ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు గోవాలో జరిగిన జి 20 ఇంధన మంత్రుల సమావేశంలో వీడియో సందేశం ద్వారా
ప్రసంగించారు.
భారతదేశానికి వచ్చిన ప్రముఖులకు స్వాగతం పలికిన ప్రధాన మంత్రి, భవిష్యత్తు, సుస్థిరత, వృద్ధి , అభివృద్ధి గురించి ఏ చర్చ అయినా ఇంధనం గురించిన ప్రస్తావన లేకుంటే అసంపూర్ణమని, ఎందుకంటే ఇంధనం అన్ని స్థాయిలలో వ్యక్తులు, దేశాల అభివృద్ధిని ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఇంధన మార్పు విషయంలో ప్రతి దేశానికి భిన్నమైన వాస్తవికత , మార్గం ఉన్నప్పటికీ, ప్రతి దేశం లక్ష్యాలు ఒకటేనని తాను గట్టిగా నమ్ముతున్నట్టు ప్రధాన మంత్రి చెప్పారు. హరిత వృద్ధి, ఇంధన మార్పు లో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ, భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం అనీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థ అని, అయినప్పటికీ దాని వాతావరణ కట్టుబాట్ల వైపు బలంగా కదులుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. భారతదేశం తన శిలాజేతర స్థాపిత విద్యుత్ సామర్థ్య లక్ష్యాన్ని తొమ్మిదేళ్ల ముందుగానే సాధించిందని, తనకంటూ ఒక ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందని ప్రధాన మంత్రి తెలియజేశారు. 2030 నాటికి శిలాజేతర స్థాపిత సామర్థ్యాన్ని 50 శాతం సాధించాలని దేశం యోచిస్తోందని ఆయన పేర్కొన్నారు. "సౌర, పవన విద్యుదుత్పత్తిలో భారతదేశం కూడా ప్రపంచ సారథ్య దేశాలలో ఒకటి" అని ప్రధాన మంత్రి అన్నారు. పావగడ సోలార్ పార్కు , మొధేరా సోలార్ విలేజ్ లను సందర్శించడం ద్వారా క్లీన్ ఎనర్జీ పట్ల భారతదేశ నిబద్ధతను , స్థాయిని వీక్షించే అవకాశం వర్కింగ్ గ్రూప్ ప్రతినిధులకు లభించిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
గడచిన తొమ్మిదేళ్లలో దేశం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, భారతదేశం 190 మిలియన్లకు పైగా కుటుంబాలను ఎల్ పిజితో అనుసంధానం చేసిందని, అదే సమయంలో ప్రతి గ్రామాన్ని విద్యుత్ తో అనుసంధానించే చారిత్రాత్మక మైలురాయిని నమోదు చేసిందని ప్రధాన మంత్రి తెలియజేశారు. కొన్నేళ్లలో జనాభాలో 90 శాతానికి పైగా కవర్ అయ్యే విధంగా పైపుల ద్వారా వంటగ్యాస్ అందించేందుకు కృషి చేస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. "అందరికీ సమ్మిళిత, స్థితిస్థాపక, సమానమైన స్థిరమైన ఇంధనం కోసం పనిచేయడమే మా ప్రయత్నం" అని ఆయన అన్నారు.
2015 లో, భారతదేశం ఎల్ఇడి లైట్ల ఉపయోగం కోసం ఒక పథకాన్ని ప్రారంభించడం ద్వారా ఒక చిన్న ఉద్యమాన్ని ప్రారంభించిందని, ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్ఇడి పంపిణీ కార్యక్రమంగా మారిందని, ఇది సంవత్సరానికి 45 బిలియన్ యూనిట్లకు పైగా ఇంధనాన్ని ఆదా చేస్తుందని ప్రధాన మంత్రి తెలియజేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవసాయ పంపు సోలారైజేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడం, 2030 నాటికి 10 మిలియన్ల వార్షిక అమ్మకాలను భారతదేశ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్ అంచనాను కూడా ఆయన ప్రస్తావించారు. 2025 నాటికి దేశం మొత్తానికి విస్తరింప చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 20 శాతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ ను ఈ ఏడాది ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. భారతదేశాన్ని డీకార్బనైజ్ చేయడం కోసం ఒక ప్రత్యామ్నాయంగా గ్రీన్ హైడ్రోజన్ పై దేశం లక్ష్య సంకల్పంతో పనిచేస్తోందని, గ్రీన్ హైడ్రోజన్ , దాని ఉత్పన్నాల ఉత్పత్తి, వినియోగం , ఎగుమతి కోసం భారతదేశాన్ని గ్లోబల్ హబ్ గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రధాన మంత్రి చెప్పారు.
సుస్థిరమైన, న్యాయమైన, సరసమైన, సమ్మిళిత , స్వచ్ఛమైన ఇంధన మార్పు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి ప్రపంచం జి 20 సమూహం వైపు చూస్తోందని పేర్కొన్న ప్రధాన మంత్రి, గ్లోబల్ సౌత్ ను ముందుకు తీసుకెళ్లడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో కూడిన ఆర్థిక సహాయం అందించడం ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. సాంకేతిక అంతరాలను పూడ్చడానికి, ఇంధన భద్రతను ప్రోత్సహించడానికి , సరఫరా గొలుసులను వైవిధ్యపరచడానికి మార్గాలను కనుగొనాలని ఆయన స్పష్టం చేశారు. 'భవిష్యత్తు కోసం ఇంధనాలు'పై సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించిన ప్రధాన మంత్రి, 'హైడ్రోజన్ పై ఉన్నత స్థాయి సూత్రాలు' సరైన దిశలో ఒక అడుగు అని వ్యాఖ్యానించారు.
అంతర్జాతీయ గ్రిడ్ ఇంటర్ కనెక్షన్లు ఇంధన భద్రతను పెంపొందిస్తాయని, భారత్ తన పొరుగు దేశాలతో ఈ పరస్పర ప్రయోజనకరమైన సహకారాన్ని ప్రోత్సహిస్తోందని ఆయన అన్నారు. ఇంటర్ కనెక్టెడ్ గ్రీన్ గ్రిడ్ ల విజన్ ను సాకారం చేయడం ద్వారా మార్పు తీసుకురావచ్చన్నారు. “ఇది మనమందరం మన వాతావరణ లక్ష్యాలను చేరుకోవడానికి, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడానికి , మిలియన్ల గ్రీన్ ఉద్యోగాలను సృష్టించడానికి వీలు కల్పిస్తుంది" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమికి చెందిన గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్ - 'వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్'లో భాగస్వాములు కావాలని పాల్గొనే దేశాలకు ఆయన పిలుపు ఇచ్చారు.
పరిసరాలను సంరక్షించడం సహజం లేదా సాంస్కృతికం కావచ్చు, కానీ భారతదేశ సంప్రదాయ విజ్ఞానం మిషన్ మిషన్ లైఫ్- లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్ మెంట్- ను బలోపేతం చేస్తుందని, ఇది మనలో ప్రతి ఒక్కరినీ వాతావరణ ఛాంపియన్ గా మారుస్తుందని ప్రధాన మంత్రి చెప్పారు. ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధాన మంత్రి, మన ఆలోచనలు, చర్యలు ఎల్లప్పుడూ మన 'ఒకే భూమి'ని పరిరక్షించడానికి, మన 'ఒకే కుటుంబం' ప్రయోజనాలను పరిరక్షించడానికి ఇంకా మనం ఎలా మార్పు చెందినా హరిత సహిత 'ఒకే భవిష్యత్తు' వైపు ముందుకు సహాయపడాలని స్పష్టం చేశారు.