ఈ రోజు గోవాలో జరిగిన జి 20 పర్యాటక మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ వీడియో సందేశంలో ప్రసంగించారు. సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, 'అపురూపమైన భారతదేశం' భావన స్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ, పర్యాటక శాఖల మంత్రులు ప్రపంచవ్యాప్తంగా రెండు ట్రిలియన్లకు పైబడ్డ రంగాన్ని నిర్వహిస్తున్నప్పటికీ పర్యాటక శాఖామంత్రులు తామే పర్యాటకులుగా మారే పరిస్థితి చాలా అరుదైన అవకాశంగా అభివర్ణించారు. భారతదేశంలోని పేరుమోసిన పర్యాటక కేంద్రాల్లో ఒకటైన గోవాలో పర్యాటక మంత్రుల సమావేశం జరుగుతుండటాన్ని ప్రస్తావిస్తూ, అతిథులు తమ చర్చల బిజీ షెడ్యూల్ లో కొంత సమయాన్ని గోవా సహజ అందాలను, ఆధ్యాత్మిక శోభను తిలకించటానికి కేటాయించాలన్నారు.
పర్యాటక రంగం పట్ల భారతదేశ వైఖరి ప్రాచీన సంస్కృత గ్రంథాలలో చెప్పినట్టు 'అతిథి దేవోభవ' అనే భావన మీద ఆధారపడిందని, అతిథే దేవుడనేది దానర్థమని ప్రధాని ఈ సందర్భంగా చెప్పారు. పర్యాటకం అనేది కేవలం కొత్త ప్రదేశాలు చూడటం కాదని, పరిసరాలలో లీనమై పోవటమని గుర్తు చేశారు. అది సంగీతమైనా, ఆహారమైనా, కళలైనా, సంస్కృతి అయినా భారతదేశవు వైవిధ్యం ఒక అద్భుతమన్నారు. ఉన్నతమైన హిమాలయ పర్వతాలైనా, దట్టమైన అడవులైనా, పొడిబారిన ఎడారులైనా, అందమైన బీచ్ లు, సాహస క్రీడలైనా, ధ్యానకేంద్రాలైనా భారతదేశంలో అందరికీ అన్నీ ఉన్నాయన్నారు. భారతదేశం తన జి 20 అధ్యక్షతన దేశ వ్యాప్తంగా దాదాపు 100 నగరాలలో 200 సమావేశాలు ఏర్పాటు చేసిందని, దేని వలన ప్రతి అనుభవమూ మరొక దానికి భిన్నంగా ఉంటుందని చెప్పారు. "ఈ సమావేశాలకు ఇప్పటికే హాజరైన మీ మిత్రులను అడిగితే, ఏ ఇద్దరి అనుభవమూ ఒక రకంగా ఉండదని నేను కచ్చితంగా చెప్పగలను" అన్నారు.
పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సుసంపన్నమైన దేశ వారసత్వ సంపదను కాపాడటం భారత పర్యాటక రంగానికి కీలకమని ప్రధాని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోని అన్ని ప్రధాన మతాలవారినీ భారత పర్యాటకరంగం ఆకట్టుకుంటుందన్న విషయాన్ని కూడా ప్రధాని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆధ్యాత్మిక పర్యాటకాన్ని అభివృద్ధి చేయటం మీద కూడా దృష్టి సారించిన సంగతి చెబుతూ, వారణాశి తదితర ఆధ్యాత్మిక నగరాలలో మౌలిక సదుపాయాలు పెంచటం ద్వారా పది రెట్లమంది యాత్రికులు పెరిగి ఇప్పుడు 7 కోట్లకు చేరారన్నారు. భారతదేశం ఇప్పుడు సరికొత్త పర్యాటక ప్రదేశాలను సృష్టిస్తున్నదని చెబుతూ, ప్రపంచంలోనే ఎత్తైన ఐక్యతా విగ్రహాన్ని ఉదహరించారు. అది ప్రారంభమైన ఏడాదిలోపే 27 లక్షలమంది యాత్రికులను ఆకట్టుకున్న విషయం గుర్తు చేశారు. గడిచిన తొమ్మిదేళ్లలో దేశంలోని మొత్తం పర్యాటక పర్యావరణాన్ని అభివృద్ధి చేయటం మీద దృష్టిపెట్టామన్నారు. రవాణా మౌలిక సదుపాయాలు, ఆతిథ్యం, నైపుణ్యాభివృద్ధి, చివరికి వీసా వ్యవస్థ దాకా సంస్కరణల్లో పర్యాటకరంగాన్ని కీలకంగా మార్చామన్నారు. ఉపాధి కల్పనలోనూ, సామాజిక సమ్మిళితి లోనూ, ఆర్థికాభివృద్ధిలోనూ ఆతిథ్య రంగానికి అవకాశం ఎక్కువగా ఉందని చెప్పారు. పైగా, ఈ రంగంలో మిగిలిన రంగాలకంటే ఎక్కువగా మహిళలకు, యువతకు అవకాశాలు లభిస్తాయన్నారు. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలసాధన వేగవంతం చేయటంలో పర్యాటక రంగ ప్రాధాన్యాన్ని భారతదేశం కూడా గుర్తించటం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
