మన వినియోగ నమూనాల పై సమీక్ష జరుపుకోవలసిన అవసరం తో పాటు, మనం ఆ నమూనాలు పరిసరాల పై ప్రసరింప చేసే ప్రభావాన్ని మనం ఏ విధంగా తగ్గించగలం అనే అంశాన్ని కూడా పరిశీలించుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఈ విషయం లో మనకు ఎదురవుతున్న సవాళ్ళ లో అనేక సవాళ్ళ ను పరిష్కరించడం లో సర్క్యులర్ ఇకానమీ ఒక కీలకమైన మార్గం కాగలదని ఆయన అన్నారు. ‘ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఇకానమీ హ్యాకథన్ (ఐ-ఎసిఇ)’ ముగింపు కార్యక్రమం లో ఆయన ఈ రోజున వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా మాట్లాడారు.
వస్తువు లను రీసైకిల్ చేయడం, అలా మళ్ళీ వినియోగం లోకి తెచ్చుకోవడం, వ్యర్థాల ను నిర్మూలించడం, వనరుల ను సమర్ధం గా వాడుకొనే విధానాల ను మెరుగు పరచుకోవడం అనేది మన జీవన శైలుల లో భాగం అయి తీరాలని ప్రధాన మంత్రి అన్నారు. హ్యాకథన్ లో ప్రదర్శించిన మీ నూతన ఆవిష్కరణలు సర్క్యులర్ ఇకానమీ సొల్యూషన్స్ లో మన రెండు దేశాలు నాయకత్వ స్థానాన్ని అందుకోవడానికి ప్రేరణ ను అందిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ ఆలోచనల ను ఇంకాస్త ముందుకు తీసుకుపోయి, భారీ స్థాయి లో కార్యాచరణ రూపాన్ని ఎలా ఇవ్వగలుగుతామో అన్నది కూడా ఇక అన్వేషించవలసి ఉందని ఆయన కోరారు. ‘‘మనం భూ మాత అందిస్తున్న వనరులు అన్నింటికీ యజమానులం కాదని, మనం ఆ వనరుల కు భావి తరాల తరఫున ధర్మకర్తలం గా మాత్రమే ఉన్నామన్న సంగతి ని ఎన్నటికీ మరచిపోకూడదు’’ అని ప్రధాన మంత్రి అన్నారు.
హ్యాకథన్ లో భాగం పంచుకొన్న యువ ఔత్సాహికుల లో పెల్లుబుకుతున్న శక్తే భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య మునుముందుకు సాగిపోయేటటువంటి భాగస్వామ్యాని కి ఒక ప్రతీకగా నిలుస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘దృఢమైన భారతదేశాని కి, ఆస్ట్రేలియా కు మధ్య గల దృఢమైన భాగస్వామ్యం కొవిడ్ అనంతర కాలం లో ప్రపంచానికి ఒక ఆకృతిని ఇవ్వడం లో ఒక ముఖ్యమైన పాత్ర ను పోషిస్తుంది. మరి, ఈ భాగస్వామ్యాని కి మన యువత, మన యువ నూతన ఆవిష్కర్తలు, మన స్టార్ట్-అప్ లు ముందు భాగాన నిలబడబోతున్నాయి’’ అని ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.