వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ 2017 కు హాజరైన మీకందరికీ సుస్వాగతం. అలాగే ఈ కొత్త సంవత్సరం సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ఏడాది అందరికీ సంతోష, సౌభాగ్యాలు కలగాలని, విజయాలు సమకూరాలని ఆకాంక్షిస్తున్నా. ఈ సమావేశాలు మొదటిసారిగా 2003లో నిరాడంబరంగా శ్రీకారం చుట్టుకున్న క్షణాలను ఆప్యాయంగా గుర్తు చేసుకుంటున్నా. నాటి నుండీ ఈ పయనం విజయవంతంగా సాగుతూ వస్తోంది.
ఈ సదస్సు భాగస్వామ్య దేశాలు, సంస్థలన్నిటికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ జాబితాలో జపాన్, కెనడా, అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, డెన్మార్క్, ఫ్రాన్స్, పోలాండ్, స్వీడన్, సింగపూర్, యుఎఇ తదితరాలున్నాయి. వైబ్రంట్ గుజరాత్ సమావేశాలకు నాంది పలికిన నాటి భాగస్వామ్య దేశాలు జపాన్, కెనడాలకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు.
ఈ సమావేశ నిర్వహణలో అనేక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సంస్థలు, నెట్ వర్క్ లు భాగస్వాములుగా ఉన్నాయి. ఇందులో పాలుపంచుకుంటున్న మీకందరికీ ధన్యవాదాలు. మీరు ఈ కార్యక్రమానికి హాజరుకావడం ఇక్కడున్న వ్యాపార దిగ్గజాలకేగాక యువ ఔత్సాహికులకూ స్ఫూర్తిదాయకమే. మీ మద్దతు లేకుండా ద్వైవార్షిక కార్యక్రమం ఇప్పుడిలా ఎనిమిదోసారి నిర్వహించుకునే అవకాశం ఉండేది కాదనడంలో సందేహం లేదు. అందునా ప్రతిసారీ మునుపటి సమావేశాల కన్నా మెరుగ్గా, భారీగా ఇది రూపుదాల్చుతూండటం మరింత విశేషం.
గడచిన మూడు సమావేశాలు ప్రత్యేకించి అత్యంత భారీగా సాగాయి. 100కు పైగా దేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు, రాజకీయ నాయకులు, ప్రపంచం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో వివిధ సంస్థలు ఇందులో పాల్గొంటూ దీనిని ఒక ప్రపంచ శ్రేణి సమావేశంగా మార్చుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుత సదస్సు నుండి అత్యుత్తమ ప్రయోజనాన్ని పొందే దిశగా మీరంతా పరస్పరం సంప్రదింపులు సాగించాలని విజ్ఞప్తి చేస్తున్నా. అంతేకాకుండా వందలాది కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తున్న వాణిజ్య, వస్తు తయారీ ప్రక్రియల ప్రదర్శనను కూడా మీరు తిలకించాలని కోరుతున్నా.
గుజరాత్… మహాత్మ గాంధీ, సర్దార్ పటేల్ ల వంటి మహనీయుల జన్మభూమి మాత్రమే కాదు.. భారతదేశ వ్యాపార స్ఫూర్తికి ప్రతినిధి. యుగాలుగా వాణిజ్యానికి, పరిశ్రమలకు దారిచూపింది. శతాబ్దాల కిందటే ఇక్కడి వారు అవకాశాన్వేషణలో సప్త సముద్రాలు దాటి వెళ్లారు. నేటికీ విదేశాలలో నివసిస్తున్న, పనిచేస్తున్న వారిలో అత్యధికుల మూలాలు గుజరాత్‌లోనే ఉన్నాయని ఈ రాష్ట్రం గొప్పగా చెబుతూంటుంది. ఇక వారెక్కడికి వెళితే అక్కడ ఓ సూక్ష్మ గుజరాత్‌ను సృష్టించారు. అందుకే మేం గర్వంగా చెప్పుకొంటుంటాం ‘‘జ్యా జ్యా బసే గుజరాతీ, త్యా త్యా సదాకాల్ గుజరాత్’’.. ఎక్కడెక్కడ గుజరాతీ నివసిస్తుంటాడో, అక్కడక్కడ గుజరాత్ ఎప్పటికీ జీవించే ఉంటుంది.. అని. గుజరాత్ గాలిపటాల పండుగ సంబరాల్లో మునిగి ఉన్నఈ సమయంలో మరింత ఎత్తుకు ఎదగాలన్న మన ఆకాంక్షలకు ఈ పతంగులు ఉత్తేజమిచ్చుగాక.
