ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు వ్యవసాయం, సహకార రంగాల మీద జరిగిన బడ్జెట్ అనంతర వెబినార్ లో ప్రసంగించారు. 2023 కేంద్ర బడ్జెట్ లో ప్రకటించిన అనేక నిర్ణయాలు సమర్థంగా అమలు చేయటానికి వీలుగా ఆలోచనలు, సలహాలు స్వీకరించేందుకు ప్రభుత్వం చేపట్టిన 12 బడ్జెట్ అనంతర వెబినార్ సిరీస్ లో ఇది రెండవది.
సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తూ, ఈ ఏడాదితో బాటు గడిచిన 8-9 సంవత్సరాల బడ్జెట్లలో వ్యవసాయ రంగానికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. 2014 లో వ్యవసాయ బడ్జెట్ 25,000 కోట్ల లోపు ఉండగా ఇప్పుడు అది ఐదు రెట్లు పెరిగి లక్షా 25 వేల కోట్లకు చేరిందని గుర్తు చేశారు. “ఇటీవలి కాలపు ప్రతి బడ్జెట్ ను గ్రామాల, పేదల, రైతుల బడ్జెట్ అంటున్నారు” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
స్వాతంత్ర్యం వచ్చాక చాలా కాలం భారత వ్యవసాయ రంగం దీన స్థితిలో సాగిందని చెబుతూ, మన ఆహార భద్రత కోసం విదేశాల మీద ఆధారపడటాన్ని ప్రధాని గుర్తు చేశారు. కానీ ఇప్పటి రైతులు దేశాన్ని ఆత్మ నిర్భర్ (స్వయం సమృద్ధం) చేయటంతో బాటు ఆహార ధాన్యాలు ఎగుమతి చేయగలిగే స్థితికి వచ్చారన్నారు. “నేడు భారతదేశం అనేక రకాల వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేస్తోంది” అన్నారు. స్వదేశ, విదేశ మార్కెట్లను రైతులకు అందుబాటులోకి తీసుకురావటానికి ప్రభుత్వం చేసిన కృషి ఫలితమే ఇదని చెప్పారు. స్వయం సమృద్ధి విషయానికొచ్చినా, ఎగుమతులైనా భారతదేశం పాత్ర కేవలం వరికి, గోధుమలకే పరిమితం కాకూడదన్నారు. దిగుమతుల గురించి ప్రస్తావిస్తూ, 2021-22 లో పప్పుధాన్యాల దిగుమతికి రూ.17 వేలకోట్లు వెచ్చించగా, విలువ జోడించిన ఆహారోత్పత్తుల దిగుమతికి రూ. 25 వేల కోట్లు, వంట నూనెల దిగుమతికి రూ. 1.5 లక్షల కోట్లు వెచ్చించామన్నారు. మొత్తంగా వ్యవసాయోత్పత్తుల దిగుమతులన్నీ కలిసి 2 లక్షల కోట్లు అని చెప్పారు. అందుకే రకరకాల వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెంచేందుకు ఈ రంగంలో దేశం ‘ఆత్మ నిర్భర్’ అయ్యేందుకు బడ్జెట్ లో అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. ఆ విధంగా దిగుమతులమీద పెడుతున్న ఖర్చు మన రైతు ఇళ్ళకే చేరేట్టు చూస్తున్నామని ఈ సందర్భంగా ప్రధాని వివరించారు. గరిష్ఠ మద్దతు ధర పెంపు, పప్పు ధాన్యాల ఉత్పత్తి పెంపు, ఆహార శుద్ధి పార్కుల సంఖ్య పెంపు, వంట నూనెల విషయంలో పూర్తిగా స్వయం సమృద్ధి సాధించటానికి కృషి లాంటి అంశాలను ప్రధాని ఉదాహరించారు.
వ్యవసాయ రంగం ఎదుర్కుంటున్న సవాళ్ళకు పరిష్కారం లభించేదాకా సంపూర్ణ అభివృద్ధి లక్ష్యాన్ని సాధించలేమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రైవేట్ రంగ నవకల్పనలు, పెట్టుబడులు ఈ రంగానికి దూరంగా ఉండటం వలన దేశ యువత మిగతా రంగాలతో పోల్చినప్పుడు వ్యవసాయ రంగంలో పాల్గొనటం లేదని అన్నారు. ఈ శూన్యాన్ని భర్తీ చేయటానికి ఈ సంవత్సరం బడ్జెట్లో చాలా ప్రోత్సాహకాలు ప్రకటించామన్నారు. యూపీఐ ఓపెన్ ప్లాట్ ఫామ్ తో పోల్చి చెబుతూ, వ్యవసాయ రంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ప్లాట్ ఫామ్ వలన అగ్రి టెక్ లో పెట్టుబడులు, నవకల్పనల అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రవాణా సౌకర్యాల మెరుగుదల, పెద్ద మార్కెట్లు అందుబాటులోకి రావటం, టెక్నాలజీ ద్వారా బిందు సేద్యాన్ని ప్రోత్సహించటం, మెడికల్ లాబ్స్ తరహాలోనే భూసార పరీక్షలకు లాబ్స్ ఏర్పాటు చేయటం లాంటి అవకాశాలను ప్రధాని చెప్పుకొచ్చారు. యువత తమ నవకల్పనల గురించి చెబుతూ ప్రభుత్వానికీ, రైతులకూ మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. దీనివలన ప్రభుత్వ విధాన నిర్ణయాలు సులువవుతాయన్నారు. వాతావరణ మార్పులను ఎప్పటికప్పుడు తెలియజేయటానికి, అదే సమయంలో డ్రోన్ల ద్వారా పంటను అంచనావేయటానికి కృషి జరగాలన్నారు.
