ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అవినీతి నిరోధంపై కోల్‌కతాలో నిర్వహించిన జి-20 సచివుల స్థాయి సమావేశంలో వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ముందుగా నోబెల్ పురస్కార గ్రహీత అయిన గురుదేవుడు రవీంద్రనాథ్ టాగూర్ నగరం కోల్‌కతా వచ్చిన ప్రముఖులకు ఆయన స్వాగతం పలికారు. అవినీతి నిరోధంపై జి-20 సచివుల స్థాయి సమావేశం ప్రత్యక్షంగా నిర్వహించడం ఇదే తొలిసారి అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఠాగూర్ రచనలను ప్రస్తావిస్తూ- ఎవరికైనా దురాశ తగదని, అది సత్యాన్వేషణకు అడ్డుగోడగా నిలుస్తుందని హెచ్చరించారు. ఈ మేరకు ‘మా గృథా’.. అంటే- దురాశకు తావుండరాదు’ అన్న ప్రాచీన భారతీయ ఉపనిషత్తు ఉద్బోధను ప్రధాని ఉటంకించారు.
ఏ దేశంలోనైనా అవినీతి దుష్ప్రభావం అత్యధికంగా పేదలు-అట్టడుగు వర్గాలపైనే పడుతుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఇది వనరుల వినియోగంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, మార్కెట్‌లను తప్పుదోవ పట్టిస్తుందని, సేవల ప్రదానాన్ని దెబ్బతీస్తుందని, వీటన్నిటి పర్యవసానంగా ప్రజల జీవన నాణ్యత దెబ్బతింటుందని స్పష్టం చేశారు. కౌటిల్యుని అర్థశాస్త్రాన్ని ప్రస్తావిస్తూ- గరిష్ఠ స్థాయిలో ప్రజా సంక్షేమం కోసం జాతీయ వనరులు పెంచుకోవడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్నారని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ లక్ష్యసాధన దిశగా అవినీతిని ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతయినా ఉందని ఆయన నొక్కిచెప్పారు. ప్రజల తరఫున ఇది ప్రభుత్వ పవిత్ర కర్తవ్యమని స్పష్టం చేశారు.
దేశంలో పారదర్శక-జవాబుదారీతనంతో కూడిన పర్యావరణ వ్యవస్థ సృష్టికి ప్రభుత్వం సాంకేతికతను, ఇ-పరిపాలనను సద్వినియోగం చేసుకుంటున్నదని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆ మేరకు “అవినీతి సమూల నిర్మూలనపై భారతదేశానికి పటిష్ట విధానం ఉంది” అని వివరించారు. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలలో నిధుల దుర్వినియోగం, స్వాహాకు తావులేకుండా చూస్తున్నట్లు ఆయన తెలిపారు. దీనివల్ల దేశంలోని కోట్లాది ప్రజల బ్యాంకు ఖాతాలలోకి 360 బిలియన్ డాలర్లకుపైగా విలువైన ప్రత్యక్ష ప్రయోజనాలు బదిలీ అవుతున్నాయని పేర్కొన్నారు. తద్వారా 33 బిలియన్ డాలర్లకుపైగా ప్రజాధనం ఆదా అయిందని ప్రధానమంత్రి వెల్లడించారు. వ్యాపారాల కోసం ప్రభుత్వం వివిధ విధానాలను సరళీకరించిందని ప్రధాని తెలిపారు. ప్రభుత్వ సేవల యాంత్రీకరణ, డిజిటలీకరణతో సంపద సృష్టితో నిమిత్తంలేని వారు దాన్ని అనుభవించే అవకాశవాద కార్యకలాపాలకు వీల్లేకుండా చేశామని ఆయన ఉదాహరించారు. “ప్రభుత్వపరంగా కొనుగోళ్లలో మా ప్రభుత్వంలోని ఇ-మార్కెట్ ప్లేస్ లేదా ‘జిఇఎం’ పోర్టల్ ఎనలేని పారదర్శకత తెచ్చింది” అని ప్రధానమంత్రి తెలిపారు. మరోవైపు ‘ఆర్థిక నేరగాళ్ల చట్టం-2018’ అమలులోకి తేవడాన్ని ప్రస్తావిస్తూ- ఆర్థిక నేరగాళ్లను ప్రభుత్వం నీడలా వెంటాడుతున్నదని, ఇటువంటి వారితోపాటు దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల నుంచి 1.8 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు రాబట్టినట్లు ప్రధాని వివరించారు. ఇందులో భాగంగా 2014 నుంచి 12 బిలియన్ డాలర్లకుపైగా విలువైన నేరగాళ్ల ఆస్తులను కేసులకు జోడించడంలో అక్రమార్జన తరలింపు నిరోధక చట్టం తోడ్పాటు గురించి కూడా ఆయన వెల్లడించారు.