మిత్రులారా,
నేను తరచూ చెబుతున్నట్లు భారత్ బలం మూడు ‘డి’లు… డెమోక్రసీ (ప్రజాస్వామ్యం). డెమోగ్రఫీ (జనశక్తి), డిమాండ్ (గిరాకీ)లలోనే ఉంది.
ప్రభావశీలమైన ప్రజాస్వామ్యమే మా అతి పెద్ద బలం. ప్రజాస్వామ్యంలో సమర్థ, వేగవంతమైన పరిపాలన సాధ్యంకాదని కొందరంటుంటారు. కానీ, ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ సత్వర ఫలితాలు సాధ్యమేనని గడచిన రెండున్నరేళ్లలో మనం ప్రత్యక్షంగా చూశాం.
ఇదే రెండున్నరేళ్ల వ్యవధిలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ సంస్కృతిని మేం ఆవిష్కరించాం. సుపరిపాలన కొలబద్దగా రాష్ట్రాలకు రేటింగ్ ఇస్తున్నాం. ఈ ప్రక్రియలో ప్రపంచ బ్యాంకు మాకు సహకరిస్తోంది.
జనశక్తి విషయానికొస్తే.. ఉత్తేజపూరిత యువతరంతో నిండిన దేశం మాది. క్రమశిక్షణ, అంకితభావం, నైపుణ్యం గల భారత యువత ప్రపంచానికి తిరుగు లేని కార్మిక శక్తిని అందిస్తోంది. ఆంగ్లం మాట్లాడగలిగే వారు అధికంగా ఉన్న దేశాల్లో మాది రెండో స్థానం. మా యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడడం లేదు. కష్టనష్టాలను ఎదుర్కొనడానికి సిద్ధమై తరచూ వ్యవస్థాపకులు కావడానికే ప్రాధాన్యమిస్తున్నారు.
డిమాండ్ సంగతి చూస్తే… మా వర్ధమాన మధ్య తరగతి ప్రజానీకం భారీ దేశీయ విపణికి భరోసా ఇస్తోంది. భారత ద్వీపకల్పానికి చుట్టూ ఉన్న మహా సముద్రాలు ఆఫ్రికా, మధ్య ప్రాచ్యం, ఐరోపా ల వంటి ప్రపంచంలోని అతి పెద్ద విపణులకు మమ్మల్ని అనుసంధానిస్తున్నాయి.
ప్రకృతికీ మాపైన కరుణ అపారం. ముక్కారు పంటలకు అవకాశం గల మా దేశంలో ఆహార పంటలేగాక కూరగాయలు, పండ్లకూ కొరత లేదు. వృక్షజాల, జంతుజాల వైవిధ్యం ఇక్కడ అసమానం.
సుసంపన్న సంస్కృతి, అందుకు తార్కాణంగా నిలిచే సజీవ చిహ్నాలు మా దేశ విశిష్టత. మా విద్యాసంస్థలు, మేధావులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. భారతదేశం ఇప్పుడు పరిశోధన-అభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రంగా ఆవిర్భవిస్తోంది. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను తయారుచేస్తున్న దేశాల జాబితాలో మేం ద్వితీయ స్థానంలో ఉన్నాం.
మా వినోద పరిశ్రమ విశ్వవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇవన్నీ కలిసి సాపేక్షంగా తక్కువ వ్యయంతోనే నాణ్యమైన జీవితాస్వాదనకు హామీ ఇస్తున్నాయి.
మిత్రులారా,
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతో నిండిన పాలనను అంతంచేసి, సుపరిపాలన అందిస్తామన్న ప్రధాన వాగ్దానమే మా ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టేందుకు దోహదపడింది. దేశ పరిపాలన, ఆర్థిక విధానాలలో ఆదర్శప్రాయ పరివర్తనే మా స్వప్నం, లక్ష్యం. ఈ దిశగా మేం అనేక నిర్ణయాలు, చర్యలు తీసుకున్నాం. ఉదాహరణకు మేం తెస్తున్న మార్పులు ఇలా ఉన్నాయి:
- సంబంధాల ఆధారిత పాలన నుండి వ్యవస్థ ఆధారిత పాలనవైపు;
- విచక్షణ ఆధారిత పాలన నుండి విధాన ఆధారిత పరిపాలనవైపు;
- యథేచ్ఛగా జోక్యం నుండి సాంకేతిక మధ్యవర్తిత్వంవైపు;
- పక్షపాత వైఖరి నుండి సమానావకాశాల కల్పనవైపు;
- క్రమరహిత ఆర్థిక వ్యవస్థ నుండి క్రమబద్ధ ఆర్థిక వ్యవస్థవైపు..
