‘‘రవాణా రంగంలో భారత్ పరుగు.. శరవేగంగా దూసుకెళ్తోంది’’;
‘‘ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంబంధిత గణాంకాలు.. పెరుగుతున్న ఆదాయం రవాణా రంగంలో కొత్త విశ్వాసం నింపగలవు’’;
‘‘మా ప్రభుత్వ వేగం.. స్థాయి భారతదేశంలో రవాణారంగ నిర్వచనాన్ని మార్చేశాయి’’;
‘‘ఆటో-ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ కీలక పాత్ర ఫలితంగా భారత్ నేడు ప్రపంచ ఆర్థికశక్తి కూడలిగా అవతరించే దశకు చేరువలో ఉంది’’;
‘‘ట్రక్కు డ్రైవర్లు.. వారి కుటుంబాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుంది’’;
‘‘కొత్త పథకం తొలి దశకింద అన్ని జాతీయ రహదారులపై ఆహారం.. స్వచ్ఛమైన తాగునీరు.. మరుగుదొడ్లు... పార్కింగ్ సహా డ్రైవర్లకు విశ్రాంతి సౌకర్యంతో 1000 ఆధునిక భవనాల నిర్మాణం సాగుతోంది’’

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని భారత మండపంలో దేశంలోనే అతిపెద్ద, తొలి రవాణా రంగ ప్రదర్శన- ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో-2024’ సంబంధిత కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు ప్రదర్శన ప్రాంగణంలో తిరుగుతూ అన్ని అంశాలనూ పరిశీలించారు. ఈ తొలి ప్రదర్శన రవాణా రంగంతోపాటు ఆటోమోటివ్ విలువ శ్రేణిలో భారతదేశ శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటుతుంది. ఇందులో భాగంగా వివిధ ఉత్పత్తుల ప్రదర్శనలు, సదస్సులు, కొనుగోలుదారు-విక్రేత సమావేశాలు, రాష్ట్రస్థాయి సదస్సులు, రహదారి భద్రత ప్రాంగణం, గో-కార్టింగ్ వంటి ప్రజాకర్షక విశేషాలు అందర్నీ ఆకట్టుకుంటాయి.

 

   ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిని ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- ఈ భారీ ప్రదర్శన నిర్వహణపై భార‌త‌దేశంలోని ఆటోమోటివ్ ప‌రిశ్ర‌మ‌ను అభినందించారు. అలాగే ఎక్స్‌ పోలో తమ ఉత్పత్తులను ప్రదర్శించిన ఉత్పత్తిదారుల కృషిని ప్రశంసించారు. దేశంలో ఇంత భారీగా అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శనను నిర్వహించడం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. అలాగే భవిష్యత్తుపై విశ్వాసం నింపుతున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌ పో-2024’ను సందర్శించాల్సిందిగా ఢిల్లీ ప్రజలకు సూచించారు. రవాణారంగం మొత్తాన్ని, సరఫరా శ్రేణి సముదాయాన్ని ఈ భారీ ప్రదర్శన ఒకే వేదికపైకి తెస్తుందని ప్రధానమంత్రి అన్నారు.

   దేశ ప్రధానిగా మొదటిసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్వహించిన తొలి రవాణా రంగ సంబంధిత సమావేశం గురించి ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఆనాటి నుంచే తాను బ్యాటరీ-విద్యుత్ వాహనాలపై నిశితంగా దృష్టి సారించానని పేర్కొన్నారు. అటుపైన రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక ఈ దిశగా గణనీయ ప్రగతిని చూడగలిగానంటూ సంతృప్తి వెలిబుచ్చారు. ఇక రాబోయే మూడో దఫాలో రవాణా రంగం కొత్త శిఖరాలను అందుకోగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని 2047 నాటికి వికసిత భారతంగా రూపుదిద్దే సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తూ ఇందులో రవాణా రంగం కీలకపాత్ర పోషిస్తుందని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ‘ఇదే సమయం... సరైన తరుణం’ అంటూ ఎర్రకోట బురుజుల తానిచ్చిన పిలుపును ఆయన పునరావృతం చేశారు. ప్ర‌స్తుత కాలం రవాణా రంగంలో స్వర్ణయుగానికి నాంది అని నొక్కిచెప్పారు. ఆ మేరకు ‘‘రవాణా రంగంలో భారత్ పరుగు.. శరవేగంగా దూసుకెళ్తోంది’’ అని వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ శరవేగంగా వృద్ధి చెందుతున్నదని, ప్రస్తుత ప్రభుత్వ మూడో దఫాలో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించగలదని భవిష్యవాణి వినిపించారు.

