జర్మనీలోని స్టట్‌గార్ట్ లో జరిగిన న్యూస్ 9 అంతర్జాతీయ సదస్సును ఉద్దేశించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. భారత్-జర్మనీ భాగస్వామ్యంలో ఈ సదస్సు కొత్త అధ్యాయానికి తెరతీస్తుందని ప్రధానమంత్రి అన్నారు. “నేటి సమాచార యుగంలో జర్మనీ, జర్మన్ ప్రజలతో అనుసంధితమయ్యేలా భారతదేశం నుంచి ఓ మీడియా సంస్థ ప్రయత్నిస్తుండడం సంతోషాన్నిస్తోంది. జర్మనీని, ఆ దేశ ప్రజలను అర్థం చేసుకోవడానికి భారతీయులకు ఇది ఒక వేదికను అందిస్తుంది” అని ప్రధానమంత్రి అన్నారు.
జర్మనీలోని స్టట్ గార్ట్ ఎఫ్ఏయూ, బాడెన్-వుర్టెంబర్గ్ సహకారంతో భారత టీవీ 9 ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని ప్రధానమంత్రి చెప్పారు. ‘భారత్-జర్మనీ: సుస్థిర వృద్ధి కోసం ప్రణాళిక’ అనే ఈ సదస్సు ఇతివృత్తం భారత్, జర్మనీ మధ్య బాధ్యతాయుతమైన భాగస్వామ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సదస్సుకు హాజరైనవారు రెండు రోజులుగా ఆర్థిక అంశాలతోపాటు క్రీడలు, వినోదానికి సంబంధించిన అంశాలపై ఫలప్రదంగా చర్చించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సహకారానికి గల విస్తృతమైన పరిధిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
ప్రత్యేకించి భౌగోళిక రాజకీయ సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడుల అంశాల్లో భారత్ కు ఐరోపా వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధానంగా పేర్కొన్నారు. అందులో కీలక భాగస్వాముల్లో జర్మనీ ఒకటని స్పష్టం చేశారు. 2024లో భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి 25 వసంతాలు పూర్తవుతుండడం చారిత్రక సందర్భమన్నారు. చాన్సలర్ స్కాల్జ్ మూడోసారి భారత్ లో పర్యటించడం, 12 సంవత్సరాల తర్వాత జర్మన్ వ్యవహారాల ఆసియా-పసిఫిక్ సదస్సు ఢిల్లీలో నిర్వహించడం సహా ప్రధాన కార్యక్రమాలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ‘ఫోకస్ ఆన్ ఇండియా’ పత్రాన్ని కూడా జర్మనీ విడుదల చేసిందనీ, భారత్ కోసం నిపుణులైన కార్మికుల వ్యూహాన్ని నిర్దిష్టంగా పేర్కొన్న మొదటి దేశమనీ పేర్కొన్న ప్రధానమంత్రి.. ఇది ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్నారు.
భారత్-జర్మనీ వ్యూహాత్మక భాగస్వామ్యం 25 ఏళ్లుగా కొనసాగుతున్నప్పటికీ.. రెండు దేశాల మధ్య సంబంధాలు శతాబ్దాల నాటివని ప్రధాని పేర్కొన్నారు. ముఖ్యంగా ఐరోపాలో తొలి సంస్కృత వ్యాకరణ గ్రంథాలను ఒక జర్మన్ సృజించారు. జర్మన్ వర్తకులు ఐరోపాలో తమిళం, తెలుగు ముద్రణను ప్రవేశపెట్టారు. “నేడు జర్మనీలో దాదాపు 3,00,000 మంది భారతీయులు నివసిస్తున్నారు. 50,000 మంది భారతీయ విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. భారతదేశంలో 1,800కు పైగా జర్మన్ కంపెనీలు 3-4 సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాయి” అని ప్రధానమంత్రి చెప్పారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 34 బిలియన్ డాలర్లుగా ఉందని, భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ద్వారా మున్ముందు ఈ వాణిజ్యం ఇంకా వృద్ధి చెందుతుందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, ఈ వృద్ధితో భాగస్వామ్యం వహించడానికి