సోనాల్ మాత శతజయంతి వేడుకల నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఆయి శ్రీ సోనాల్ మాత జన్మశతాబ్ది ఉత్సవం పవిత్ర పుష్య మాసంలో నిర్వహిస్తున్న సందర్భంగా మాత ఆశీస్సులు పొందడంపై కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పవిత్ర కార్యక్రమంలో పాలుపంచుకోవడం తన అదృష్టమని ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల నిర్వహణపై చరణ్ సమాజంతోపాటు నిర్వాహకులందర్నీ ప్రధాని మోదీ అభినందించారు. ‘‘మద్దా ధామ్ చరణ సమాజానికి భక్తి, శక్తి, ఆచార-సంప్రదాయాల కూడలిగా ఉంది. నేను శ్రీ ఆయి పాదాలకు ప్రణమిల్లి, నా భక్తిప్రపత్తులను చాటుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.
మూడు రోజులపాటు సాగిన సోనాల్ మాత జన్మశతాబ్ది వేడుకల జ్ఞాపకాలు ఇప్పటికీ తాజాగా ఉన్నాయని ప్రధాని నొక్కిచెప్పారు. భారతదేశంలో ఏ యుగంలోనూ మానవ రూపంలోని మహనీయులకు కొరత లేదనడానికి భగవతి స్వరూపిణి అయిన సోనాల్ మాత ఒక సజీవ ఉదాహరణ అని అన్నారు. ముఖ్యంగా గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాలు ఎందరో గొప్ప సాధువులకు, మహాత్ములకు పుట్టినిల్లని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లోని యావత్ మానవాళికీ వారు తమ జ్ఞానప్రకాశాన్ని పంచారని గుర్తుచేశారు. భగవాన్ దత్తాత్రేయ సహా అసంఖ్యాక సాధువులకు పవిత్ర గిర్నార్ కేంద్ర స్థానమని ఆయన పేర్కొన్నారు. ‘‘సౌరాష్ట్రలో కొనసాగే ఈ నిరంతర సాధు సంప్రదాయంలో శ్రీ సోనాల్ మాత ఆధునిక యుగానికి ఒక వెలుగులాంటిది. ఆమె ఆధ్యాత్మిక శక్తి, మానవతా ప్రబోధం, తపస్సు ఆమె వ్యక్తిత్వంలో అద్భుత దివ్య తేజస్సును సృష్టించాయి. దాన్ని మనం జునాగఢ్, మద్దాలోని సోనాల్ ధామ్‌లో ఇప్పటికీ అనుభూతి చెందుతాం’’ అని పేర్కొన్నారు.
అలాగే ‘‘సోనాల్ మాత తన జీవితాన్ని ప్రజా సంక్షేమానికే అంకిత చేశారు. ఆ మేరకు భగత్ బాపు, వినోబా భావే, రవిశంకర్ మహరాజ్, కాన్భాయ్ లహేరి, కళ్యాణ్ షేథ్ వంటి మహనీయులతో సంయుక్తంగా దేశానికే కాకుండా ఆధ్యాత్మికంగానూ ఎనలేని సేవ చేశారు’’ అని ప్రధాని కొనియాడారు. చరణ సమాజ పండితులలో ఆమెది ప్రత్యేక స్థానమని, ముఖ్యంగా తన ప్రబోధాలతో యువతరంలో చైతన్యం తెచ్చి జీవితాలను తీర్చిదిద్దుకునేలా వారికి దిశానిర్దేశం చేశారని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ఆమె సమాజ సేవను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- విద్యా వికాసంతోపాటు సమాజంలో వ్యసన విముక్తి దిశగా చేసిన కృషి అద్భుతమని ప్రధానమంత్రి ప్రశంసించా. సమాజాన్ని దురలవాట్ల నుంచి రక్షించడానికి సోనాల్ మాత కృషి చేశారని, ఇందులో భాగంగా కచ్‌లోని వోవార్ గ్రామం నుంచి భారీస్థాయిలో ప్రతిజ్ఞ కార్యాక్రమం చేపట్టారని గుర్తుచేశారు. కష్టపడి పని చేయడం, పశుపోషణ ద్వారా స్వావలంబన సాధించేలా ప్రజల్లో ఈ కార్యక్రమం మార్పు తెచ్చిందని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక, సామాజిక కార్యక్రమాలతోపాటు దేశ ఐక్యత-సమగ్రతకు బలమైన సంరక్షకురాలుగా సోనాల్ మాత తనవంతు పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ మేరకు దేశ విభజన సమయంలో జునాగఢ్ విచ్ఛిన్నానికి సాగిన కుట్రపై చండీమాతలా పోరాడారని ప్రధాని మోదీ గుర్తుచేశారు.
