ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్ పుర్ లో ఈ రోజు న జరిగిన నేశనల్ గంగ కౌన్సిల్ ఒకటో సమావేశాని కి అధ్యక్షత వహించారు.
ఈ కౌన్సిల్ కు గంగా నది మరియు దాని ఉప నదులు సహా గంగ నదీగర్భం లో కాలుష్య నివారణ మరియు శుద్ధి తాలూకు సమగ్ర పర్యవేక్షణ బాధ్యత ను అప్పంగించడమైంది. ఈ కౌన్సిల్ ఒకటో సమావేశాన్ని సంబంధిత రాష్ట్ర శాఖల తో పాటు కేంద్ర మంత్రిత్వ శాఖలు గంగానది కేంద్రితంగా ఉండే దృష్టికోణం తో పని చేస్తూ ఉండాలనే ఉద్దేశ్యం తో నిర్వహించారు.
ఈ రోజు న జరిగిన సమావేశాని కి జల శక్తి శాఖ, పర్యావరణం, వ్యవసాయం మరియు గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, పట్టణ వ్యవహారాలు, విద్యుత్తు, పర్యటన, శిప్పింగ్ శాఖ ల కేంద్ర మంత్రులు, ఉత్తర్ ప్రదేశ్ మరియు ఉత్తారఖండ్ ల ముఖ్యమంత్రులు, బిహార్ ఉప ముఖ్యమంత్రి, నీతి ఆయోగ్ వైస్ చైర్‌మన్, ఇతర సీనియర్ అధికారులు హాజరు అయ్యారు. ఈ సమావేశాని కి పశ్చిమ బెంగాల్ ప్రతినిధి ఎవ్వరూ రాలేదు. ఝార్‌ఖండ్ లో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతూ, ఆదర్శ ప్రవర్తన నియమావళి అమలవుతున్న కారణం గా ఆ రాష్ట్ర ప్రతినిధి ఎవ్వరూ కూడా ఈ సమావేశాని కి హాజరు కాలేదు.
ఇంతవరకు జరిగిన పనుల తాలూకు పురోగతి ని ప్రధాన మంత్రి సమీక్షిస్తూ, ‘స్వచ్ఛత’పై, ‘అవిరళత’పై మరియు ‘నిర్మలత’పై శ్రద్ధ వహిస్తూ, గంగా నది శుద్ధి కి సంబంధించిన వివిధ కార్యాల యొక్క పురోగతి మీద సమాలోచనలు జరిపారు. ఉప మహాద్వీపం లో అత్యంత పవిత్రమైన నది గా ఉన్న గంగా మాత శుద్ధి ని సహకారాత్మక సమాఖ్య తత్వం యొక్క ఒక ఉత్కృష్ట ఉదాహరణ గా చూడాలి అని ఆయన పేర్కొన్నారు. గంగా నది యొక్క శుద్ధి దేశాని కి దీర్ఘకాలం గా పరిష్కారం కాకుండా మిగిలిపోయిన ఒక సవాలు గా ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. 2014వ సంవత్సరం లో ప్రభుత్వం ‘నమామి గంగే’ను చేపట్టిన నాటి నుండి ఇప్పటి వరకు సాధించింది ఎంతో ఉందని ఆయన అన్నారు. గంగా నది లో కాలుష్యాన్ని తగ్గించాలని, అందుకు ప్రభుత్వం లో వేరు వేరు గా సాగుతున్న కార్యకలాపాల ను ఏకీకృత పరచేటటువంటి ఒక సమగ్ర చొరవ ను తీసుకోవడం జరుగుతోందని ఆయన వివరించారు. దీని లో కాగితం మిల్లుల తాలూకు రద్దీ ని పూర్తి గా సున్నా స్థాయి కి చేర్చడం తో పాటు తోలు పరిశ్రమ ల నుండి వెలువడే కాలుష్యాన్ని తగ్గించడం వంటి కార్యసాధన లు భాగం గా ఉన్నాయని, అయినప్పటికిని చేయవలసిన పనులు మరెన్నో ఇంకా మిగిలే ఉన్నాయని ఆయన అన్నారు.
గంగా నది పారుతున్నటువంటి అయిదు రాష్ట్రాల కు నది లో తగినంత జలం అందేందుకు పూచీ పడటం కోసం 2015-20 మధ్య కాలం లో 20,000 కోట్ల రూపాయల ను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ప్రప్రథమం గా ముందుకు వచ్చిందన్నారు. ఈ సరికే దీని లో 7,700 కోట్ల రూపాయలు వెచ్చించడమైందని, ప్రధానం గా నూతన మురుగు నీటి పారుదల ప్లాంటు ల నిర్మాణాని కి శ్రద్ధ తీసుకోవడమైందని తెలిపారు.
నిర్మల గంగ ను ఆవిష్కరించాలి అంటే అందుకు ప్రజల నుండి కూడాను పూర్తి స్థాయి లో సహకారం ఎంతయినా అవసరమని, ఈ దిశ లో జాతీయ నది ఒడ్డు వెంబడి వెలసిన నగరాల లో నూ సర్వోత్తమ కార్యప్రణాళిక ల ను అనుసరించాలన్న అవగాహన విస్తృతం కావాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. తలపెట్టిన ప్రణాళికల అమలు త్వరితగతిన సాగాలంటే అన్ని జిల్లాల లో జిల్లా గంగ సంఘాల దక్షత ను మెరుగు పరచాలని ఆయన చెప్పారు.
