శ్రేష్ఠులైన అధ్యక్షులు శ్రీ మొహమూద్ అబ్బాస్,
పాలస్తీనా మరియు భారతదేశ ప్రతినిధి వర్గాలలోని సభ్యులు,
ప్రసార మాధ్యమాలకు చెందిన సభ్యులు, మహిళలు మరియు సజ్జనులారా,
Sabah-al-kher (శుభోదయం)
రామల్లాహ్ కు ఒక భారతదేశ ప్రధాన మంత్రి మొట్టమొదటిసారిగా రావడం ఎంతో సంతోషదాయకమైన విషయం.
అధ్యక్షులవారు శ్రీ అబ్బాస్ గారు, నా గౌరవార్థం మీరు చెప్పిన మాటలు, నాకు మరియు నా ప్రతినిధి వర్గానికి మీరు పలికిన ఘన స్వాగతానికి మరియు మీ ఆప్యాయతకు నేను ధన్యవాదాలు తెలియ చేయాలనుకొంటున్నాను.
ఎక్స్‌లెన్సీ, మీరు పాలస్తీనా లో అత్యున్నత గౌరవాన్ని చాలా హృదయ పూర్వకంగా నాకు అందజేశారు. ఇది యావత్ భారతదేశానికి ఎంతో ఆదరణను అందించినటువంటి అంశం మాత్రమే కాకుండా, భారతదేశం పట్ల పాలస్తీనా యొక్క మిత్రత్వానికి ఇంకా సుహృద్భావానికి ఒక ప్రతీక కూడా.
భారతదేశం మరియు పాలస్తీనా కు మధ్య నెలకొన్న ప్రాచీనమైన మరియు దృఢమైన చారిత్రక సంబంధాలు కాల పరీక్షకు తట్టుకొని నిలచాయి. పాలస్తీనా ఉద్యమానికి మా యొక్క నిరంతరాయమైన, అచంచలమైన మద్దతు మా విదేశాంగ విధానంలో అన్నింటి కన్నా మిన్న అయినటువంటి అంశంగా ఉంటూ వచ్చింది.
ఈ కారణంగా ఇక్కడ రామల్లాహ్ లో భారతదేశ చిరకాల మిత్రుడు అధ్యక్షుడు శ్రీ మొహమూద్ అబ్బాస్ గారి సరసన నిలబడటం నాకు సంతోషాన్ని ఇస్తోంది. గడచిన మే నెలలో ఆయన న్యూ ఢిల్లీ కి తరలి వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలికే విశేష అధికారం నాకు దక్కింది. మన మైత్రితో పాటు భారతదేశం యొక్క మద్ధతును పునర్ నవీకరించుకొంటున్నందుకు నేను ఆనందిస్తున్నాను.
ఈ పర్యటన కాలంలో అబూ ఉమర్ గారి సమాధి వద్ద నివాళులు అర్పించే అవకాశం నాకు దక్కింది. ఆయన తన కాలంలో అగ్రగామి నేతలలో ఒకరుగా ఉన్నారు. పాలస్తీనా సమరంలో ఆయన పోషించిన పాత్ర అసాధారణమైంది. అబూ ఉమర్ గారు భారతదేశానికి ఒక ప్రసిద్ధుడైన స్నేహితుడుగా కూడా ఉండేవారు. ఆయనకు అంకితమిచ్చిన మ్యూజియమ్ ను సందర్శించడం సైతం నాకు ఒక మరపురాని అనుభూతిని మిగిల్చింది. మరొక్కసారి నేను అబూ ఉమర్ గారికి మనఃపూర్వక నివాళులు అర్పిస్తున్నాను.
మహిళలు మరియు సజ్జనులారా,
నిరంతర సవాళ్ళు మరియు సంక్షోభాలను ఎదుర్కొంటూనే పాలస్తీనా ప్రజలు ప్రదర్శించిన అసాధారణ ధైర్యాన్ని మరియు పట్టుదలను ప్రదర్శించారు. మీరు చెక్కుచెదరని దృఢ సంకల్పాన్ని కనబరిచారు. అది కూడా పురోగతిని అడ్డుకొనేటటువంటి అస్థిరత ఇంకా అభద్రతతో కూడిన వాతావరణంలో, ఏవైతే ఒక చెప్పుకోదగిన పోరాటం అనంతరం సాధించుకొన్న ప్రయోజనాలను భగ్నం చేస్తాయో ఆ విధమైన వాతావరణంలో మీరు దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేశారు.
