గవర్నర్ ల యాభయ్యో వార్షిక సమావేశం ఈ రోజు న న్యూ ఢిల్లీ లోని రాష్ట్రపతి భవన్ లో జరిగిన ప్రారంభిక సదస్సు తో ఆరంభమైంది. మొట్టమొదటి సారిగా గవర్నర్ పదవుల ను, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టెనంట్ గవర్నర్ పదవుల ను అలంకరించిన వారు 17 మంది సహా వివిధ రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల గవర్నర్ లు ఈ సమావేశం లో పాల్గొన్నారు. వారిలో నూతనం గా ఏర్పాటైన కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము- కశ్మీర్, ఇంకా లద్దాఖ్ ల లెఫ్టెనంట్ గవర్నర్ లు కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాని కి హాజరయిన వారి లో గౌరవనీయులైన భారత రాష్ట్రపతి, భారత ఉప రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, హోం మంత్రి లతో పాటు జల శక్తి శాఖ మంత్రి కూడా ఉన్నారు.
ఈ సందర్భం గా ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, 1949వ సంవత్సరం లో ఒకటో సమావేశాన్ని నిర్వహించడం జరిగిన నాటి నుండి ఈ సమావేశాల కు ఉన్న సుదీర్ఘ చరిత్ర ను గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి యాభయ్యో సమావేశం ఈ కోవ కు చెందిన ఇదివరకటి సమావేశాల కార్యసిద్ధులు మరియు ఫలితాల మదింపు తో పాటు ఈ తరహా సమావేశాల భావి దిశ కు ఒక మార్గసూచీ ని రూపొందించడం కోసం ఒక విశిష్ట సందర్భం గా ఉందని ఆయన పేర్కొన్నారు.
సహకార పూర్వకమైనటువంటి మరియు స్పర్ధాత్మకమైనటువంటి సమాఖ్య నిర్మాణాన్ని ఆవిష్కరించడం లో గవర్నర్ ల వ్యవస్థ ఒక ప్రత్యేకమైన పాత్ర ను పోషించవలసి ఉందని ఆయన చెప్పారు. ఈ సమావేశం గవర్నర్ లకు, లెఫ్టెనంట్ గవర్నర్ లకు వారి యొక్క అభిప్రాయాల ను వెల్లడించే అవకాశాన్ని ఇవ్వడం తో పాటు ప్రతి ఒక్క సభికు ని అనుభవం నుండి ఎంతో కొంత నేర్చుకొనేందుకు కూడా ఒక అవకాశాన్ని అందిస్తుందని, అంతేకాకుండా, ప్రతి ఒక్క రాష్ట్రాని కి మరియు కేంద్ర పాలిత ప్రాంతాని కి గల విభిన్నమైన అవసరాల కు తుల తూగేటటువంటి అంతర్జాతీయ స్థాయి లో సర్వోత్తమ అభ్యాసాల ను స్వీకరించే అవకాశాన్ని సైతం ఈ సమావేశం ప్రసాదిస్తుందని వివరించారు. కేంద్ర పాలిత ప్రాంతాలు వాటి పాలన నిర్మాణం కారణం గా అభివృద్ధి పరమైన అంశాల లో ఒక ఆదర్శ నమూనా ను అందించ గలుగుతాయని ప్రధాన మంత్రి తెలిపారు.
భారతదేశం 2022వ సంవత్సరం లో తన స్వాతంత్య్రం యొక్క 75వ వార్షికోత్సవాన్ని, అలాగే 2047వ సంవత్సరం లో తన స్వాతంత్ర్యం యొక్క 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోనున్నదని ప్రధాన మంత్రి అన్నారు. దేశ ప్రజల చెంతకు పరిపాలన యంత్రాంగాన్ని తీసుకుపోవడం లో మరియు వారి కి సరి అయిన దారి ని చూపించడం లో గవర్నర్ యొక్క పాత్ర మరింత ముఖ్యమైంది అయిపోతుందని ప్రధాన మంత్రి చెప్పారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించుకొని 70 సంవత్సరాలు పూర్తి అయిన ఘట్టాన్ని మనం వేడుక గా జరుపుకోనున్న తరుణం లో, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు గవర్నర్ లు కూడా భారత రాజ్యాంగం లోని సేవా సంబంధిత అంశాల ను, మరీ ముఖ్యం గా పౌరుల యొక్క విధుల ను మరియు బాధ్యత లను ప్రత్యేకం గా ప్రస్తావించే దిశ గా కృషి చేయాలని ప్రధాన మంత్రి అన్నారు. ఇది ప్రాతినిధ్య తరహా పాలన ను దాని వాస్తవ భావం లో అమలు పరచడం లో తోడ్పడుతుందని ఆయన తెలిపారు.
