శ్రేష్ఠులైన అధ్యక్షులు శ్రీ అలెగ్జాండర్ లుకాశెంకో,
మిత్రులు,
ప్రసార మాధ్యమాల సభ్యులారా,
అధ్యక్షులు శ్రీ లుకాశెంకో భారతదేశ పర్యటన వచ్చిన వేళ ఆయనకు స్వాగతం పలుకుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మన ఇరు దేశాల దౌత్య సంబంధాలకు ఈ సంవత్సరం 25 ఏళ్ళు వచ్చిన నేపథ్యంలో ఆయన పర్యటన చోటు చేసుకొంటోంది.
ఇది వరకు 1997లోను, 2007 లోను అధ్యక్షులు శ్రీ లుకాశెంకో కు ఆహ్వానం పలికిన ఆనందాన్ని మేం పొందాము. ఈసారి పర్యటనలో అధ్యక్షుల వారికి భారతదేశంలో చోటు చేసుకొంటున్న పరివర్తనలను గమనించే అవకాశం దక్కుతుందని నేను ఆశిస్తున్నా
ఈ రోజు మేము జరిపిన చర్చలు వేరు వేరు అంశాలతోను, భవిష్యత్తు పట్ల దార్శనికత తోను కూడుకొన్నటువంటివి. అవి మన మధ్య రెండున్నర దశాబ్దాలుగా నెలకొన్న సంబంధాలలోని ఆత్మీయతకు ప్రతీకగా నిలచాయి. మేం ద్వైపాక్షిక అంశాలు, ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాల పై ఒకరి అభిప్రాయాలను మరొకరికి వెల్లడించుకొన్నాం. మేం మా భాగస్వామ్య ప్రాతిపదికలను సమీక్షించాం. ఈ భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు తగిన ఆలోచనలను మరియు కార్యక్రమాలను మేం పరిశీలించాం. పరస్పర సహకారానికి సంబంధించిన అన్ని అంశాలలో అన్యోన్యతను పెంపొందించుకోవాలన్న నిర్నయాన్ని మేం తీసుకొన్నాం.
మన ప్రజల మేలు కోసం మన భాగస్వామ్యాన్ని ఇంకా ఎత్తుకు తీసుకువెళ్ళాలన్న ఉత్సాహం, అభిమతం అధ్యక్షులు శ్రీ లుకాశెంకో లో తొణికిసలాడటాన్ని నేను గమనించాను.
ఈ దిశగా, ఆర్థిక సంబంధాలను ప్రోత్సహించడానికి మేం కృషి చేస్తాం. రెండు దేశాల మధ్య స్వాభావికమైన ఆదాన ప్రదానాలను అధికం చేసుకోవడం పై మేం దృష్టి సారిస్తాం.
మన కంపెనీలు కొనుగోలుదారు, అమ్మకందారు చట్రం కన్నా మరింత ఉన్నత స్థాయికి బలం పుంజుకోవాల్సి ఉంది. ఔషధాలు, చమురు- గ్యాస్, భారీ యంత్ర పరికరాల రంగాలలో అపారమైన వ్యాపారావకాశాలు మరియు పెట్టుబడి అవకాశాలు ఉన్నాయి. గత సంవత్సరం భారతీయ కంపెనీలు ఔషధ రంగంలో మూడు సంయుక్త సంస్థలను నెలకొల్పడం ద్వారా ఒక శుభారంభాన్ని ఇచ్చాయి.
అలాగే, టైర్లు, వ్యవసాయ- పారిశ్రామిక యంత్ర సామగ్రి, గనుల తవ్వకానికి ఉపయోగించే పరికరాలు.. వీటన్నింటి తయారీలోనూ భాగస్వామ్యానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంతేకాక, భారతదేశంలో నిర్మాణ రంగ సంబంధిత యంత్రాల గిరాకీ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు, బెలారూస్ కు పారిశ్రామికంగా శక్తి సామర్ధ్యాలు ఉన్నాయి.
మేం ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా రక్షణ రంగంలో సంయుక్త అభివృద్ధి మరియు తయారీ కార్యకలాపాలను కూడా ప్రోత్సహించబోతున్నాం. బెలారూస్ లో ఎంపిక చేసిన ప్రాజెక్టులకు 2015లో భారతదేశం ఇవ్వజూపిన 100 మిలియన్ అమెరికన్ డాలర్ల లైన్ ఆఫ్ క్రెడిట్ ను ఉపయోగించే అంశంపైనా మా చర్చలు పురోగమించాయి.