ఈ కృషిలో డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించింది. ఎలక్ట్రానిక్ పాలనే (ఇ-గవర్నెన్స్) సులభ, సమర్థ పాలన అని నేను తరచూ చెబుతుంటాను. అదే సమయంలో విధానచోదిత పాలన అవసరాన్నీ నేను నొక్కిచెబుతుంటాను. నిర్ణయాల్లో వేగం, పారదర్శకతకు ఆన్‌లైన్ ప్రక్రియలు దోహదపడతాయి. ఆ మేరకు పారదర్శకత తేవడం ద్వారా విచక్షణను అంతం చేసే దిశగా సరికొత్త సాంకేతికత పరిజ్ఞానాలను అందిపుచ్చుకుని, పాలనలో అంతర్భాగం చేసుకునేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ డిజిటల్ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతోందంటే నమ్మశక్యం కాకపోవచ్చు.. కానీ, మీలో చాలా మంది దేశంలో ఈ మార్పునే చూడాలని ఆకాంక్షించారు. ఇప్పుడు అదే మీ కళ్ల ముందు సాక్షాత్కరిస్తోందని నేను సగర్వంగా ప్రకటిస్తున్నాను.
భారతదేశ సామర్థ్యాన్ని సాకారం చేయడానికి, గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థను సరైన బాటలో పెట్టడానికి గడచిన రెండున్నరేళ్లలో మేం అవిశ్రాంతంగా శ్రమించాం. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి. స్థూల దేశీయోత్పత్తి, వృద్ధి, ద్రవ్యోల్బణం, కోశసంబంధి లోటు, వర్తమాన ఖాతా లోటు వంటి స్థూల సూచీలు సహా విదేశీ పెట్టుబడులలో గణనీయ మెరుగుదల సాధ్యమైంది.
ప్రపంచంలో అతి వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించింది. అంతర్జాతీయ ఆర్థిక మందగమనం నడుమ మనం అద్భుత వృద్ధిని నమోదు చేశాం. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్ ఇప్పుడొక వెలిగిపోతున్న ప్రదేశం. అన్ని దేశాలూ భారతదేశాన్ని నేడు ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా చూస్తున్నాయి.
రానున్న రోజుల్లో మరింత వృద్ధిని సాధించగలమని ప్రపంచబ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) సహా పలు సంస్థలు సూచిస్తున్నాయి. ప్రపంచ వృద్ధికి సంబంధించి 2014-15లో భారతదేశం వాటా 12.5 శాతం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మన దేశం వాటా ప్రకారం చూస్తే ప్రపంచ వృద్ధిలో మన వాటా 68 శాతం అధికం.
వ్యాపారానికి అనువైన వాతావరణం కల్పించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం నాకు అగ్ర ప్రాధాన్యాలు. యువతకు అవకాశాలు సృష్టించడం కోసం మనం ఇదంతా చేయాలి. ఆ ఉత్తేజంతోనే కొన్ని చరిత్రాత్మక చర్యల అమలుకు మేం ముందడుగు వేస్తున్నాం. వస్తు సేవల పన్ను (జిఎస్ టి) కూడా ఇందులో ఒక భాగం.
ఆర్థిక అశక్తత, దివాలా స్మృతి (బ్యాంక్ రప్టసి కోడ్), జాతీయ కంపెనీ చట్ట ధర్మాసనం, ఓ కొత్త మధ్యవర్తిత్వ చట్రం, నూతన మేధోసంపత్తి హక్కుల వ్యవస్థ తదితరాలను ప్రవేశపెట్టాం. కొత్తగా వాణిజ్య న్యాయస్థానాలను కూడా ఏర్పాటు చేశాం. మేం ముందడుగు వేయదలచిన దిశగా తీసుకున్న చర్యలకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. భారత ఆర్థిక వ్యవస్థను సంస్కరించే ప్రక్రియను కొనసాగించేందుకు నా ప్రభుత్వం దృఢంగా కట్టుబడి ఉంది.
