‘‘లక్షద్వీప్ దీవుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ లక్షద్వీప్‌లోని అగట్టి విమానాశ్రయం వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- లక్షద్వీప్‌లోగల అపార అవకాశాల గురించి ఆయన నొక్కిచెప్పారు. అయితే, స్వాతంత్ర్యం వచ్చాక ఈ దీవులు సుదీర్ఘకాలం నిర్లక్ష్యానికి గురయ్యాయని విచారం వెలిబుచ్చారు. ఈ ప్రాంతానికి నౌకాయానం జీవనాడి అయినప్పటికీ, ఓడరేవు మౌలిక సదుపాయాలను తగినంతగా అభివృద్ధి చేయకపోవడాన్ని ప్రస్తావించారు. అలాగే విద్య, ఆరోగ్య రంగాలతోపాటు పెట్రోలు, డీజిల్ విషయంలో ఉదాసీనతను ఈ ప్రాంతం ఎదుర్కొన్నదని ప్రధాని వివరించారు. ఈ పరిస్థితులను ప్రభుత్వం ఇప్పుడు చక్కదిద్దుతూ, ప్రగతికి బాటలు పరచిందని పేర్కొన్నారు. ఈ మేరకు ‘‘లక్షద్వీప్ ప్రజల సమస్యలన్నిటినీ మా ప్రభుత్వం పూర్తిగా పరిష్కరిస్తోంది’’ అని గుర్తుచేశారు.
ప్రభుత్వ కృషి ఫలితంగా అగట్టిలో అనేక అభివృద్ధి ప్రాజెక్టులు గత పదేళ్లలో పూర్తయ్యాయని ప్రధాని తెలిపారు. ఇక్కడి ప్రజలకు... ముఖ్యంగా మత్స్యకారులకు ఆధుని సదుపాయాలు సమకూర్చినట్లు పేర్కొన్నారు. అగట్టికి నేడు విమానాశ్రయంతోపాటు ఐస్ ప్లాంట్ కూడా అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. దీనివల్ల సముద్ర ఆహార ఉత్పత్తుల రంగంతోపాటు వాటి ఎగుమతికి కొత్త అవకాశాలు లభిస్తాయన్నారు. లక్షద్వీప్ నుంచి టునా చేపల ఎగుమతికి చొరవ చూపడం వల్ల ఇక్కడి మత్స్యకారుల ఆదాయం పెరుగుదలకు మార్గం సుగమమైందని చెప్పారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ప్రారంభించిన సౌరశక్తి ప్రాజెక్టు, విమాన ఇంధన డిపోల ద్వారా లక్షద్వీప్ విద్యుత్తు సహా ఇతర ఇంధన అవసరాలు తీరుతాయని ప్రధాని వెల్లడించారు. అగట్టి ద్వీపంలోని అన్ని నివాసాలకూ కొళాయి నీటి కనెక్షన్లు సంతృప్తస్థాయికి చేరాయని ఆయన తెలిపారు. అలాగే పేదలకు పక్కా ఇళ్లు, మరుగుదొడ్లు, విద్యుత్, వంటగ్యాస్ కనెక్షన్లు వంటివన్నీ సమకూర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని పునరుద్ఘాటించారు. ఈ మేరకు ‘‘అగట్టి సహా లక్షద్వీప్ దీవుల సమూహం సర్వతోముఖాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని గుర్తుచేశారు. ఇందులో భాగంగా లక్షద్వీప్ ప్రజలకోసం రేపు కవరట్టిలో మరిన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నామని చెబుతూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.