   దేశంలో గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరిస్తూ- దాదాపు 25 కోట్ల మంది ప్రజలు పేదరిక విముక్తులయ్యారని ప్రధాని వెల్లడించారు. ఒక పౌరుడు పేదరికం నుంచి బయట పడటమంటే- కనీసం సైకిల్ లేదా ద్విచక్ర/చతుశ్చక్ర వాహనాల్లో ఏదో ఒకటి వారికి తొలి అవసరం కాగలదని ఆయన ఉద్ఘాటించారు. ఈ నయా మధ్యతరగతి ఆవిర్భావాన్ని ప్రస్తావిస్తూ- అటువంటి ఆర్థిక వర్గాలకుగల ఆకాంక్షలను ఎవరికీ తీసిపోని రీతిలో నెరవేర్చాల్సిన అవసరాన్ని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. దేశంలోని మధ్యతరగతి ఆదాయం పెరుగుదల, విస్తరిస్తున్న పరిధులు భారత రవాణా రంగాన్ని బలోపేతం చేస్తాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ఆ మేరకు ‘‘ఆర్థిక వ్యవస్థ వృద్ధి సంబంధిత గణాంకాలు.. పెరుగుతున్న ఆదాయం రవాణా రంగంలో కొత్త విశ్వాసం నింపగలవు’’ అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

 

   భారతదేశంలో 2014కు ముందు ఆ తర్వాత 10 సంవత్సరాల వ్యవధిలో విక్రయించిన కార్ల సంఖ్య 12 కోట్ల నుంచి 21 కోట్లకు పెరిగింది. అలాగే పదేళ్ల వ్యవధిలో దేశవ్యాప్తంగా విద్యుత్ కార్ల సంఖ్య పెరుగుదల ఏటా 2 వేల నుంచి నేడు 12 లక్షల స్థాయికి పెరిగింది. అదేవిధంగా గడచిన 10 సంవత్సరాల్లో  ప్రయాణిక వాహనాల సంఖ్య 60 శాతం, ద్విచక్ర వాహనాల సంఖ్య 70 శాతం పెరిగినట్లు ప్రధాని వివరించారు. తాజా గణాంకాల ప్రకారం- ఈ ఏడాది జనవరిలో కార్ల విక్రయాలు మునుపటి రికార్డులన్నిటినీ బద్దలు కొట్టినట్లు ఆయన తెలిపారు. ‘‘రవాణా రంగానికి ఇవాళ దేశంలో అద్భుత సానుకూల వాతావరణం ఏర్పడింది. మీరు దాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి’’ అని కార్యక్రమానికి హాజరైన అగ్రశ్రేణి పరిశ్రమాధిపతులకు ప్రధాని మోదీ సూచించారు.

   భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని, నేటి భార‌తం సరికొత్త విధానాల‌ను రూపొందిస్తోంద‌ని ప్ర‌ధానమంత్రి చెప్పారు. ఈ మేరకు నిన్న సమర్పించిన కేంద్ర బడ్జెట్‌ను ప్రస్తావిస్తూ- 2014లో భారత  మూలధన వ్యయం రూ.2 లక్షల కోట్లకన్నా తక్కువ కాగా, నేడు రూ.11 లక్షల కోట్లకు పెరిగిందని శ్రీ మోదీ తెలిపారు. ఇది భారత రవాణా రంగానికి అపార అవకాశాలను అందుబాటులోకి తెచ్చిందని ఆయన అన్నారు. మునుపెన్నడూ లేని స్థాయిలో మూలధన వ్యయం ఫలితంగా రైలు, రోడ్డు, గగన, జలమార్గాలు సహా అన్ని రకాలుగా రవాణా రంగం పరివర్తనాత్మకంగా రూపొందింది. అటల్ టన్నెల్ నుంచి అటల్ సేతు దాకా ఇంజనీరింగ్ అద్భుతాల రికార్డ్ సమయంలో పూర్తి చేయడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దేశంలో గత 10 సంవత్సరాల్లో 75 కొత్త విమానాశ్రయాలు ఏర్పడ్డాయని తెలిపారు. అలాగే సుమారు 4 లక్షల కిలోమీటర్ల పొడవైన గ్రామీణ రోడ్లు వేయగా, 90,000 కిలోమీటర్ల జాతీయ రహదారులు నిర్మించబడ్డాయన్నారు. మరోవైపు 3,500 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్లు నిర్మితం కాగా, 15 కొత్త నగరాలకు మెట్రో సదుపాయం విస్తరించడంతోపాటు  25,000 రైలు మార్గాలు నిర్మించబడ్డాయని తెలిపారు. అలాగే 40,000 రైలు కోచ్‌లను ఆధునిక వందే భారత్ తరహా బోగీలుగా మారుస్తామని బడ్జెట్‌లో ప్రకటించడాన్ని గుర్తుచేశారు. సాధారణ రైళ్లకు అమర్చే ఈ బోగీలు భారతీయ రైల్వేల స్వరూపాన్ని వినూత్నం చేస్తాయని ప్రధాని అన్నారు.

   ‘‘మా ప్రభుత్వ వేగం... స్థాయి భారతదేశంలో రవాణారంగ నిర్వచనాన్ని పూర్తిగా మార్చేశాయి’’ అని ప్రధానమంత్రి అన్నారు. అలాగే ప్రాజెక్టులను పకడ్బందీగా, సకాలంలో పూర్తి చేయడం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ మేరకు రవాణా రంగంలో అడ్డంకులు తొలగించేందుకు చేపట్టిన చర్యలను ప్రముఖంగా వివరించారు. ప్రధానమంత్రి జాతీయ గతిశక్తి బృహత్ప్రణాళిక దేశంలో సమీకృత రవాణాను ప్రోత్సహిస్తోందని చెప్పారు. అలాగే విమాన, నౌకా లీజింగ్ దిశగా గిఫ్ట్ సిటీ నియంత్రణ చట్రం రూపొందించబడిందని తెలిపారు. తదనుగుణంగా జాతీయ రవాణారంగ విధానం అనేక సమస్యలను పరిష్కరిస్తున్నదని ఆయన చెప్పారు. ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లతో ఖర్చులు తగ్గుతున్నాయని గుర్తుచేశారు. కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన మూడు రైల్వే ఆర్థిక కారిడార్లు దేశంలో రవాణా సౌలభ్యాన్ని కూడా పెంచుతాయని పేర్కొన్నారు.

 

   రాష్ట్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల రద్దుసహా వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలుతో పరివర్తనాత్మక ప్రభావం ఫలితంగా వాణిజ్యం వేగవంతం కావడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. అంతేకాకుండా పరిశ్రమలలో ఇంధనం, సమయం రెండింటి ఆదాలో ఫాస్ట్-ట్యాగ్ సాంకేతిక పాత్రను కూడా ప్రధాని మోదీ నొక్కిచెప్పారు. ‘‘ఫాస్ట్-ట్యాగ్ టెక్నాలజీవల్ల పరిశ్రమలలో ఇంధనం, సమయం కూడా ఆదా అవుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ఇటీవలి ఓ అధ్యయనాన్ని ఉటంకిస్తూ, ఫాస్ట్-ట్యాగ్ సాంకేతికత తోడ్పాటుతో ఆర్థిక వ్యవస్థకు ఏటా రూ.40,000 కోట్ల ఆర్థిక ప్రయోజనం సమకూరుతోందని ప్రధానమంత్రి తెలిపారు.