ప్రధాని తన ప్రసంగం కొనసాగిస్తూ- ‘‘చరణ సమాజం దేశానికి చేసిన నిరుపమాన సేవలకు శ్రీ సోనాల్ మాత గొప్ప చిహ్నం’’ అన్నారు. భారతీయ సాహిత్యంలో ఈ సమాజానికి ప్రత్యేక స్థానం, గౌరవం ఇవ్వబడినట్లు ప్రధాని గుర్తుచేశారు. ఈ మేరకు చరణ సమాజం శ్రీహరి ప్రత్యక్ష వారసులని భగవత్ పురాణం వంటి పవిత్ర గ్రంథాలు సూచిస్తున్నాయని ఆయన తెలిపారు. ఈ సమాజానికి సరస్వతీ మాత విశిష్ట ఆశీస్సులు కూడా ఉన్నాయన్నారు. ఈ సమాజంలో పూజ్య తరణ్ బాపు, పూజ్య ఇసార్ దాస్, పింగల్షి బాపు, పూజ్య కాగ్ బాపు, మేరుభా బాపు, శంకర్దన్ బాపు, శంభుదన్, భజనిక్ నారణ్‌స్వామి, హేముభాయ్ గధ్వి, పద్మశ్రీ కవి దాద్, పద్మశ్రీ భిఖుదన్ గధ్వి వంటి అనేకమంది పండితులు జన్మించారని ప్రధానమంత్రి ఉదాహరించారు.
శ్రీ సోనాల్ మాత శక్తిమంతమైన ప్రసంగాలను ప్రస్తావిస్తూ- ‘‘విస్తృత చరణ సాహిత్యం ఇప్పటికీ ఈ గొప్ప సంప్రదాయానికి నిదర్శనం. దేశభక్తి గీతాలు.. ఆధ్యాత్మిక ప్రసంగాలు వంటివేవైనా కావచ్చు- శతాబ్దాలుగా చరణ సాహిత్యం కీలక పాత్ర పోషించింది’’ అని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ఆమె సంప్రదాయ పద్ధతిలో విద్యాభ్యాసం చేయనప్పటికీ సంస్కృతం వంటి భాషలపై ఆమెకు బలమైన పట్టుతోపాటు పలు గ్రంథాలపై లోతైన జ్ఞానం ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘ఆమె స్వరంతో రామాయణ గాథను విన్నవారు దాన్ని ఎన్నటి మరువలేరు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అయోధ్యలోని శ్రీ రామ మందిరంలో జనవరి 22న ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం గురించి తెలిస్తే సోనాల్ మాత ఆనందానికి అవధులు ఉండేవికావని ప్రధాని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జనవరి 22న శుభ ముహూర్తాన ప్రతి ఇంటా శ్రీరామ జ్యోతిని వెలిగించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా నిన్న దేశవ్యాప్తంగా ప్రారంభమైన ఆలయాల పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- ‘‘మనం ఈ దిశగానూ సమష్టిగా కృషి చేయాలి... ఇలాంటి కార్యక్రమాల ద్వారా శ్రీ సోనాల్ మాత ఆనందం కూడా రెట్టింపు కాగలదని నేను కచ్చితంగా విశ్వసిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
చివరగా- మన దేశాన్ని వికసిత, స్వయం సమృద్ధ భారతంగా రూపుదిద్దడంలో శ్రీ సోనాల్ మాత స్ఫూర్తి మనకో కొత్త శక్తినిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ఈ లక్ష్యాలను సాధించడంలో చరణ సమాజ పాత్రను కూడా ఆయన గుర్తుచేస్తూ ‘‘సోనాల్ మాత ఇచ్చిన 51 ఆజ్ఞలు ఆ సమాజానికి దిశానిర్దేశం చేస్తాయి’’ అని ప్రధాని అన్నారు. సమాజంలో అవగాహన కల్పించేందుకు చరణ సమాజం నిరంతరం కృషి చేయాలని కోరారు. సామాజిక సామరస్య పటిష్టం దిశగా మద్దా ధామ్‌లో సదావ్రత యజ్ఞం నిరంతరాయంగా సాగుతుండటం అభినందనీయమన్నారు. ఇలాంటి అనేకానేక దేశ నిర్మాణ కార్యక్రమాలకు భవిష్యత్తులోనూ మద్దా ధామం ఉత్తేజమివ్వగలదని ఆకాంక్షిస్తూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.