సోదర సోదరీమణులారా,
ప్రసార మాధ్యమాల సభ్యులారా,
అధ్యక్షులు శ్రీ రహమాన్ కు, ఆయన ప్రతినిధి వర్గానికి నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. ఆసియాలో విలువైన మిత్రదేశం, వ్యూహాత్మక భాగస్వామి తాజికిస్తాన్. ప్రెసిడెంట్ శ్రీ రహమాన్ భారతదేశానికి సుపరిచితులు. మరో సారి ఆయనకు ఆతిథ్యం ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఆయన నాయకత్వాన్ని, ద్వైపాక్షిక బంధం బలోపేతం కావడంలో ఆయన కృషిని మేము అభినందిస్తున్నాము. పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రాంతీయ భద్రత, అభివృద్ధి విషయంలో ఉభయులకు గల ఆసక్తి అనే పునాదులపై మన వ్యూహాత్మక భాగస్వామ్యం నిర్మితమైంది. మన రెండు దేశాలు, సమాజాలు దీర్ఘకాలిక చారిత్రక, వారసత్వ సంపదలతో కూడిన సహజ సిద్ధమైన సాన్నిహిత్యాన్ని కలిగి వున్నాయి. గతం నుండి మనకు సంక్రమించిన సాంస్కృతిక, మత, భాషాపరమైన సారూప్యాలు ఉభయ దేశాల ప్రజల మధ్య బాంధవ్యాన్ని బలోపేతం చేశాయి.
ప్రెసిడెంట్ శ్రీ రహమాన్, నేను ఈ రోజు ఉదయం ఫలవంతమైన చర్చలు జరిపాము. ఇరు దేశాల మధ్య గల రక్షణ, భద్రత భాగస్వామ్యంతో సహా ద్వైపాక్షిక బంధంలోని భిన్న విభాగాలలో చోటు చేసుకొన్న విస్తృతమైన పురోగతిని మేము మదింపు చేశాము. భారతదేశం, తాజికిస్తాన్ లు రెండూ విస్తృత పొరుగు దేశాలు కావడంతో పాటు భద్రతాపరంగా బహుముఖీనమైన సవాళ్ళు, ముప్పు ఎదుర్కొంటున్నాయి. ఉగ్రవాదం నుండి ఎదురయ్యే ముప్పు మన రెండు దేశాలకే కాదు, ప్రాంతీయంగా దౌర్జన్యకాండ, అస్థిరత మేఘాలు ఆవరించేందుకు కూడా కారణం అవుతోంది. అందుకే ఉగ్రవాదంపై పోరాటం మన సహకారంలో ప్రధానాంశంగా నిలుస్తోంది. సెంట్రల్ ఏషియా ప్రాంతంలో తీవ్రవాదం, విప్లవ తత్త్వం, ఉగ్రవాదం వ్యాపింపచేస్తున్న శక్తుల వ్యతిరేక పోరాటంలో తాజికిస్తాన్ పాత్రను మేము ప్రశంసిస్తున్నాము. పరస్పరం అంగీకారం కుదిరిన ప్రాధాన్యాల మేరకు ఈ పోరాటాన్ని మరింత పటిష్ఠం చేయాలని శ్రీ రహమాన్, నేను ఈ రోజు సమ్మతించాము.
మేము ఈ సహకారాన్ని
- స్థూల ద్వైపాక్షిక భద్రతా సహకారాన్ని పటిష్ఠం చేసుకోవడం;
- శిక్షణ, సామర్థ్యాల నిర్మాణం కార్యకలాపాలు విస్తరించడంతో పాటు సమాచార మార్పిడి;
- ప్రాంతీయ, బహుముఖీన వేదికలపై క్రియాశీల సహకారం వంటి భిన్న స్థాయిలలో విస్తరించుకుంటాము.
మిత్రులారా,
ఆర్థిక సహకారాన్ని మరింతగా విస్తరించుకునేందుకు ప్రత్యేకించి వాణిజ్యం, పెట్టుబడులు పెంచుకొనేందుకు అధ్యక్షుల వారు, నేను అంగీకరించాము. జల విద్యుత్తు, సమాచార సాంకేతిక పరిజ్ఞానం, ఔషధరంగం, ఆరోగ్య సంరక్షణ రంగాలలో విస్తృతమైన కార్యాచరణకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు మేము గుర్తించాము. ఉభయ దేశాలకు ప్రయోజనకరంగా ఉండే విధంగా ఆర్థిక భాగస్వామ్యాన్ని విస్తరించుకోవాలన్న ఆకాంక్షను నిజం చేసుకోవడానికి ఉపరితల అనుసంధానాన్ని అధికం చేసుకోవలసిన అవసరం ఉందని మేము అంగీకరించాము. ప్రస్తుతం ఉన్న ఓడరేవు, రవాణా మౌలిక వసతులను మరింతగా అభివృద్ధి చేయడంతో పాటు అఫ్గానిస్తాన్, తాజికిస్తాన్, సెంట్రల్ ఆసియాల మీదుగా రహదారి, రైలుమార్గ నెట్ వర్క్ ను విస్తరించుకొనే ప్రయత్నాలకు భారతదేశం పూర్తి మద్దతిస్తుంది. ఇరాన్ లోని చాబహార్ పోర్టు మీదుగా వాణిజ్య, రవాణా మార్గాలను నిర్మించేందుకు మేము కృషి చేస్తాము. తాజికిస్తాన్ తో పాటుగా ఇతర సభ్యదేశాలన్నింటినీ కలిపి ఇంటర్ నేషనల్ నార్త్ సౌత్ కారిడర్ నిర్మాణంలో కూడా భారతదేశం భాగస్వామిగా ఉంది. అష్గాబాత్ ఒప్పందంలో మేము భాగస్వాములం కావడం వల్ల తాజికిస్తాన్, సెంట్రల్ ఆసియా లతో అనుసంధానం మరింతగా విస్తరిస్తుంది. భారత సాంకేతిక, ఆర్థిక సహకార శిక్షణ కార్యక్రమం ద్వారా సామర్థ్యాలు, సంస్థాగత నిర్మాణం విషయంలో భారతదేశం, తాజికిస్తాన్ ల మధ్య చక్కని భాగస్వామ్యం ఉంది. ఈ భాగస్వామ్యాన్ని మరింత సుస్థిరం చేసుకోవడంతో పాటు పటిష్ఠపరచుకోవాలని అధ్యక్షుల వారు శ్రీ రహమాన్, నేను అంగీకారానికి వచ్చాము.
వచ్చే సంవత్సరం భారతదేశం, తాజికిస్తాన్ ల ద్వైపాక్షిక బంధం రజతోత్సవాలను జరుపుకోబోతున్నాము. ఈ పర్యటన సమయంలో శ్రీ రహమాన్, నేను మా దేశాలకు విస్తృత శ్రేణి కార్య్రమాల పట్టికను నిర్దేశించుకోవడం నాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ఈ రోజు జరిగిన చర్చలు, కుదిరిన అంగీకారాలు భారతదేశం, తాజికిస్తాన్ ల మధ్య భిన్న రంగాలలో ఆచరణీయ సహకారం మరింతగా విస్తరించుకొనేందుకు దోహదపడుతుందని నేను ఆశిస్తున్నాను. శ్రీ రహమాన్ కు మరోసారి నేను స్వాగతం పలుకుతూ, వారికి ఈ పర్యటన ఆహ్లాదకరంగా సాగాలని ఆకాంక్షిస్తున్నాను.
మీకు ఇవే నా ధన్యవాదాలు, బహుధా ధన్యవాదాలు.