“విద్యార్థుల సమగ్ర వికాసం దిశగా వారి మనసులో.. హృదయంలో గురుకులం సదాలోచనలు-విలువలు నింపింది”;
“నిజమైన జ్ఞానవ్యాప్తి ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన కర్తవ్యం.. భారతదేశం ఈ లక్ష్యానికి తననుతాను అంకితం చేసుకుంది”;
“ఆధ్యాత్మిక రంగంలో అంకితభావంగల విద్యార్థుల నుంచి ఇస్రో.. బార్క్‌ శాస్త్రవేత్తలదాకా గురుకుల సంప్రదాయం దేశంలోని ప్రతి రంగాన్నీ తీర్చిదిద్దింది”;
“ఆవిష్కరణ-పరిశోధన భారతీయ జీవనశైలిలో అంతర్భాగాలు”;
“మన గురుకులాలు విజ్ఞాన.. ఆధ్యాత్మిక.. లింగ సమానత్వాలపై మానవాళికి మార్గనిర్దేశం చేశాయి”;
“దేశంలో విద్యా మౌలిక సదుపాయాల విస్తరణకు అపూర్వ కృషి సాగుతోంది”

   ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్‌ సదుపాయం ద్వారా రాజ్‌కోట్‌లోని శ్రీ స్వామి నారాయణ్‌ గురుకులం 75వ అమృత మహోత్సవంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా స‌భికులనుద్దేశించి మాట్లాడుతూ- శ్రీ స్వామినారాయ‌ణ్ గురుకుల్ రాజ్‌కోట్ సంస్థాన్‌ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ అభినందించారు. ఈ ప్ర‌స్థానంలో శాస్త్రిజీ మ‌హారాజ్ శ్రీ ధ‌ర్మ‌జీవ‌న్‌ దాస్‌ స్వామి చేసిన అవిరళ కృషిని ఆయన ప్ర‌శంసించారు. భగవాన్ శ్రీ స్వామి నారాయణ్ నామస్మరణతోనే మనలో నవ చైతన్యం ఉప్పొంగుతుందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

   ప్రస్తుత అమృత కాలంలో ఈ శుభకార్యక్రమం కూడా యాదృచ్ఛికంగా కలసివచ్చిందని, ఇదొక సంతోషం కలిగించే సందర్భమని ప్రధానమంత్రి అన్నారు. చరిత్రలో ఇలాంటి యాదృచ్చిక సంఘటనలతోనే భారతీయ సంప్రదాయం ఉత్తేజితమైందని పేర్కొన్నారు. చరిత్రలో కర్తవ్యం, కృషి, సంస్కృతి, అంకితభావం, ఆధ్యాత్మికత, ఆధునికతల సంగమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. స్వాతంత్య్రం రాగానే ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ వైభవ పునరుద్ధరణ బాధ్యతతోపాటు విద్యను విస్మరించడంపై ప్రధాని విచారం వెలిబుచ్చారు. ఈ మేరకు మునుపటి ప్రభుత్వాలు ఎక్కడ తడబడ్డాయో అక్కడ జాతీయ సాధువులు, ఆచార్యులు ఈ సవాలును దీటుగా స్వీకరించారని ప్రధాని అన్నారు. “ఈ యాదృచ్ఛిక సంగమానికి స్వామినారాయణ్‌ గురుకుల్ ఒక ప్రత్యక్ష ఉదాహరణ” అని ఆయన అభివర్ణించారు. స్వాతంత్ర్య ఉద్యమ ఆదర్శాల పునాదిపై ఈ సంస్థ అభివృద్ధి చేయబడిందని గుర్తుచేశారు.

   నిజమైన జ్ఞానవ్యాప్తి అత్యంత ముఖ్యమైన కర్తవ్యం… ప్రపంచంలో జ్ఞానం, విద్య వ్యాప్తిపై భారతదేశం తననుతాను అంకితం చేసుకుంది. భారతీయ నాగరికత మూలాలకు పునాది ఈ అంకితభావమే” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గురుకుల విద్యా ప్రతిష్ఠానం రాజ్‌కోట్‌లో కేవలం ఏడుగురు విద్యార్థులతో ప్రారంభం కాగా నేడు ప్రపంచవ్యాప్తంగా 40 శాఖలను నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి వేలాది విద్యార్థులను ఈ గురుకులం ఆకర్షిస్తున్నదని ప్రధానమంత్రి తెలిపారు. గురుకులం 75 ఏళ్లనుంచీ విద్యార్థుల సమగ్ర వికాసం లక్ష్యంగా వారి మనసులో, హృదయంలో సదాలోచనలు-విలువలు నింపిందని ఆయన అన్నారు. ఆధ్యాత్మిక రంగంలో అంకితభావంగల విద్యార్థుల నుంచి ఇస్రో, బార్క్‌ శాస్త్రవేత్తల వరకూ గురుకుల సంప్రదాయం దేశంలోని ప్రతి రంగాన్నీ తీర్చిదిద్దిందని ఆయన అన్నారు. పేదలకు కేవలం రూపాయి రుసుముతో విద్యనందించే గురుకుల విధానం వారి విద్యాభ్యాసాన్ని సులభం చేసిందని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు.