మీరు ఏ విధమైన కష్టాలను, సవాళ్ళను ఎదురించి ముందుకు సాగారో అనేది నిజంగా అభినందనీయమైనది. ఒక మెరుగైన రేపటి కోసం మీరు మీ యొక్క ప్రయత్నాలలో కనబరచిన స్ఫూర్తిని, విశ్వాసాలను మేం అభినందిస్తున్నాం.
పాలస్తీనా జాతి నిర్మాణ కృషిలో భారతదేశం చాలా పాతదైన మిత్ర దేశంగా వ్యవహరిస్తోంది. బడ్జెట్ రూపేణ మద్ధతు, ప్రాజెక్టువారీ సహాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక విజ్ఞానం ఇంకా శిక్షణ రంగాలలో మనం సహకరించుకొంటున్నాం.
ఒక కొత్త కార్యక్రమంలో భాగంగా మనం రామల్లాహ్ లో ఒక టెక్నాలజీ పార్క్ ప్రాజెక్టును అరంభించాం. దీని తాలూకు నిర్మాణ పనులు ప్రస్తుతం సాగుతున్నాయి. ఇది తుది రూపాన్ని సంతరించుకొన్న తరువాత ఈ సంస్థ ఉపాధి సంబంధిత నైపుణ్యాలు మరియు సేవలను పెంపొందించే ఒక కేంద్రంగా పని చేస్తుందని మనం ఆశిస్తున్నాం.
రామల్లాహ్ లో ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిప్లొమసీ ని ఏర్పాటు చేయడానికి కూడా భారతదేశం తన సహకారాన్ని అందిస్తోంది. ఈ సంస్థ పాలస్తీనాకు చెందిన యువ దౌత్య అధికారులకు ఒక ప్రపంచ శ్రేణి శిక్షణ సంస్థగా రూపుదాలుస్తుందని మనం నమ్ముతున్నాం.
మన కెపాసిటీ బిల్డింగ్ సంబంధిత సహకారం, అటు స్వల్పకాలిక ఇటు దీర్ఘకాలిక కోర్సులలో పరస్పర శిక్షణతో ముడిపడి ఉంది. ఆర్థిక, మేనేజ్‌మెంట్, గ్రామీణాభివృద్ధి ఇంకా సమాచార సాంకేతిక విజ్ఞానం ల వంటి వివిధ రంగాలలోని ప్రముఖ భారతీయ విద్యా సంస్థలలో పాలస్తీనా కు శిక్షణ మరియు ఉపకార వేతన స్థానాలను ఇటీవలే విస్తరించడం జరిగింది.
ఈ పర్యటన కాలంలో మన అభివృద్ధి సంబంధ సహకారాన్ని పొడిగించుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. పాలస్తీనా లో ఆరోగ్యం, విద్యారంగ సంబంధ మౌలిక సదుపాయాలతో పాటు మహిళల సాధికారిత కేంద్రం ఇంకా ఒక ముద్రణాలయం వంటి ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టడాన్ని భారతదేశం కొనసాగిస్తుంది.
ఈ తోడ్పాటును ఉత్సాహభరితమైన పాలస్తీనా ఆవిర్భావానికి చేయూతను అందించేదిగా మేము భావిస్తున్నాము.
ద్వైపాక్షిక స్థాయిలో మనం మంత్రివర్గ స్థాయి జాయింట్ కమిషన్ మీటింగ్ ను నిర్వహించుకోవడం ద్వారా మన సంబంధాలను మరింత గాఢతరంగా మలచుకోవాలని ఒక అంగీకారానికి వచ్చాం.