మిత్రులారా,
వ్యాపార సౌలభ్య కల్పనపై అత్యంత అధికంగా శ్రద్ధ పెట్టాం. లైసెన్సుల జారీ ప్రక్రియల సరళీకరణకు నిర్ణయాత్మక చర్యలు తీసుకున్నాం. అనుమతులు, రిటర్నుల దాఖలు, తనిఖీలకు సంబంధించిన నిబంధనలు, విధివిధానాలను హేతుబద్ధీకరించాం. వివిధ రంగాల్లో్ల నియంత్రణ చట్రాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా వందలాది కార్యాచరణల అమలును నిశితంగా పర్యవేక్షిస్తున్నాం. సుపరిపాలనపై మా వాగ్దానంలో ఇదంతా ఒక భాగం.
వివిధ సూచీల అంతర్జాతీయ ర్యాంకింగ్‌లలో భారత్‌కు ఉత్తమ స్థానం లభిస్తుండటమే మా కృషి ఫలితాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. గడచిన భారతదేశం తన విధానాలను, పాలనను మెరుగుపరచుకున్నదని, అది దేశ ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రంలో ప్రతిఫలిస్తున్నదని గడచిన రెండేళ్లలో అనేక అంతర్జాతీయ నివేదికలు, అంచనాలు స్పష్టం చేశాయి.
ప్రపంచ బ్యాంకు ప్రకటించిన వ్యాపార నిర్వహణ నివేదికలో భారత్ ర్యాంకు గణనీయంగా మెరుగుపడింది. అలాగే 2016-18కిగాను అగ్రశ్రేణి సంభావ్య ఆతిథ్య ఆర్థిక వ్యవస్థలపై యుఎన్ సిటిఎడి విడుదల చేసిన ప్రపంచ పెట్టుబడుల నివేదిక-2016 జాబితాలో మూడో స్థానంలో నిలిచింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన అంతర్జాతీయ స్పర్థ నివేదిక 2015-16, 2016-17లోనూ మన ర్యాంకు 32 స్థానాలు మెరుగుపడింది. డబ్ల్యుఐపిఒ, ఇతర సంస్థలు రూపొందించిన ‘ప్రపంచ నవకల్పన సూచీ-2016’లోనూ మనం 16 స్థానాలు పైకి దూసుకెళ్లాం.
ప్రపంచ బ్యాంకు వెలువరించిన‘లాజిస్టిక్స్ పెర్ఫామెన్స్ ఇండెక్స్ ఆఫ్ 2016’లో 19 స్థానాలు ఎగువకు చేరాం.
ప్రపంచంలో అత్యుత్తమ విధానాలకు మనం చేరువ కావడాన్ని చూస్తున్నాం. రోజురోజుకూ ప్రపంచంతో మరింతగా మమేకమవుతున్నాం. మన విధానాలు, కార్యాచరణల సానుకూల ప్రభావం మనలోని ఆత్మవిశ్వాసానికి మరింత ఉత్తేజమిస్తోంది. ఇదంతా మన ప్రక్రియలను మరింత సరళీకరించి వ్యాపార సౌలభ్యంలో భారత్‌కు మించిన దేశం లేదని చాటుకునేలా మనకు స్ఫూర్తినిస్తుంది.
వ్యాపార స్థాపన, వృద్ధికి వీలుగా సరళీకరణవైపు మనం ప్రతిరోజూ మన విధానాలు, ప్రక్రియలను హేతుబద్ధీకరిస్తున్నాం.
వివిధ రంగాలలో, వివిధ మార్గాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నియంత్రణ వ్యవస్థను సరళతరం చేశాం. అనేక సార్వత్రిక ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారతదేశం నేడు స్థానం సంపాదించింది.
పెట్టుబడుల వాతావరణంలో ఈ మార్పును దేశీయ, విదేశీ పెట్టుబడిదారులు గుర్తించారు. దేశంలో ఇప్పుడు స్టార్ట్- అప్ సంస్థల వాతావరణ వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. ఈ విధంగా యువశక్తి తననుతాను ఆవిష్కరించుకోవడం చూస్తే ఉత్సాహం ఉప్పొంగుతోంది.
