ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా బ్రహ్మకుమారీల ‘జల్-జన్ అభియాన్’ ప్రారంభ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. బ్రహ్మకుమారీల ద్వారా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టే అవకాశం లభించడంపై ఈ సందర్భంగా ఆయన హర్షం వ్యక్తం చేశారు. వారినుంచి నేర్చుకోవడం ఎప్పుడూ ఒక ప్రత్యేక అనుభవమేనని వ్యాఖ్యానించారు. “దివంగత రాజయోగిని దాదీ జానకీ నుంచి పొందిన ఆశీర్వాదాలు నాకు అతిపెద్ద సంపద” అని ప్రధాని అన్నారు. దాది ప్రకాష్ మణి మరణానంతరం 2007లో ఆమెకు నివాళి అర్పించేందుకు అబు రోడ్‌కు వచ్చిన సందర్భాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
దీంతోపాటు ఇంతకుముందు కూడా బ్రహ్మకుమారి సోదరీమణుల నుంచి పలు సందర్భాల్లో తనకందిన సాదర ఆహ్వానాలను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో సభ్యుడుగా వారిలో ఒకడిని కావాలని తాను సదా ప్రయత్నిస్తుంటానని చెప్పారు. అహ్మదాబాద్‌లో ‘ఫ్యూచర్ ఆఫ్ పవర్’ కింద 2011నాటి కార్యక్రమాలు, సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా 2013లో నిర్వహించిన ‘సంగమ తీర్థం’, 2017లో బ్రహ్మకుమారీస్ సంస్థాన్ 80వ వ్యవస్థాపక దినోత్సవం, ప్రస్తుత స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమాలను గుర్తుచేసుకున్నారు. ఆయా సందర్భాల్లో వారు తనపై చూపిన ప్రత్యేక ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. బ్రహ్మ కుమారీలతో తనది ప్రత్యేక అనుబంధమని, అహాన్ని అధిగమించటం, సమాజానికి సర్వం అంకితం చేయడం వారందరికీ ఆధ్యాత్మిక సాధన రూపమని కొనియాడారు.
ప్రపంచవ్యాప్తంగా నీటి కొరత భవిష్యత్ సంక్షోభంగా మారనున్న తరుణంలో ‘జల్-జన్ అభియాన్’ ప్రారంభమవుతోందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రస్తుత 21వ శతాబ్దపు ప్రపంచం భూమిపైగల పరిమిత నీటి వనరుల ప్రాముఖ్యాన్ని గుర్తిస్తోందని, అధిక జనాభా నేపథ్యంలో భారతదేశానికి జలభద్రత చాలా కీలకాంశమని అని ఆయన ఎత్తి చూపారు. “అమృత కాలంలో భారతదేశం జలమే భవిష్యత్తుగా పరిగణిస్తోంది. నీరుంటేనే రేపనేది ఉంటుంది” అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. అందుకే సమష్టి ప్రయత్నాలకు తక్షణమే శ్రీకారం చుట్టాల్సి ఉందనని నొక్కి చెప్పారు. దేశం జల సంరక్షణను ఒక ప్రజా ఉద్యమంగా మలచిందని ప్రధాని సంతృప్తి వ్యక్తంచేశారు. ప్రజా భాగస్వామ్యంతో కూడిన ఈ కృషికి ఇప్పుడు బ్రహ్మకుమారీలు ప్రారంభించిన కార్యక్రమం కొత్త బలాన్నిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జల సంరక్షణ కార్యక్రమాల విస్తరణకూ ఇది ఊపునిచ్చి, ఆ ప్రభావాన్ని ఉత్తేజితం చేయగలదని ఆయన పేర్కొన్నారు.
వేల ఏళ్ల కిందటే ప్రకృతి-పర్యావరణం-జలానికి సంబంధించి సామరస్య-సమతుల-సున్నిత వ్యవస్థను రూపొందించిన భారత రుషిపుంగవుల గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. జల వినాశం కాదు-జల సంరక్షణ అవసరం’ అనే ప్రాచీన సామెతను ఆయన గుర్తుచేశారు. ఈ భావన వేల సంవత్సరాలుగా భారత ఆధ్యాత్మికత, మతంలో ఒక భాగమైందని నొక్కిచెప్పారు. “జల సంరక్షణ మన సమాజ సంస్కృతి, సామాజిక ఆలోచనకు కేంద్రకం” అని ప్రధానమంత్రి అన్నారు. కాబట్టే “భారతదేశం నీటిని దేవతగానూ, నదులను తల్లులుగానూ పూజిస్తుంది” అని గుర్తుచేశారు. ప్రకృతితో అటువంటి భావోద్వేగ సంబంధాన్ని ఏర్పరుచుకున్న సమాజానికి స్థిరమైన అభివృద్ధి సహజ జీవన విధానంగా మారుతుందని ఆయన స్పష్టం చేశారు. గతకాలపు చైతన్య పునరుజ్జీవనంతోపాటు భవిష్యత్ సవాళ్లకు పరిష్కారాన్వేషణ అవసరాన్ని పునరుద్ఘాటించారు. జల సంరక్షణ విలువలపై దేశప్రజల్లో విశ్వాసం కలిగించాలని, జల కాలుష్యానికి దారితీసే ప్రతి అవరోధాన్నీ తొలగించడం అవశ్యమని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. జల సంరక్షణలో బ్రహ్మకుమారీల వంటి భారత ఆధ్యాత్మిక సంస్థల పాత్రను ఆయన కొనియాడారు.