పరస్పరం సంబంధమున్న ఐదు ప్రాధాన్యతాంశాలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అవి - హరిత పర్యాటకం, డిజిటైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక రంగ ఎంఎస్ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్ మెంట్. ఇవి భారతదేశ ప్రాధాన్యాలే కాక అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలకు అద్దం పడుతున్నాయని కూడా స్పష్టం చేశారు. కృత్రిమ మేథ. అగ్మెంటెడ్ రియాలిటీ లాంటి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ నవకల్పనలకు బాటలు వేయాలని సూచించారు. భారతదేశం ఈ దిశగా కృషిచేస్తూ, దేశంలో మాట్లాడే వివిధ భాషలకు తక్షణ అనువాదం అందించే కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వాలు, వ్యాపార దక్షులు, మదుపుదారులు, మేధావుల మధ్య సహకారం, సమన్వయం ఉంటే పర్యాటకరంగంలో సాంకేతికత వినియోగ వేగాన్ని పెంచవచ్చునన్నారు. . పర్యాటక రంగ కంపెనీల వ్యాపార నిర్వహణను సులభతరం చేస్తూ నిబంధనల సడలింపు ద్వారా వాటికి సులభంగా పెట్టుబడులు లభించటానికి, నైపుణ్యాభివృద్ధి ద్వారా నిపుణులు అందుబాటులో ఉంచటానికి కృషి జరగాలని సూచించారు.
“తీవ్రవాదం విభజిస్తుంది, పర్యాటకం ఏకం చేస్తుంది" అని ప్రధాని వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలనూ ఏకం చేసి సామరస్య సమాజాన్ని సృష్టించే శక్తి పర్యాటక రంగానికి ఉందని అన్నారు. పర్యాటక మంత్రుల సమావేశంలో జరిగే చర్చలు, గోవా రోడ్ మ్యాప్ పర్యాటకరంగంలో మార్పుకు ఉన్న శక్తిని సాకారం చేయగలవని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. భారతదేశపు జి 20 అధ్యక్షత లక్ష్యమైన వసుధైవ కుటుంబకం - 'ఒక కుటుంబం, ఒక భూమి, ఒక భవిష్యత్తు' ప్రపంచ పర్యాటకానికి సైతం వర్తిస్తుందన్నారు.
భారతదేశం పండుగలకు నిలయమని చెబుతూ గోవాలో త్వరలో జరగబోయే సావో, జోవో వేడుకలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక ఎన్నికలను ప్రస్తావిస్తూ, భారతదేశంలో ప్రజాస్వామ్య వేడుకలను కూడా చూడాల్సిందిగా విదేశ ప్రముఖులకు సూచించారు. ప్రజాస్వామ్య మాతృదేశంలో ఈ వేడుకలలో వందకోట్ల మంది వోటర్లు దాదాపు నెలరోజులకు పైగా పాల్గొని ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం ప్రకటించటం దీనికి ప్రాధాన్యం తెచ్చిపెడుతుందన్నారు. పది లక్షలకు పైగా వోటింగ్ కేంద్రాలతో వైవిధ్యభరితంగా ఉండే ఈ ప్రక్రియ చూడటానికి ప్రదేశాలకు కొరతే ఉండదన్నారు. ప్రజాస్వామ్య వేడుకలు చూడటానికి రావలసిందిగా అతిథులను ఆహ్వానిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.