Quote· “ప్రపంచంలోని ప్రధాన దేశాలు లేదా అంతర్జాతీయ వేదికలన్నిటా నేడు భారత్‌పై విశ్వాసం మునుపటికన్నా బలపడింది”
Quote· “వికసిత భారత్‌ పురోగమన వేగం అత్యద్భుతం”
Quote· “దేశంలోని అనేక ఆకాంక్షాత్మక జిల్లాలు ఇప్పుడు స్ఫూర్తిదాయక జిల్లాలుగా రూపాంతరం చెందాయి”
Quote· “బ్యాంకింగ్ సౌలభ్యం లేనివారికి బ్యాంకింగ్ సేవలు... అభద్రతలో ఉన్నవారికి భద్రత... నిధులందని వారికి నిధుల లభ్యత మా వ్యూహంలో భాగం”
Quote· “వ్యాపార నిర్వహణ భయాన్ని వాణిజ్య సౌలభ్యంగా మార్చాం”
Quote· “భారత్‌ తొలి 3 పారిశ్రామిక విప్లవాలను కోల్పోయినా... నాలుగో విప్లవంలో ప్రపంచంతో ముందడుగుకు సిద్ధంగా ఉంది”
Quote· “వికసిత భారత్‌ దిశగా దేశ పురోగమనంలో ప్రైవేట్ రంగాన్ని ఓ కీలక భాగస్వామిగా మా ప్రభుత్వం పరిగణిస్తుంది”
Quote· “కేవలం పదేళ్లలోనే 25 కోట్ల మంది భారతీయులు పేదరిక విముక్తులయ్యారు”

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఈటీ నౌ’ ప్రపంచ వాణిజ్య సదస్సు-2025లో ఇవాళ ప్రసంగించారు. మూడోదఫా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వ పాలనలో భారత్‌ సరికొత్త వేగంతో ముందంజ వేస్తుందని మునుపటి ‘ఈటీ నౌ’ సదస్సులో తాను సవినయంగా ప్రకటించానని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. ఆ వేగం ఇప్పుడు సుస్పష్టంగా కనిపిస్తున్నదని, దీనికి యావద్దేశం పూర్తి మద్దతు ఇస్తున్నదని సంతృప్తి వ్యక్తం చేశారు. వికసిత భారత్‌పై తమ నిబద్ధతకు అపార మద్దతు ప్రకటించిన ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, న్యూఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన భారత్‌ స్వప్న సాకారంలో పౌరులందరూ భుజం కలిపి నడుస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

   ఫ్రాన్స్‌, అమెరికాలలో పర్యటన అనంతరం నిన్న స్వదేశం చేరుకున్న ప్రధానమంత్రి- “ప్రపంచంలోని ప్రధాన దేశాలు లేదా అంతర్జాతీయ వేదికలన్నిటా నేడు భారత్‌పై విశ్వాసం మునుపటికన్నా బలపడింది” అని వ్యాఖ్యానించారు. కృత్రిమ మేధపై పారిస్‌లో నిర్వహించిన కార్యాచరణ సదస్సులోనూ ఈ భావన ప్రతిబింబించిందని ఆయన గుర్తుచేశారు. “ప్రపంచ భవిష్యత్తుపై చర్చలలో నేడు కేంద్ర స్థానంలోగల భారత్‌, కొన్ని అంశాల్లో కాస్త ముందంజలోనే ఉంది” అని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఇదంతా 2014 నుంచి దేశంలో మొదలైన సరికొత్త  సంస్కరణల విప్లవ ఫలితమేనని ఆయన అభివర్ణించారు. గత దశాబ్దంలో భారత్‌ ప్రపంచంలోని 5 అతిపెద్ద అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థల జాబితాలో స్థానం పొందడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. వికసిత భారత్ ప్రగతి వేగాన్ని ఈ పరిణామం సూచిస్తున్నదని వివరించారు. మరి కొన్నేళ్లలోనే మన దేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడాన్ని ప్రజలు త్వరలో చూడగలరని ధీమా ప్రకటించారు. భారత్‌ వంటి యువ దేశానికి ఈ వేగం ఎంతో అవసరమని, దీన్ని ఇదేవిధంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
 