   జ్ఞాన సముపార్జనను జీవితంలో అత్యున్నత సాధనగా పరిగణించే భారతీయ సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ- ప్రపంచంలోని ఇతర దేశాలు వారి అనువంశిక పాలకులతో గుర్తింపు పొందితే, భారతదేశం గుర్తింపు గురుకులాలతో ముడిపడి ఉందని ప్రధాని స్పష్టం చేశారు. “మన గురుకులాలు శతాబ్దాలుగా సమానత్వం, సమానావకాశాలు, సంరక్షణ, సేవా భావం తదితర మానవీయ విలువలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి” అని ఆయన చెప్పారు. నలంద, తక్షశిల గురుకులాలు భారతదేశ ప్రాచీన వైభవానికి పర్యాయపదాలని గుర్తుచేశారు. “ఆవిష్కరణ-పరిశోధన భారతీయ జీవనశైలిలో అంతర్భాగాలు. ఆత్మాన్వేషణ నుంచి పరమాత్మదాకా.. ఆయుర్వేదం నుంచి ఆధ్యాత్మికం వరకూ… సామాజిక శాస్త్రం నుంచి సౌరశాస్త్రం దాకా… గణితం నుంచి లోహవిజ్ఞానం వరకూ… సున్నా నుంచి అనంతం దాకా- ఒకటనేమిటి.. ప్రతి రంగంలోనూ పరిశోధనలు, కొత్త సిద్ధాంతాలు ఆవిష్కృతమయ్యాయి” అన్నారు. “నాటి అంధయుగంలో భారతదేశం మానవాళికి కాంతికిరణాలను ప్రసరింపజేసింది. అది ఆధునిక విజ్ఞాన ప్రపంచ ప్రస్థానానికి మార్గం సుగమం చేసింది” అని పేర్కొన్నారు. భారతీయ ప్రాచీన గురుకుల వ్యవస్థలోని లింగ సమానత్వం, సున్నితత్వాన్ని కూడా ప్రధాన మంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘కన్యా గురుకులం’ ప్రారంభం ఇందుకు నిదర్శనమంటూ స్వామినారాయణ్‌ గురుకులాన్ని ప్రశంసించారు.

   భారత ఉజ్వల భవిష్యత్తు రూపకల్పనలో విద్యా వ్యవస్థ, విద్యా సంస్థల పాత్ర కీలకమని  ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. ఆ మేరకు ప్రస్తుత స్వాతంత్ర్య అమృతకాలంలో దేశంలోని విద్యా మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రతి స్థాయిలో విధానాల రూపకల్పనకు శరవేగంగా ముందుకు సాగుతున్నట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఐఐటీలు, ఐఐఐటీలు, ఐఐఎంలు, ఎయిమ్స్‌ వంటి అత్యున్నత విద్యా సంస్థల సంఖ్య పెరిగిందని గుర్తుచేశారు. అలాగే 2014కు  మునుపటి కాలంతో పోలిస్తే వైద్య కళాశాలల సంఖ్య 65 శాతం పెరిగినట్లు ప్రధానమంత్రి వివరించారు. కొత్త విద్యా విధానంతో దేశం భవిష్యత్తుకు అనుగుణంగా విద్యా వ్యవస్థను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కొత్త వ్యవస్థలో విద్యనభ్యసించే కొత్త తరాలు దేశానికి ఆదర్శ పౌరులుగా తయారవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.

   రాబోయే 25 ఏళ్ల ప్రయాణంలో సాధువుల ప్రాముఖ్యం గురించి ప్రధాని నొక్కిచెప్పారు. “నేడు భారతదేశం సరికొత్త సంకల్పాలను నిర్దేశించుకుంటూ వాటి సాకారానికి కృషి చేస్తోంది. డిజిటల్ ఇండియా, స్వయం సమృద్ధ భారతం, స్థానికం కోసం స్వగళం, ప్రతి జిల్లాలో 75 అమృత్ సరోవరాలు, ఒకే భారతం-శ్రేష్ఠ భారతం వంటి దార్శనిక దృష్టితో ముందడుగు వేస్తోంది. ఈ సామాజిక పరివర్తన, సంఘ సంస్కరణ ప్రాజెక్టులలో అందరి కృషి కోట్లాది ప్రజా జీవితాలను ప్రభావితం చేస్తుంది” అని ప్రధాని అన్నారు. గురుకుల విద్యార్థులు కనీసం 15 రోజులు ఈశాన్య భారతంలో పర్యటించి, దేశాన్ని బలోపేతం చేసేలా ప్రజలతో మమేకం కావాలని కోరారు. అలాగే ‘బేటీ బచావో’, పర్యావరణ పరిరక్షణ అంశాలను కూడా ప్రస్తావించారు. ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. “దేశం నిర్దేశించుకున్న  సంకల్పాల సాధనవైపు పయనానికి స్వామినారాయణ్‌ గురుకుల విద్యా ప్రతిష్ఠానం వంటి సంస్థలు సహకరించగలవని నా దృఢ విశ్వాసం” అంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

      రాజ్‌కోట్‌లో శ్రీ స్వామినారాయణ్ గురుకుల సంస్థాన్‌ను గురుదేవులు శాస్త్రీ మహారాజ్ శ్రీ ధర్మాజీవన్‌ దాస్‌ స్వామి 1948లో ఏర్పాటు చేశారు. నేడు ఈ గురుకులానికి ప్రపంచంలో 40కిపైగా శాఖలున్నాయి. వీటిలో 25,000 మందికిపైగా చదువుతుండగా ఈ విద్యా సంస్థల్లో పాఠశాల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్‌ స్థాయివరకూ విద్యనందిస్తున్నారు.

 

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage