ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లో జరిగిన సిఎస్ఐఆర్ సొసైటీ సమావేశాని కి అధ్యక్షత వహించారు.
ఈ సందర్భం గా సిఎస్ఐఆర్ కృషి తాలూకు సమగ్రమైన వివరణ ను ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు రావడం జరిగింది. సొసైటీ కృషి ని ఆయన ప్రశంసించడం తో పాటు ఒక భవిష్యత్ మార్గసూచీ ని రూపొందించుకోవాలంటూ అందుకోసం తన తరఫు నుండి కొన్ని సలహాల ను కూడా ఇచ్చారు.
వర్చువల్ లాబ్స్ ను అభివృద్ధిపరచడానికి గల ప్రాముఖ్యాన్ని ఆయన నొక్కి పలుకుతూ, ఇలా చేయడం ద్వారా విజ్ఞాన శాస్త్రాన్ని దేశం లోని ప్రతి ఒక్క ప్రాంతాని కి, అలాగే విద్యార్థుల లో అన్ని విభాగాల వారి వద్ద కు తీసుకు పోవచ్చన్నారు. యువ విద్యార్థినీ విద్యార్థుల ను విజ్ఞాన శాస్త్రం వైపు మళ్ళే విధం గా చూడవలసిన అవసరాన్ని గురించి, విజ్ఞాన శాస్త్రం పట్ల తదుపరి తరం లో మక్కువ ను మరింత గా పటిష్ట పరచవలసిన అవసరాన్ని గురించి ఆయన వివరించారు. ప్రపంచం లో వివిధ ప్రాంతాల లో పని చేస్తున్న భారతీయులు అందరి మధ్య పరిశోధన మరియు అభివృద్ధి పథకాల కు సంబంధించిన సహకారాన్ని పెంపొందింప చేసేందుకు తీసుకోవలసిన చర్యల ను గురించి కూడా ఆయన సూచనలు చేశారు.
భారతదేశం యొక్క ఆకాంక్షపూరితమైన అవసరాల ను గమనం లోకి తీసుకొని కృషి చేయవలసింది గా ఆయన శాస్త్రవేత్తల ను కోరారు. భారతదేశం లో పోషకాహార లోపం వంటి వాస్తవ కాల సామాజిక సమస్యల పట్ల- వ్యవసాయ ఉత్పత్తుల కు విలువ ను జోడించడం మరియు నీటి ని పొదుపు గా వాడుకోవడం వంటి చర్యల- ద్వారా సిఎస్ఐఆర్ శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు.
శాస్త్రవేత్త లు శ్రద్ధ వహించవలసిన సవాళ్ళ లో 5జి, ఎఐ మరియు అక్షయ శక్తి నిలవ చేయడం కోసం తక్కువ ఖర్చు అయ్యేటటువంటి మరియు చిరకాలం పని చేసేటటువంటి బ్యాటరీ లు వంటివి భాగం గా ఉన్నాయని ప్రధాన మంత్రి తెలిపారు. ప్రపంచ శ్రేణి ఉత్పత్తుల ను అభివృద్ధి చేయడానికై ఆధునిక విజ్ఞాన శాస్త్రాని కి సాంప్రదాయిక జ్ఞానాన్ని జత పరచవలసివుందని ఆయన నొక్కి వక్కాణించారు. వాణిజ్య సరళి వినియోగాని కి అనువైనవి గా నూతన ఆవిష్కరణల ను తీర్చిదిద్దడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వాలి అని కూడా ఆయన చెప్పారు.
సామాన్య మానవుడి జీవన నాణ్యత ను మెరుగు పరచే దిశ గా శ్రమించండంటూ సిఎస్ఐఆర్ శాస్త్రవేత్తల సముదాయాని కి ప్రధాన మంత్రి ఉద్బోధించారు.