|

   కఠోర కృషికి ఇచ్చగించని మునుపటి ప్రభుత్వాలు సంస్కరణలను నిర్లక్ష్యం చేశాయని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దీనికి భిన్నంగా దేశంలో నేడు దృఢ నిశ్చయంతో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పారు. కీలక సంస్కరణలు దేశంలో ఎలా గణనీయ మార్పులు తేగలవనే అంశంపై  ఆనాడు ఎలాంటి చర్చకూ తావుండేది కాదని ప్రముఖంగా ప్రస్తావించారు. వలసవాద భారం మోస్తూ జీవించడం ఒక అలవాటుగా మారిపోయిందని పేర్కొన్నారు. స్వాతంత్య్రం  తర్వాత కూడా బ్రిటిష్ హయాం నాటి కొన్ని పద్ధతులు కొనసాగాయని చెప్పారు. ఆ మేరకు “న్యాయంలో జాప్యం-న్యాయం నిరాకరించడమే”ననే నానుడి చాలా కాలంపాటు వినిపిస్తూ వచ్చినా, ఆ సమస్య పరిష్కారానికి నిర్దిష్ట చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని ఆయన ఉదాహరించారు. క్రమేణా ప్రజలు కూడా ఇలాంటి విషయాలకు అలవాటు పడి, చివరకు మార్పు అవసరాన్ని కూడా గుర్తించలేని స్థితికి చేరారని ప్రధాని వివరించారు. మంచి విషయాలపై చర్చలకు తావివ్వని, అలాంటి ప్రయత్నాలను శాయశక్తులా నిరోధించే వాతావరణం ఉండేదన్నారు. ప్రజాస్వామ్యంలో సానుకూల అంశాలంపై చర్చలు, సంప్రదింపులు అత్యంత కీలకమని శ్రీ మోదీ వివరించారు. కానీ, ప్రతికూల వ్యాఖ్యలు చేయడాన్ని లేదా వ్యతిరేకత వ్యాప్తిని ప్రజాస్వామ్యంగా పరిగణించే సంప్రదాయం సృష్టించారని పేర్కొన్నారు. ఒకవేళ సానుకూల అంశాలపై చర్చించినా దాన్ని ప్రజాస్వామ్య బలహీనతగా ముద్ర వేశారన్నారు. ఇటువంటి ధోరణి నుంచి బయటపడటం ఎంతో అవసరమని ఆయన స్పష్టం చేశారు.
   భారత్‌లో వలస పాలన బలోపేతం, భారత పౌరులను శిక్షించే లక్ష్యంతో రూపొందిన 1860 నాటి శిక్షాస్మృతి నిన్నమొన్నటిదాకా మన దేశంలో అమలైందని శ్రీ మోదీ గుర్తుచేశారు. శిక్షించడమనే దుస్సంప్రదాయంలో కూరుకుపోయిన వ్యవస్థ న్యాయం చేయలేకపోవడం దీర్ఘకాలిక జాప్యానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 7-8 నెలల కిందట సరికొత్త భారత న్యాయస్మృతి అమలులోకి రావడంతో గమనార్హమైన మార్పులు వచ్చాయని ఆయన వ్యాఖ్యానించారు. మూడు హత్యల నేరంపై కేసు నమోదు నుంచి విచారణ ప్రక్రియ కేవలం 14 రోజుల్లో పూర్తికాగా, దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందని వెల్లడించారు. అలాగే ఒక మైనర్ హత్య కేసుపై విచారణ 20 రోజుల్లోనే ముగిసిందని పేర్కొన్నారు. గుజరాత్‌లో 2024 అక్టోబరు 9న సామూహిక అత్యాచారం కేసు నమోదు కాగా, అదే నెల 26కల్లా అభియోగపత్రం దాఖలైందని, నేడు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు ఇచ్చిందని ప్రధాని ఉదాహరించారు. ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న మరో ఉదంతాన్ని ఉటంకిస్తూ- 5 నెలల చిన్నారిపై నేరంలో డిజిటల్‌ ఆధారాలతో నేర నిరూపణ ద్వారా కోర్టు దోషికి 25 ఏళ్ల జైలు శిక్ష విధించిందని వివరించారు. అలాగే ఒక రాష్ట్రంలో అత్యాచారం, హత్య కేసు నిందితుడు, ఇంకొక రాష్ట్రంలో ఓ నేరానికి శిక్ష అనుభవించిన వ్యక్తేనని గుర్తించి అరెస్ట్‌ చేయడంలో ‘ఇ-ప్రిజన్ మాడ్యూల్’ తోడ్పడిందని చెప్పారు. ఈ విధంగా ప్రజలకు సకాలంలో న్యాయం లభిస్తున్న ఉదంతాలు నేడు ఎన్నో ఉన్నాయని ఆయన అన్నారు.
 

