శ్రేష్ఠులైన ప్రధాని శ్రీ శింజో ఆబే,
ప్రముఖ ప్రతినిధులు,
ప్రసార మాధ్యమాల సభ్యులారా,
కొన్నిచివా (శుభ అపరాహ్ణం/నమస్కారం)
నా అనుపమాన మిత్రులు, జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే ను భారతదేశానికి.. ప్రత్యేకించి గుజరాత్ కు ఆహ్వానించే అవకాశం లభించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. ప్రధాని శీ ఆబే, నేను అనేక అంతర్జాతీయ సమావేశాల సందర్భంగా చాలా సార్లు కలుసుకున్నాం. కానీ, ఆయనకు భారతదేశంలో స్వాగతం పలకడం నాకు గొప్ప ఆనందాన్నిస్తోంది. ఆయనతో కలసి నిన్న సాబర్ మతీ ఆశ్రమాన్ని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఇవాళ మేమిద్దరం దండి కుటీరాన్ని సందర్శించాం. ఇక ఈ ఉదయం ముంబయి- అహమదాబాద్ హై స్పీడ్ రైల్వే ప్రాజెక్టుకు ఇద్దరం కలసి భూమి పూజ లో పాల్గొన్నాం. ఈ రైలుమార్గం జపాన్ సహకారంతో నిర్మాణమవుతోంది. ఇదో పెద్ద ముందడుగు. ఇది హై స్పీడ్ రైలుకు శ్రీకారం చుట్టడం ఒక్కటే కాదు.. మన భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ కొత్త రైల్వే తాత్వికతను నవ భారతానికి జీవన రేఖగా నేను పరిగణిస్తున్నాను. భారతదేశ నిరంతరాయ ప్రగతికి ఇప్పుడిక మరింత వేగం జోడించబడింది.
మిత్రులారా,
పరస్పర విశ్వాసం, ప్రయోజనాలు, ఆందోళనలను అర్థం చేసుకోవడం, నిరంతరం అత్యున్నత స్థాయి చర్చలు.. ఇవే భారత- జపాన్ సంబంధాల లోని అద్వితీయత. మన ప్రత్యేక వ్యూహాత్మక అంతర్జాతీయ భాగస్వామ్యం పరిధి ద్వైపాక్షిక స్థాయికి లేదా ప్రాంతీయ స్థాయికి పరిమితమైంది కాదు. అంతర్జాతీయ సమస్యలపై మన మధ్య సన్నిహిత సహకారం ఉంది. నిరుడు నా జపాన్ సందర్శన సందర్భంగా శాంతియుత ప్రయోజనాలకు పరమాణు శక్తి వినియోగంపై మనం చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఆ ఒప్పందాన్ని ఆమోదించినందుకుగాను జపాన్ ప్రజలకు, జపాన్ పార్లమెంటుకు, ప్రత్యేకించి ప్రధాని ఆబే గారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. పరిశుభ్ర ఇంధనం, జల వాయు పరివర్తన అంశాలలో మన మధ్య సహకారంలో ఈ ఒప్పందం ఒక కొత్త అధ్యాయాన్ని చేర్చింది.
