ప్రధాన మంత్రి 2019వ సంవత్సరం డిసెంబర్ 7వ, 8వ తేదీల లో పుణె లో జరిగిన డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్/ఇన్‌స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ (డిజిఎస్‌పి/ఐజిఎస్‌పి) 54వ సమావేశం లో పాలు పంచుకొన్నారు. ఆయన చర్చల కు నాయకత్వం వహించడంతో పాటు విలువైనటువంటి సూచనల ను కూడా చేశారు. ఈ రోజు న సాయంత్రం పూట జరిగినటువంటి ముగింపు కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. రహస్య సమాచార విభాగం (ఐబి)లో విశిష్ట సేవల ను అందించిన అధికారుల కు రాష్ట్రపతి పోలీసు పతకాల ను కూడా ప్రధాన మంత్రి ప్రదానం చేశారు.
ఈ సమావేశం ఇది వరకు ఒక రోజు కార్యక్రమం గా మాత్రమే ఉండేది. ప్రధాన మంత్రి మార్గదర్శకత్వం తో పాటు, అభిప్రాయాలు అనుభవాల అర్థవంతమైనటువంటి ఆదాన- ప్రదానాన్ని ప్రోత్సహించడం కోసం 2015వ సంవత్సరం మొదలుకొని డిజిఎస్ పి మరియు ఐజిఎస్ పి సమావేశాన్ని ఒక రోజు కు బదులు మూడు రోజుల కార్యక్రమం గా నిర్వహించడం జరుగుతున్నది. అంతేకాదు, ఈ సమావేశాన్ని ఢిల్లీ కి వెలుపల దేశం లోని వివిధ ప్రాంతాల లో సైతం నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రధాన మంత్రి మరియు కేంద్ర హోం శాఖ మంత్రి హాజరు తో ఈ సమావేశం యొక్క స్వరూపం లో కూడాను గణనీయమైనటువంటి మార్పు లు చోటు చేసుకొన్నాయి. సమావేశ క్రమం లో- సమకాలీన భద్రత కు ఎదురవుతున్న బెదరింపుల పై నివేదికల సమర్పణ కోసం డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ యొక్క సంఘాల ను ఏర్పాటు చేయడమైంది.
దీని కి తోడు సమావేశాల లో భాగం గా విధాన పరమైన అంశాల ను పునర్ నిర్వచించడం కోసం చర్చా సభ లు కూడా జరిపారు. ఈ సంవత్సరం లో ఉగ్రవాదం, నక్సలిజం, కోస్తా తీర ప్రాంతాల భద్రత, సైబర్ థ్రెట్స్, సమూల సంస్కరణ వాదం పై మరియు నార్కో టెర్రరిజమ్ పై పోరాటం సలపడం వంటి ఆంతరంగిక మరియు విదేశీ భద్రత తాలూకు కీలకమైన అంశాల పై మేధోమథనం జరిపేందుకు పదకొండు కీలకమైన గ్రూపుల ను ఏర్పాటు చేశారు.
విధాన పరమైన ప్రణాళిక రచన కు మరియు ఆచరణ కు సంబంధించి చక్కని సూచనల తో ముందుకు వచ్చినందుకు ఈ సమావేశాల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఖరారు చేసిన కార్యాచరణ అంశాల నుండి స్పష్టమైన ఫలితాల ను రాబట్టడాని కి ప్రయత్నించాలని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.
దేశం లో సాధారణ శాంతి ని మరియు ప్రశాంత పరిస్థితుల ను పరిరక్షించడం కోసం దేశ పోలీసు బలగాలు చేస్తున్న అకుంఠిత ప్రయత్నాల ను ప్రధాన మంత్రి మెచ్చుకొంటూ, మనం ఆ బలగాల వెన్నంటి నిలచిన కుటుంబాల తోడ్పాటు ను విస్మరించకూడదని తెలిపారు. అన్ని వేళల్లోను వారు సమాజం లో చిన్నారులు మరియు మహిళల తో పాటు అన్ని వర్గాల లో కూడాను విశ్వాసాన్ని నింపేందుకు పోలీసు బలగాలు మారుపేరు గా నిలుస్తాయన్న పేరు ను ఇనుమడింప చేసుకోవడం కోసం పాటు పడాలని ఆయన చెప్పారు. మహిళ లు భద్రం గా మరియు సురక్షితం గా ఉండేటట్టు పూచీ పడటం లో పోలీసు విభాగం సమర్ధం గా కృషి చేయాలని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు.
రాష్ట్ర స్థాయి మొదలుకొని జిల్లా స్థాయి నుండి అట్టడుగు న ఉండే పోలీస్ స్టేశన్ స్థాయి వరకు- ఈ సమావేశం అందించిన ప్రేరణ ను ముందుకు తీసుకు పోవాలి-అని పోలీసు విభాగాల అధిపతుల ను ప్రధాన మంత్రి కోరారు. వేరు వేరు రాష్ట్రాల పోలీసు దళాలు సమర్పించిన నివేదిక ల సారాన్ని ప్రధాన మంత్రి విని, తదనంతరం మాట్లాడుతూ ఈ సూచనల తో ఒక విస్తృతమైన పట్టిక ను సిద్ధం చేయాలని, దీనిని సర్వోత్తమ అభ్యాసాల రూపం లో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు ఆమోదించవచ్చని పేర్కొన్నారు.
ప్రొ- యాక్టివ్ పోలీసింగ్ దిశ గా సాంకేతిక విజ్ఞానం ఒక సమర్ధమైన అస్త్రం గా తోడ్పడగలుగుతుందని, ఇది సామాన్య మానవుని ద్వారా అందిన సమాచారం ఆధారం గా పోలీసు ల ముందస్తు క్రియాశీలత్వాని కి ఉపకరిస్తుంది అని కూడా ఆయన చెప్పారు.
ప్రధాన మంత్రి ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి పై ప్రత్యేక కుతూహలాన్ని కనబరిచారు. తమ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి యాక్ట్ ఈస్ట్ పాలిసి కి ఇది ఎంతైనా అవసరమని చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాల కు అనుకూలమైనటువంటి వాతావరణాని కి పూచీ పడేందుకు అదనపు ప్రయాసల కు నడుం కట్టాలని ఆయా రాష్ట్రాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ మరియు ఇన్ స్పెక్టర్ జనరల్స్ ఆఫ్ పోలీస్ ను ప్రధాన మంత్రి కోరారు.
ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో పోలీసు బలగాల సమక్షం లో కర్తవ్య నిర్వహణ పరంగా ఎదురయ్యే ఒత్తిడులు మరియు నిర్భందాల ను గురించి ప్రత్యేకం గా ప్రస్తావించారు. అయితే, వారు సంశయాని కి లోనైనపుడల్లా సివిల్ సర్వీసెస్ పరీక్ష లకు హాజరు అయిన వేళ వారు ప్రదర్శించినటువంటి స్ఫూర్తి ని మరియు వారి ఆదర్శాల ను వారు స్మరించుకోవాలని, దేశ హితానికై పని చేస్తూ, సమాజం లో నిరుపేదలు మరియు బలహీన వర్గాల వారి సంక్షేమాన్ని దృష్టి లో పెట్టుకోవాలని కూడా ఆయన హితవు పలికారు.