|

   ఆస్తి హక్కు సంబంధిత ఒక ప్రధాన సంస్కరణను ప్రస్తావిస్తూ- ఏ దేశంలోనైనా ప్రజలకు ఆస్తి హక్కు లేకపోవడం తీవ్రమైన సమస్యేనని ఐక్యరాజ్యసమితి అధ్యయనం స్పష్టం చేయడాన్ని శ్రీ మోదీ ఉటంకించారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందికి చట్టపరమైన ఆస్తి పత్రాలు లేవని పేర్కొంటూ, పేదరిక విముక్తిలో ఆస్తి హక్కు ఎంతగానో తోడ్పడుతుందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలకు ఈ చిక్కుల గురించి తెలిసి కూడా అలాంటి సవాళ్ల పరిష్కారంలో కృషి చేయలేదని పేర్కొన్నారు. ఈ విధానం దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేదని లేదా నడిపించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 3 లక్షలకుపైగా గ్రామాల్లో డ్రోన్ సర్వే ద్వారా 2.25 కోట్లమందికిపైగా ప్రజలు ఆస్తి హక్కు కార్డులు పొందారని శ్రీ మోదీ వెల్లడించారు. ఈ మేరకు ‘స్వామిత్వ’ యోజన కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.100 లక్షల కోట్ల విలువైన ఆస్తి వివాద విముక్తమైందని ఆయన తెలిపారు. ఈ ఆస్తి అంతకుముందు కూడా ఉన్నప్పటికీ, దానిపై హక్కు నిర్ధారణ కానందువల్ల ఆర్థికాభివృద్ధికి వినియోగించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. ఆస్తి హక్కు నిర్ధారణ పత్రాలు లేనందువల్ల గ్రామీణులకు బ్యాంకు రుణాలు దక్కలేదని శ్రీ మోదీ ప్రముఖంగా పేర్కొన్నారు.
   ఈ సమస్యకు ఇప్పుడు శాశ్వత పరిష్కారం లభించిందని, స్వామిత్వ యోజన ఆస్తి కార్డులతో ప్రజలు ఎన్ని రకాలుగా ప్రయోజనం పొందారో దేశం నలుమూలల నుంచి అందుతున్న నివేదికలు స్పష్టం చేస్తున్నాయని ప్రధాని చెప్పారు. ఈ పథకం కింద ఆస్తి కార్డు పొందిన రాజస్థాన్‌ మహిళ ఒకరితో ఇటీవలి తన సంభాషణను ప్రధాని వెల్లడించారు. ఆమె కుటుంబం 20 ఏళ్లుగా ఓ చిన్న ఇంట్లో నివసిస్తుండగా, ఆస్తి కార్డు పొందడంతో బ్యాంకు నుంచి దాదాపు రూ.8 లక్షలు రుణంగా లభించిందని చెప్పారు. ఈ డబ్బుతో, ఆమె ఒక దుకాణం ప్రారంభించిందని, దానిపై వచ్చే ఆదాయంతో ఇప్పుడు పిల్లలను ఉన్నత విద్య చదివిస్తున్నదని తెలిపారు. మరొక రాష్ట్రం నుంచి ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ- ఓ గ్రామస్థుడు తన ఆస్తి కార్డుతో బ్యాంకు నుంచి రూ.4.5 లక్షల రుణం పొంది, రవాణా వ్యాపారం కోసం వాహనం కొన్నాడని చెప్పారు. మరొక గ్రామంలోని రైతు తన భూమిలో ఆధునిక నీటిపారుదల సౌకర్యాల ఏర్పాటు కోసం ఆస్తి కార్డు ద్వారా రుణం తీసుకోగలిగాడని తెలిపారు. ఈ విధంగా  సంస్కరణలతో గ్రామాలు, పేదలకు కొత్త ఆదాయ మార్గాలు అందివచ్చాయని ప్రధాని వివరించారు. సంస్కరణ-సామర్థ్యం-రూపాంతరీకరణకు ఇవన్నీ సజీవ తార్కాణాలని పేర్కొన్నారు. కానీ, సాధారణంగా పత్రికలు/టీవీల వార్తా కథనాల్లో ఇవేవీ కనిపించవని ప్రధాని చమత్కరించారు.