వ్యవసాయ అంకుర సంస్థలకు ప్రోత్సాహక నిధులు సమకూర్చటాన్ని ప్రధాని గుర్తు చేశారు. కేవలం డిజిటల్ మౌలిక వసతులు కల్పించి చేతులు దులుపుకోవటం కాకుండా ప్రభుత్వం నిధుల అందజేత మార్గాలు కూడా పరిశీలిస్తోందన్నారు. యువత, వ్యాపార దక్షత ఉన్న యువ ఔత్సాహికులు తమ లక్ష్యాల సాధనకు కృషి చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. తొమ్మిదేళ్ళ కిందట ఏమీలేని వ్యవసాయ అంకుర సంస్థలు ఇప్పుడు 3000 కు చేరాయన్నారు.
ఈ ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించటాన్ని ప్రస్తావిస్తూ, ఈ గుర్తింపు ద్వారా భారత రైతులకు అంతర్జాతీయ మార్కెట్ల ప్రవేశానికి తలుపులు తెరచినట్టయిందన్నారు. “దేశం ఇప్పుడు ముతక ధాన్యాలను ‘శ్రీ అన్న’ గా గుర్తించిందని వీటి సాగు చిన్న రైతులకు ప్రోత్సాహంగా మారబోతోందని చెబుతూ, ఈ రంగంలో కూడా అంకుర సంస్థలకు మెరుగైన అవకాశాలుంటాయన్నారు.
భారత సహకార రంగంలో కొత్త విప్లవం నడుస్తోందని ప్రధాని వ్యాఖ్యానించారు. అది కొన్ని ప్రాంతాలకో, కొన్ని రాష్ట్రాలకో పరిమితం కాదని కూడా స్పష్టం చేశారు. ఈ ఏడాది బడ్జెట్ లో తయారీ రంగపు సహకార సంస్థలకు పన్ను సంబంధమైన రాయితీలిచ్చామన్నారు. సహకార సంఘాలు నగదు విత్ డ్రా చేసుకుంటే 3 కోట్ల రూపాయల వరకూ, మూలంలో పన్ను మినహాయింపు ఉండబోదన్నారు. 2016-17 కు ముందు చక్కెర సహకార సంఘాల చెల్లింపులకు పన్ను మినహాయింపు ఇచ్చామని,. సహకార చక్కెర కర్మాగారాలు దీనివల్ల 10 వేల కోట్ల లబ్ధిపొందుతాయనిఅన్నారు.
ఇంతకు ముందు సహకార సంఘాలు లేని పాడి, మత్స్య సహకార సంఘాల వలన ఇప్పుడు రైతులు ఎంతగానో లబ్ధి పొందుతారన్నారు. గత 8-9 ఏళ్లలో చేపల ఉత్పత్తి 70 లక్షల టన్నుల మేర పెరిగిందని చెబుతూ, రూ.6,000 కోట్ల పిఎం మత్స్య సంపద యోజన వలన చేపల ఉత్పత్తి, మార్కెటింగ్ పెరుగుతాయన్నారు.
ప్రధాని శ్రీ మోదీ తన ప్రసంగం ముగిస్తూ, పిఎం ప్రణామ్ యోజన, గోబర్ధన్ యోజన గురించి ప్రస్తావించారు. రసాయన ఆధారిత వ్యవసాయాన్ని నిరుత్సాహ పరుస్తూ ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు..
आज भारत कई तरह के कृषि उत्पादों को निर्यात कर रहा है। pic.twitter.com/u7V3ad3yNY
— PMO India (@PMOIndia) February 24, 2023
हमने MSP में बढ़ोतरी की, दलहन उत्पादन को बढ़ावा दिया, फूड प्रोसेसिंग करने वाले फूड पार्कों की संख्या बढ़ाई गई। pic.twitter.com/IIDHRFhEkO
— PMO India (@PMOIndia) February 24, 2023
इस बार के बजट में एक और महत्वपूर्ण घोषणा हुई है। pic.twitter.com/vVde5APjqY
— PMO India (@PMOIndia) February 24, 2023
भारत के सहकारिता सेक्टर में एक नया revolution हो रहा है। pic.twitter.com/j0LbpVh6eX
— PMO India (@PMOIndia) February 24, 2023