ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ఉత్తర్ ప్రదేశ్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ లో ఈ రోజు ప్రారంభోపన్యాసం చేశారు.
పరివర్తన చోటు చేసుకొన్నప్పుడు అది అందరూ చూసేటట్లు స్పష్టంగా ఉంటుంది అని ఆయన అన్నారు. ఇంత మంది పెట్టుబడిదారుల ప్రాతినిధ్యంతో ఇంత ప్రముఖ పెట్టుబడిదారుల శిఖర సమ్మేళనాన్ని ఉత్తర్ ప్రదేశ్ లో నిర్వహిస్తున్నారంటే ఇదే మార్పును సూచిస్తున్నట్లుగా ఉందని ఆయన చెప్పారు. ఇంత తక్కువ కాలంలో రాష్ట్రం తనను తాను అభివృద్ధి మార్గంలోను, సమృద్ధి పథంలోను నిలుపుకొన్నందుకు రాష్ట్రాన్ని ఆయన అభినందించారు.
వనరులు మరియు సామర్ధ్యాల పరంగా రాష్ట్రం పుష్కలంగా ఉందని ఆయన అన్నారు. ఈ రాష్ట్రం యొక్క బలాలు వ్యవసాయంలో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని నకారాత్మక వాతావరణాన్ని సకారాత్మకమైందిగా, ఇంకా ఆశ తో నిండినదిగా మార్చివేసినందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని ప్రధాన మంత్రి అభినందించారు. వేరు వేరు రంగాలలో రాష్ట్రం సరైన విధానాలను రూపొందిస్తోందని ఆయన అన్నారు. వ్యవసాయదారులకు, మహిళలకు మరియు యువతకు చేసిన వాగ్దానాలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం గంభీరంగా ఉన్నదని ఆయన వివరించారు.
రాష్ట్రం ‘‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’’ పథకం పై కసరత్తు చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘స్కిల్ ఇండియా మిషన్’, ‘స్టాండ్-అప్ ఇండియా’, ‘స్టార్ట్-అప్ ఇండియా’, ఇంకా ‘ప్రధాన మంత్రి ముద్ర యోజన’ ల వంటి పథకాలు ‘‘ఒక జిల్లా, ఒక ఉత్పత్తి’’ పథకాన్ని అమలు చేయడంలో ఉపయోగకరంగా ఉండగలవని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం యొక్క ‘ప్రధాన మంత్రి కిసాన్ సంపద పథకం’ వ్యవసాయ రంగంలో వృథా ను తగ్గించడంలో తోడ్పడగలదని ఆయన అన్నారు. రాష్ట్రంలో చెరకు పంట పెద్ద ఎత్తున సాగవుతున్న కారణంగా ఇథనాల్ ఉత్పత్తి లో ఈ రాష్ట్రానికి గొప్ప అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు.
రక్షణ రంగ సంబంధిత పారిశ్రామిక కారిడార్ ను ఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఇది బుందేల్‌ఖండ్ ప్రాంత అభివృద్ధికి దోహదం చేయగలదని ప్రధాన మంత్రి వెల్లడించారు.
వచ్చే సంవత్సరం ప్రయాగ లో నిర్వహించే కుంభ్ మేళా ప్రపంచంలోకెల్లా ఆ తరహా అతి పెద్ద కార్యక్రమం కాగలదని ప్రధాన మంత్రి అన్నారు.