   దేశంలోని ఆటో-ఆటోమోటివ్ కాంపోనెంట్ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుండటంతో భారత్ నేడు ప్రపంచ ఆర్థికశక్తి కూడలిగా అవతరించే దశకు చేరువైందని ప్రధాని మోదీ అన్నారు. ప్రపంచ ఆటోమోటివ్ విపణిలో భారత్ స్థాయిని వివరిస్తూ- ‘‘భారతదేశం నేడు ప్రయాణిక వాహనాలకు ప్రపంచంలో మూడో అతిపెద్ద మార్కెట్. అంతేకాదు.. ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య వాహనాలను తయారుచేసే తొలి మూడు దేశాల్లో ఒకటిగా ఉంది’’ అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ఇక ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పిఎల్‌ఐ) పథకం వంటి కార్యక్రమాల ద్వారా వివిధ రంగాలకు మద్దతివ్వడంలో ప్రభుత్వ నిబద్ధతను ప్రధాని పునరుద్ఘాటించారు. ‘‘పరిశ్రమల రంగం కోసం ప్రభుత్వం రూ.25,000 కోట్లకుపైగా నిధితో ‘పిఎల్ఐ’ పథకాన్ని ప్రవేశపెట్టింది’’ అని ఆయన తెలిపారు. ఇక ‘నేషనల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మిషన్’ విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహిస్తోందని ప్రధాని చెప్పారు. ఈ వాహనాలకు గిరాకీ సృష్టించేందుకు ప్రభుత్వం రూ.10 వేల కోట్లు పెట్టుబడిగా పెట్టిందన్నారు. అలాగే ‘ఫేమ్’ పథకం వల్ల దేశ రాజధానితోపాటు అనేక ఇతర నగరాల్లో విద్యుత్ బస్సుల ప్రవేశానికి దారితీసిందని చెప్పారు.

   దేశంలో పరిశోధనలు-ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.లక్ష కోట్ల మేర కేటాయింపులు చేసినట్లు ప్రధాని తెలిపారు. అలాగే అంకుర సంస్థలకిచ్చే పన్ను రాయితీలను మరింత విస్తరించే నిర్ణయాన్ని కూడా శ్రీ మోదీ ప్రస్తావించారు. ‘‘ఈ నిర్ణయాలతో రవాణా రంగంలో కొత్త అవకాశాలు అందివస్తాయి’’ అని చెప్పారు. విద్యుత్ వాహన పరిశ్రమలో ధర, బ్యాటరీలకు సంబంధించిన అత్యంత కీలక సవాళ్లను వివరిస్తూ- ఈ రంగం తన పరిశోధనల కోసం ఈ నిధులను సద్వినియోగం చేసుకోవచ్చునని సూచించారు. బ్యాటరీ తయారీ కోసం భారతదేశంలో సమృద్ధిగాగల ముడి పదార్థాలను వాడుకునే పరిశోధన మార్గాలను అన్వేషించాలని పరిశ్రమల రంగానికి దిశానిర్దేశం చేశారు. అలాగే హరిత ఉదజని, ఇథనాల్ వంటి రంగాల్లో పరిశోధనలు చేపట్టాలంటూ ప్రధాని మోదీ ప్రోత్సహించారు. ‘‘బ్యాటరీల తయారీ కోసం భారతదేశంలో లభించే ముడి పదార్థాలను వాడుకోవడంపై ఎందుకు పరిశోధనలు చేయకూడదు? అదేవిధంగా ఆటోమోటివ్ రంగం హరిత ఉదజని, ఇథనాల్‌ల సంబంధిత పరిశోధనలు కూడా చేపడితే మంచిది’’ అని ఆయన మార్గనిర్దేశం చేశారు.