 

|

 స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో అనేక జిల్లాలు పరిపాలనా వైఫల్యాల వల్ల అభివృద్ధి చెందకుండా ఉండిపోయాయని ప్రస్తావించిన శ్రీ మోదీ, ఆ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సింది పోయి, వాటిని వెనకబడిన జిల్లాలుగా ముద్ర వేసి వాటి భవిష్యత్ ను గాలికి వదిలేశారని అన్నారు. ప్రభుత్వాధికారులను ఒక శిక్షగా ఆ జిల్లాలకు బదిలీపై పంపించేవారని ఆయన వ్యాఖ్యానించారు. "100కు పైగా జిల్లాలను ఆకాంక్షిత జిల్లాలుగా ప్రకటించడం ద్వారా మేము ఈ వైఖరిని మార్చాం" అని ప్రధానమంత్రి అన్నారు. క్షేత్ర స్థాయిలో పాలనను మెరుగుపరిచేందుకు యువ అధికారులను ఈ జిల్లాలకు పంపామని, వారు ఈ జిల్లాలు వెనుకబాటులో ఉన్న సూచీలపై పనిచేసి ప్రభుత్వ పథకాలను నిర్దేశిత లక్ష్యంతో  అమలు చేశారని తెలిపారు."ఈ రోజు, ఈ ఆకాంక్షాత్మక జిల్లాలు అనేకం స్ఫూర్తిదాయక జిల్లాలుగా మారాయి", అని ఆయన అన్నారు. 2018లో అస్సాంలోని బార్ పేటలో కేవలం 26 శాతం ఎలిమెంటరీ స్కూళ్లలో మాత్రమే సరైన విద్యార్థి- ఉపాధ్యాయ నిష్పత్తి ఉందని, అది ఇప్పుడు 100 శాతంగా ఉందని ఒక ఉదాహరణ గా శ్రీ మోదీ పేర్కొన్నారు. అనుబంధ పౌష్టికాహారం పొందుతున్న గర్భిణుల సంఖ్య బీహార్ లోని బెగుసరాయ్ లో 21 శాతం, యూపీలోని చందౌలిలో 14 శాతం ఉండగా, నేడు రెండు జిల్లాలు 100 శాతం సాధించాయని తెలిపారు.పిల్లల వ్యాధి నిరోధక కార్యక్రమంలో కూడా గణనీయమైన మెరుగుదల ఉందని ప్రధాన మంత్రి తెలిపారు. యూపీలోని శ్రావస్తిలో ఈ శాతం 49 శాతం నుంచి 86 శాతానికి, తమిళనాడులోని రామనాథపురంలో 67 శాతం నుంచి 93 శాతానికి పెరిగిందని చెప్పారు.ఇలాంటి విజయాలను చూసి దేశంలోని 500 బ్లాక్ లను ఆకాంక్షాత్మక బ్లాక్ లుగా ప్రకటించామని, ఈ ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు.

ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న పారిశ్రామికవేత్తల దశాబ్దాల వ్యాపార అనుభవాన్ని ప్రస్తావిస్తూ ప్రధానమంత్రి, ఒకప్పుడు భారతదేశంలో వ్యాపార వాతావరణం వారి ఆశల  జాబితాలో మాత్రమే ఉండేదని గుర్తు చేశారు. దశాబ్దం క్రితం భారతీయ బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయని, బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనంగా ఉందని, లక్షలాది మంది భారతీయులు బ్యాంకింగ్ వ్యవస్థకు వెలుపల ఉండిపోయారని ఆయన అన్నారు. రుణ సదుపాయం లభించడం అత్యంత దుర్లభంగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటని చెప్పారు. “బ్యాంకింగ్ సౌకర్యం లేని వారికి బ్యాంకింగ్ అందించడం, భద్రత లేని వారికి భద్రత కల్పించడం, నిధులు లేని వారికి నిధులు సమకూర్చడం” ప్రభుత్వ వ్యూహంగా బ్యాంకింగ్ రంగాన్ని బలోపేతం చేశామని శ్రీ మోదీ వివరించారు. ఆర్థిక సమ్మిళితం గణనీయంగా మెరుగుపడిందని, ఇప్పుడు దాదాపు ప్రతి గ్రామంలో ఐదు కిలోమీటర్ల పరిధిలో బ్యాంక్ బ్రాంచ్ లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ ఉన్నారని ఆయన పేర్కొన్నారు. పాత బ్యాంకింగ్ విధానంలో రుణాలు పొందలేని వ్యక్తులకు సుమారు రూ.32 లక్షల కోట్లు అందించిన ముద్ర యోజనను ఆయన ఉదహరించారు. ఎంఎస్ఎంఇలకు రుణాలు చాలా సులభంగా మారాయని, వీధి వ్యాపారులను కూడా సులభమైన రుణాలతో అనుసంధానించారని, రైతులకు ఇచ్చిన రుణాలు రెట్టింపు అయ్యాయని ఆయన చెప్పారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున రుణాలు అందిస్తుండగా, బ్యాంకుల లాభాలు కూడా పెరుగుతున్నాయని ప్రధానమంత్రి అన్నారు. పదేళ్ల క్రితం రికార్డు స్థాయిలో బ్యాంకు నష్టాల గురించి, ఎన్‌పిఏల (నాన్-పర్ఫార్మింగ్ అసెట్స్) గురించి పత్రికలలో ఆందోళన వ్యక్తం చేసే వార్తలు, సంపాదకీయాలు రావడం సర్వ సాధారణమని ప్రధానమంత్రి గుర్తు చేశారు. కానీ, ఈ రోజు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ప్రభుత్వ రంగ బ్యాంకులు రూ.1.25 లక్షల కోట్లకు పైగా లాభాన్ని నమోదు చేశాయని తెలిపారు. ఇది కేవలం పతాక శీర్షికల్లో వచ్చిన మార్పు కాదని, బ్యాంకింగ్ సంస్కరణలతో వచ్చిన వ్యవస్థాగత మార్పు అని, ఇది ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి నిదర్శనమని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.