గత సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పాలస్తీనా మరియు భారతదేశం.. ఈ రెండింటి యువజన ప్రతినిధి వర్గాల నడుమ ఒక ఆదాన ప్రదానం చోటు చేసుకొంది. మన యువజనుల సంబంధింత కార్యక్రమాలలోను వారి నైపుణ్యాలకు సానపట్టే కార్యకలాపాలలోను సహకరించుకోవాలన్నది మన ఉమ్మడి ప్రాథమ్యాలలో ఒకటి.
భారతదేశం కూడా పాలస్తీనా వలనే ఒక యువ దేశం. పాలస్తీనా యువతకు సంబంధించినంత వరకు మా ఆకాంక్షలు మా దేశ యువజనుల పట్ల మాకు ఉన్నటువంటి ఆకాంక్షలతో సరిసమానమైనవే. ఈ ఆకాంక్షలు పురోగతికి, సమృద్ధికి మరియు స్వావలంబనకు అవకాశాలను ఇవ్వజూపుతున్నాయి. ఇవి మన భవిష్యత్తును నిర్దేశించేవి, మన స్నేహం తాలూకు వారసత్వం పొందినటువంటివి.
ఈ సంవత్సరం నుండి మన యువ ప్రతినిధుల రాకపోకలను 50 నుండి 100 కు పెంచుకొంటున్నామని నేను సంతోషంగా ప్రకటిస్తున్నాను.
మహిళలు మరియు సజ్జనులారా,
ఈ రోజు నాటి మన చర్చలో పాలస్తీనా ప్రజల ప్రయోజనాల పట్ల శ్రద్ధ తీసుకోవడంలో భారతదేశం నిబద్ధురాలై ఉందని నేను మరొక్కమారు అధ్యక్షులు శ్రీ అబ్బాస్ గారికి హామీని ఇచ్చాను.
పాలస్తీనా త్వరలోనే శాంతియుత పరిస్థితులలో ఒక స్వతంత్రమైన మరియు సార్వభౌమాధికారంతో కూడిన దేశంగా ఆవిర్భవిస్తుందని భారతదేశం ఆశిస్తోంది.
పాలస్తీనా శాంతి భద్రత మరియు పాలస్తీనా తాలూకు శాంతి ప్రక్రియకు సంబంధించిన ప్రాంతీయ మరియు ప్రపంచ పరిణామాల పై అధ్యక్షులు శ్రీ అబ్బాస్ గారు మరియు నేను చర్చించాం.
ఈ ప్రాంతంలో శాంతితో పాటు సుస్థిరత నెలకొనాలని భారతదేశం ఎంతగానో ఆశిస్తోంది.
పాలస్తీనా కు ఒక శాశ్వత పరిష్కారం సంప్రదింపులలోనే ఇమిడి ఉన్నదని అవగాహన మార్గం గుండానే ఒక శాంతియుతమైన సహజీవనాన్ని పొందగలమని మేము విశ్వసిస్తున్నాము.
ఈ యొక్క హింస చక్రభ్రమణం నుండి మరియు చరిత్ర నెత్తిన రుద్దిన భారం నుండి స్వేచ్ఛను పొందాలంటే ముమ్మరమైన దౌత్యంతో పాటు, న్యాయ సమ్మతమైన ప్రక్రియ ఒక్కటే సహాయ పడగలుగుతుంది.
ఇది సులభం కాదన్న సంగతి మనకు ఎరుకే. అయితే మనం తప్పక ప్రయత్నిస్తూ పోవాలి. ఎందుకంటే మనకు దక్కవలసింది ఎంతో ఉంది.
యువర్ ఎక్స్‌లెన్సీ, మీరు అందించిన అపురూపమైన ఆతిథ్యానికి గాను నేను నా హృదయ పూర్వక కృతజ్ఞతలు వెల్లడిస్తున్నాను.
125 కోట్ల మంది భారతీయుల పక్షాన నేను పాలస్తీనా ప్రజల పురోగతి మరియు సమృద్ధి కోసం ఆప్యాయతతో కూడిన శుభాకాంక్షలను అందజేస్తున్నాను.
మీకందరికీ ధ్యన్యవాదాలు.