సమస్యలకు పరిష్కారాన్వేషణలో భాగంగా వినూత్న ఆలోచనలు చేయడంలోపాటు వాటిని సమర్థంగా అనుసరిద్దాం’’ అంటూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
నేపథ్యం
ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0ను ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్ సిటీ’ సంయుక్తంగా నిర్వహించాయి. ప్రపంచవ్యాప్త ప్రగతిశీల ఆలోచనలు, తీవ్ర మస్యలు, వినూత్న సాంకేతికతల అన్వేషణ, చర్చలు, పరిష్కారాలు, అవకాశాల రూపకల్పనకు ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ ఇతివృత్తంగా సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది కింది మూడు విభాగాల సమాహారంగా సాగుతుంది:-
- ప్లీనరీ ట్రాక్: నవతరం అంతర్జాతీయ ఆర్థిక కేంద్రం రూపకల్పన
- గ్రీన్ ట్రాక్: ‘హరిత సముచ్ఛయానికి’ సహేతుకత
- సిల్వర్ ట్రాక్: ‘గిఫ్ట్- ఐఎఫ్ఎస్‌సి’లో దీర్ఘకాలిక ఆర్థిక కూడలి
ప్రతి ట్రాక్‌లో ఒక సీనియర్ పారిశ్రామిక అగ్రగామి ప్రతినిధి ఇన్ఫినిటీ ప్రసంగంతోపాటు భారత్ సహా ప్రపంచవ్యాప్త ఆర్థికరంగ పరిశ్రమ నిపుణులు-వృత్తిదారులతో బృంద చర్చ కూడా ఉంటుంది. ఇది ఆచరణాత్మక ఆలోచనలను, అనుసరణీయ పరిష్కారాలను సూచిస్తుంది.
అలాగే ఇన్ఫినిటీ వేదికపై భారతదేశంతోపాటు అమెరికా, యుకె, సింగపూర్, దక్షిణాఫ్రికా, యుఎఇ, ఆస్ట్రేలియా, జర్మనీ సహా 20కిపైగా ప్రపంచ దేశాల నుంచి 300 మందికిపైగా ‘సిఎక్స్ఒ’ ప్రతినిధులతో కూడిన బలమైన ఆన్‌లైన్ ప్రేక్షక భాగస్వామ్యం ఉంటుంది. ఈ కార్యక్రమానికి విదేశీ విశ్వవిద్యాలయాల ఉప-కులపతులు, విదేశీ రాయబార కార్యాలయాల ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు.
आज भारत की Growth Story ने दुनिया को दिखाया है कि... pic.twitter.com/mICUFPGPxA
— PMO India (@PMOIndia) December 9, 2023
India - A ray of hope for the world. pic.twitter.com/CNJoTU6vme
— PMO India (@PMOIndia) December 9, 2023
हम GIFT City को New Age Global Financial and Technology Services का Global Nerve Centre बनाना चाहते हैं: PM @narendramodi pic.twitter.com/w6bebrBbcU
— PMO India (@PMOIndia) December 9, 2023
India is one of the fastest growing FinTech markets in the world today. pic.twitter.com/OGuGu7szZn
— PMO India (@PMOIndia) December 9, 2023
India is a country with deep democratic values, and a historical tradition of trade and commerce.
— PMO India (@PMOIndia) December 9, 2023
The most diverse range of opportunities exists for every investor in India. pic.twitter.com/Y2N0sjHxvr