ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జాతీయ సాహస పురస్కారాలను ఈ రోజు 18 మంది చిన్నారులకు అందజేశారు. ఈ పురస్కారాలలో మూడింటిని మరణానంతరం ప్రదానం చేయడమైంది.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి పురస్కార గ్రహీతలతో మాట్లాడుతూ, వారి సాహస కార్యాలను గురించి విస్తృత స్థాయిలో చర్చించుకోవడంతో పాటు ప్రసార మాధ్యమాలు వారి సాహస కార్యాలను గురించి ప్రముఖంగా చాటిచెబుతాయని కూడా పేర్కొన్నారు. ఈ కారణంగా, వారు ఇతర చిన్నారులకు ప్రేరణను అందించేటటువంటి వారు కావడమే కాక ఇతర పిల్లలలో తరచుగా ఆత్మవిశ్వాస భావనను కూడా అంకురింపయగలరని ఆయన అన్నారు.
పురస్కార స్వీకర్తలలో ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుండి మరియు అణకువ కలిగిన కుటుంబాల నుండి వచ్చిన వారేనంటూ ప్రధాన మంత్రి గుర్తు చేశారు. బహుశా వారి దైనందిన పోరాటాలు, వారిలో ప్రతికూల పరిస్థితులకు ధైర్యంగా ఎదురొడ్డి నిలవగల హుషారును నింపి ఉండి ఉండవచ్చని ఆయన అన్నారు.
అవార్డు విజేతలను, వారి తల్లిదండ్రులను మరియు ఆ చిన్నారుల యొక్క పాఠశాల ఉపాధ్యాయులను ప్రధాన మంత్రి అభినందించారు. అంతేకాకుండా వారి సాహసకృత్యాలను గమనించి, లోకం వారి పట్ల శ్రద్ధ వహించడంలో తోడ్పడినవారిని సైతం ఆయన ప్రశంసించారు.
ఈ తరహా గుర్తింపు లభించిన తరువాత అవార్డు గ్రహీతల పైన భావి అంచనాలు ఇదివరకటి కన్నా అధికం అవుతాయని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వారు వారి యొక్క భావి ప్రయత్నాలలో రాణించాలంటూ ఆయన ఆకాంక్షించారు.
మహిళలు మరియు బాల వికాస శాఖ మంత్రి శ్రీమతి మేనకా గాంధీ ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్నారు.