గడచిన రెండున్నరేళ్లలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్ డిఐ) 130 బిలియన్ల అమెరికన్ డాలర్ల స్థాయికి చేరాయి. అలాగే గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎఫ్ డిఐ ప్రవాహం అంతకుముందు రెండేళ్లలో వచ్చినదానితో పోలిస్తే 60 శాతం అధికం. వాస్తవానికి నిరుడు వచ్చినంత అత్యధికస్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమాణం ఇప్పటిదాకా ఏ సంవత్సరంలోనూ లేకపోవడం విశేషం. అలాగే రెండేళ్లుగా ఎఫ్ డిఐ రాశి తో పాటు పెట్టుబడులు పెట్టే రంగాలలోనూ వైవిధ్యం ప్రస్ఫుటమవుతోంది. ప్రస్తుతం ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా మూలధన పెట్టుబడులు స్వీకరిస్తున్న దేశం భారత్ కావడం గమనార్హం.
అంతేగాక ఎఫ్ డిఐ ప్రవాహం రీత్యా పది అగ్ర దేశాల జాబితాలో భారత్ కొనసాగుతూనే ఉంది. అయితే, విజయగాధ ఇక్కడితో ఆగిపోదు. పెట్టుబడులపై ఫలితాలివ్వడంలో ప్రతి దేశాన్నీ భారత్ వెనక్కు నెట్టింది. ఆ మేరకు 2015లో బేస్ లైన్ ప్రాఫిటబిలిటీ ఇండెక్స్ లో ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది.
మిత్రులారా,
“మేక్ ఇన్ ఇండియా” భారతదేశానికి ఎన్నడూ లేని ఓ అతి పెద్ద వ్యాపార చిహ్నంగా మారింది. తయారీ, రూపకల్పన, ఆవిష్కరణలకు భారత్‌ను ఒక ప్రపంచ కేంద్రంగా రూపుదిద్దడానికే ఈ ప్రచారోద్యమం. మిత్రులారా నేను ఏ దేశానికి వెళ్లినా అక్కడ నేను ఐదుసార్లు “మేక్ ఇన్ ఇండియా” అంటే ఆతిథ్య దేశాధినేత 50 సార్లు “మేక్ ఇన్ ఇండియా” అనడం నాకో గొప్ప అనుభవం. ఒకవిధంగా చూస్తే “మేక్ ఇన్ ఇండియా” నినాదం ప్రపంచం దృష్టిలో భారత్‌ను పెట్టుబడుల గమ్యంగా మార్చేసింది. దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాల చొరవ, కేంద్ర ప్రభుత్వ సహకారంద్వారా సాగే సంయుక్త ప్రయత్నాలు “మేక్ ఇన్ ఇండియా”కు వీలైనన్ని కొత్త బాటలు పరిచాయి.
ఈ అవకాశం నుంచి లబ్ధి పొందడానికి రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీ మొదలైంది. అయితే, అది సుపరిపాలన, తదనుగుణ పర్యావరణ వ్యవస్థకు సంబంధించినదే. ఇంతకుముందు కూడా ఈ పోటీ ఉండేది. పదిహేనేళ్ల కిందట ఒక ప్రభుత్వం మరో ప్రభుత్వంకన్నా ఎక్కువ వస్తువులిచ్చేది. మూడోది అంతకన్నా ఎక్కువిచ్చేది. ఇవ్వడంలో ఇలా పోటీపడినా చివరకు ఏదీ మరోసారి అధికారంలోకి వచ్చేది కాదు. అయితే, ఎక్కడెక్కడైతే సుపరిపాలనను బలోపేతం చేశారో, అక్కడక్కడల్లా తగిన పర్యావరణ వ్యవస్థ మొలకెత్తింది. ఎక్కడెక్కడ నిబంధనలను సరిచేశారో అక్కడల్లా వ్యాపార వాతావరణం స్నేహపూరితంగా మారింది. అలాంటి అధికశాతం రాష్ట్రాలకు ఇతర దేశాల నుంచి పెట్టుబడిదారులు రాసాగారు. అందుకే మేక్ ఇన్ ఇండియా గురించి ప్రపంచంలో ఎక్కడా వివరించాల్సిన పరిస్థితి లేదు. ఈ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. ఆ రాష్ట్ర ప్రభుత్వం తన ప్రగతి ధోరణి ఆధారంగా సుపరిపాలనను బలోపేతం చేసింది. అందుకే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడంపై గుజరాత్ ప్రభుత్వ కృషిపై జట్టు మొత్తాన్నీ పదేపదే అభినందిస్తున్నాను.
