“భారత శాస్త్రవేత్తల సమాజం దేశాన్ని సమున్నత స్థానానికి చేర్చగలదు”;
“ఈ 21వ శతాబ్దపు భారతదేశంలో సమాచార-సాంకేతిక సమృద్ధి శాస్త్రవిజ్ఞాన పురోగమనానికి తోడ్పడగలదు”;
“శాస్త్ర విజ్ఞానంతో మహిళా సాధికారత కల్పన మాత్రమేగాక మహిళల పాత్రతో శాస్త్రవిజ్ఞాన సాధికారతపైనా మనం యోచించాలి”;
“దేశంలో శాస్త్రవిజ్ఞానం.. మహిళల పురోగతికి పెరుగుతున్న మహిళా భాగస్వామ్యమే నిదర్శనం”;
“శాస్త్రవిజ్ఞాన కృషి ప్రయోగశాల నుంచి దేశంలోకి వస్తేనే గొప్ప విజయం కాగలదు; ఆ ప్రభావం ప్రపంచ స్థాయి నుంచిక్షేత్రస్థాయికి… వాటి పరిధి పత్రికల నుంచి ప్రజలకు చేరుతుంది...పరిశోధనల నుంచి జీవితాలకు చేరితేనే మార్పు సుస్పష్టం కాగలదు”;
“భవిష్యత్‌ రంగాలపై దేశం చొరవ చూపితే పారిశ్రామిక విప్లవం 4.0కు మనం నాయకత్వం వహించగలం”

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ 108వ భారత వైజ్ఞానిక మహాసభను (ఐఎస్‌సి) ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ఈ ఏడాది ‘మహిళా సాధికారత ద్వారా సుస్థిర ప్రగతి కోసం శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాలు” ప్రధాన ఇతివృత్తంగా ‘ఐఎస్‌సి’ నిర్వహించబడుతోంది. ఈ మేరకు సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత, ఈ లక్ష్యసాధనలో శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాల పాత్రపై చర్చలు సాగుతాయి. ఈ సందర్భంగా మహాసభలనుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- రాబోయే 25 ఏళ్ల భార‌త‌ ప్రగతి ప్రస్థానంలో దేశ వైజ్ఞానిక శక్తి పాత్రను ప్రముఖంగా ప్రస్తావించారు. “అభిరుచితో పాటు శాస్త్ర విజ్ఞానంలో దేశసేవా స్ఫూర్తిని నింపితే అద్భుత ఫలితాలు సిద్ధిస్తాయి. భారత వైజ్ఞానిక సమాజం మన దేశాన్ని సదా సముచిత స్థానంలో నిలపగలదని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను” అని ఆయన వ్యాఖ్యానించారు.

   విజ్ఞాన శాస్త్రానికి పరిశీలనే ప్రాణమని, తద్వారానే శాస్త్రవేత్తలు వివిధ ధోరణులను అధ్యయనం చేసి, అవసరమైన ఫలితాలు సాధిస్తారని ప్రధాని స్పష్టం చేశారు. సమాచార సేకరణ, ఫలితాల విశ్లేషణ ప్రాముఖ్యం గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ 21వ తాబ్దపు భారతదేశంలో సమాచారం, సాంకేతికత సమృద్ధిగా అందుబాటులో ఉన్నందున భారతీయ విజ్ఞాన శాస్త్రాన్ని కొత్త శిఖరాలకు చేర్చగల సామర్థ్యం వీటికి ఉందని ఆయన వివరించారు. సమాచార విశ్లేషణ రంగం అనూహ్య వేగంతో ముందుకు సాగుతోందని, ఇది సమాచారాన్ని అంతర్దృష్టిగా, విశ్లేషణను ఆచరణాత్మక జ్ఞానంగా మార్చడంలో గొప్ప దోహదకారి కాగలదని ఆయన అన్నారు. “సంప్రదాయ జ్ఞానం లేదా ఆధునిక సాంకేతికత.. ఏదైనప్పటికీ ప్రతి ఒక్కటి శాస్త్రీయ ఆవిష్కరణలో కీలకపాత్ర పోషిస్తుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. పరిశోధన-చోదక ప్రగతితో ఒనగూడే వివిధ పద్ధతులను వర్తింపజేస్తూ శాస్త్రీయ ప్రక్రియలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు.

