గుజరాత్ లోని మా ఉమియా ధామ్ అభివృద్ధి ప్రాజెక్టు పనులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టులో భాగంగా ఉమియా మాత ధామ్ దేవాలయం , దేవాలయ ఆవరణలో అభివృద్ధి పనులను అమలు చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధానమంత్రి సమిష్టి కృషికి ఈ ప్రాజెక్టు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు.ప్రతి ఒక్కరి సహకారంతో పవిత్రమైన ఈ ప్రాజెక్టు పూర్తవుతుందని అన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో భక్తులు ఆధ్యాత్మిక, సామాజిక సేవా స్ఫూర్తితో పాల్గోవాలని ప్రధాని పిలుపు ఇచ్చారు. సామాజిక సేవ నిజమైన అతి పెద్ద దైవ ఆరాధనగా ఉంటుందని అన్నారు.
సంస్థలోని అన్ని కార్యకలాపాలను నైపుణ్యంతో పూర్తి చేయాలని ప్రధానమంత్రి సూచించారు. ' పూర్వ కాలంలో కుటుంబ వ్యవస్థ పటిష్టంగా ఉండేది. తమ నైపుణ్యాన్ని భావి తరాలకు కుటుంబ పెద్దలు వారసత్వంగా అందించేవారు. ప్రస్తుతం సామాజిక వ్యవస్థలో పలు మార్పులు చోటుచేసుకున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని వ్యవస్థలో అవసరమైన మార్పులను తీసుకుని రావడానికి మనం కృషి చేయాల్సి ఉంటుంది' అని ప్రధానమంత్రి అన్నారు.
బేటీ బచావో బేటీ పఢావో ప్రచారం సందర్భంగా తాను ఉంఝా సందర్శించానని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. స్త్రీ జననాల రేటు తగ్గడం పట్ల ఆవేదన వ్యక్తం చేసిన శ్రీ మోదీ దీనిని ఒక కళంకంగా తన పర్యటనలో వ్యాఖ్యానించారు. తన ఆవేదనను అర్ధం చేసుకుని సవాల్ ను సానుకూలంగా స్వీకరించిన ప్రజలకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల స్పందనతో ఆడపిల్లల జనాభా మగపిల్లలతో సమానంగా ఉందని ఆయన అన్నారు. ఈ ప్రాంతంలో నీటి కొరతను నివారించాలని తాను మా ఉమియా ప్రార్ధించి ఆశీర్వదించాలని కోరి ఈ విషయంలో ప్రజల సహకారాన్ని కోరానని శ్రీ మోదీ వివరించారు. బిందు సేద్య వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పాటిస్తున్న ప్రజలను ప్రధానమంత్రి అభినందించారు.
మౌ ఉమియాను ఆధ్యాత్మిక మార్గదర్శిగా అభివర్ణించిన ప్రధాని భూమి మనకు ప్రాణం అని అన్నారు. ప్రాంతంలో భూ సార ఆరోగ్య కార్డు వ్యవస్థ అమలు కావడం పట్ల ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. సేంద్రీయ వ్యవసాయ విధానాలను అనుసరించాలని ఉత్తర గుజరాత్ ప్రాంత రైతులకు ఆయన సూచించారు. సేంద్రీయ వ్యవసాయ విధానాన్ని జీరో బడ్జెట్ వ్యవసాయం అని వ్యవహరిస్తున్నారు. ' సరే నేను చేసిన సూచన మీకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు. ఇక్కడ మీకు నేను మరో ప్రత్యామ్నాయాన్ని సూచిస్తాను. మీరు రెండు ఎకరాల భూమిని కలిగి ఉంటే ఒక ఎకరం భూమిలో సేంద్రియ విధానాలను మిగిలిన భూమిలో సాధారణ విధానాల్లో వ్యవసాయం సాగించండి. ఏడాదిపాటు ఈ విధానాన్ని అనుసరించండి. ఇది మీకు లాభసాటిగా ఉంటే మొత్తం రెండు ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయాన్ని సాగించండి. ఇది ఖర్చు తగ్గించడమే కాకుండా భూసారాన్ని ఎక్కువ చేస్తుంది' అని ప్రధానమంత్రి అన్నారు.డిసెంబర్ 16 న సేంద్రియ వ్యవసాయంపై జరిగే కార్యక్రమంలో పాల్గోవాలని రైతులకు ప్రధాని సూచించారు. పంటల విధానంలో మార్పులు చేసి నూతన పంటలు సాగు చేయాలని రైతులకు ప్రధాని సూచించారు.