మనం గాంధీ మహాత్ముని 150వ జయంతి ని జరుపుకొంటున్నామని, ఈ సందర్భాన్ని గాంధేయ విలువలు మరియు గాంధేయ ఆలోచన లు ఏ విధం గా మన రాజ్యాంగాని కి ఒక ముఖ్యమైన ఆధార శిల గా ఉన్నదీ చాటి చెప్పాలని ప్రధాన మంత్రి అన్నారు. గవర్నర్ లు విశ్వవిద్యాలయాల కులపతులు గా కూడా ఉన్నందున, ఆ పాత్ర లో వారు మన దేశ యువత లో జాతి నిర్మాణం తాలూకు విలువల ను పాదుకొల్పడం లోను, మరిన్ని గొప్ప కార్యసాధనల దిశ గా వారి లో స్ఫూర్తి ని నింపడం లోను తోడ్పడ గలుగుతారని ప్రధాన మంత్రి అన్నారు.
గవర్నర్ లు మరియు లెఫ్టెనంట్ గవర్నర్ లు వారి రాజ్యాంగయుతమైన బాధ్యతల ను నెరవేర్చడం లో భాగం గా సామాన్య మానవుడి అవసరాల ను గురించి కూడా పట్టించుకోవాలని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో కోరారు. సమాజం లో ఆదరణ కు నోచుకోని వర్గాలు, అల్పసంఖ్యాక సముదాయాలు, మహిళలు, యువత, షెడ్యూల్డు తెగల అభ్యున్నతి దిశ గా కృషి చేయాలని ఆయన కోరారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వాల తో కలసి పని చేయడమే కాక వర్తమాన పథకాల ను మరియు కార్యక్రమాల అమలు పట్ల శ్రద్ధ వహించవచ్చని ప్రధాన మంత్రి చెప్పారు.
ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు పర్యటన రంగాల ను గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఈ రంగాల లో ఉద్యోగాల కల్పన కు మరియు పేదలు, అణచివేత కు గురి అయిన వర్గాల అభ్యున్నతి కి నూతన అవకాశాలు ఉన్నాయన్నారు. క్షయ వ్యాధి పట్ల చైతన్యాన్ని విస్తృతం గా వ్యాప్తి లోకి తీసుకు వచ్చేందుకు మరియు 2025వ సంవత్సరం కల్లా భారతదేశం లో ఈ వ్యాధి ఆనవాలు లేకుండా చేసేందుకు గవర్నర్ కార్యాలయాన్ని వినియోగించుకోవచ్చంటూ ప్రధాన మంత్రి సూచించారు.
ఈ సమావేశాల యాభయ్యో సంచిక ఆదివాసీ అంశాలు, వ్యవసాయ సంస్కరణ లు, జల్ జీవన్ మిశన్, నూతన విద్య విధానం మరియు జీవించడం లో సౌలభ్యం కోసం చట్టాల వంటి విశేష అంశాల పైన అయిదు ఉప సమూహాల మధ్య లోతైన చర్చ ల రూపం లో మథనాని కి దారి తీయనుండటం పట్ల ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ బృందాలు సమర్పించే నివేదిక ల ఆధారం గా తదనంతరం మరో సారి గవర్నర్ లు, లెఫ్టెనంట్ గవర్నర్ లు అందరితోను పెద్ద ఎత్తు న చర్చించడం జరుగుతుందని ప్రధాన మంత్రి తెలిపారు.