వ్యక్తుల నుండి, ఎన్ఆర్ఐ ల నుండి, కార్పొరేట్ సంస్థల నుండి గంగ శుద్ధి పథకాల కు ఆర్థిక సహాయాన్ని పొందేందుకు వీలుగా క్లీన్ గంగా ఫండ్ (సిజిఎఫ్) ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాన్య ప్రధాన మంత్రి స్వయం గా 16.53 కోట్ల రూపాయల ను సిజిఎఫ్ కు విరాళం గా అందించారు. దీనిలో 2014వ సంవత్సరం నాటి నుండి ఆయన కు అందిన బహుమతుల ను వేలం వేయగా లభించిన డబ్బు తో పాటు సియోల్ శాంతి బహుమతి తాలూకు బహుమతి సొమ్ము కలసివుంది.
గంగా నది కి సంబంధించిన ఆర్థిక కార్యకలాపాల పై దృష్టి పెట్టినటువంటి ఒక స్థిర అభివృద్ధి నమూనా లేదా ‘అర్థ్ గంగా’గా ‘నమామి గంగే’ రూపొందేటట్టు ఒక సంపూర్ణ ఆలోచన ప్రక్రియ దిశ గా ఆలోచించాలని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియ లో భాగం గా రైతుల ను జీరో బడ్జెట్ ఫార్మింగ్, పండ్ల మొక్కల పెంపకం మరియు గంగా నది తీర ప్రాంతాల లో వృక్షసంవర్ధిని ల అభివృద్ధి సహా స్థిర వ్యవసాయ అభ్యాసాల లో తలమునకలు అయ్యేటట్లు గా వారి ని ప్రోత్సహించాలని సూచించారు. ఈ కార్యక్రమాల ను చేపట్టవలసింది గా మాజీ సైనికోద్యోగి సంస్థల ను మరియు మహిళా స్వయం సహాయతా సమూహాల ను కోరాలన్నారు. అటువంటి అభ్యాసాల కు తోడు, జల సంబంధిత క్రీడ ల కోసం మౌలిక సదుపాయాల విస్తరణ, సైక్లింగ్ ట్రాక్ లు మరియు వాకింగ్ ట్రాక్ లను నిర్మించడం ద్వారా నదీగర్భ ప్రాంతాల లో ‘హైబ్రీడ్’ టూరిజమ్ అవకాశాల ను అధిక స్థాయి లో వినియోగించుకొనేందుకు వీలు ఉంటుందని చెప్పారు. ఇకో–టూరిజమ్ ను మరియు గంగా వన్యజీవుల సంరక్షణ ను, అలాగే క్రూజ్ టూరిజమ్ మొదలైన అంశాలను ప్రోత్సహించడం గంగ శుద్ధి కి నిలుకడతనం తో కూడిన ఆర్జనను అందించడం లో తోడ్పడగలవు.
‘నమామి గంగే’ మరియు ‘అర్థ్ గంగా’ కార్యక్రమాల లో భాగం గా చేపట్టే వివిధ పథకాలు తత్సంబంధిత పురోగతి ని పర్యవేక్షించడం కోసం ప్రధాన మంత్రి ఒక డిజిటల్ డాశ్ బోర్డ్ ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ డాశ్ బోర్డు మాధ్యమం ద్వారా పట్టణ సంస్థలు మరియు గ్రామాల నుండి అందే సమాచారాన్ని రోజువారీ ప్రాతిపదికన జల శక్తి మంత్రిత్వ శాఖ మరియు నీతి ఆయోగ్ పర్యవేక్షించాలని చెప్పారు. ఆకాంక్షభరిత జిల్లాల కోవలోనే, గంగా నది ని ఆనుకొని ఉన్నటువంటి జిల్లాలు అన్నిటిని నమామి గంగే లో భాగం గా చేపట్టే ప్రయాసలను పర్యవేక్షించడం కోసం ఒక కేంద్రిత క్షేత్రాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాన మంత్రి అన్నారు.
సమావేశాని కి తరలివచ్చే ముందు, ప్రధాన మంత్రి ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు, కీర్తిశేషుడు చంద్రశేఖర్ ఆజాద్ కు పుష్పాంజలి ని సమర్పించారు. నమామి గంగే కార్యక్రమం లో భాగం గా చేపడుతున్న పనులు మరియు అమలుపరుస్తున్న పథకాల పై చంద్రశేఖర్ ఆజాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం లో ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శన ను ఆయన తిలకించారు. ప్రధాన మంత్రి తన యాత్ర లో భాగం గా అటల్ ఘాట్ కు వెళ్ళారు. అలాగే, సీసామవూ కాలువ శుద్ధి కై చేసిన పనులు ఫలప్రదం అయిన తీరు ను కూడా ఆయన పరిశీలించారు.