   షిప్పింగ్ పరిశ్రమలో హైబ్రిడ్ నౌకల అభివృద్ధికి స్వదేశీ సాంకేతికతను వాడుకోవడంలోని ప్రాముఖ్యాన్ని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ‘‘హైబ్రిడ్ నౌకల తయారీ దిశగా భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ముందడుగు వేస్తోంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. అలాగే అంకుర సంస్థల ఏర్పాటుతో భారతదేశంలో డ్రోన్ రంగం కూడా కొత్త ఎత్తులకు చేరుతున్నదని శ్రీ మోదీ వివరించారు. డ్రోన్‌ సంబంధిత పరిశోధనల కోసం కూడా బడ్జెట్ కేటాయింపులను వాడుకోవచ్చునని సూచించారు. జలమార్గాల ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన రవాణా సాధనాల ఆవిష్కరణ గురించి కూడా ప్రస్తావించారు. ఇందులో భాగంగా స్వదేశీ సాంకేతికతతో హైబ్రిడ్ నౌకల తయారీకి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ చేస్తున్న కృషి గురించి వివరించారు.

 

 

   రవాణా రంగంలో డ్రైవర్లకు సంబంధించి మానవీయ కోణంపైనా ప్రధాని మోదీ దృష్టి సారించారు. వారు ఎదుర్కొంటున్న కష్టాలను ప్రస్తావిస్తూ- ‘‘ట్రక్ డ్రైవర్లు, వారి కుటుంబాల ఆందోళనను ప్రభుత్వం అర్థం చేసుకుంది’’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు అన్ని జాతీయ రహదారులపై డ్రైవర్లకు ఆహారం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, పార్కింగ్ సహా విశ్రాంతి సౌకర్యాలతో ఆధునిక భవనాల నిర్మాణం సంబంధిత కొత్త పథకం గురించి ప్రధాని వెల్లడించారు. ఈ పథకం కింద తొలిదశలో దేశవ్యాప్తంగా 1,000 భవనాల నిర్మాణానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని ఆయన తెలిపారు. తద్వారా ట్రక్కు-టాక్సీ డ్రైవర్లకు జీవన/ప్రయాణ సౌలభ్యం రెండూ కలుగుతాయని చెప్పారు. దీనివల్ల వారి ఆరోగ్యం మెరుగుపడటమేగాక ప్రమాదాల నివారణకూ వీలు కలుగుతుందని పేర్కొన్నారు.

   రాబోయే 25 ఏళ్లలో రవాణా రంగంలో అందివచ్చే అపార అవకాశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకునే దిశగా పరిశ్రమల రంగం వేగంగా రూపాంతరం చెందాలని ప్రధాని మోదీ కోరారు. రవాణా రంగ అవసరాల్లో ప్రధానంగా సాంకేతిక కార్మికశక్తి, సుశిక్షిత డ్రైవర్ల ఆవశ్యకతను నొక్కిచెప్పారు. ఈ పరిశ్రమకు నేడు ఈ మానవ వనరులను అందిస్తున్న ఐటీఐలు  దేశంలోని 15 వేలకుపైగా ఉన్నాయని ప్రధాని చెప్పారు. పరిశ్రమల అవసరాలకు తగిన కోర్సులు మరింత సందర్భోచితంగా ఉండేలా ఐటీఐలతో సహకరించాలని పారిశ్రామిక ప్రముఖులను ఆయన కోరారు. పాత వాహనాలను తుక్కుకు పంపితే కొత్త వాహనాలపై రహదారి పన్నులో రాయితీ కల్పించే  ప్రభుత్వ తుక్కు విధానాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

