ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీ లో ఉన్నత న్యాయస్థానం ఏర్పాటై 50 ఏళ్లయిన సందర్భంగా జరిగిన వార్షికోత్సవానికి హాజరయ్యారు.
ఢిల్లీ ఉన్నత న్యాయస్థానంతో గత అయిదు దశాబ్దాలకు పైబడి సంబంధం ఉన్న వారందరి సేవలను ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయన సంబంధితులందరూ వారికి అప్పగించిన బాధ్యతలను భారతదేశ రాజ్యాంగానికి అనుగుణంగా నెరవేర్చాలన్నారు.
అక్టోబరు 31వ తేదీ సర్దార్ పటేల్ జయంతి కూడా అని ప్రధాన మంత్రి గుర్తుచేస్తూ, సర్దార్ పటేల్ ఒక న్యాయవాది అని, ఆయన తన జీవనాన్ని దేశ సేవ కోసం అంకితం చేశారన్నారు. అఖిల భారత సివిల్ సర్వీసుల స్థాపన సహా సర్దార్ పటేల్ చేసిన సేవలను ఆయన గుర్తుకు తెచ్చారు.
వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ప్రత్యామ్నాయ యంత్రాంగాలకు బలాన్ని ఇస్తున్నందుకు గాను న్యాయవాద వృత్తి నిపుణులను ప్రధాన మంత్రి అభినందించారు. న్యాయ వ్యవస్థ ఎదుట నిలుస్తున్న కొత్త కొత్త సవాళ్లను గురించి ఆయన ప్రస్తావిస్తూ, భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని ఒక మార్గసూచీని సిద్ధం చేయాలని పిలుపునిచ్చారు.