శ్రీరామ చంద్ర మిషన్ 75వ వార్షికోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. ప్రజలలో అర్ధవంతమైన శాంతి, ఆరోగ్యాలతో పాటు, ఆధ్యాత్మిక స్వస్థతను పెంపొందిస్తున్నందుకు, ఈ సంస్థను, ప్రధానమంత్రి ప్రశంసించారు. యోగాకు ప్రాచుర్యం కల్పిస్తున్నందుకు కూడా ప్రధానమంత్రి ఈ సంస్థను ప్రశంసించారు. నేటి వేగవంతమైన, ఒత్తిడితో కూడిన జీవితంలో, ప్రపంచమంతా, జీవనశైలికి సంబంధించిన వ్యాధులు, మహమ్మారితో పోరాడుతుండగా - సహజ మార్గం, హృదయ పూర్వక ఆదరణ, యోగా అనేవి ప్రపంచానికి ఆశాకిరణాలుగా నిలిచాయని, ప్రధానమంత్రి పేర్కొన్నారు.
కరోనా విషయంలో భారతదేశం వ్యవహరించిన తీరును ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, 130 కోట్ల భారతీయులను అప్రమత్తం చేయడం, ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. గృహ విజ్ఞానం, యోగ, ఆయుర్వేదం, ఈ విషయంలో పెద్ద పాత్ర పోషించాయి.
ప్రపంచవ్యాప్తంగా మంచిని పెంపొందించడానికి, భారతదేశం, మానవ కేంద్రిత విధానాన్ని అనుసరిస్తోందని, శ్రీ మోదీ చెప్పారు. ఈ మానవ కేంద్రిత విధానం - సంక్షేమం, శ్రేయస్సు, సంపదల యొక్క ఆరోగ్యవంతమైన సంతులనంపై ఆధారపడి ఉందని ఆయన అన్నారు. గత ఆరేళ్ళలో, భారతదేశం ప్రపంచంలోనే, అతిపెద్ద ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది. పేదలకు ఆత్మగౌరవం,అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి. సార్వత్రిక పారిశుధ్య కార్యక్రమాల నుంచి సాంఘిక సంక్షేమ పథకాల వరకు; పొగ లేని వంటశాలల నుంచి బ్యాంకింగు సౌకర్యం తెలియని వారికి బ్యాంకింగు సౌకర్యం కల్పించడం వరకు; సాంకేతికతను అందుబాటులోకి తేవడం దగ్గర నుంచి అందరికీ గృహ నిర్మాణం వరకు; భారతదేశ ప్రజా సంక్షేమ పథకాలు అనేక మంది జీవితాలను ప్రభావితం చేశాయని, ప్రధానమంత్రి వివరించారు.
ప్రజారోగ్యం పై భారతదేశం యొక్క దృష్టి గురించి, ప్రధానమంత్రి వివరిస్తూ, స్వస్థత - అంటే భారతీయ ఆలోచన, కేవలం ఒక వ్యాధిని నయం చేయడం కంటే ఎక్కువగా ఉంటుందని, పేర్కొన్నారు. నివారణ ఆరోగ్య సంరక్షణపై విస్తృత కసరత్తు జరిగింది. భారతదేశం అమలుచేస్తున్న ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం, ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్య, అమెరికాతో పాటు, అనేక యూరోపియన్ దేశాల జనాభాల కంటే ఎక్కువగా ఉందని శ్రీ మోదీ, పేర్కొన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం. మందులు, వైద్య పరికరాల ధరలు గణనీయంగా తగ్గాయి.
ప్రపంచ వ్యాప్తంగా టీకాలు వేసే కార్యక్రమంలో, భారతదేశం కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి అన్నారు. ప్రజారోగ్యంపై దేశీయంగా ఎంత దృష్టి పెడుతున్నామో, అంతర్జాతీయంగా కూడా మనకు అంత శ్రద్ధ ఉంది. ఆరోగ్యం మరియు స్వస్థత విషయంలో, భారతదేశం అనేక సేవలను అందిస్తుంది. ఆధ్యాత్మిక మరియు ఆరోగ్య రంగ పర్యాటకానికి భారతదేశాన్ని ఒక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కృషి చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. మన యోగా మరియు ఆయుర్వేదం ఆరోగ్యవంతమైన గ్రహానికి దోహదం చేస్తాయి. వీటిని తాము అర్థం చేసుకోగల భాషలో ప్రపంచానికి సమర్పించాలన్నదే మన లక్ష్యం అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
యోగా మరియు ధ్యానం పట్ల పెరుగుతున్న అంతర్జాతీయ అవగాహన గురించి, శ్రీ మోదీ, ప్రముఖంగా పేర్కొన్నారు. ఒత్తిడి వల్ల పెరుగుతున్న సవాలును గురించి కూడా ప్రస్తావిస్తూ, ఈ సమస్య పరిష్కారానికి హృదయపూర్వక కార్యక్రమ౦ సహాయపడుతు౦దని ఆయన ఆశాభావాన్ని వ్యక్త౦ చేశాడు. "వ్యాధి రహిత పౌరులు, ముఖ్యంగా మానసికంగా బలంగా ఉండే పౌరులు భారతదేశాన్ని నూతన శిఖరాలకు చేరుస్తారు". అని అంటూ, ప్రధానమంత్రి, తమ ప్రసంగాన్ని ముగించారు.