అఫ్గానిస్తాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ డాక్టర్ అబ్దుల్లా అబ్దుల్లా తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు మధ్యాహ్నం సమావేశమయ్యారు.
భారతదేశంలో రెండు రోజుల పర్యటనకు గాను విచ్చేసిన శ్రీ డాక్టర్ అబ్దుల్లా కు ప్రధాన మంత్రి స్నేహ పూర్వక స్వాగతం పలికారు.
భారతదేశం మరియు అఫ్గానిస్తాన్ ల మధ్య నెలకొన్న బహుముఖీనమైన వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలాన్ని, సామీప్యాన్ని పుంజుకొందని ఇరువురు నేతలు పునరుద్ఘాటించారు. న్యూ ఢిల్లీలో ఇటీవల ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్య మండలి సమావేశం జరిగిన సందర్భంగా చేసినటువంటి నూతన అభివృద్ధి భాగస్వామ్య ప్రకటన ద్వారా ద్వైపాక్షిక సహకారం వేగాన్ని అందుకోవడాన్ని వారు హర్షించారు. ఈ కోణంలో అపారమైన అవకాశాలు ఉండడాన్ని గురించి మరియు ద్వైపాక్షిక ఆర్థిక సంబంధ, వికాస సంబంధ సహకారాన్ని గురించి కూడా వారు చర్చించారు.
అఫ్గానిస్తాన్ లో అవస్థాపన అభివృద్ధి కోసం, ఇంకా సామర్ధ్యాల పెంపుదల కోసం భారతదేశం మద్ధతివ్వడం కొనసాగించడాన్ని అఫ్గానిస్తాన్ ఎంతగానో ప్రశంసిస్తున్నట్లు శ్రీ డాక్టర్ అబ్దుల్లా వెల్లడించారు.
శాంతియుతమైన, సమృద్ధమైన, సమ్మిళితమైన, ప్రగతిశీల, సమైక్య అఫ్గానిస్తాన్ నిర్మాణం కోసం అఫ్గాన్ చేస్తున్న కృషికి భారతదేశం సంపూర్ణ మద్దతును అందించగలదని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
అఫ్గానిస్తాన్ లో మరియు దానిని ఆనుకొని ఉన్న ప్రాంతంలో భద్రమైన వాతావరణం నెలకొనాలనే అంశం పై ఉభయ నేతలు ఒకరి అభిప్రాయాలను మరొకరికి తెలియజెప్పుకొన్నారు. ఈ విషయంలో సన్నిహిత సమన్వయాన్ని మరియు సహకారాన్ని కొనసాగించాలని వారు ఒక అంగీకారానికి వచ్చారు.
సమావేశం ముగింపులో ఇరు పక్షాలు పోలీసు బలగాల శిక్షణ మరియు అభివృద్ధి సంబంధిత సాంకేతిక సహకారం అంశంపై ఒక అవగాహన పూర్వక ఒప్పంద పత్రాన్ని ఉభయ నాయకుల సమక్షంలో ఇచ్చిపుచ్చుకొన్నాయి.
చేయి తిరిగిన ఒక అఫ్గాన్ చిత్రలేఖకుడు రూపొందించినటువంటి ఒక వర్ణ చిత్రాన్ని శ్రీ డాక్టర్ అబ్దుల్లా తనకు అందజేయగా ఆ వర్ణచిత్రం బాగుందంటూ ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.