Quoteదేశ సాంప్రదాయక విజ్ఞానం, ఆచార వ్యవహారాలు, బోధనల ఆధారంగా నేడు భారత్ ముందడుగు వేస్తోందన్న ప్రధాని
Quoteవికసిత్ భారత్ పరమావధిగా నూతన అమృత కాలంలోకి ప్రవేశించిన మనం నిర్ణీత సమయంలో లక్ష్యాన్ని చేరుకోవాలని పిలుపు
Quoteజాతి నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాల్లో నేతృత్వం వహించేందుకు యువతను సన్నద్ధులను చేయాలి, రాజకీయాల్లో నాయకత్వ పాత్రకు యువత సిద్ధం కావాలన్న ప్రధానమంత్రి
Quoteభవిష్య సారధులుగా, 21వ శతాబ్దంలో భారత రాజకీయ పటానికి ముఖచిత్రాలుగా ఉండగల సత్తా కలిగిన లక్ష ప్రతిభావంతులైన యువతకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించాలని భావిస్తున్నామని వెల్లడి
Quoteఆధ్యాత్మికత, అనుకూల పద్ధతుల అభివృద్ధి అనే సూత్రాల సమన్వయం వల్ల మెరుగైన భవిష్యత్తు సాధ్యమన్న శ్రీ మోదీ

గుజరాత్ రామకృష్ణ మఠం ఈరోజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ పూజ్య స్వామి గౌతమానందజీ మహరాజ్, రామకృష్ణ మఠానికి చెందిన దేశవిదేశాల సాధువులు, మహాత్ములు, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయి పటేల్, కార్యక్రమంలో భాగమైన విశిష్ఠ అతిథులు తదితరులకు అభినందనలు తెలిపారు. మాతా శారదాదేవి, గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందుల వారి పాదాలకు ప్రణామాలు అర్పించారు. నేటి కార్యక్రమం స్వామి ప్రేమానంద్ మహరాజ్ జీ జయంతి సందర్భంగా ఏర్పాటయ్యిందంటూ వారికి వందనాలర్పించారు.

 “మహాత్ముల శక్తి  కొన్ని శతాబ్దాల పాటు కొనసాగి, గొప్ప పనులు నెరవేర్చడానికి అవసరమైన  బలాన్ని అందిస్తుంది” అని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. స్వామి ప్రేమానంద జీ మహరాజ్ జయంతి సందర్భంగా కొత్తగా నిర్మితమైన ప్రార్థనా మందిరం, లేఖంబా లోని సాధువుల నివాస కేంద్రాలు దేశ సాధు మహాత్ముల సంప్రదాయాన్ని కొనసాగించడంలో సహాయపడగలవన్నారు. సేవకు, విద్యకూ సంబంధించి కొత్తగా మొదలయ్యే కార్యక్రమాలు రానున్న అనేక తరాలకు లబ్ధి చేకూరుస్తాయని ప్రధాని వ్యాఖ్యానించారు. శ్రీరామకృష్ణ మందిరం, పేద విద్యార్థులకు బస కల్పించే హాస్టళ్లు, వృత్తివిద్యా కేంద్రాలు, ఆసుపత్రులు, విశ్రాంతి గృహాల వంటి సదుపాయాలు ఆధ్యాత్మికత వ్యాప్తికి, మానవసేవకూ దోహదపడగలవని శ్రీ మోదీ అన్నారు. సాధువుల మధ్య, ఆధ్యాత్మిక పరిమళం నిండిన వాతావరణంలో సమయాన్ని గడపడం తనకి సంతోషాన్ని కలిగిస్తుందంటూ కార్యక్రమానికి శుభాకాంక్షలు తెలియజేశారు.
 

|

సనంద్ తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ప్రధాని, వెనకబడ్డ ఈ ప్రాంతానికి ఎంతో అవసరమైన ఆర్థికాభివృద్ధి ఈరోజున సాకారమవుతోందన్నారు. ఈ ప్రాంతం పరివర్తన చెందడంలో ప్రభుత్వ  కృషి, విధానాలు సహా సాధు మహాత్ముల దీవెనలు కూడా ప్రభావం చూపాయన్నారు. మారుతున్న కాలంతో పాటూ సామాజిక పరిస్థితుల్లో మార్పులు సంభవిస్తున్నాయని, సనంద్ అటు ఆర్థికంగా, ఇటు ఆధ్యాత్మికంగా ఎదగాలన్నది తన ఆకాంక్ష అనీ ప్రధాని పేర్కొన్నారు. చక్కని జీవితానికి బాహ్యపరమైన సంపద ఎంత ముఖ్యమో, ఆధ్యాత్మిక సంపదా అంతే ముఖ్యమని, సాధు మహాత్ముల మార్గదర్శనంలో సనంద్, గుజరాత్ లు ఆధ్యాత్మిక బాటలో ముందుకు సాగటం తనకు సంతోషాన్ని కలిగిస్తోందని శ్రీ మోదీ హర్షం వ్యక్తం చేశారు.