   చివరగా- ‘‘ఎక్స్‌ పో- బియాండ్ బౌండరీస్’’ ఉప శీర్షికను ప్రధాని ప్రస్తావిస్తూ- ఇది భారతదేశ స్ఫూర్తిని ప్రస్ఫుటం చేస్తున్నదని పేర్కొన్నారు. ‘‘ఇవాళ మనం పాత అడ్డంకులను ఛేదించుకుంటూ  ప్రపంచం మొత్తాన్ని ఏకతాటిపైకి తేవాలని కృషి చేస్తున్నాం. ప్రపంచ సరఫరా శ్రేణిలో భారత్ పాత్రను మరింత విస్తరించాలని భావిస్తున్నాం. అందుకు తగిన అవకాశాలు అపారంగా భారతీయ ఆటో పరిశ్రమ ముందున్నాయి’’ అని ప్రధాని ఉద్ఘాటించారు. అమృత కాల దృక్పథంతో ముందడుగు వేస్తూ భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలపాలని ఉద్బోధించారు. రైతుల సహకారంతో రబ్బరు దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించాలని టైర్ల పరిశ్రమను కోరారు. చివరగా- దేశంలోని రైతన్నలపై తనకున్న విశ్వాసాన్ని ప్రధానమంత్రి నొక్కిచెబుతూ- సమీకృత, సమగ్ర విధానాన్ని అనుసరించాలని సూచించారు. సమావేశాల్లో చర్చనీయాంశాలకు భిన్నంగా వినూత్న ఆలోచనలతో సహకారానికి ప్రాధాన్యమిస్తూ ముందుకు రావాలని కోరారు. దేశంలోని అన్ని ప్రధాన డిజైనింగ్ సంస్థల ఉనికిని ప్రస్తావిస్తూ- స్వదేశీ డిజైనింగ్ సామర్థ్యాలను ప్రోత్సహించాలని పరిశ్రమల రంగానికి ప్రధాని పిలుపునిచ్చారు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా యోగాకుగల ఆద‌ర‌ణ‌ను ఉదాహ‌రిస్తూ- ‘‘మీరు మీపై విశ్వాసం ప్రదర్శిస్తే ప్రపంచం కూడా మిమ్మల్ని విశ్వసిస్తుంది. మీ చూపు ఎక్కడ పడుతుందో అక్కడల్లా మీ వాహనాలే కనిపించాలి’’ అంటూ తన ప్రసంగం  ముగించారు.

 

   ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య-పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్; రోడ్డు, రవాణా- రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ; సూక్ష్మ-చిన్న-మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నారాయణ్ రాణే; పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి, భారీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ మహేంద్ర నాథ్ పాండే తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

 

   ప్రపంచంలోని 50కిపైగా దేశాల నుంచి 800 మంది ఎగ్జిబిటర్లు ఈ ‘ఎక్స్‌ పో’లో పాల్గొంటున్నారు. వీరంతా అత్యాధునిక సాంకేతికతలు, సుస్థిర పరిష్కారాలు, రవాణా రంగంలో ప్రగతి వగైరాలను తమ ఉత్పత్తుల ద్వారా ప్రముఖంగా ప్రదర్శిస్తారు. అలాగే 600కుపైగా ఆటో కాంపోనెంట్ తయారీదారులు, 28కిపైగా వాహన తయారీదారు సంస్థలు కూడా పాలుపంచుకుంటున్నాయి. మొత్తం 13 అంతర్జాతీయ విపణుల నుంచి 1000కిపైగా బ్రాండ్‌లు తమ ఉత్పత్తులు, సాంకేతికతలు, సేవలను ప్రదర్శిస్తున్నాయి. ఈ సందర్భంగా ప్రదర్శన, సదస్సులు-సమావేశాలతోపాటు రవాణా రంగ పరిష్కారాల్లో రాష్ట్రాలు తాము చేపట్టిన చర్యలు, ప్రాంతీయంగా ఒనగూడిన ఫలితాలను ప్రదర్శించే వీలుంది. తద్వారా రాష్ట్రాల మధ్య జాతీయ, ప్రాంతీయ స్థాయులలో సహకారం దిశగా తగిన సమగ్ర విధానానికి ప్రోత్సాహం లభిస్తుంది.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
India Inc hails 'bold' Budget with 'heavy dose of reforms' to boost consumption, create jobs

Media Coverage

India Inc hails 'bold' Budget with 'heavy dose of reforms' to boost consumption, create jobs
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 2 ఫెబ్రవరి 2025
February 02, 2025

Appreciation for PM Modi's Visionary Leadership and Progressive Policies Driving India’s Growth