   శాస్త్రీయ దృక్పథంతో భారతదేశ సమన్వయ కృషి గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ-  భారతదేశం 2015నాటికి ‘ప్రపంచ ఆవిష్కరణల సూచీ’లో 81వ స్థానంలో ఉండగా 2022కల్లా 40వ స్థానానికి దూసుకెళ్లిందని ఆయన గుర్తుచేశారు. దీంతో ప్రపంచ అగ్రదేశాలలో ఒకటిగా భారత్‌ పరిగణించబడుతున్నదని పేర్కొన్నారు. అంకుర సంస్థలు, పీహెచ్‌డీల సంఖ్యపరంగా ప్రపంచంలోని తొలి మూడు దేశాల జాబితాలో ఒకటిగా ఉందన్నారు. మహిళా సాధికారతతో పాటు సుస్థిర అభివృద్ధిని మిళితం చేసే ఈ సంవత్సరపు వైజ్ఞానిక మహాసభ ఇతివృత్తంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ రెండు రంగాల మధ్య అనుబంధాన్ని నొక్కి చెబుతూ- “శాస్త్ర విజ్ఞానంతో మహిళలకు సాధికారత కల్పన మాత్రమేగాక మహిళల సహకారంతో శాస్త్ర విజ్ఞానాన్ని కూడా సాధికారం చేయాలనేది మా ఆలోచన” అని ఆయన స్పష్టం చేశారు.

   భారతదేశానికి జి-20 అధ్యక్షత అవకాశం దక్కడాన్ని ప్రస్తావిస్తూ- మహిళా చోదిత అభివృద్ధి అనేది మన అధ్యక్షతన అత్యంత ప్రాధాన్యమిస్తున్న అంశాలలో ఒకటని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలలో భారతదేశం పాలన నుంచి సమాజం-ఆర్థిక వ్యవస్థదాకా  అసాధారణ చర్యలు చేపట్టిందని, ఇది నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైందని చెప్పారు. చిన్న పరిశ్రమలు, వ్యాపారాల భాగస్వామ్యంలో లేదా అంకుర ప్రపంచంలో నాయకత్వం వహిస్తూ ప్రపంచానికి తమ శక్తిసామర్థ్యాలను రుజువు చేస్తున్న మహిళల గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. దేశంలోని మహిళలకు సాధికారత కల్పనలో కీలకపాత్ర పోషించిన ముద్రా యోజనను ఈ సందర్భంగా ప్రధానమంత్రి ఉదాహరించారు. ప్రాంగణేతర పరిశోధన-అభివృద్ధి రంగంలో మహిళా భాగస్వామ్యం రెట్టింపు చేయడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. “దేశంలో మహిళలు-శాస్త్ర విజ్ఞానం రెండూ పురోగమిస్తున్నాయనడానికి మహిళల భాగస్వామ్యమే నిదర్శనం” అని శ్రీ మోదీ ఈ సందర్భంగా అన్నారు.

   జ్ఞానాన్ని ఆచరణాత్మక-సహాయకర ఫలితాలుగా మార్చడంలో శాస్త్రవేత్తలకుగల సవాలు గురించి ప్రధానమంత్రి మాట్లాడుతూ- “శాస్త్రవిజ్ఞాన కృషి ప్రయోగశాల నుంచి దేశంలోకి వస్తేనే గొప్ప విజయం కాగలదు. ఆ ప్రభావం ప్రపంచ స్థాయి నుంచి క్షేత్రస్థాయికి చేరాలి. వాటి పరిధి పత్రికల నుంచి ప్రజలకు చేరువ కావాలి. అలాగే పరిశోధనలు నిజ జీవితాలకు చేరితేనే మార్పు సుస్పష్టం కాగలదు” అన్నారు. ప్రజల అనుభవాలకు-ప్రయోగాలకు మధ్య దూరాన్ని శాస్త్ర విజయాలు భర్తీ చేసినప్పుడు అదొక ముఖ్యమైన సందేశాన్నిస్తుందని, తద్వారా మార్పులో శాస్త్ర విజ్ఞానం పాత్రపై యువతరం ప్రభావితం కాగలదని ఆయన అన్నారు. అటువంటి యువతకు తోడ్పాటు ఇవ్వడానికి ఒక సంస్థాగత చట్రం ఆవశ్యకతను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అటువంటి వ్యవస్థీకృత ప్రోత్సాహక చట్రం అభివృద్ధికి కృషి చేయాల్సిందిగా ఆయన సభికులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ‘ప్రతిభాన్వేషణ’ (టాలెంట్ హంట్),  ‘హ్యాకథాన్‌’లను ఆయన ఉదాహరించారు. వీటిద్వారా శాస్త్ర విజ్ఞానాసక్తిగల బాలలను కనుగొనవచ్చునని తెలిపారు. క్రీడా రంగంలో భారత పురోగతి గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. పురోగమిస్తున్న బలమైన సంస్థాగత యంత్రాంగం, గురు-శిష్య పరంపర ఈ విజయానికి కారణమని స్పష్టం చేశారు. శాస్త్ర విజ్ఞాన రంగంలోనూ ఈ సంప్రదాయం విజయ మంత్రం కాగలదని ప్రధాని సూచించారు.

