ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ‘చివరి అంచెకూ చేరిక’పై బడ్జెట్ అనంతర వెబ్- సదస్సునుద్దేశించి ప్రసంగించారు. కేంద్ర బడ్జెట్ 2023లో ప్రకటించిన కార్యక్రమాల సమర్థ అమలుకు తగిన సలహాలు, సూచనలను ఆహ్వానిస్తూ ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన 12 బడ్జెట్ అనంతర వెబ్-సదస్సులలో ఇది నాలుగోది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- పార్లమెంటులో బడ్జెట్‌పై చర్చ ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మరో అడుగు ముందుకేసిందని పేర్కొన్నారు. ఈ మేరకు కొన్నేళ్లుగా బడ్జెట్ అనంతరం భాగస్వాములతో మేథోమధనం నిర్వహించే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అలాగే “సకాలంలో సేవలు, అమలు కోణంలో ఈ బడ్జెట్ అనంతర మేథోమధనం ఎంతో ముఖ్యమైనది. పన్ను చెల్లింపుదారుల ప్రతి పైసా సద్వినియోగానికి ఇది హామీ ఇస్తుంది” అని వ్యాఖ్యానించారు.
అభివృద్ధి సాధించాలంటే నిధులతోపాటు రాజకీయ సంకల్పం కూడా ఉండాలని ప్రధాని అన్నారు. ఆకాంక్షిత లక్ష్యాల సాధనలో సుపరిపాలనకు ప్రాధాన్యంసహా నిరంతర పర్యవేక్షణ అవసరాన్ని నొక్కిచెప్పారు. కాబట్టి- “సుపరిపాలనకు మనం ఎంత ఎక్కువ ప్రాధాన్యమిస్తే- చివరి అంచెకు చేరే లక్ష్యాన్ని అంత సులువుగా సాధించగలం” అని స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనలో సుపరిపాలనకుగల శక్తిని వివరిస్తూ- మిషన్ ఇంద్రధనుష్, కరోనా మహమ్మారి వేళ రోగనిరోధకత పెంపు, టీకాలపై అనుసరించిన కొత్త విధానాలను ప్రధాని ఉదాహరించారు. ఈ నేపథ్యంలో చివరి అంచెకూ చేరిక, సంతృప్త స్థాయి విధానాలు పరస్పర పూరకాలని చెప్పారు.
మౌలిక వసతుల కల్పన కోసం పేదలు ఒకనాడు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని ప్రధాని గుర్తుచేశారు. ఇందుకు విరుద్ధంగా నేడు ప్రభుత్వమే పేదల ముంగిళ్లకు చేరువైందని వివరించారు. “ప్రతి ప్రాంతంలో.. ప్రతి పౌరుడికీ.. ప్రతి ప్రాథమిక సౌకర్యం కల్పనకు మనం నిశ్చయించుకున్న రోజున స్థానిక స్థాయి పని సంస్కృతిలో ఎంతటి పెనుమార్పు రాగలదో మనం చూడగలం. సంతృప్త విధానానికి ఆత్మ ఇదే. మన లక్ష్యం ప్రతి ఒక్కరినీ చేరుకోవడమే.. అప్పుడు వివక్ష, అవినీతికి తావుండదు. ఆ విధంగా మాత్రమే చివరి అంచెకూ చేరుకోవాలనే లక్ష్యాన్ని సాధించగలం” ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ విధానాన్ని వివరించే ఉదాహరణలలో పీఎం-స్వానిధి పథకం ఒకటని ఆయన ఉటంకించారు. ఇది వీధి వర్తకులను బ్యాంకింగ్ లావాదేవీలతో అనుసంధానించిందని గుర్తుచేశారు. అలాగే సంచార, పాక్షిక-సంచార తెగలు, నేరజాబితా నుంచి తొలగించబడిన వారికోసం అభివృద్ధి-సంక్షేమ బోర్డు ఏర్పాటు, దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 5 లక్షల సార్వత్రిక సేవా కేంద్రాల ఏర్పాటు, 10 కోట్ల దూరవైద్య సేవలు వంటివి సంతృప్తి విధానానికి మరికొన్ని నిదర్శనాలని ఆయన పేర్కొన్నారు.
గిరిజన-గ్రామీణ ప్రాంతాల చివరి అంచెకూ చేరాలనే మంత్రం దిశగా ఈ ఏడాది బడ్జెట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నదని ప్రధాని గుర్తుచేశారు. ఇందులో భాగంగా జల్ జీవన్ మిషన్‌కు రూ.వేల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా 60 వేలకుపైగా అమృత సరోవరాల నిర్మాణం చేపట్టగా 30 వేలు ఇప్పటికే పూర్తయినట్లు తెలిపారు. “దశాబ్దాలుగా ఇలాంటి సౌకర్యాల కోసం ఎదురుచూస్తున్న దేశపౌరుల జీవన ప్రమాణాలను ఈ కార్యక్రమాలు మెరుగుపరుస్తున్నాయి. ఇంతటితో మనం ఆగిపోయే పనిలేదు… కొత్త కొళాయి కనెక్షన్లు, నీటి వినియోగ ధోరణి ఒక యంత్రాంగాన్ని సృష్టించాలి. జల కమిటీని మరింత బలోపేతం చేయడానికి ఏంచేయాలో కూడా మనం సమీక్షించాలి” అని ఆయన అన్నారు.
పటిష్టంగా, అందుబాటు ధరతో ఇళ్ల నిర్మాణానికి మార్గాన్వేషణ దిశగా గృహనిర్మాణాన్ని సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించే అంశంపై భాగస్వాములు చర్చించాలని ప్రధాని కోరారు. పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో ఆమోదయోగ్య సౌరశక్తి, సామూహిక గృహ నమూనాల ద్వారా ప్రయోజనం కోసం సులువైన మార్గాలను అన్వేషించాలన్నారు. దేశంలో పేదలకు గృహ నిర్మాణం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.80 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఇక గిరిజన సంక్షేమం గురించి ప్రస్తావిస్తూ- “దేశం తొలిసారిగా గిరిజన సమాజంలోని సంపూర్ణ సామర్థ్యాన్ని వాడుకుంటోంది. తదనుగుణంగా ఈ బడ్జెట్‌లో గిరిజనాభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వబడింది” అని ప్రధాని వెల్లడించారు. ఏకలవ్య ఆశ్రమ పాఠశాలల సిబ్బంది నియామకాలకు సమృద్ధిగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. ఈ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థుల అభిప్రాయాలను స్వీకరించాల్సిందిగా వెబ్-సదస్సులో పాల్గొన్నవారిని ప్రధాని కోరారు. ఈ పాఠశాలల విద్యార్థులు పెద్ద నగరాలను చేరే మార్గాలపైనా, వీటిలో మరిన్ని ‘అటల్ టింకరింగ్ లేబొరేటరీల ఏర్పాటుతోపాటు అంకుర సంస్థల సంబంధిత అంశాలపై వర్క్ షాప్‌ల నిర్వహణపై చర్చించాలని కోరారు.
గిరిజన సమాజంలో అత్యంత వెనుకబడిన వారి కోసం ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రధానమంత్రి ప్రకటించారు. ఈ మేరకు “దేశంలోని 200 జిల్లాల్లోగల 22వేలకుపైగా గిరిజన గ్రామాల్లో శరవేగంగా సౌకర్యాలు కల్పించాలి. అలాగే పాస్మండ ముస్లింల సమస్య పరిష్కారం కూడా ముఖ్యం. వారిలో ‘సికిల్ సెల్’ రుగ్మతను పూర్తిగా నిర్మూలించేందుకు ఈ బడ్జెట్‌లో కూడా ఒక లక్ష్యం నిర్దేశించబడింది. ఈ లక్ష్యాల సాధనకు ‘యావద్దేశం’ అనే విధానం అత్యవసరం. అందుకే ఆరోగ్య రంగంలోని ప్రతి భాగస్వామి వేగంగా పనిచేయాల్సి ఉంటుంది” అని ఆయన సూచించారు. చివరి అంచెకూ చేరిక విషయంలో ఆకాంక్షపూరిత జిల్లాల కార్యక్రమం విజయవంతమైన నమూనాగా ఆవిర్భవించిందని ప్రధాని తెలిపారు. ఈ విధానాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ- ప్రతి జిల్లాకూ ఒకటి వంతున దేశంలోని 500 సమితుల ప్రగతి లక్ష్యంగా ఆకాంక్షభరిత సమితుల కార్యక్రమం ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. “ఈ ఆకాంక్షభరిత సమితుల కార్యక్రమ విజయం కోసం మనమంతా జిల్లాల విషయంలో చేసినట్లుగా తులనాత్మక పారామితులను దృష్టిలో ఉంచుకుంటూ కృషి చేయాలి. అలాగే ప్రతి సమితి స్థాయిలో పరస్పరం ఆరోగ్యకర పోటీ వాతావరణం సృష్టించాలి” అని పిలుపునిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.
सरकारी कार्यों और सरकारी योजनाओं की सफलता की सबसे अनिवार्य शर्त है- Good Governance. pic.twitter.com/bDVkc7yMGg
— PMO India (@PMOIndia) February 27, 2023
Reaching The Last Mile की अप्रोच और saturation की नीति, एक दूसरे की पूरक है। pic.twitter.com/XzFBXYqbfE
— PMO India (@PMOIndia) February 27, 2023
भारत में जो आदिवासी क्षेत्र हैं, ग्रामीण क्षेत्र हैं, वहां आखिरी छोर तक Reaching The Last Mile के मंत्र को ले जाने की जरूरत है। pic.twitter.com/bQxkRXmXWg
— PMO India (@PMOIndia) February 27, 2023
Aspirational District Program, Reaching The Last Mile के लिहाज से एक success model बन कर उभरा है। pic.twitter.com/cRwyMc4Mm0
— PMO India (@PMOIndia) February 27, 2023