‘మేక్ ఇన్ ఇండియా’ ఇటీవలే రెండో వార్షికోత్సవం చేసుకుంది.
ప్రపంచంలోని అతిపెద్ద తయారీ దేశాలకుగాను మనం 9వ స్థానం నుంచి ఆరో స్థానానికి దూసుకెళ్లామని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మనం 2015-16 జోడించిన స్థూల ఉత్పాదకత విలువ 9 శాతం వృద్ధి నమోదు చేసింది. అంతకుముందు మూడేళ్లలో సాధించిన 5 నుంచి 6 శాతంకన్నా ఇది చాలా ఎక్కువ. ఇదంతా మనం ఉపాధి మార్కెట్‌ను విస్తరించడానికి, ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికే. అయితే, వాస్తవ సామర్థ్యం ఇంతకన్నా చాలా ఎక్కువ.
కొన్ని ఉదాహరణలు పరిశీలిస్తే: భారత ఆహారోత్పత్తుల తయారీ పరిశ్రమ రాబోయే పదేళ్లలో ఐదురెట్లు పెరగనుంది. అలాగే దేశంలో వాహనరంగం బాగా చొచ్చుకుపోనందువల్ల ప్రపంచ ఆకర్షణీయ ఆటోమొబైల్ విపణిగా మార్చింది. ప్రభుత్వ స్థాయిలో మనం చేయాల్సిందల్లా మన వృద్ధి ప్రక్రియ సమ్మిళతమైనది, పట్టణ-గ్రామీణ సమాజాలపై సమదృష్టి కలిగినదిగా స్పష్టం చేయడమే. భారతదేశం పట్టణ-గ్రామీణ ప్రాంతాల సమతుల అభివృద్ధికి కట్టుబడి ఉంది. మన విధానాల ఫలితాలు పట్టణ-గ్రామీణ ప్రాంతాలకు సమానంగా అందాలి. ఇందుకోసం మన పథకాలలో పట్టణాలతో సమానంగా గ్రామాలకూ ప్రాధాన్యం దక్కాలి. అభివృద్ధి యాత్రలో అంతిమ లబ్ధి గ్రామీణ పేదరైతులదాకా చేరాలి. ఇదే మన ప్రాధాన్యంగా పరిగణించడానికి కారణం అన్ని విధానాల్లోనూ దానికే అగ్రాసనం వేయడమే.
మనం ఎలాంటి భారతదేశానికి కట్టుబడ్డామంటే:
- మెరుగైన ఉద్యోగావకాశాలు;
- మెరుగైన ఆదాయం;
- మెరుగైన కొనుగోలు శక్తి;
- మెరుగైన జీవన నాణ్యత;
- మెరుగైన జీవన ప్రమాణాలు ఉండే భారతదేశానికి.
మిత్రులారా,
మన అభివృద్ధి అవసరాలు భారీ.. మన అభివృద్ధి కార్యక్రమం ప్రగాఢ ఆకాంక్షతో కూడినది. ఉదాహరణకు:
- ప్రతి వ్యక్తికీ తలదాచుకునే నీడ;
పేదలలో ప్రతి ఒక్కరికీ ఇల్లుండాలి. అది తమ సొంతమై ఉండాలి. అది 2002నాటికి సాకారం కావాలి. ఈ స్వప్న సాకారం కోసం మన ప్రయత్నం ప్రారంభమైంది.
- ప్రతిచేతికీ పని కల్పించాలని కోరుకుంటున్నాం:
దేశ జనాభాలో 80 కోట్ల మంది 35 ఏళ్ల లోపు వయస్కులే… అంటే ఇది యువ భారతమన్న మాట. 80 కోట్ల మంది 35 ఏళ్ల లోపు యువకులైనప్పుడు.. వారి చేతిలో నైపుణ్యం ఉన్నపుడు.. పనిచేసే అవకాశం దొరికినప్పుడు.. ఈ యువత సరికొత్త భారతదేశాన్ని మన కళ్లముందు నిలబెట్టగలరు. మన యువతరంపై నాకు ఆ విశ్వాసం ఉంది. మనందరికీ ఉంది. వారికి ఆ అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. మనం అవకాశం ఇవ్వగలం, అందుకు అనువైన మార్గాలు కూడా ఎన్నో ఉన్నాయి.
