ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, జర్మనీ చాన్స్ లర్ ఏంజెలా మర్కెల్ లు ఈ రోజు బెర్లిన్ లో జరిగిన నాలుగో భారత, జర్మనీ ల అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశానికి సంయుక్తంగా అధ్యక్షత వహించారు.
సమావేశం ముగిసిన అనంతరం ప్రసార మాధ్యమాల ప్రతినిధులతో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ప్రసంగిస్తూ, యూరోప్ తో పాటు ప్రపంచం పట్ల చాన్స్ లర్ మర్కెల్ యొక్క దార్శనికతను ప్రశంసించారు.
ఉభయ దేశాల మధ్య సంబంధాలు ఫలితాల సాధన ప్రధానం అన్న రీతిలో సాగుతున్నాయని ఆయన చెప్నారు.
జర్మనీ నుండి భారతదేశంలోకి మరీ ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలోకి వస్తున్న పెట్టుబడులు పెరుగుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రపంచ కొలమానాలు’’ భారతదేశానికి కీలకమైనవని ఆయన చెబుతూ, జర్మనీ పరామితులు ప్రపంచ ప్రమాణాలను సరిపోలుతాయని, అలాంటిది జర్మనీ ‘స్కిల్ ఇండియా మిషన్’ లో భాగస్వామ్యాన్ని పంచుకోవడం ముఖ్యమైన విషయం అన్నారు. క్రీడా మైదానంలో ప్రత్యేకించి ఫుట్ బాల్ లోనూ సహకారాన్ని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.
శీతోష్ణ స్థితి పరిరక్షణ, స్మార్ట్ సిటీస్ వంటి అంశాలు తమ చర్చలలో ప్రస్తావనకు వచ్చినట్లు ప్రధాన మంత్రి ప్రస్తావించారు. జర్మనీ యొక్క నూతన ఆవిష్కరణలు మరియు భారత యువశక్తి కలగలిస్తే స్టార్టప్ ల రంగానికి మరింత హుషారును అందించగలుగుతాయని ప్రధాన మంత్రి అన్నారు.
ఒక దేశంతో మరొక దేశం అనుసంధానమైన, పరస్పర ఆధారితమైన ప్రస్తుత ప్రపంచ వ్యవస్థలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు వర్ధిల్లవలసిన అవసరం ఎంతైనా ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
ఒక ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, జర్మనీ, భారతదేశం "ఒకరికి మరొకరు" వంటి పోలికను కలిగివున్నాయని అన్నారు. జర్మనీ శక్తి సామర్థ్యాలకు, భారతదేశ అవసరాలకు మధ్య గొప్ప కలయిక చోటు చేసుకున్నదని ఆయన వివరించారు. ఇంజినీరింగ్, అవస్థాపన, నైపుణ్యాల అభివృద్ధి వంటి రంగాలలో భారతదేశం సాధిస్తున్న విజయాలను గురించి ఆయన వివరించారు. ప్రజాస్వామ్యం మరియు నూతన ఆవిష్కారాల విలువను గురించి అభివర్ణిస్తూ, ఈ విలువలు మానవాళికి ఒక దీవెన వంటివి అన్నారు. ఈ విలువలను భారతదేశం, జర్మనీ అనుసరిస్తున్నట్లు చెప్పారు.
శీతోష్ణస్థితిలో మార్పు అంశంపై అడిగిన మరొక ప్రశ్నకు ప్రధాన మంత్రి జవాబిస్తూ, ప్రకృతిని పరిరక్షించడంలోను, పెంచి పోషించడంలోను భారతదేశం ఎంతో కాలంగా పెద్ద పీట వేసినట్లు పునరుద్ఘాటించారు. 2022 కల్లా నవీకరణ యోగ్య శక్తి వనరుల ద్వారా 175 గీగావాట్ల శక్తిని ఉత్పత్తి చేయాలని భారతదేశం తీర్మానించుకొన్నదని ఆయన గుర్తు చేశారు. ప్రకృతిని కాపాడడానికి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను గురించి నొక్కి చెబుతూ, "రాబోయే తరాల వారి శ్రేయస్సుతో ఆటలాడడం అనైతికమైనటు వంటి మరియు నేర పూర్వకమైనటు వంటి చేష్ట కాగలదని ప్రధాన మంత్రి అన్నారు.
అంత క్రితం ఐజిసి సమావేశంలో ప్రధాన మంత్రి శ్రీ మోదీ నియమాలపై ఆధారపడినటు వంటి ప్రపంచ వ్యవస్థ వర్ధిల్లేటట్లు చూడటంలో యూరోపియన్ యూనియన్ ప్రముఖ పాత్రను పోషించవలసి ఉన్నదని స్పష్టం చేశారు. ప్రపంచానికి ఒక ముప్పుగా పరిణమించినటు వంటి ఉగ్రవాదంపై ఇరువురు నేతలు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఎదురొడ్డటంలో పరస్పర సహకారాన్ని మరింత పటిష్ట పరచాలని వారు నిర్ణయించారు.
ఎగుమతి నియంత్రణ విధానాలలో భారతదేశం పాలుపంచుకొనేందుకు అండదండలు అందించిన జర్మనీకి ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. శుద్ధమైన బొగ్గు, ఎలక్ట్రిక్ మొబిలిటీ, శాస్త్ర విజ్ఞానం మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధ సహకారం, సైబర్ సెక్యూరిటీ ఇంకా విమానయాన భద్రత తదితర అంశాలు కూడా చర్చకు వచ్చాయి. అలాగే ఈ సమావేశంలో అఫ్గనిస్థాన్ తో పాటు ఇతర ప్రపంచ అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి.
ఇరు దేశాలు 12 ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. ఈ సంప్రదింపులలో చోటు చేసుకున్న వివిధ అంశాలను పేర్కొంటూ, ఒక సమగ్రమైన సంయుక్త ప్రకటనను కూడా విడుదల చేశారు.