నేపథ్యం
లక్షద్వీప్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి రూ.1,150 కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులలో కొన్నిటిని జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి శంకుస్థాపన చేస్తున్నారు. కాగా, ఇంటర్నెట్ సదుపాయం అత్యంత బలహీనంగా ఉండటం ఈ ప్రాంతం ప్రధాన సమస్య. దీన్ని పరిష్కరించేందుకు చేపట్టిన పరివర్తనాత్మక చర్యల్లో భాగంగా కొచ్చి-లక్షద్వీప్ మధ్య నిర్మించిన సముద్రాంతర ఆప్టికల్ ఫైబర్ కనెక్షన్ (కెఎల్ఐ-ఎస్ఒఎఫ్‌సి) ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. ఈ సమస్య పరిష్కారంపై ఆయన 2020లో ఎర్రకోట పైనుంచి స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సకాలంలో పూర్తయిన ఈ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తున్నారు. దీనిద్వారా ఇకపై ఇంటర్నెట్ వేగం 100 రెట్లు (1.7 జిబిపిఎస్ నుంచి 200 జిబిపిఎస్ వరకు) పెరుగుతుంది. స్వాతంత్య్రం తర్వాత తొలిసారి ‘ఎస్ఒఎఫ్‌సి’తో లక్షద్వీప్ అనుసంధానం కానుండటం విశేషం. దీనివల్ల లక్షద్వీప్ దీవుల కమ్యూనికేషన్ మౌలిక సదుపాయాల్లో వినూత్న మార్పు వస్తుంది. ఇంటర్నెట్ సేవలలో వేగం, విశ్వసనీయత పెరుగుతాయి. ఇ-పరిపాలన, విద్యా కార్యక్రమాలు, డిజిటల్ బ్యాంకింగ్, కరెన్సీ వినియోగం, అక్షరాస్యత తదితరాలకు మార్గం సుగమం కాగలదు.
కద్మత్‌లో నిర్మించిన ‘లో టెంపరేచర్ థర్మల్ డీశాలినేషన్’ (ఎల్‌టిటిడి) ప్లాంటును ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. దీనిద్వారా ప్రజలకు నిత్యం 1.5 లక్షల లీటర్ల పరిశుభ్రమైన తాగునీరు లభిస్తుంది. అగట్టి, మినికాయ్ ద్వీపాల్లోని అన్ని గృహాలకూ కొళాయి కనెక్షన్లను కూడా ప్రధాని జాతికి అంకితం చేస్తారు. పగడపు దీవి అయిన లక్షద్వీప్ దీవులలో తాగునీటి లభ్యత నిరంతర సమస్యగా ఉంది. ఇక్కడ భూగర్భజల లభ్యత స్వల్పం కావడమే ఇందుకు కారణం. ఈ నేపథ్యంలో తాజా తాగునీటి ప్రాజెక్టులు అందుబాటులోకి రావడంతో ఈ ద్వీపాల పర్యాటక సామర్థ్యం పెరుగుతుంది. తద్వారా స్థానిక ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయి.
దేశానికి అంకితం చేయబడే ఇతర ప్రాజెక్టులలో కవరట్టిలో నిర్మించిన సౌరశక్తి ప్లాంట్ కూడా ఒకటి. ఇది లక్షద్వీప్‌లోని తొలి బ్యాటరీ ఆధారిత సౌర విద్యుత్తు ప్రాజెక్ట్. దీనివల్ల డీజిల్ ఆధారిత విద్యుత్ ఉత్పాదనపై ఆధారపడాల్సిన అవసరం తప్పుతుంది. దీంతోపాటు కవరట్టిలో ఇండియా రిజర్వ్ బెటాలియన్ ప్రాంగణంలో 80 మంది సిబ్బంది కోసం నిర్మించిన కొత్త అడ్మినిస్ట్రేటివ్ భవనాన్నికూడా ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే కల్పేనిలోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ భవన పునర్నవీకరణ పనులతోపాటు ఆంద్రోత్, చెట్లత్, కద్మత్, అగట్టి, మినికాయ్ దీవులలో ఐదు ఆదర్శ అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.
Furthering development of Lakshadweep. pic.twitter.com/1ewwVAwWjr
— PMO India (@PMOIndia) January 2, 2024
The Government of India is committed for the development of Lakshadweep. pic.twitter.com/OigU87M2Tn
— PMO India (@PMOIndia) January 2, 2024