శ్రేష్ఠులైన కంబోడియా ప్రధాని శ్రీ హున్ సెన్,
గౌరవనీయ ప్రతినిధి వర్గ సభ్యులు,
ప్రముఖ అతిథులు,
ప్రసార మాధ్యమాలకు చెందిన స్నేహితులు,
మహిళలు మరియు సజ్జనులారా,
మీకు ఇవే నా శుభాకాంక్షలు.
ప్రధాని శ్రీ హున్ సెన్ కు మరొక్క మారు స్వాగతం పలకడం నాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. పది సంవత్సరాల విరామం అనంతరం ఆయన ఈ ఆధికారిక పర్యటనకు విచ్చేశారు.
ప్రధాని గారూ, భారతదేశం గురించి మీకు, అలాగే మీ గురించి భారతదేశానికి చిర పరిచయం ఉన్నప్పటికీ, ఈ పర్యటన క్రమంలో భారత ఆర్థిక పురోగతితో పాటు సామాజిక మార్పులను కూడా దగ్గర నుండి చూసే అవకాశం మీకు దక్కితీరుతుందని నేను భావిస్తున్నాను.
రెండు రోజుల కిందట ఆసియాన్ ఇండియా కమెమరేటివ్ సమిట్ సందర్భంగా ఆసియాన్ – భారతదేశం భాగస్వామ్యం పై క్షుణ్ణమైన చర్చ చోటుచేసుకొంది.
భారతదేశం మరియు ఆసియాన్ సహకారం సమీప భవిష్యత్తులో కొత్త శిఖరాలను చేరుకొనే విధంగా భారతదేశం, ఇంకా పది ఆసియాన్ దేశాల నేతలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొన్నారు.
ఈ విషయంలో ప్రధాని శ్రీ హున్ సెన్ నా ఆహ్వానాన్ని మన్నించడం ద్వారాను, ఈ శిఖర సమ్మేళనానికి విచ్చేయడం ద్వారాను మమ్మల్ని సమాదరించారు.
ఇది మాత్రమే కాదు, ఈ శిఖర సమ్మేళనంలో జరిగిన చర్చలలోను, ఫలితాలలోను మీరు విలువైన తోడ్పాటును అందించారు. దీనికిగాను మీకు ఇవే నా హృదయ పూర్వక ధన్యవాదాలు.
మిత్రులారా,
పూర్వ కాలం నుండి భారతదేశం మరియు కంబోడియా ల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలు గత శతాబ్దం రెండో అర్థ భాగంలో గాఢతరం అయ్యాయి. కంబోడియాలో రాజకీయ మార్పులు జరిగిన కాలంలో భారతదేశం తన పాత మిత్ర దేశంతోను, ఆ దేశ పౌరులతోను భుజం భుజం కలిపి నిలబడింది.
ప్రస్తుత సమకాలీన అవసరాలకు తగినట్లుగా మనం అన్ని రంగాలలో మన సంబంధాలను మరింతగా పెంపొందించుకోవలసిన ఆవశ్యకత ఉందని ప్రధాని శ్రీ హున్ సెన్ కూడా ఒప్పుకొంటారు.
ఆర్థిక రంగం, సామాజిక అభివృద్ధి, సామర్ధ్య నిర్మాణం, సంస్కృతి, వ్యాపారం, పర్యటన లతో పాటు ప్రజా సంబంధాల వంటి అన్ని రంగాలలో కంబోడియా తో తన భాగస్వామ్యాన్ని విస్తరింపచేసుకొనేందుకు భారతదేశం సుముఖంగా ఉండటమే కాకుండా దీక్షా బద్ధురాలుగా కూడా ఉంది.
మన ఉమ్మడి వారసత్వం మన యొక్క సాంస్కృతిక సంబంధాలలో ఒక అత్యంత ముఖ్యమైన భాగంగా ఉంది. 12వ శతాబ్దంలో నిర్మించిన అంకోర్ వాట్ దేవాలయం చారిత్రక పునరుద్ధరణ పనులే ఈ సహకారానికి ఒక నిదర్శనం.
కంబోడియాకు చెందిన ఈ సాంస్కృతిక వారసత్వాన్ని అభివృద్ధిపరచి, పరిరక్షించడంలో తోడ్పడినందుకు భారతదేశం సంతోషిస్తోంది.
మన భాషలు సైతం సంస్కృతం మరియు పాళీ భాషల నుండి ఆవిర్భవించాయి.
మన చరిత్రాత్మకమైన మరియు సాంస్కృతిక పరమైన సంబంధాల యొక్క ఉనికి బాగా లోతుగా ఉందన్న విషయం ఎంతో ఆనందాన్ని కలగజేసే అంశం. ఈ కారణంగా పర్యటన రంగాన్ని పరస్పరం ప్రోత్సహించుకొనేందుకు ఎంతో అవకాశం ఉంది.
మిత్రులారా,
మన మిత్ర దేశమైన కంబోడియా ఆర్థిక పురోభివృద్ధి పథంలో దూసుకుపోతూ ఉండడం ఎంతో సంతోషాన్ని ఇచ్చేటటువంటి విషయం. ఈ దేశం గత రెండు దశాబ్దాలుగా ఏటా 7 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది.