ఇంటర్‌నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, యూరేషియన్ ఇకనామిక్ యూనియన్ (ఇఇయు) ల వంటి బహుముఖీన ఆర్థిక కార్యకలాపాలలో బెలారూస్ తో కలిసి భారతదేశం ముందుకు సాగుతోంది. ఒక స్వేచ్ఛా వ్యాపార ఒప్పందం పై ఇఇయు తో భారతదేశం సంప్రదింపులు జరుపుతోంది.
మిత్రులారా,
బలమైన సహకారాన్ని సాధించగలిగిన మరొక రంగం శాస్త్ర విజ్ఞాన మరియు సాంకేతిక విజ్ఞాన రంగం. ఈ రంగంలో బెలారూస్ దీర్ఘకాల భాగస్వామిగా ఉంది.
లోహ శోధన శాస్త్రం & పరికరాలు, నానో- మెటీరియల్స్, జీవ శాస్త్రం, వైద్య శాస్త్రాలు, రసాయనిక & ఇంజినీయరింగ్ శాస్త్రాలు తదితర రంగాలలో నవకల్పనకు, వాణిజ్య సరళి కార్యకలాపాలకు తగిన ప్రాముఖ్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రక్రియలో మన యువతీ యువకులకు ప్రాతినిధ్యం కల్పించాలని భావిస్తున్నాం.
బెలారూస్ సాంకేతిక ప్రతిభను చాటే ఒక టెక్నాలజీ డెమన్ స్ట్రేషన్ సెంటరును కేంద్రాన్ని భారతదేశంలో నెలకొల్పే ఆలోచన చేస్తున్నాం.
అభివృద్ధి రంగంలో సహకరించుకోవడమనేది బెలారూస్ తో భారతదేశానికి ఉన్న భాగస్వామ్యంలో మరొక పార్శ్వం. ఇండియన్ టెక్నికల్ అండ్ ఇకనామిక్ కోఆపరేషన్ ప్రోగ్రామ్‌లో బెలారూస్ ఓ క్రియాశీల పాత్రధారిగా ఉంది.
అంతర్జాతీయ వేదికలలోనూ మన ఉభయ దేశాలు పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలలో ఉమ్మడి విధానాలను అనుసరిస్తున్నాయి; సన్నిహిత సహకారాన్ని అందజేసుకొంటున్నాయి.
ఇతర బహుముఖీన వేదికలలో సైతం భారతదేశం, బెలారూస్ లు ఒక దానికి మరొకటి పరస్పరం తోడ్పాటును అందజేసుకోవడాన్ని కొనసాగిస్తాయి.
మిత్రులారా,
మన ప్రజల మధ్య నెలకొన్న సాంస్కృతిక బంధాల విశిష్ట చరిత్ర సుహృద్భావాన్ని పెంచి పోషిస్తూ వస్తున్న విషయాన్ని అధ్యక్షుల వారు శ్రీ లుకాశెంకో మరియు నేను చర్చించాం. బెలారూస్ కు చెందిన పలువురు భారతీయ సంస్కృతి, పిండి వంటలు, చలనచిత్రాలు, సంగీతం, నాట్యం, యోగా, ఇంకా ఆయుర్వేదంలో మంచి అభిరుచిని కనబరుస్తున్నారని తెలుసుకొని నేను సంతోషించాను.
మన ఇరు దేశాల మధ్య పర్యటనలు, ఇంకా ప్రజల రాకపోకలు ఇప్పటికన్నా ఎక్కువగా చోటు చేసుకోవాలని, తద్వారా మన సంబంధాలు మరింత దృఢతరం కావాలని నేను ఆశిస్తున్నాను.
చివరగా, అధ్యక్షుల వారు శ్రీ లుకాశెంకో మా మాననీయ అతిథిగా విచ్చేసినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు సాధించిన ఏకాభిప్రాయం మరియు చర్చల పర్యవసానాలను రానున్న రోజులలో కార్యరూపం లోకి తీసుకురావడానికి భారతదేశం, బెలారూస్ లు భుజం భుజం కలిపి ముందంజ వేస్తాయి. అధ్యక్షుల వారు జరుపుతున్న భారతదేశ పర్యటన ఆయనకు స్మరించదగ్గ పర్యటన అవ్వాలని నేను ఆకాంక్షిస్తున్నాను.
మీకందరికీ ఇవే నా ధన్యవాదాలు.