విత్తుని బట్టి మొక్క సత్తా అంచనా వేయవచ్చునని, స్వామి వివేకానంద వంటి మహాత్ముల తిరుగులేని ఆధ్యాత్మిక శక్తిని ఇముడ్చుకున్న విత్తనం నుంచీ రామకృష్ణ మఠం వృక్షం వలె ఉద్భవించిందని ప్రధాని వ్యాఖ్యానించారు. అందుకే అవధులు లేని విస్తరణతో ఈ వృక్షం మానవాళికి నీడనిస్తోందని తెలియజేశారు. మఠం మౌలిక సారాన్ని అర్ధం చేసుకోవాలంటే స్వామి వివేకానంద తత్వాన్నీ, మరీ ముఖ్యంగా ఆయన బోధనలనూ అర్ధం చేసుకోవలసి ఉంటుందని, స్వామీజీ ఆలోచనలను అర్ధం చేసుకుని ఆచరించిన తనకు ఆ బోధనలే దారి చూపాయని పేర్కొన్నారు. సాధువుల ఆశీస్సులతో మిషన్ కార్యకలాపాల్లో పాలుపంచుకునే పలు అవకాశాలు లభించాయని, పూజ్య స్వామి ఆత్మస్థానందజీ నేతృత్వంలో 2005లో వడోదర లోని దిలారామ్ బంగళాను మిషన్ కు అప్పగించే గౌరవం తనకు దక్కిందని, స్వామి వివేకానంద కొంత కాలం ఆ బంగాళాలో నివసించారని తెలియజేశారు.  

అనేక సంవత్సరాలుగా మిషన్ ఏర్పాటు చేసిన అనేక కార్యక్రమాల్లో భాగమయ్యే అదృష్టం తనకు లభించిందంటూ, నేడు ప్రపంచవ్యాప్తంగా 280 కేంద్రాలు గల రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో దేశంలో 1200 ఆశ్రమాలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయన్నారు. ఈ కేంద్రాలు మానవసేవలో నిమగ్నమై ఉన్నాయని, రామకృష్ణ మిషన్ సేవలకు గుజరాత్ అనేక సంవత్సరాలుగా ప్రత్యక్ష సాక్షిగా నిలుస్తోందన్నారు. రాష్టానికి ఎప్పుడు ఏ ఆపద కలిగినా, తానున్నానంటూ మిషన్ ఇక్కడి ప్రజలకు బాసటగా నిలిచిందని కొన్ని  సందర్భాలని ఉటంకించారు.  సూరత్ వరదలు, మోర్బీ వంతెన దుర్ఘటన, భుజ్ భూకంపానంతర అల్లకల్లోల పరిస్థితులు వంటి విషమ పరిస్థితులు ఎప్పుడు ఎదురైనా, రామకృష్ణ మిషన్ బాధితులకు చేయూతనందించిందన్నారు. భూకంపంలో దెబ్బతిన్న 80 పాఠశాలల పునర్నిర్మాణంలో మిషన్ ముఖ్య పాత్ర పోషించిందని, ఆ సహాయాన్ని గుజరాత్ ప్రజలు ఎన్నటికీ మరువలేరంటూ మిషన్ సేవాభావాన్నించీ రాష్ట్ర ప్రజలు నేటికీ స్ఫూర్తి పొందుతూనే ఉన్నారన్నారు.  
 