భారతదేశం ప్రపంచంలో అత్యంత వేగంగా వర్ధిల్లుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. మనం ఒకే విధమైన విలువలను మరియు సాంస్కృతిక నాగరకతను కలిగి ఉన్న కారణంగా మన రెండు దేశాల మధ్య వ్యాపారాన్ని పెంచుకొనేందుకు స్వాభావిక సమన్వయాన్ని ఏర్పరచుకొనేందుకు వీలు ఉంది.
కంబోడియాలో ఉదారవాద ఆర్థిక విధానాలు అమలవడం, ఆసియాన్ ఎకనామిక్ కమ్యూనిటీ యొక్క స్థాపన కంబోడియా లో భారతీయ పెట్టుబడులకు మరీ ముఖ్యంగా ఆరోగ్యం, వైద్యం, సమాచార సాంకేతిక విజ్ఞానం, వ్యవసాయం, ఆటోమొబైల్, ఇంకా ఆటో పార్ట్స్, జౌళి తదితర రంగాలలో ఒక సదవకాశాన్ని కల్పించాయి.
రానున్న సంవత్సరాలలో మన ద్వైపాక్షిక వ్యాపారం మరింత పెరుగుతుందని, భారతదేశం నుండి వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు మరింత అధిక సంఖ్యలో కంబోడియాలో వారి ఉనికిని ఏర్పరచుకొంటారన్న నమ్మకం నాకుంది.
మిత్రులారా,
అభివృద్ధిలో సహకారం అనేది కంబోడియాతో భారతదేశానికి ఉన్న సంబంధాలలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.
కంబోడియా యొక్క సామాజిక మరియు ఆర్థిక అభివృద్ధిలో ఒక ముఖ్య భాగస్వామిగా ఉండాలనేది భారతదేశం నిబద్ధత. ఇది ఇంతకు ముందు కూడా ఉంది. ఇక మీదట ఇదే రీతిలో ఉంటుంది.
మేం కంబోడియా ప్రభుత్వ అవసరాలకు తగినట్లుగా ప్రధానంగా ఆరోగ్యం, అనుసంధానం, డిజిటల్ కనెక్టివిటీ రంగాలలోని ప్రాజెక్టులకు లైన్ ఆఫ్ క్రెడిట్ ను ప్రతిపాదించాం.
ఏటా 5 త్వరిత గతిన ప్రభావాన్ని చూపే పథకాలను కంబోడియాలో భారతదేశం అమలు పరుస్తూ వస్తోంది. ఈ ప్రాజెక్టులను 5 నుండి 10కి పెంచాలని మేము నిర్ణయించాం. అలాగే 500 కోట్ల రూపాయలతో ఒక ప్రాజెక్టు డివెలప్‌మెంట్ ఫండ్ ను కూడా మేం ఏర్పాటు చేశాం.
ఈ నిధిని పరిశ్రమను మరియు వ్యాపారాన్ని విస్తరించడానికే కాకుండా సరఫరా వలయాన్ని తక్కువ ఖర్చుతో కూడినదిగా మర్చేందుకు కూడా వినియోగించుకోవచ్చు.
మేం కంబోడియాలో ఐటి మరియు ఐటి ఆధారిత సేవల రంగంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ను నెలకొల్పుతున్నాం.
అయిదు దశాబ్దాలకు పైగా భారతదేశం కంబోడియాలో ఇండియన్ టెక్నాలజీ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్ లో ఒక క్రియాశీల భాగస్వామిగా ఉంటూ వచ్చింది.
ఈ కార్యక్రమం ద్వారా 1400 కు పైగా కంబోడియా పౌరులు వారి యొక్క సామార్థ్యాలకు పదును పెట్టుకొన్నారు.
ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో కూడా మేం కొనసాగించనున్నాం. అంతేకాకుండా కంబోడియా అవసరాలకు తగినట్లుగా దీనిని మరింతగా విస్తరించడానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం.
మిత్రులారా,
మన రెండు దేశాల మధ్య అంతర్జాతీయ వేదికలలో ఒక గాఢమైన సహకారం నెలకొంది. అంతేకాకుండా అనేక ప్రాంతీయ వేదికలలోను, అంతర్జాతీయ వేదికలలోను మనం ఒక విశ్వసనీయమైన సంబంధాన్ని నెరపుతున్నాము.
భారతదేశం మరియు కంబోడియా వాటి ప్రస్తుత సమన్వయాన్ని పెంపొందించుకొంటూ, అంతర్జాతీయ వేదికలలో ఒక దానికి మరొకటి మద్దతును అందించుకోవడాన్ని కొనసాగిస్తాయి.
చివరగా, నేను ఒక ఆప్త మిత్రునిగా, భారతదేశానికి ఒక గౌరవనీయ అతిథిగా విచ్చేసినటువంటి ప్రధాని శ్రీ హున్ సెన్ కు ధన్యవాదాలు తెలియజేసుకొంటున్నాను. భారతదేశంలో ఆయన బస ఆహ్లాదకరంగాను, జ్ఞాపకం పెట్టుకోదగినదిగాను ఉండగలదని నేను ఆశిస్తున్నాను.
సమీప భవిష్యత్తులో కంబోడియా కు మరింత సన్నిహిత సహకారాన్ని అందించేందుకు, తద్వారా కంబోడియా తోను మరియు ఆ దేశ పౌరుల తోను సాంప్రదాయకంగా నెలకొన్న ప్రగాఢ సంబంధాలను ఇప్పటికన్నా మిన్నగా పెంపొందించుకొనేందుకు భారతదేశం సిద్ధంగా ఉందని నేను హామీ ఇస్తున్నాను.