   దేశంలో శాస్త్ర విజ్ఞానాభివృద్ధికి మార్గం సుగమం చేయగల అంశాలను ప్రధానమంత్రి ఎత్తిచూపారు. దేశ అవసరాలను తీర్చడమన్నదే అన్నివిధాలా శాస్త్రవిజ్ఞాన సమాజ స్ఫూర్తికి మూలం కావాలని వ్యాఖ్యానించారు. “భారతదేశంలో శాస్త్ర విజ్ఞానం దేశాన్ని స్వయం సమృద్ధం చేయాలి” అని ప్రధానమంత్రి అన్నారు. మానవ జనాభాలో 17-18 శాతం భారతదేశంలో నివసిస్తున్న నేపథ్యంలో అటువంటి శాస్త్రీయ పరిణామాలు మొత్తం జనాభాకు ప్రయోజనం చేకూర్చగలవని ప్రధాని పేర్కొన్నారు. అదే సమయంలో మానవాళి మొత్తానికీ ప్రాధాన్యమిచ్చే అంశాలపై కృషి కొనసాగాల్సిన అవసరాన్ని ఆయన నొక్కిచెప్పారు. దేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చడంలో భాగంగా భారతదేశం జాతీయ ఉదజని కార్యక్రమం చేపట్టిందని, దాన్ని విజయవంతం చేయడం కోసం ఎలక్ట్రోలైజర్ల సంక్లిష్ట పరికరాలను దేశీయంగా తయారుచేయాల్సి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.

   కొత్తగా పుట్టుకొస్తున్న వ్యాధుల నివారణ, నియంత్రణ మార్గాన్వేషణలో శాస్త్రీయ సమాజం పాత్రను, కొత్త టీకాల రూపకల్పనలో పరిశోధనలను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని కూడా ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. వ్యాధులను సకాలంలో గుర్తించే దిశగా సమగ్ర వ్యాధి నిఘా గురించి ఆయన ప్రస్తావించారు. ఇందుకోసం అన్ని మంత్రిత్వ శాఖల సమన్వయ కృషి అవసరమని నొక్కిచెప్పారు. అదేవిధంగా ‘పర్యావరణం కోసం జీవనశైలి’ (లైఫ్‌) ఉద్యమానికి శాస్త్రవేత్తలు ఇతోధికంగా చేయూత ఇవ్వవచ్చునని అన్నారు. ఇక భారత్‌ ప్రతిపాదన మేరకు 2023ను ‘అంతర్జాతీయ చిరుధాన్యం సంవత్సరం’గా ఐక్యరాజ్య సమితి ప్రకటించడం ప్రతి భారత పౌరునికీ గర్వకారణమని ప్రధానమంత్రి గుర్తుచేశారు. జీవసాంకేతిక విజ్ఞానంతో పంట అనంతర నష్టాల తగ్గింపు దిశగా శాస్త్రీయ సమాజం సమర్థ చర్యలు చేపడితే భారత  చిరుధాన్యాలతోపాటు వినియోగం మెరుగుకు వీలవుతుందని ఆయన సూచించారు. పురపాలక ఘన వ్యర్థాలు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, బయో-మెడికల్ వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు విస్తరిస్తున్నందున వాటి నిర్వహణలో శాస్త్రవిజ్ఞాన పాత్రను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అలాగే వృత్తాకార ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నదని తెలిపారు.

   భారతదేశంలో అంతరిక్ష రంగం పురోగమిస్తున్న నేపథ్యంలో చౌక ఉపగ్రహ ప్రయోగ వాహనాల పాత్రను ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు మన సేవల కోసం ప్రపంచం ముందుకొస్తున్నదని ఆయన పేర్కొన్నారు. అందువల్ల ఈ రంగంలో పరిశోధన-అభివృద్ధి ప్రయోగశాలలు, విద్యాసంస్థలతో అనుసంధానం ద్వారా ప్రైవేట్ సంస్థలు, అంకుర సంస్థలకుగల అవకాశాలను ప్రధానమంత్రి నొక్కిచెప్పారు. అలాగే క్వాంటం కంప్యూటింగ్‌లో దేశం ముందంజ గురించి, క్వాంటం గమ్యంగా భారత్‌ ప్రపంచంలో ఎలా తనదైన ముద్ర వేస్తున్నదో కూడా ఆయన వివరించారు. “క్వాంటమ్ కంప్యూటర్లు, కెమిస్ట్రీ, కమ్యూనికేషన్, సెన్సార్లు, క్రిప్టోగ్రఫీ, కొత్త సరంజామాల వైపు భారతదేశం వేగంగా దూసుకుపోతోంది” అని ఆయన పేర్కొన్నారు.  క్వాంటమ్ రంగంలో మరింత నైపుణ్యం సంపాదించి అగ్రగాములు కావాలని యువ పరిశోధకులను, శాస్త్రవేత్తలను ప్రధాని కోరారు.

   ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కడా స్పృశించని భవిష్యత్‌ రంగాలతోపాటు కాలానికన్నా ముందస్తు ఆలోచనలపై  దృష్టి సారించాల్సిన అవసరాన్ని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. అదే సమయంలో ‘ఎఐ, ఎఆర్‌, విఆర్‌’ సాంకేతికతలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందిగా సూచించారు. సెమీకండక్టర్ చిప్‌లలో ఆవిష్కరణలతో ముందుకు రావాలని ఆయన శాస్త్రీయ సమాజాన్ని కోరారు. సెమీకండక్టర్ ఆధారిత భవిష్యత్తు మార్గాన్ని ఇప్పటినుంచే సిద్ధం చేసుకోవడంపై ఆలోచించాలని సూచించారు. “ఈ రంగాలలో దేశం చొరవ చూపితే మనం పారిశ్రామిక విప్లవం  4.0కు నాయకత్వం వహించగల స్థితిలో ఉంటాం” అని ఆయన అన్నారు. చివరగా- ప్రస్తుత భారత వైజ్ఞానిక మహాసభల్లో భవిష్యత్‌ ప్రాధాన్యంతో వివిధ నిర్మాణాత్మక అంశాలపై విస్పష్ట మార్గ ప్రణాళిక రూపొందగలదని ప్రధానమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. “ఈ అమృత కాలంలో మనం భారతదేశాన్ని ఆధునిక విజ్ఞాన శాస్త్రరీత్యా అత్యంత అధునాతన ప్రయోగశాలగా మార్చాలి” అని పిలుపునిస్తూ శ్రీ మోదీ తన ప్రసంగం ముగించారు.

నేపథ్యం

    ఏడాది ‘మహిళా సాధికారత ద్వారా సుస్థిర ప్రగతి కోసం శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాలు” ప్రధాన ఇతివృత్తంగా ‘ఐఎస్‌సి’ నిర్వహించబడుతోంది. ఈ మేరకు సుస్థిర అభివృద్ధి, మహిళా సాధికారత, ఈ లక్ష్యసాధనలో శాస్త్ర-సాంకేతిక విజ్ఞానాల పాత్రపై చర్చలు సాగుతాయి. బోధన, పరిశోధన, పారిశ్రామిక రంగాల్లో ఉన్నతస్థాయికి చేరే మహిళల సంఖ్య పెంచే మార్గాలపై ఈ మహాసభలో చర్చలు, గోష్టులు సాగుతాయి. అలాగే విద్య, పరిశోధన, ఆర్థిక భాగస్వామ్యంలో సమాన అవకాశాల కల్పన దిశగా ‘స్టెమ్‌’ (శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్‌, గణితం) మహిళలకు సౌలభ్యం కోసం మార్గాన్వేషణ చేస్తారు. అంతేకాకుండా శాస్త్ర-సాంకేతిక రంగాల్లో మహిళల పాత్రను ప్రస్ఫుటం చేసే ప్రత్యేక కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. ఇందులో ప్రముఖ మహిళా శాస్త్రవేత్తలు ఉపన్యసిస్తారు.

   ‘ఐఎస్‌సి’తో సమాంతరంగా మరికొన్ని ఇతర కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. ఈ మేరకు పిల్లల్లో శాస్త్రవిజ్ఞాన అభిరుచిని పెంచే దిశగా బాలల వైజ్ఞానిక మహాసభ కూడా నిర్వహిస్తారు. అలాగే వ్యవసాయం వైపు యువతను ఆకర్షించడంతోపాటు జీవ-ఆర్థిక వ్యవస్థ మెరుగు లక్ష్యంగా నిర్వహించే రైతు విజ్ఞాన మహాసభ వారికి ఒక వేదికగా నిలుస్తుంది. దేశీయ ప్రాచీన విజ్ఞానం, వ్యవస్థలు, పద్ధతుల శాస్త్రీయ విలువలను వెలుగులోకి తేవడంతోపాటు గిరిజన మహిళల సాధికారత లక్ష్యంగా గిరిజన వైజ్ఞానిక మహాసభ కూడా నిర్వహిస్తారు.

   మన దేశంలో తొలి భారత వైజ్ఞానిక మహాసభ 1914లో నిర్వహించబడగా, ఈ ఏడాది శతిబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్న “రాష్ట్రసంత్ తుకాడోజీ మహారాజ్ నాగ్‌పూర్ విశ్వవిద్యాలయం”లో ప్రస్తుత 108వ ‘ఐఎస్‌సి’ని నిర్వహిస్తుండటం విశేషం.

 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 నవంబర్ 2024
November 21, 2024

PM Modi's International Accolades: A Reflection of India's Growing Influence on the World Stage