|

స్వామి వివేకానంద కు గుజరాత్ తో ప్రత్యేక అనుబంధం ఉందని ప్రధానమంత్రి తెలిపారు.  ఆయన జీవనయానంలో ఈ రాష్ట్రం ముఖ్య పాత్ర పోషించిందంటూ స్వామీజీ గుజరాత్ లోని అనేక ప్రాంతాలని సందర్శించారని వెల్లడించారు. చికాగో అంతర్జాతీయ మత సమ్మేళనం (వరల్డ్ పార్లమెంట్ ఆఫ్ రిలీజియన్స్) గురించి మొదటిసారి ఆయన ఇక్కడే తెలుసుకున్నారని,  వేదాంత సూత్రాల వ్యాప్తి కోసం అనేక గ్రంధాలను ఆయన గుజరాత్ లోనే అధ్యయనం చేశారని చెప్పారు. 1891 లో పోర్బందర్ లోని భోజేశ్వర్ భవన్ లో స్వామీజీ కొన్ని నెలల పాటు బస చేశారని, ఈ ఉదంతం చారిత్రక ప్రాముఖ్యాన్ని గ్రహించిన గుజరాత్ ప్రభుత్వం భవంతిని స్వామీజీ స్మారక మందిరంగా అభివృద్ధి పరిచేందుకు రామకృష్ణా మిషన్ కు అప్పగించిందనీ వెల్లడించారు. 2012 నుంచీ 2014 వరకూ, రెండేళ్ళ పాటు స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవాలను గుజరాత్ ప్రభుత్వం నిర్వహించిందని గుర్తు చేస్తూ, గాంధీనగర్ మహాత్మా మందిర్ లో ఘనంగా జరిగిన ముగింపు ఉత్సవాల్లో దేశవిదేశాల వారు వేల సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారని చెప్పారు. స్వామీజీకి గుజరాత్ తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని సంస్మరించుకునే ఉద్దేశంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం స్వామి వివేకానంద పర్యాటక కేంద్రాల అభివృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికలని రూపొందిస్తోందని, ఈ విషయం తనకు  ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందని చెప్పారు.

స్వామి వివేకానంద ఆధునిక విజ్ఞానశాస్త్రానికి మద్దతునిచ్చేవారంటూ విజ్ఞానశాస్త్రం కేవలం వివరణలకు పరిమితం కాదని, మన పురోగతికి స్ఫూర్తిగా నిలిచే ప్రాముఖ్యాన్ని కలిగి ఉందని భావించేవారని చెప్పారు. అత్యాధునిక సాంకేతికత రంగంలో పెరుగుతున్న భారత్ ప్రాభవాన్ని గురించి ప్రస్తావిస్తూ, ప్రపంచ మూడో అతిపెద్ద అంకుర పరిశ్రమల ప్రోత్సాహక వాతావరణం, ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు దేశం వేస్తున్న అడుగులు, అధునాతన మౌలిక సదుపాయాలూ.. ఇవన్నీ భారత్ శరవేగ ఎదుగుదలకు సూచికలేనని, వీటి ద్వారా ప్రపంచం దేశ ప్రగతిని గుర్తిస్తోందని చెప్పారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు భారత్ పరిష్కారాలని అందిస్తోందన్నారు.  సాంప్రదాయక విజ్ఞానం, ఆచార వ్యవహారాలు, బోధనల ఆధారంగా నేడు భారత్ ముందడుగు వేస్తోందని శ్రీ మోదీ అన్నారు. “దేశానికి యువశక్తి వెన్నెముక వంటిదని స్వామీజీ భావించేవారు” అంటూ యువశక్తి గురించి స్వామీజీ మాటల్ని నెమరువేసుకున్నారు. యువత పురోగతి బాధ్యతను స్వీకరించవలసిన తరుణం ఆసన్నమైందన్నారు.  వికసిత్ భారత్ (సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశం) పరమావధిగా అమృత కాలంలోకి ప్రవేశించామని, అనుకున్న సమయానికి లక్ష్యాన్ని తప్పక చేరుకోవాలన్నారు. నేడు మనదేశం యువశక్తిని అత్యధికంగా కలిగిన దేశమని గుర్తు చేశారు. ప్రపంచ వేదికపై  సత్తా చాటిన భారత యువత, ప్రపంచ అగ్రగామి కంపెనీలకు నేతృత్వం వహిస్తోందన్నారు. జాతి నిర్మాణంలో యువతకు నాయకత్వాన్ని కల్పించే అవకాశం, సమయం నేడు దేశానికి ఉన్నాయని, సాంకేతిక, ఇతర రంగాలలో నాయకత్వాన్ని చేపట్టినట్లే రాజకీయాల్లో కూడా నాయకత్వం స్వీకరించేందుకు యువత సన్నద్ధమవ్వాలన్నారు. ఈ దిశగా 2025 జనవరి 12న స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజనోత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఢిల్లీలో “యంగ్ లీడర్స్ డైలాగ్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోందని వెల్లడించారు. కార్యక్రమం కోసం దేశం నలుమూలల నుంచీ ఎంపిక చేసిన 2000 మందికి ఆహ్వానాలు అందుతాయని, లక్షలాది ఇతర యువత ఈ కార్యక్రమంలో అంతర్జాల వేదికల ద్వారా పాల్గొంటారని చెప్పారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యం గురించి ఏర్పాటయ్యే చర్చా కార్యక్రమంలో యువత తన దృక్పథాన్ని వెల్లడిస్తుందని,  రాజకీయాల్లో  యువతకు భాగస్వామ్యం కల్పించే దిశగా ఈ సందర్భంగా ప్రణాళికలు  తయారవుతాయని తెలియజేశారు. ప్రతిభావంతులైన లక్షమంది యువతకు రాజకీయాల్లో ప్రవేశం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యాన్ని పెట్టుకుందని,  21వ శతాబ్దపు నవీన భారతదేశ రాజకీయ ముఖచిత్రానికి, దేశ భావిష్యత్తుకూ వీరు ప్రతినిధులుగా ఉంటారని శ్రీ మోదీ తెలియజేశారు.

ఆధ్యాత్మికత, అనుకూల పద్ధతుల్లో అభివృద్ధి అనే రెండు అంశాలు, భూమండలాన్ని  మరింత మెరుగైన  ప్రదేశంగా మలుచుకునేందుకు అవసరమైనవంటూ.. ఈ రెండిటి సమన్వయం ద్వారా మెరుగైన భవిష్యత్తు నిర్మాణం సుసాధ్యమవుతుందన్నారు. స్వామి వివేకానంద ఆధ్యాత్మికతను క్రియాశీల దృష్టితో చూసేవారని, సమాజ అవసరాలను ఆధ్యాత్మికత గుర్తించాలని  భావించేవారన్నారు. పవిత్రమైన భావనలతో పాటూ పరిశుభ్రమైన వాతావరణం కూడా ముఖ్యమని స్వామి వివేకానంద చెప్పేవారన్నారు. ఆర్థికాభివృద్ధి, సామాజిక శ్రేయస్సు, పర్యావరణ పరిరక్షణ అనే అంశాల మధ్య సమతౌల్యం పాటిస్తే, సరైన పద్ధతుల్లో అభివృద్ధి సాధించినట్లేనని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వామి వివేకానంద బోధనలు ఈ విషయంలో మనకు మార్గాన్ని చూపగలవన్నారు.  

ఆధ్యాత్మికత, అనుకూల అభివృద్ధి, ఈ రెండిటికీ సమతౌల్యం ముఖ్యమేనని, మొదటిది మనసులో సమస్థితికి కారణమైతే, రెండోది ప్రకృతిలో సమతౌల్యాన్ని బోధిస్తుందని ప్రధానమంత్రి చెప్పారు. రామకృష్ణ మిషన్ వంటి సంస్థలు ‘మిషన్ లైఫ్’, ‘ఏక్ పేడ్ మా కే నామ్' వంటి ప్రచారోద్యమాలను మరింత పెద్దయెత్తున చేపట్టేందుకు సహాయపడగలవన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.  

 “మన దేశాన్ని స్వావలంబన కలిగిన బలమైన దేశంగా చూడాలని స్వామి వివేకానంద ఆశించేవారు” అన్న శ్రీ మోదీ, ఆయన కలలను నిజం చేసే దిశగా దేశం పురోగమిస్తోందన్నారు. స్వామీజీ స్వప్నం శీఘ్రంగా నెరవేరాలని, బలమైన స్వావలంబన గల దేశంగా అవతరించి, ప్రపంచ మానవాళికి భారత్ ఆదర్శంగా నిలవగలదని ఆకాంక్షిస్తున్నానంటూ శ్రీ మోదీ తమ ప్రసంగాన్ని ముగించారు. ఈ ఆశయ సాకారం కోసం ప్రతి పౌరుడూ గురుదేవులు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద బోధనలను ఆచరించాలని పేర్కొన్నారు.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ

ప్రముఖ ప్రసంగాలు

ప్రతి భారతీయుడి రక్తం మరుగుతోంది: మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
Swiss ratifies India-EFTA mega deal, rollout in October

Media Coverage

Swiss ratifies India-EFTA mega deal, rollout in October
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 11 జూలై 2025
July 11, 2025

Appreciation by Citizens in Building a Self-Reliant India PM Modi's Initiatives in Action