|

గత దశాబ్దకాలంలో తమ ప్రభుత్వం 'వ్యాపార భయాన్ని' 'సులభతర వాణిజ్యం'గా మార్చిందని ప్రధాని చెప్పారు. జీఎస్టీ ద్వారా ఒకే పెద్ద మార్కెట్ ను ఏర్పాటు చేయడం వల్ల పరిశ్రమలు పొందిన ప్రయోజనాలను ఆయన వివరించారు. గత దశాబ్ద కాలంలో మౌలిక సదుపాయాలలో అపూర్వమైన అభివృద్ధి జరిగిందని, దీనివల్ల రవాణా సంబంధ ఖర్చులు తగ్గాయని, సామర్థ్యం పెరిగిందని ఆయన చెప్పారు. అనుమతుల విషయంలో ప్రభుత్వం వందలాది నిబంధనలను తొలగించిందని, ఇప్పుడు జన్ విశ్వాస్ 2.0 ద్వారా వీటిని మరింత తగ్గిస్తోందని శ్రీ మోదీ పేర్కొన్నారు. సమాజం పై ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించడానికి, క్రమబద్ధీకరణ కమిషన్ ను కూడా ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పారు.

భవిష్యత్తు సన్నద్ధతకు సంబంధించి భారతదేశం గణనీయమైన మార్పును చూస్తోందని చెబుతూ, మొదటి పారిశ్రామిక విప్లవం సమయంలో భారతదేశం వలస పాలన గుప్పిట్లో ఉందని, రెండో పారిశ్రామిక విప్లవం సమయంలో ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆవిష్కరణలు, కర్మాగారాలు పుట్టుకొచ్చాయని, భారత్ లో స్థానిక పరిశ్రమలు నాశనమయ్యాయని, ముడిసరుకును దేశం నుంచి బయటకు తరలించారని శ్రీ మోదీ గుర్తు చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా పరిస్థితులు పెద్దగా మారలేదని గుర్తు చేశారు. ప్రపంచం కంప్యూటర్ విప్లవం దిశగా పయనిస్తున్న సమయంలో భారత్ లో కంప్యూటర్ కొనాలంటే లైసెన్స్ పొందాల్సి వచ్చిందన్నారు. "మొదటి మూడు పారిశ్రామిక విప్లవాల నుండి భారతదేశం పెద్దగా ప్రయోజనం పొందలేకపోయినప్పటికీ, నాలుగో పారిశ్రామిక విప్లవంలో ప్రపంచంతో సరితూగడానికి దేశం ఇప్పుడు సిద్ధంగా ఉంది" అని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
 

|

"వికసిత్ భారత్ దిశగా సాగే ప్రయాణంలో ప్రయివేటు రంగాన్ని మా ప్రభుత్వం కీలక భాగస్వామిగా భావిస్తోంది" అని ప్రధాన మంత్రి అన్నారు. అంతరిక్షం సహా అనేక కొత్త రంగాలు ప్రైవేటు రంగానికి తెరుచుకున్నాయని, ఇందులో చాలా మంది యువత, స్టార్టప్ లు గణనీయమైన సహకారం అందిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నిన్నమొన్నటి వరకు ప్రజలకు అందుబాటులో లేని డ్రోన్ రంగం ఇప్పుడు యువతకు విస్తారమైన అవకాశాలను కల్పిస్తోందన్నారు. వాణిజ్య బొగ్గు గనుల రంగాన్ని ప్రైవేటు సంస్థలకు తెరిపించామని, ప్రైవేటు సంస్థలకు వేలం ప్రక్రియను కూడా సరళీకరించామని తెలిపారు. దేశ పునరుత్పాదక ఇంధన విజయాల్లో ప్రయివేటు రంగం గణనీయమైన పాత్ర పోషిస్తోందని, సామర్థ్యాన్ని పెంపొందించడానికి విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ఇటీవలి బడ్జెట్ లో గణనీయమైన మార్పు - అణు రంగాన్ని ప్రైవేటు భాగస్వామ్యానికి తెరవడం అని ఆయన చెప్పారు.

నేటి రాజకీయాలు పనితీరు ఆధారితంగా మారాయని, క్షేత్రస్థాయితో సంబంధం ఉండి ఫలితాలను అందించే వారు మాత్రమే నిలదొక్కుకుంటారనే వాస్తవాన్ని భారత ప్రజలు స్పష్టంగా చెప్పారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ప్రజాసమస్యల పట్ల ప్రభుత్వం సున్నితంగా ఉండాలని, గత విధాన నిర్ణేతలకు సున్నితత్వం, సంకల్పబలం లోపించాయని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ప్రజాసమస్యలను సున్నితంగా అర్థం చేసుకుందని, వాటి పరిష్కారానికి ఇష్టంతో, ఉత్సాహంతో అవసరమైన చర్యలు చేపట్టిందని అన్నారు. గత దశాబ్దకాలంలో మౌలిక సదుపాయాలు, సాధికారత కల్పించడం వల్ల 25 కోట్ల మంది భారతీయులు పేదరికం నుంచి బయట పడినట్టు ప్రపంచ అధ్యయనాలు చెబుతున్నాయని శ్రీ మోదీ తెలిపారు. ఈ పెద్ద సమూహం నవతరం మద్య తరగతిగా రూపు దాల్చిందని, ఇప్పుడు  మొదటి ద్విచక్ర వాహనం, మొదటి కారు మొదటి ఇల్లు గురించి వారు కలలు కంటున్నారని ఆయన అన్నారు. మధ్యతరగతిని ఆదుకునేందుకు ఇటీవలి బడ్జెట్ పన్ను కట్టనవసరం లేని పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలకు పెంచిందని, ఇది మొత్తం మధ్యతరగతిని బలోపేతం చేసి, ఆర్థిక కార్యకలాపాలకు ఊతమిస్తుందని తెలిపారు. "చురుకైన, సున్నితమైన ప్రభుత్వం వల్లనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయి" అని శ్రీ మోదీ అన్నారు.

"అభివృద్ధి చెందిన భారతదేశానికి నిజమైన పునాది విశ్వాసం. ఈ అంశం ప్రతి పౌరుడికి, ప్రతి ప్రభుత్వానికి, ప్రతి వ్యాపార నేతకు అవసరం" అని శ్రీ మోదీ స్పష్టం చేశారు. ప్రజల్లో విశ్వాసం నింపేందుకు ప్రభుత్వం పూర్తి శక్తిసామర్ధ్యాలతో పని చేస్తోందన్నారు. ఆవిష్కర్తలు తమ ఆలోచనలను అభివృద్ధి చేసుకునే వాతావరణాన్ని అందిస్తున్నామని, వ్యాపారాలకు స్థిరమైన,  సహాయక విధానాలకు భరోసా కల్పిస్తున్నామని ప్రధానమంత్రి తెలిపారు. ఈ శిఖరాగ్ర సదస్సు (ఈటీ సమిట్) ఈ నమ్మకాన్ని మరింత బలోపేతం చేయగలదన్న ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రధాని తమ ప్రసంగాన్ని ముగించారు.

 

Click here to read full text speech

 

 

 

 

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Commercial LPG cylinders price reduced by Rs 41 from today

Media Coverage

Commercial LPG cylinders price reduced by Rs 41 from today
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi encourages young minds to embrace summer holidays for Growth and Learning
April 01, 2025

Extending warm wishes to young friends across the nation as they embark on their summer holidays, the Prime Minister Shri Narendra Modi today encouraged them to utilize this time for enjoyment, learning, and personal growth.

Responding to a post by Lok Sabha MP Shri Tejasvi Surya on X, he wrote:

“Wishing all my young friends a wonderful experience and a happy holidays. As I said in last Sunday’s #MannKiBaat, the summer holidays provide a great opportunity to enjoy, learn and grow. Such efforts are great in this endeavour.”