భారత ప్రధాని హోదాలో 2014లో తాను పాల్గొన్న తొలి జి-20 శిఖరాగ్ర సదస్సులో జి-20 దేశాలుసహా దక్షిణార్థ గోళంలోని దేశాలకు చెందిన ఆర్థిక నేరగాళ్లు పారిపోవడంపై సవాళ్లను ప్రస్తావించడాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. పరారీలోగల ఆర్థిక నేరగాళ్లపై చర్యలతోపాటు ఆస్తుల రికవరీ దిశగా తొమ్మిది అంశాల కార్యాచరణను కూడా సమర్పించినట్లు తెలిపారు. దీనిపై 2018నాటి జి-20 శిఖరాగ్ర సదస్సులో కార్యాచరణ బృందం నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. సమాచార భాగస్వామ్యం ద్వారా చట్టాల అమలులో సహకారం, ఆస్తుల రికవరీ యంత్రాంగాన్ని బలోపేతం చేయడం, అవినీతి నిరోధక అధికారుల నిజాయితీ-ప్రభావాల పెంపు వంటి మూడు ప్రాధాన్య రంగాల్లో చర్య ఆధారిత, ఉన్నత స్థాయి సూత్రాల అనుసరణను ప్రధానమంత్రి స్వాగతించారు. సరిహద్దులు దాటి పారిపోయేందుకు నేరగాళ్లు చట్టపరమైన లొసుగులను వాడుకోకుండా నిరోధించడానికి చట్టాల అమలు వ్యవస్థల మధ్య అనధికారిక సహకారంపై అవగాహన కుదరడం హర్షణీయమని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
అక్రమ ఆస్తులను సకాలంలో కనుగొనడానికే కాకుండా నేరపూరిత ఆర్జనను గుర్తించడానికీ సమ ప్రాధాన్యం ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా అన్ని దేశాలూ తమ దేశీయ ఆస్తుల రికవరీ యంత్రాంగాల మెరుగును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. అలాగే విదేశీ ఆస్తుల రికవరీని వేగిరం చేయడానికి నేరారోపణ-ఆధారిత జప్తు విధానాలను ఉపయోగించడం ద్వారా జి-20 దేశాలు ప్రపంచానికి అనుసరణీయ మార్గం చూపవచ్చునని శ్రీ మోదీ సూచించారు. తద్వారా న్యాయ ప్రక్రియ ముగిసిన తర్వాత నేరగాళ్లను త్వరగా స్వదేశాల్లోని చట్టాల అమలు సంస్థకు తిరిగి అప్పగించడం సులువు కాగలదన్నారు. “అవినీతిపై మన సామూహిక పోరాటానికి ఇది బలమైన సంకేతమిస్తుంది” అని ఆయన నొక్కి చెప్పారు.
అవినీతిపై యుద్ధంలో జి-20 దేశాల సమష్టి కృషి గణనీయంగా తోడ్పడుతుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. అలాగే అంతర్జాతీయ సహకారం మెరుగుదల, అవినీతి మూలకారణాల ఏరివేత వంటి పటిష్ట చర్యల అమలుద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అవినీతిపై పోరులో ఆడిట్ సంస్థల పాత్రను కూడా శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. చివరగా- మన పరిపాలన, న్యాయ వ్యవస్థల బలోపేతం సహా విలువ వ్యవస్థలలో నైతికత-నిజాయితీతో కూడిన సంస్కృతిని ప్రోత్సహించాలని ప్రతినిధులను కోరారు. “మనం ఇలా చేయడం ద్వారా మాత్రమే సమధర్మ, సుస్థిర సమాజానికి పునాది వేయగలం. ఈ నేపథ్యంలో ప్రస్తుత సమావేశం నిర్మాణాత్మకంగా, విజయవంతంగా సాగాలని కోరుతూ మీకందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని ప్రధానమంత్రి తన ప్రసంగం ముగించారు.