ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 19న మధ్యాహ్నం 12:00 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా బెంగళూరు టెక్ సమిట్, 2020 ని ప్రారంభించనున్నారు.
బెంగళూరు టెక్ సమిట్ ఈ నెల 19 నుంచి ఈ నెల 21 వరకు జరుగనుంది. ఈ శిఖర సమ్మేళనాన్ని కర్నాటక ఇన్నోవేషన్ ఎండ్ టెక్నాలజీ సొసైటీ (కెఐటిఎస్), కర్నాటక ప్రభుత్వానికి చెందిన విజన్ గ్రూప్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ ఎండ్ స్టార్ట్-అప్ తో, సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్‌స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టిపిఐ) తో, అలాగే ఎమ్ఎమ్ యాక్టివ్ సైన్స్-టెక్ కమ్యూనికేషన్స్ తో కలసి కర్నాటక ప్రభుత్వం ఏర్పాటుచేసింది.
బెంగళూరు టెక్ సమిట్ లో ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, స్విస్ కన్ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు శ్రీ గై పర్మెలిన్ లతో పాటు, అంతర్జాతీయంగా ప్రముఖ వ్యక్తులు చాలా మంది పాలుపంచుకోనున్నారు. వారితో పాటు, దేశ విదేశాలలోని పరిశ్రమరంగ సారధులు, టెక్నోక్రాట్స్, పరిశోధకులు, నూతన ఆవిష్కర్తలు, ఇన్వెస్టర్లు, విధాన నిర్ణేతలు, విద్యారంగ ప్రముఖులు కూడా ఈ శిఖర సమ్మేళనంలో పాలుపంచుకొంటారు.
‘‘నెక్స్‌ట్ ఈజ్ నౌ’’ అనేది ఈ శిఖర సమ్మేళనానికి ఇతివృత్తంగా ఉంది. మహమ్మారి ప్రాబల్యం అనంతర కాలంలో ప్రపంచం లో ఎదురైన ముఖ్య సవాళ్ళతో పాటు, ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ & ఎలక్ట్రానిక్స్’, ‘బయోటెక్నాలజీ’ రంగాలలో ప్రముఖ సాంకేతికతను, నూతన ఆవిష్కారాలు ప్రసరించిన ప్రభావం పై చర్చోపచర్చలు జరుగనున్నాయి.