- మనం విద్యుత్తు తయారచేయాల్సి ఉంది… అది పరిశుభ్రమైనదిగా ఉండాలి;
- మనం రహదారులు, రైలు మార్గాలను నిర్మించాల్సి ఉంది… వాటిని వేగంగా పూర్తిచేసుకోవాలి;
- ఖనిజాల అన్వేషణ సాగించాల్సి ఉంది… అది హరిత మార్గంలో ఉండాలి;
- మనం పట్టణ సదుపాయాలు కల్పించుకోవాలి… అవి స్థిరమైనవి కావాలి;
- మనమంతా నాణ్యమైన జీవనాన్ని చూడాలి… అది ఎప్పటికప్పుడు మెరుగుపడాలి.
మనం కొత్త తరం మౌలిక సదుపాయాలవైపు అంగలు వేస్తున్నాం: ప‌్రధాన-సామాజిక రంగాల్లో; పట్టణ-గ్రామీణ ప్రాంతాల్లో; ఇందులో రవాణా ప్రాంగణాలు, పారిశ్రామిక ప్రాంగణాలు, అత్యంత వేగ-మహానగర రైలుమార్గాలు, రవాణా పార్కులు, స్మార్ట్ సిటీలు, తీర మండళ్లు, ప్రాంతీయ విమానాశ్రయాలు, నీరు-పారిశుధ్య-విద్యుత్తు సంబంధిత చర్యలు… ఇవన్నీసాకారం చేసుకోవాలి. మన తలసరి విద్యుత్ వినియోగం పెరగాలి. అలా చేయగలిగినా పునరుత్పాదక ఇంధనోత్పత్తికి మేం కట్టుబడి ఉన్నాం. పర్యాటక రంగాన్ని భారీ స్థాయిలో ప్రోత్సహించాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇందుకు పర్యాటక మౌలిక సదుపాయాలు అవసరం.
నేను 175 గీగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి గురించి మాట్లాడుతున్న నేపథ్యంలో ఇంతకుముందు మెగావాట్ గురించి చర్చించాలన్నా భయపడే రోజులుండేవి. అయితే, ఇప్పడు గీగావాట్ల గురించి దేశం ఆలోచిస్తోంది. ఇది చాలాగొప్ప భారీ మార్పే మరి! 175 గీగావాట్ల విద్యుత్తులో సౌర, పవన, అణు విద్యుత్తు అంతర్భాగంగా ఉన్నాయి. ఇక ప్రపంచాన్ని భయపెడుతున్న భూ తాపంపై ఆందోళన తగ్గించడంలో మనవంతు కర్తవ్యం కూడా నిర్వర్తించేందుకు భారత్ సిద్ధంగా ఉంది. దేశంలో 175 గీగావాట్ల విద్యుదుత్పాదన దిశగా పెట్టుబడులకు ఆకాశమే హద్దు కాగలదని నేను ప్రపంచానికి సూచిస్తున్నాను. దీనికి తోడు మన విధానాలు కూడా ఎంతో ప్రగతిశీలమైనవి. మానవ సమాజంలో జీవితంపై దృక్కోణం కూడా మారాలని, మార్పునకు ఇదే అవకాశమని విశ్వసిస్తూ సూచిస్తున్నా. రెండు శతాబ్దాలుగా ప్రకృతి వనరుల విపరీత వినియోగంపై మనం గళమెత్తాం. ఇక రాబోయే శతాబ్దాల్లో ప్రకృతి వనరుల వినియోగంపై మన ఆలోచనల్లో మార్పు రావాలి. మనం ప్రకృతిలో ప్రాథమికాంశాలను బలోపేతం చేసే ఉపకరణాలతో ముందుకు సాగాలి. మనం ఆ విధంగా ముందడుగు వేసే అవకాశాన్ని అందిపుచ్చుకుంటే ప్రపంచంలో పరివర్తన దిశగా మనవంతు పాత్రను విజయవంతంగా పోషించగలం.