గత దశాబ్దాలలో ప్రతికూల ఆలోచనా విధానం ఫలితంగా జల సంరక్షణ, పర్యావరణం వంటి అంశాలు దుర్లభ కార్యక్రమాలు భావించబడ్డాయని ప్రధానమంత్రి విచారం వ్యక్తం చేశారు. గత 8-9 ఏళ్లలో మార్పులను ప్రస్తావిస్తూ- నాటి నిరాశావాద ఆలోచనా విధానం, పరిస్థితులు రెండూ మారిపోయాయని ప్రధానమంత్రి అన్నారు. ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని ఉదాహరిస్తూ… గంగానది మాత్రమేగాక దాని ఉపనదులన్నీ కూడా శుద్ధి అవుతున్నాయని తెలిపారు. అలాగే గంగానదీ తీరాన ప్రకృతి వ్యవసాయం వంటి కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని ప్రధాని చెప్పారు. “నమామి గంగే కార్యక్రమం వివిధ రాష్ట్రాలకు ఒక ఆదర్శంగా రూపొందింది” అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే ‘వానచుక్కను ఒడిసిపట్టు’ (క్యాచ్ ద రెయిన్) ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ- భూగర్భజలాల క్షీణత కూడా దేశానికి పెను సవాలేనని పేర్కొన్నారు. అందుకే ‘అటల్ భూజల్ యోజన’ ద్వారా దేశంలోని వేలాది పంచాయతీలలో జల సంరక్షణను కూడా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలిపారు. దేశంలోని ప్రతి జిల్లాలో ఒకటి వంతున 75 అమృత్ సరోవరాల నిర్మాణ కార్యక్రమాన్ని కూడా ప్రధాని ప్రస్తావించారు. జల సంరక్షణ దిశగా ఇది ఒక పెద్ద ముందడుగుని ఆయన అన్నారు.
జల సంరక్షణలో మహిళల పాత్రను ప్రస్తావిస్తూ- గ్రామీణ మహిళలు జలకమిటీల ద్వారా జల్ జీవన్ మిషన్ వంటి ముఖ్యమైన పథకాలకు నాయకత్వం వహిస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. బ్రహ్మ కుమారి సోదరీమణులు దేశంలోనేగాక ప్రపంచ స్థాయిలోనూ ఇలాంటి పాత్ర పోషించగలరని ఉద్ఘాటించారు. జల సంరక్షణతోపాటు పర్యావరణ సంబంధిత అంశాలను కూడా లేవనెత్తాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు. వ్యవసాయంలో నీటి సమతుల వినియోగం కోసం దేశం బిందుసేద్యం వంటి పద్ధతులను ప్రోత్సహిస్తోందని, దీని వినియోగం పెంచడంపై రైతులను ప్రోత్సహించాలని బ్రహ్మ కుమారీలను కోరారు.
ఈ ఏడాదిని ప్రపంచం అంతర్జాతీయ చిరుధాన్య సంవత్సరంగా నిర్వహించుకుంటోందని ప్రధాని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రతి ఒక్కరూ తృణధాన్యాలను తమ ఆహారంలో భాగం చేసుకోవాలని కోరారు. శతాబ్దాలుగా భారత వ్యవసాయ, ఆహారపు అలవాట్లలో ‘శ్రీ అన్న’ సజ్జ, జొన్న ఒక భాగంగా ఉన్నాయని ఆయన నొక్కి చెప్పారు. చిరుధాన్యాల్లో పోషకాలు పుష్కలమని, సాగుకు నీటి అవసరం కూడా తక్కువని ప్రధాని తెలిపారు. చివరగా, సమష్టి కృషితో జల్-జన్ అభియాన్ విజయవంతం కాగలదని, మెరుగైన భవిష్యత్తుతో కూడిన మెరుగైన భారతదేశ నిర్మాణంలో ఇది తోడ్పడగలదనని విశ్వాసం వ్యక్తంచేస్తూ ప్రసంగం ముగించారు.
‘जल-जन अभियान’ एक ऐसे समय में शुरू हो रहा है, जब पानी की कमी को पूरे विश्व में भविष्य के संकट के रूप में देखा जा रहा है। pic.twitter.com/nFgiEkUA95
— PMO India (@PMOIndia) February 16, 2023
हम जल को देव की संज्ञा देते हैं, नदियों को माँ मानते हैं। pic.twitter.com/R7iCUyUEMY
— PMO India (@PMOIndia) February 16, 2023
‘नमामि गंगे’ अभियान, आज देश के विभिन्न राज्यों के लिए एक मॉडल बनकर उभरा है। pic.twitter.com/QyVy469Sm0
— PMO India (@PMOIndia) February 16, 2023