మిత్రులారా,
భారతదేశానికి 2016-17లో జపాన్ పెట్టుబడులు 4.7 బిలియన్ డాలర్ల మేర వచ్చాయి. అంతక్రితం సంవత్సరంతో పోలిస్తే ఇది 80 శాతం అధికం. ఇప్పుడు భారతదేశంలో అతి పెద్ద మూడో పెట్టుబడిదారుగా జపాన్ నమోదైంది. దీనిని బట్టి భారతదేశ ఆర్థికాభివృద్ధి, బంగారు భవిష్యత్తుపై జపాన్‌లో ఆశావాదం, నమ్మకం ఏ స్థాయిలో ఉన్నాయో స్పష్టం అవుతోంది. ఈ పెట్టుబడుల ప్రవాహం నేపథ్యంలో భారతదేశం, జపాన్ ల మధ్య పెరిగే వాణిజ్యంతో పాటు రాబోయే రోజుల్లో ఉభయ దేశాల ప్రజల మధ్య సంబంధాలు కూడా వృద్ధి చెందుతాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. దేశంలో అడుగుపెట్టాక వీసా ఇచ్చే సదుపాయాన్ని జపాన్ పౌరులకు మేం ఇప్పటికే కల్పిస్తున్నాం. దీనితో పాటు భారతదేశం, జపాన్ ల తపాలా విభాగాల మధ్య సహకారంతో ఇకపై కూల్‌బాక్స్ సర్వీసు ను మేం ప్రవేశపెట్టబోతున్నాం. ఇది అమలులోకి వచ్చిన తరువాత భారతదేశంలో ఉంటున్న జపాన్ పౌరులు వారికి ఇష్టమైన ఆహారాన్ని స్వదేశం నుండి నేరుగా తెప్పించుకోవచ్చు.
అదే సమయంలో భారతదేశంలో మరిన్ని జపనీస్ రెస్ట్రాంట్ లను ప్రారంభించాలని జపాన్ వ్యాపార సముదాయానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. భారతదేశం ఇవాళ పరివర్తన పథంలోని అనేక స్థాయులలో వేగంగా పురోగమిస్తోంది. అది వాణిజ్య సౌలభ్యం లేదా నైపుణ్య భారతం, పన్ను సంస్కరణలు లేదా ‘మేక్ ఇన్ ఇండియా’ వంటిది ఏదైనా కావచ్చు.. భారతదేశం పూర్తిగా పరివర్తన చెందుతోందన్నది వాస్తవం. ఇది జపాన్ వ్యాపార సంస్థలకు ఒక మహత్తర అవకాశం. అలాగే అనేక జపాన్ కంపెనీలు మా ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలలో లోతుగా నిమగ్నమై ఉండటం కూడా నాకు ఎంతో సంతోషాన్నిస్తోంది. దీని ప్రత్యక్ష లబ్ధి ఏమిటో ఇవాళ సాయంత్రం వ్యాపార ప్రముఖులతో కార్యక్రమంలో సాగే మా సంభాషణలలో స్పష్టమవుతుంది. జపాన్ అధికారిక అభివృద్ధి సహకారం కార్యక్రమంలో భారతదేశం అతి పెద్ద భాగస్వామిగా ఉంది. ఇందులో భాగంగా అనేక రంగాలలో వివిధ ప్రాజెక్టులపై ఒప్పందాల మీద సంతకాలు పూర్తి కావడాన్ని నేను హృదయపూర్వకంగా హర్షిస్తున్నాను.
మిత్రులారా,
ఇవాళ సంతకాలు చేసిన ఒప్పందాలు, మన మధ్య చర్చలతో అన్ని రంగాలలోనూ భారతదేశం, జపాన్ ల భాగస్వామ్యం మరింత బలోపేతం కాగలదని నేను విశ్వసిస్తున్నాను. ఈ మేరకు ప్రధాని శ్రీ ఆబే, ఆయనతో పాటు విచ్చేసిన ఉన్నత స్థాయి ప్రతినిధి బృందానికి నేను మరో సారి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను.
ఇజ్యో దే గొజైమస్ (ఇప్పటికి ఇంతే)
అరిగతో గొజైమస్ (ధన్యవాదాలు)
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు.
Expanding the horizons of bilateral relationship.
— Raveesh Kumar (@MEAIndia) September 14, 2017
The two leaders witness the exchange of MoUs/Agreements between #IndiaJapan pic.twitter.com/OBARyOTGOy
द्धिपक्षीय संबंधों का विस्तार
— Raveesh Kumar (@MEAIndia) September 14, 2017
दोनों प्रधान मंत्रिओं के समक्ष #IndiaJapan के बीच समझौता ज्ञापनों का आदान-प्रदान हुआ pic.twitter.com/mpBDxqORkt