దేశవ్యాప్తంగా కోవిడ్-19 పరిస్థితులపై సమీక్షకు నిర్వహించిన ఉన్నతాధికారుల సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆక్సిజన్ లభ్యత, మందులు, మౌలిక ఆరోగ్య సదుపాయాలు వగైరాలకు సంబంధించి దేశంలో ప్రస్తుత పరిస్థితులను ఆయన పరిశీలించారు. ఆక్సిజన్ సరఫరా పెంపు నిమిత్తం ఏర్పాటైన సాధికార బృందం దేశమంతటా ఆక్సిజన్ లభ్యత, సరఫరా దిశగా సాగుతున్న కృషి గురించి ప్రధానమంత్రికి వివరించింది. ఇందులో భాగంగా రాష్ట్రాలకు ఆక్సిజన్ కేటాయింపు పెంచడం గురించి ప్రధానికి తెలియజేసింది. దేశంలో 2020 ఆగస్టు నాటికి ద్రవీకృత వైద్య ఆక్సిజన్ (ఎల్ఎంఒ) ఉత్పాదన రోజుకు 5,700 మెట్రిక్ టన్నులు కాగా, ప్రస్తుతం (2021 ఏప్రిల్ 25 నాటికి) 8922 మెట్రిక్ టన్నులకు పెరగడం గురించి సమావేశం చర్చించింది. ఈ మేరకు నెలాఖరుకల్లా దేశీయంగా ఉత్పాదన నిత్యం 9250 మెట్రిక్ టన్నులు దాటుతుందని అంచనా వేసింది.
దేశంలో ఏర్పాటు చేయనున్న ‘పీఎస్ఏ’ ఆక్సిజన్ యంత్రాగారాలు వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభించేలా ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయం చేసుకోవాలని ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. మరోవైపు ‘పీఎస్ఏ’ ఆక్సిజన్ యంత్రాగారాల ఏర్పాటుపై రాష్ట్రాలను ప్రోత్సహిస్తున్నట్లు అధికారుల ప్రధానికి వివరించారు. రైల్వేల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్ల అత్యవసర రవాణా సేవలు, భారత వాయుసేన దేశ-విదేశాల నుంచి చేపట్టిన ఆక్సిజన్ ట్యాంకర్ల రవాణా గురించి కూడా వారు ప్రధానమంత్రికి తెలియజేశారు.
ఇక మౌలిక వైద్య సదుపాయాల కల్పన-కోవిడ్ నిర్వహణ సాధికార బృందం కూడా ఆస్పత్రులలో పడకలు, ఐసీయూల లభ్యత పెంపు దిశగా చేపట్టిన చర్యలను ప్రధానికి నివేదించింది. వ్యాధి వ్యాప్తి క్రమాన్ని ఛేదించేందుకు చేపట్టిన చర్యల గురించి కూడా ప్రధానమంత్రికి తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ- కోవిడ్ మహమ్మారి నిర్వహణకు రూపొందించిన మార్గదర్శకాలు, వ్యూహాలను వివిధ రాష్ట్రాల్లోని సంబంధిత సంస్థలు సముచితంగా అమలుచేసేలా శ్రద్ధ వహించాలని నొక్కిచెప్పారు. దేశవ్యాప్తంగా కోవిడ్ అనుగుణ ప్రవర్తనశైలి గురించి ప్రజల్లో అవగాహన మెరుగుకు చేపట్టిన చర్యల గురించి ప్రజావగాహన కల్పన సాధికార బృందం ప్రధానమంత్రికి నివేదించింది. కేంద్ర మంత్రిమండలి కార్యదర్శితోపాటు దేశీయాంగ శాఖ కార్యదర్శి, రోడ్డు రవాణా-జాతీయ రహదారుల శాఖ కార్యదర్శి, సమాచార-ప్రసార శాఖ కార్యదర్శి, ఔషధశాఖ కార్యదర్శి, బయోటెక్నాలజీ శాఖ కార్యదర్శిసహా నీతి ఆయోగ్ సభ్యుడు, ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.