దేశంలో రహదారులు, రైలు మార్గాల పనుల వేగం ద్విగుణీకృతమైంది. కోట్లాది గృహాలను నిర్మించాల్సి ఉన్నందున ప్రపంచానికి అతిపెద్ద నిర్మాణరంగ విపణులలో ఒకటిగా భారత్ రూపొందుతుంది. పెట్టుబడులు పెట్టే సమాజానికి ఇదొక అనూహ్య అవకాశాలు కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో మీలో చాలామంది అనేక రంగాల్లో మాతో కలసి పనిచేసే వీలుంది:-
- హార్డ్‌వేర్ నుండి సాఫ్ట్‌వేర్ దాకా;
- సాధారణ నైపుణ్యాల నుండి శాస్త్రీయ జిజ్ఞాస దాకా;
- రక్షణ వ్యవస్థల నుండి సైబర్ భద్రత దాకా;
- ఔషధాల నుండి పర్యాటకందాకా;
ఈ ఖండంలోని అన్ని దేశాలూ పోటీపడగలిగినన్ని అవకాశాలను భారతదేశం ఒక్కటే అందించగలుగుతుందని నేను ధైర్యంగా చెప్పగలను. పూర్తి శతాబ్ద కాలపు అవకాశాలను ఇవాళ భారతదేశం అందించగలదు. అందునా ఇదంతా మేము పరిశుభ్రంగా, హరితమార్గంలో సుస్థిరత ప్రాతిపదికన చేయాలని మేం ఆకాంక్షిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి, ప్రకృతిపట్ల మా బాధ్యతను చక్కగా నిర్వర్తిస్తాం. అంతిమంగా చెప్పేదేమిటంటే… భారతదేశం అనాదిగా ఈ విలువలకు చిహ్నంగా నిలిచింది.
భారతదేశానికి సుస్వాగతం:
- సంప్రదాయం, ప్రశాంతతకు ఆలవాలమైన నేల;
- తాదాత్మ్యం, ఉత్సాహాలకు నెలవైన నేల;
- ప్రయోగం, పరిశ్రమల నిలయమైన నేల;
- ఆరంభాలు, అపార అవకాశాలున్న నేల;
మరోసారి నేను మిమ్మల్నందర్నీ స్వాగతిస్తూ ఈ రెండింటిలో భాగం కావాలని ఆహ్వానిస్తున్నా-
- నేటి భారతం
- భవిష్యత్ భారతం
మీకు ఎప్పుడు నా తోడ్పాటు అవసరమైనా అందించడానికి సదా అందుబాటులోనే ఉంటానని హామీ ఇస్తున్నాను.
ధన్యవాదాలు.
The @VibrantGujarat journey has come a long way from its beginning in 2003 to the present. pic.twitter.com/iRX4XpT1iA
— PMO India (@PMOIndia) January 10, 2017
Gujarat, a land of enterprise and entrepreneurship. pic.twitter.com/riJFFE287P
— PMO India (@PMOIndia) January 10, 2017
India's strengths. pic.twitter.com/eVs1NiRbGe
— PMO India (@PMOIndia) January 10, 2017
Youth-led development. Creating job creators, not job seekers. pic.twitter.com/wj90QI5PMg
— PMO India (@PMOIndia) January 10, 2017
Corruption-free governance for a prosperous and developed India. pic.twitter.com/mev2DLnLvb
— PMO India (@PMOIndia) January 10, 2017
A paradigm shift. pic.twitter.com/IW6KOwICtj
— PMO India (@PMOIndia) January 10, 2017
India, a bright spot in the global economy. pic.twitter.com/dNSfsXHkq4
— PMO India (@PMOIndia) January 10, 2017
Making it simpler for business to be established and grow in India. pic.twitter.com/P3FDb0qTSb
— PMO India (@PMOIndia) January 10, 2017
Inclusive growth, more jobs, better incomes, purchasing power and quality of life. pic.twitter.com/Xu4xfaJL00
— PMO India (@PMOIndia) January 10, 2017
#TransformingIndia with an ambitious development agenda. pic.twitter.com/FOAuEMR1Kq
— PMO India (@PMOIndia) January 10, 2017
India: a land of many opportunities and a commitment to protect the environment. pic.twitter.com/3QgK2pIK4L
— PMO India (@PMOIndia) January 10, 2017
Welcome to India! pic.twitter.com/pMJcTpUWdT
— PMO India (@PMOIndia) January 10, 2017