ప్రపంచం ఆసక్తి కనబరుస్తోందని ప్రధాని ఉద్ఘాటించారు. భారత వ్యూహాత్మక ప్రాధాన్యాన్ని ప్రపంచం గుర్తిస్తోందనడాన్ని జర్మనీ ‘ఫోకస్ ఆన్ ఇండియా’ పత్రం ప్రతిబింబిస్తోందన్నారు. దశాబ్ద కాలంగా భారత్ చేపట్టిన సంస్కరణల ద్వారా ఇది సాధ్యపడిందన్నారు. వాణిజ్య పరిస్థితులు, అధికార వర్గ జోక్యాన్ని తగ్గించడం, అన్ని రంగాల్లో ఆధునిక విధానాలను ఈ సంస్కరణలు మెరుగుపరిచాయని పేర్కొన్నారు. జీఎస్టీ ద్వారా పన్ను వ్యవస్థను సులభతరం చేయడం, వివిధ అంశాల్లో 30 వేలకు పైగా నిబంధనల తొలగింపు, బ్యాంకింగ్ రంగాన్ని స్థిరీకరించడం వంటి కీలక సంస్కరణలను చేపట్టినట్లు ప్రధానమంత్రి వివరించారు. ఈ చర్యలు భారత భవిష్యత్తు అభివృద్ధికి బలమైన పునాది వేశాయని, ఈ ప్రస్థానంలో జర్మనీ కీలక భాగస్వామిగా కొనసాగుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
తయారీ రంగం, ఇంజినీరింగ్ లలో జర్మనీ స్వీయ అభివృద్ధికి సమాంతరంగా అంతర్జాతీయ తయారీ రంగ ప్రధాన కేంద్రంగా భారత్ పురోగమిస్తోందని ప్రధానమంత్రి ప్రముఖంగా పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమం ద్వారా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలను ప్రభుత్వం తయారీదారులకు అందిస్తోంది. భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీలో అగ్రగామి దేశంగా, ప్రపంచంలో అతిపెద్ద ద్విచక్ర వాహనాల ఉత్పత్తిదారుగా, ఉక్కు-సిమెంట్ ఉత్పత్తిలో రెండో అతిపెద్ద దేశంగా అవతరించింది. ప్రపంచ తయారీ రంగంలో భారత ప్రాధాన్యం పెరుగుతుండడాన్ని ఇది సూచిస్తుంది.
నాలుగు చక్రాల వాహనాల తయారీలో కూడా భారత్ నాలుగో అతిపెద్ద దేశమని, దేశ సెమీకండక్టర్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో విజయవంతం కావడానికి సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి తెలిపారు. మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, రవాణా సంబంధిత వ్యయాలను తగ్గించుకోవడం, వాణిజ్య నిర్వహణను సులభతరం చేయడం, సుస్థిరమైన పాలనకు భరోసా ఇవ్వడం లక్ష్యంగా ఇటీవల ప్రభుత్వం చేపట్టిన విధానాలు ఇందుకు కారణమన్నారు. భౌతిక, సామాజిక, సాంకేతిక మౌలిక సదుపాయాల్లో భారత్ వేగవంతమైన పురోగతి సాధిస్తోందనీ.. ఆవిష్కరణలతో కూడిన దేశ డిజిటల్ సాంకేతికతలు అంతర్జాతీయంగా విశేష ప్రభావం చూపుతున్నాయని అన్నారు. భారతదేశంలో ఇప్పుడు ప్రపంచంలో అత్యంత విశిష్టమైన డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలున్నాయి.
భారత్ లో ఇప్పటికే నెలకొల్పిన జర్మనీ కంపెనీలు తమ పెట్టుబడులను పెంచాలని ప్రోత్సహించిన ప్రధానమంత్రి.. ఇంకా ఇక్కడ పెట్టుబడులు పెట్టనివారు భారత మార్కెట్ లో ప్రవేశించాలని ఆహ్వానించారు. భారత అభివృద్ధితో జతకట్టడానికి ఇదే సరైన సమయమని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. భారత క్రియాశీలత- జర్మనీ నిర్దిష్టత, ఇంజినీరింగ్, ఆవిష్కరణల మధ్య భాగస్వామ్యం కోసం ఆయన పిలుపునిచ్చారు. ప్రాచీన నాగరికతగా భారత్ అంతర్జాతీయంగా భాగస్వామ్యాలను ఎల్లప్పుడూ ఎలా స్వాగతించిందో, ప్రపంచం కోసం సంపన్నమైన భవిష్యత్తును నిర్మించడంలో భాగస్వాములు కావాలని అందరినీ ఎలా ఆహ్వానించిందో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.